పోటీ పేరుతో డేటా చౌర్యం, గూగుల్ అతి తెలివి


Googole MapMaker screen shot -The Hindu

Googole MapMaker screen shot -The Hindu

‘స్ట్రీట్ వ్యూ’ కార్ల ద్వారా పశ్చిమ దేశాలలో పౌరుల వివరాలు అనుమతి లేకుండా సంపాదించి విచారణ ఎదుర్కొంటున్న గూగుల్ కంపెనీ భారత దేశ వివరాలు సంపాదించడానికి ‘మేపధాన్’ పోటీని ఎరగా వేసింది. ప్రత్యక్షంగా తాను డేటా సేకరించడం ‘చౌర్యం’ కిందికి రావడంతో అమాయక వినియోగదారులను అడ్డం పెట్టుకుని సృజనాత్మక పద్ధతుల్లో ‘డేటా చౌర్యానికి’ గూగుల్ పూనుకుంది. గూగుల్ అతి తెలివిని పసిగట్టిన బి.జె.పి ఎం.పిలు ఫిర్యాదు చేయడంతో, అధికారిక ‘రాజకీయ భౌగోళిక మేప్ ల నిర్వహణకు’ బాధ్యురాలయిన ‘సర్వే ఆఫ్ ఇండియా’ సంస్ధ గూగుల్ కంపెనీ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూగుల్ కంపెనీ మాత్రం యధావిధిగా తాను చట్టాలను ఉల్లంఘించలేదని బొంకుతోంది.

‘మేపధాన్ 2013’ పేరుతో గూగుల్ కంపెనీ ఫిబ్రవరి 12 నుండి మార్చి 25 వరకు ఒక పోటీ నిర్వహించింది. తమ చుట్టు పక్కల ప్రాంతాలను ఫోటోలు తీసి గూగుల్ కి అప్పగించడం ఈ పోటీ లక్ష్యం. భారతీయులను తన ‘మేప్ మేకర్’ ని వినియోగించేలా ప్రోత్సహించడమే లక్ష్యమని గూగుల్ చెబుతోంది. పోటీలో పాల్గొన్నవారిలో మొదటి 1000 మందికి ఏవో బహుమతులు పంచిపెడతామని గూగుల్ ఆశ చూపింది. కానీ ఈ పోటీ వల్ల భారత ప్రజలు తమకు తెలియకుండానే జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యం ఉన్న స్ధలాలను ఫోటోలు తీసి గూగుల్ కి అప్పగించే ప్రమాదం ఉన్నదని బి.జె.పి ఎం.పి లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో ‘సర్వే ఆఫ్ ఇండియా’ కూడా ప్రమాద తీవ్రతను గుర్తించింది.

“మేపధాన్ 2013 కార్యకలాపాలు జాతీయ భద్రతా ప్రయోజనాలను ప్రమాదంలో పడవేస్తాయి. ‘జాతీయ మేప్ విధానాన్ని’ కూడా అది ఉల్లంఘిస్తోంది. చట్టపరమైన పరిణామాల పట్ల అవగాహన లేని అమాయక పౌరులు దేశ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉంది” అని సర్వే ఆఫ్ ఇండియా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మార్చి 25, 2013 తేదీన ఢిల్లీ లోని ఆర్.కె.పురం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయిందని ‘ది హిందు’ శుక్రవారం తెలియజేసింది. ‘సర్వే ఆఫ్ ఇండియా’ నుండి తమకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

google mapathonపోటీలో పాల్గొన్నవారు పంపిన ఫోటోలను సంబంధిత గూగుల్ వెబ్ సైట్ కు అప్ లోడ్ చేస్తే ఆ ఫోటోలను తన ‘సెర్చ్ ఇంజన్’ ప్రయోజనాలకు వినియోగించడం గూగుల్ ఉద్దేశం. ఈ పోటీ ద్వారా తమ స్ట్రీట్ కార్లు చేసే పనిని గూగుల్ కంపెనీ భారత ప్రజల ద్వారా చేయిస్తోందన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది. ‘స్ట్రీట్ వ్యూ కార్’ ప్రాజెక్టు ప్రపంచ వ్యాపితంగా, పశ్చిమ దేశాల్లో సైతం, చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటోంది. వీధులు, కూడళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు తదితర స్ధలాల ఫోటోలు సేకరిస్తున్నామని చెప్పిన గూగుల్, దానితో పాటు రహస్య ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను కూడా అక్రమంగా సేకరించింది.

