కోలేటరల్ మర్డర్: ఓ అమెరికా సైనికుడి పశ్చాత్తాపం


రష్యా టుడే విలేఖరి మెగాన్ లోపెజ్ తో అమెరికా సైనికుడు ఈధన్ మెక్ కార్డ్ (వీడియో షాట్)

రష్యా టుడే విలేఖరి మెగాన్ లోపెజ్ తో అమెరికా సైనికుడు ఈధన్ మెక్ కార్డ్ (వీడియో షాట్)

2010 ఏప్రిల్ 5 తేదీన ‘కోలేటరల్ మర్డర్’ శీర్షికతో వికీ లీక్స్ విడుదల చేసిన వీడియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇరాక్ దురాక్రమణ యుద్ధంలో ఆ దేశ పౌరులపైన అమెరికా సైనికులు సాగిస్తున్న దారుణ మారణ కాండను ‘కోలేటరల్ మర్డర్’ వీడియో కళ్లకు కట్టింది. ఒక గ్రూపుగా వీధిలో నిలబడి ఉన్న సాధారణ పౌరులను మైలున్నర దూరంలో ఆకాశంలో ఎగురుతున్న హెలికాప్టర్ గన్ తో అమెరికా సైనికులు కాల్చి చంపిన దృశ్యాన్ని, దారినే పోతున్న మెటాడోర్ వ్యాన్ లో పసిపిల్లలు ఉన్నారని స్పష్టంగా తెలుస్తున్నా, కాల్పులు జరిపి రాక్షసానందం పొందిన సంఘటనను వీడియో లోకానికి వెల్లడి చేసింది. ఈ దుర్ఘటనలో రాయిటర్స్ విలేఖరులు కూడా దుర్మరణం చెందడం కాకతాళీయమే అయినా అగ్రరాజ్యాల దుర్మార్గాలకు వంతపాడితే అది తమ కాళ్ల దగ్గరకు సైతం వస్తుందని తెలిపేందుకు ప్రబల తార్కాణంగా నిలిచింది. నాటి దుర్ఘటనలో పాలు పంచుకున్న ఒక అమెరికా సైనికుడి పశ్చాత్తాపాన్ని ‘రష్యా టుడే’ పత్రిక రెండు రోజుల క్రితం ప్రచురించి మరో సంచలనం సృష్టించింది.

కోలేటరల్ మర్డర్ వీడియోను అమెరికా రహస్య కంప్యూటర్ మెమొరీ నుండి వెలికి తీసి వికీ లీక్స్ కి అందించినవాడు బ్రాడ్లీ మేనింగ్. రెండేళ్లుగా అమెరికా ఏకాంత కారాగార వాసంలో మగ్గుతున్న బ్రాడ్లీ మ్యానింగ్ అమెరికా పాటించే ద్వంద్వ మానవహక్కుల నీతికి ప్రత్యక్ష సాక్ష్యం. అమెరికా సామ్రాజ్యవాద అణచివేతలపై ప్రపంచ వ్యాపితంగా పోరాడుతున్న అనేక మందికి బ్రాడ్లీ మ్యానింగ్ ఇప్పుడు హీరో. కోలేటరల్ మర్డర్ వీడియోను, అమెరికా రాయబారులు వివిధ దేశాల్లో సాగించిన గూఢచార కార్యకలాపాలను వెల్లడి చేసిన లక్షలాది ‘డిప్లొమేటిక్ కేబుల్స్’ ను వికీ లీక్స్ కు అందించింది తానేనని కోర్టుకు తెలియజేసిన సాహసి బ్రాడ్లీ మ్యానింగ్. అలాంటి మ్యానింగ్ మిలిటరీ డిటెన్షన్ లో అత్యంత కఠిన కారాగారవాసాన్ని గడుపుతుండగా కోలేటరల్ మర్డర్ తో పాటు అనేక పౌర హత్యాకాండలలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పాత్ర పోషించిన అమెరికా సైనిక వెటరన్లు తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటివారిలో ఒకరు ఈధన్ మెక్ కార్డ్ ఒకరు.

“హెలికాప్టర్లు దాదాపు మైలున్నర దూరంలో ఎగురుతున్నాయి. వాళ్ళు ఈ జనం (బాధితులు) పైన జూమ్ చేస్తున్నారు. ఆ దృశ్యాలను మననం చేసుకుంటుంటే ఇప్పుడు కంటికి ఇంకేమీ కనిపించదు” అని పశ్చాత్తాప స్వరంతో ఈధన్, రష్యా టుడే పత్రిక విలేఖరి మెగాన్ లోపెజ్ తో వ్యాఖ్యానించాడు. 216వ బెటాలియన్ తో కలిసి జులై 12, 2007 తేదీన బాగ్దాద్ లోని ఒక కల్లోల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. “నేను నాలుగు లేక ఐదు బ్లాకుల దూరంలో ఉన్నాను. ఇది బెటాలియన్ మొత్తం నిర్వహిస్తున్న మిషన్” అని ఈధన్ తెలిపాడు.

కోలేటరల్ మర్డర్ వీడియో

భారీస్థాయిలో కాల్పుల మోత వినిపించడంతో ఈధన్ దళం సంఘటన జరిగిన చోటికి పరుగెత్తుకుని వెళ్లారు. వారు సహాయం చేసే లోపే హెలికాప్టర్ గన్ మరోసారి పేలింది. ఈధన్ బృందం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నవారంతా చచ్చిపడి ఉన్నారు. “ఒక వ్యక్తికి తల లేదు. అతని తల పైభాగం పూర్తిగా చెల్లాచెదురై పోయి ఉంది. అతని మెదడు నేలపై పడి ఉంది. ఆ వాసన ఇప్పటికీ ప్రతి రోజూ నన్ను వెంటాడుతూనే ఉంది. దానిని ఎలా వర్ణించి చెప్పాలో నాకు తెలియడం లేదు” అని ఈధన్ తెలిపాడు. అనంతరం ఈధన్ హెలికాప్టర్ టార్గెట్ చేసిన వ్యాన్ వైపుకి వెళ్ళాడు. అనుకోని విధంగా అతనికి ఒక గొంతు వినిపించింది. ఒక చిన్న అమ్మాయి ఏడుస్తున్న గొంతు అది.

“ఆ పాపకు నాలుగేళ్లు ఉంటాయనుకుంటాను. పాపకు పొట్ట పైన గాయం అయింది. పాప నా వైపు చూసిన చూపు నాకింకా గుర్తుంది. ఆ కళ్ల చుట్టూ ఉన్న నెత్తురు వలన అవి ఒక భూతం కళ్లలాగా ఉన్నాయి.” ఈధన్ మెక్ కార్డ్ ఆ అమ్మాయిని ఎత్తుకుని దగ్గరలోని భవనం వైపుకి పరుగెత్తాడు. అక్కడ పాప కంటిలో దిగబడి ఉన్న గాజు ముక్కను మెల్లగా బైటికి లాగాడు. ఆ తర్వాత మాత్రమే ఆ అమ్మాయి తన కంటి రెప్పను ఆర్ప కలిగింది. అనంతరం వైద్య సేవకుడికి పాపను అందించి ఈధన్ బైటికి వచ్చాడు. “నేను మళ్ళీ బైటికి వెళ్ళాను. ఫొటోలు తీయమని మాకు చెప్పారు. దానితో నేను ఫొటోలు తీయడం మొదలు పెట్టాను. ఇంతలో మరో పాప ఏడుపు వినిపించింది” అని ఈధన్ తెలిపాడు.

“అది ఒక చిన్న పిల్లాడి గొంతు. ఆ అబ్బాయి చనిపోయాడని మొదట అనుకున్నాను…. నేను ఏడుపు ఆపుకోలేకపోయాను” అని ఈధన్ ఆర్.టి విలేఖరి లోపెజ్ కి తెలిపాడు. పిల్లలకు తీవ్రంగా గాయాలు అయినప్పటికి వారు సజీవంగా ఉండగలిగారు. కోలేటరల్ మర్డర్ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన ఈధన్ మానసికంగా బాగా కుంగిపోయాడు. ఆ తర్వాత మానసిక వైద్యుల సహాయం కూడా కోరాడు. ఈధన్ ధోరణిని అతని పై అధికారులు గేలి చేశారు. అలాగే ఉంటే మిలట్రీ నుండి బహిష్కరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. “అప్పటి నుండే నేను తాగడం మొదలు పెట్టాను. మానసిక వైద్యుడు నాకు 13 ప్రిస్క్రిప్షన్లు ఇచ్చాడు.” అని ఈధన్ తన పరిస్ధితిని వివరించాడు.