స్ట్రీట్ వ్యూ డేటా చౌర్యం

ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు సాధారణంగా అనేకమంది వై-ఫై వైర్ లెస్ కనెక్సన్ వినియోగిస్తారు. ఒక బ్రాడ్ బాండ్ కనెక్షన్ తీసుకుని దానిని వైర్ లెస్ ద్వారా ల్యాప్ టాప్ కంప్యూటర్లకు కూడా వినియోగిస్తారు. ఈ వైర్ లెస్ సమాచార వాహకానికి భద్రత ఉండదు. గాలిలో జరిగే సమాచార ప్రవాహం సంబంధిత కనెక్షన్ ఉన్న కంప్యూటర్ కి చేరేలోపు ఇతర శక్తివంతమైన కనెక్షన్ ఉన్నవారు ఒడిసి పట్టవచ్చు. గూగుల్ చేసింది అదే. ఈ పద్ధతి ద్వారా కంప్యూటర్ వినియోగదారుల ఈ మెయిళ్ళు, పాస్ వర్డ్ లు, బ్యాంక్ ఖాతాల యూజర్ నేమ్ లు, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వివిధ వెబ్ సైట్లకు వినియోగించే యూజర్ నేమ్ లు, పాస్ వర్డ్ లు… ఇవన్నీ సేకరించి తమ సర్వర్లలో భద్రపరుచుకుంది.

గూగుల్ డేటా చౌర్యాన్ని మొదట జర్మనీ 2009లో గుర్తించింది. వెంటనే గూగుల్ ను వివరణ కోరింది. అలాంటిదేమీ జరగడం లేదని బొంకిన గూగుల్ తర్వాత మెల్లగా ‘జరుగుతోంది కానీ, మాకు తెలియకుండా జరుగుతోంది’ అని చెప్పింది. గూగుల్ సమాధానంతో సంతృప్తి పడని జర్మనీ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టింది. దానితో గూగుల్ ‘స్వంత విచారణ’ పేరుతో నాటకం మొదలు పెట్టింది. (అక్రమాలకు పాల్పడేవారే తమపై తాము తాము విచారణ చేసుకోవడం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, ఇజ్రాయెల్ తదితర అక్రమార్కుల ప్రత్యేకత. విచారణ అనంతరం కొద్దిగా తప్పు జరిగింది గాని అది తెలియకుండా జరిగిందని, దురుద్దేశాలు లేవని తేల్చి చెప్పుకునే సౌకర్యం ఈ స్వంత విచారణ లో ఉంటుంది.) వేరే అవసరం కోసం తయారు చేసిన ప్రోగ్రామ్ అనుకోని విధంగా స్ట్రీట్ వ్యూ కార్ ప్రాజెక్టు సాఫ్ట్ వేర్ లోకి జొరబడిందని, తాము చూసుకోలేదని ‘స్వంత విచారణ’ అనంతరం ఒక ‘కాకమ్మ కధ’ వినిపించింది. మారాయితే అలా సేకరించిన డేటా ప్రత్యేకంగా రూపొందించుకున్న సర్వర్ల లోకి ఎందుకు రీ డైరెక్ట్ అయిందీ, సంవత్సరాల తరబడి తస్కరించిన డేటాను సర్వర్ల నుండి తొలగించడంలో ఎందుకు విఫలం అయిందీ గూగుల్ చెప్పలేకపోయింది.

google-street-view-carఈ లోపు గూగుల్ తమ దేశాల్లో కూడా ఇదే డేటా చౌర్యానికి పాల్పడుతోందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు తదితర యూరోపియన్ దేశాలు గ్రహించి విచారణ ప్రారంభించాయి. దక్షిణ కొరియా, ఇండియా, చైనా, జపాన్ తదితర ఆసియా దేశాలు కూడా గూగుల్ పైన విచారణ జరిపాయి. భారత ప్రభుత్వ విచారణ సంగతి ఇంతవరకు పత్తా లేదు. అమెరికా రెండు మూడేళ్లు విచారణ తంతు నడిపి ముంజేతి మీద సున్నితంగా కొట్టినట్లుగా (slap on the rist) కొద్దిగా జరిమానా విధించి చేతులు దులుపుకుంది. విచారణ చేసిన అమెరికా ఫెటరల్ ట్రేడ్ కమిషన్ మొదట్లో దూకుడు ప్రదర్శించి ‘గాండ్రు’ మని గర్జించినా, గూగుల్ పలుకుబడి ధాటికి కుదేలై చివరికి ‘మ్యావ్’ అని ఊరుకుంది. కాస్తో కూస్తో గట్టిగా విచారణ చేసినట్లు కనిపించిన జర్మనీ, ఫ్రాన్సు లు గూగుల్ తో ఒప్పందం చేసుకున్నట్లు పత్రికలు తెలిపాయి. ఒప్పందం వివరాలు పెద్దగా బైటికి రాలేదు. గూగుల్ తస్కరణ ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఆ సంస్ధ అక్రమాన్ని ఖండిస్తూ ఏకంగా బ్రిటన్ పార్లమెంటు ఒక తీర్మానాన్నే ఆమోదించింది.

భద్రత ప్రమాదం, ఖర్చు జాస్తి

స్ట్రీట్ వ్యూ గుట్టు బైట పడడంతో డేటా చౌర్యానికి గూగుల్ నూతన మార్గాలు  వెతుకుతోందని, అందులో భాగమే ‘మేపధాన్ 2013’ అని గ్రహించవచ్చు. ఈ నేపధ్యంలో తన మేపధాన్ కార్యకలాపాలను ఆపాలని, అవి భారత విధాన మార్గదర్శక సూత్రాలకు విరుద్ధమని చెబుతూ అడిషనల్ సర్వేయర్ ఆఫ్ ఇండియా ఆర్.సి.పాధి మార్చి 21 న గూగుల్ కి లేఖ రాశాడని తెలుస్తోంది. “నిషేధిత తరగతికి చెందిన సర్వేయింగ్, మేపింగ్ లను నిర్వహించడం కేవలం ‘సర్వే ఆఫ్ ఇండియా’ మాత్రమే చేయాలి. మరే యితర ప్రభుత్వ/ప్రైవేటు సంస్ధలు లేదా వ్యక్తులకు ఆ అధికారం లేదు” అని సదరు లేఖలో అధికారి తెలిపాడు. “రక్షణ శాఖ, హోమ్ మంత్రిత్వ శాఖతో సంప్రదించి ముఖ్యమైన పౌర, మిలట్రీ ప్రాంతాలను గుర్తించి జాబితాను తయారు చేసింది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని వీటిని అనునిత్యం తాజాకరిస్తారు. ఈ ముఖ్య ప్రాంతాలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడానికి వీలు లేదు” అని సర్వే ఆఫ్ ఇండియా అధికారి పేర్కొన్నాడు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మేపధాన్ 2013 ప్రాజెక్టులో భాగంగా గూగుల్ సేకరిస్తున్న ప్రాంతాలకు గూగుల్ బాధ్యత లేదని పోటీ సందర్భంగా ఆ కంపెనీ స్పష్టం చేసింది. అంటే స్ట్రీట్ వ్యూ కార్ ప్రాజెక్టు అనుభవం రీత్యా గూగుల్ ముందే జాగ్రత్త పడినట్లు స్పష్టం అవుతోంది. పోటీలో పాల్గొన్న వ్యక్తులే ఫోటోలకు బాధ్యులు అవుతారు తప్ప తన బాధ్యత ఉండదని చెప్పడం అంటే అమాయకలని తెలిసీ మోసం చెయ్యడమే. అనేకమంది వ్యక్తులు తాము అప్ లోడ్ చేసే ఫోటోలు నిషేధిత మేపింగ్ ప్రక్రియలోకి వస్తాయని తెలియకుండానే అప్ లోడ్ చేస్తారనీ, ఫలితంగా అమాయకంగా చట్టం దృష్టిలో నేరస్ధూలవుతారని సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది అందుకే. మోసం చేసేది గూగుల్ అయితే నేరస్ధూలయ్యేది మాత్రం అమాయక భారతీయులు.

ఆరోగ్య సేవలు, ఎమర్జెన్సీ సేవలు, విద్యా సంస్ధలు, తినుబండారాలు దొరికే స్ధలాలు మొదలయిన వాటిని ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తేవడమే తమ ప్రాజెక్టు ఉద్దేశ్యమని గూగుల్ చెప్పేది ఒట్టి డొల్ల. గూగుల్ ప్రధాన ఉద్దేశ్యం సాధ్యమైన ఎక్కువ డేటాని సేకరించి వాటిని తమ స్వార్ధ వ్యాపార ప్రయోజనాలకు వినియోగించుకోవడమే. గూగుల్ చెప్పే ఉద్దేశాలు నెరవేరితే నెరవేరవచ్చు గానీ మన పట్టణంలో, మన సందు చివర, మన ఇంటి పక్క ఏ డాక్టర్ ఉన్నాడో, ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నదో, ఏ ఫైర్ లేదా పోలీసు స్టేషన్ ఉన్నదో అమెరికా నుండి వచ్చిన గూగుల్ వచ్చి చెబితే తప్ప తెలుసుకోలేని స్ధితిలో జనం ఉంటారంటే అంతకంటే ‘ఉబ్బర’ మరొకటి ఉండదు.

ప్రజల అవసరాలు, వ్యాపారస్ధుల అవసరాలే ఇద్దరినీ కలుపుతాయి. అందుకోసం సెల్ ఫోన్ బిల్లు పెంచుకుని, ఇంటర్నెట్ కనెక్షన్ బిల్లు మోత మోగించుకుని జేబులు ఖాళీ చేసుకోనవసరం లేదు. కానీ ఈ ప్రక్రియ వలన బడా వ్యాపార సంస్ధలకు ఖర్చు తగ్గితే వినియోగదారులకు ఖర్చు పెరుగుతుంది. ఇలాంటి సేవలను ప్రభుత్వాలే అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందుబాటులో ఉంచడడం చాలా తేలిక. కానీ విదేశీ బహుళజాతి కంపెనీల డబ్బు సంచులకు అలవాటు పడిన రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్లు గూగుల్ కి ముకుతాడు వేస్తారా అన్నది సమస్య.

One thought on “పోటీ పేరుతో డేటా చౌర్యం, గూగుల్ అతి తెలివి

  1. భారతీయుల్లో ఉన్న పోటీతత్వాన్ని ఈ విదంగా తెల్లవాళ్ళు సొమ్ము చేసుకోవటం విచారకరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s