క్రమంగా పరిస్ధితి ఇంకా దిగజారింది. తనకు ఇష్టం లేని అనేక ఊహలు, భ్రాంతులు అతనికి రావడం మొదలైంది. పగటి కలలు నిత్యకృత్యం అయ్యాయి. ఆ కలల్లో తన సొంత పిల్లలనే చంపుతున్నట్లుగా, తన చుట్టూ ఉన్నవారిని అందరినీ చంపుతున్నట్లుగా దృశ్యాలు సర్వ సాధారణంగా మారాయి. ఫలితంగా ఈధన్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. “నేను అప్పటికే విపరీతంగా తాగుతున్నాను. ఉదయం పది గంటలప్పుడు అందుబాటులో ఉన్న పిల్స్ అన్నీ మింగేసి క్రౌన్ రాయల్ తాగాను. నా భార్య గమనించి అంబులెన్స్ ను పిలిపించింది.” ఈధన్ తెలిపాడు. ఆత్మహత్యకు ప్రయత్నించినందుకు ఈధన్ మిలట్రీ నుండి డిస్మిస్ అయ్యాడు. “అంగ వైకల్యం గానీ, ఆర్మీ బెనిఫిట్స్ గానీ ఏమీ లేకుండానే నన్ను మిలట్రీ నుండి గెంటేశారు” అని ఈధన్ తన ప్రస్తుత పరిస్ధితిని వివరించాడు.

ఈధన్ పరిస్ధితి బాధాకరమే అయినప్పటికీ చాలామంది ఇతర అమెరికన్ మిలట్రీ వెటరన్ల కంటే చాలా మెరుగు. వేలాదిమంది ఆర్మీ వెటరన్లు PTSD (Post-Traumatic Stress Disorder) తో బాధపడుతున్నారు. ఒత్తిడిని భరించలేని అనేక వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో అనేకమంది తండ్రులు, సోదరులు, కుమారులు ఉన్నారు. వారిప్పుడు అమెరికా సాగిస్తున్న విదేశీ దురాక్రమణ యుద్ధాల్లో మరొక నష్టంగానే మిగిలిపోయారు. గత రెండేళ్లలో తన సహచరుల్లో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఈధన్ తెలిపాడు. ఈధన్ కి కూడా జీవితం పట్ల సరికొత్త దృక్పథం ఏమీ రాలేదు. “నేను ఎప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ బాగుపడలేనని నాకు తెలుసు. దీని నుండి నేను ఎప్పటికీ బైటికి రాలేను” అని ఈధన్ చెబుతోంది అందుకే. అయితే ఈ పరిణామం మొత్తం యుద్ధం యొక్క లక్ష్యాన్నే ప్రశ్నించేట్లుగా పురికొల్పింది.

అమెరికా మార్కు ప్రజాస్వామ్యాన్ని ఈధన్ వ్యంగ్యంగా ఇలా వివరించాడు. “మీకు తెలుసా అమెరికా, మేము జాన్ వేన్ లము. తెల్ల టోపీ ధరించి ఉంటాము. అమెరికన్లు ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. మేము చేసేది అదే. మేము స్వాతంత్ర్యాన్నీ, ప్రజాస్వామ్యాన్ని విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తాము, తుపాకి గొట్టంతో.”

తుపాకి గొట్టంతోనే ప్రజలకు నిజమైన ప్రజాస్వామిక రాజ్యాధికారం వస్తుందని మావో జెడాంగ్ చెప్పిన సూత్రాన్ని సో కాల్డ్ ప్రజాస్వామ్య వాదులు అర్ధం మార్చి వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తుపాకి గొట్టంతో ఎంతమందిని చంపితే అంత త్వరగా ప్రజాస్వామ్యం వస్తుందని, విప్లవం వస్తుందని పెడార్ధాలు తీస్తుంటారు. కానీ వాస్తవంగా ‘బల ప్రయోగంతో మాత్రమే విప్లవం వస్తుందని’ చెప్పిన మార్క్స్ సూత్రాన్ని మావో మరో విధంగా చెప్పాడంతే. మావో తుపాకి గొట్టం సూత్రాన్ని గేలి చేసే కువ్యాఖ్యాతలు అమెరికా ప్రపంచ దేశాలపై పడి సాగిస్తున్న దారుణ మారణకాండలను చంకలు ఎగరేసుకుని మరీ ప్రజాస్వామ్య సంస్ధాపన గా కీర్తిస్తుంటారు. వారి తెలివిహీన అవగాహనకు ఈధన్ మెక్ కార్డ్ విప్పి చెప్పిన సత్యం ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’ లాంటిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s