అసలు మైకు పట్టనేల, పట్టితిపో…… -కార్టూన్


The Hindu

The Hindu

అంత భారీ భావాలు వ్యక్తపరచనేల, ఇంత భారం మోయనేల?

రాహుల్ ఇప్పుడు మైకు భారాన్ని మోస్తున్నాడు. మొదటిసారి ‘కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సి.ఐ.ఐ) గురువారం జరిపిన సమావేశంలో మైకు పట్టిన రాహుల్ గాంధీ పేదలను, ముస్లింలను, దళితులను  పరాయీకరిస్తే ఆర్ధిక వృద్ధి తీవ్రంగా దెబ్బ తింటుందని బోధించాడు. సామాన్య మానవుడికి సాధికారత అప్పగించే విధంగా వ్యవస్ధాగత మార్పులు తేవలసి ఉందని, అందుకోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చాడు.

“వివిధ తరగతులను పరాయీకరించే రాజకీయాలతో ఆడుకుంటే మీరిక ప్రజల కదలికలను, భావాలను అడ్డుకున్నట్లే. అది జరిగితే నష్టపోయేది మనమే. వ్యాపారాలు నష్టపోతాయి, సమైక్యత వ్యతిరేక విత్తనాలు నాటుకుంటాయి, మన ప్రజల కలలు తీవ్రంగా దెబ్బతింటాయి” అని రాహుల్ గాంధీ ఉద్వేగంగా ప్రసంగించాడని పత్రికలు తెలిపాయి.

“అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే ప్రజలను పరాయీకరించడం. పేదలు, మైనారిటీలు, దళితులు మున్నగు వారని (అభివృద్ధి నుండి) మినహాయించడం… కోపం, విద్వేషం, ముందే ఏర్పరుచుకునే భావనలు… ఇవేవీ వృద్ధికి తోడ్పడవు. వివిధ తగతులను పరాయీకరిస్తే మనమే నష్టపోతాము” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు.

రాహుల్ ప్రసంగం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఉద్దేశించినదేనని పత్రికలు అంచనా వేస్తున్నాయి. భారత దేశానికి తాను రుణపని ఉన్నానని, దేశ ప్రజల రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని’ వ్యాఖ్యానించి  ప్రధాన మంత్రి పదవిపై ఆశను పరోక్షంగా సూచించిన నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ తన వ్యాఖ్యలు ఎక్కు పెట్టాడని అవి భావిస్తున్నాయి. అయితే తన పెళ్లి, ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వం గురించి వస్తున్న ఊహాగానాలను కూడా రాహుల్ తన ప్రసంగంలో తిరస్కరించాడు. అవన్నీ వ్యర్ధ ప్రేలాపనలని వ్యాఖ్యానించాడు.

రాహుల్ ప్రసంగాన్ని పారిశ్రామిక ప్రముఖులు మెచ్చుకుంటుంటే పత్రికలు తోచిన విధంగా అర్ధం లాగుతున్నాయి. బి.జె.పి నాయకుడు యశ్వంత్ సింగ్ అయితే ‘మోడీతో పోల్చే భారాన్ని రాహుల్ పై మోపబోనని’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. రాహుల్ అవినీతి, ద్రవ్యోల్బణం లపై మాట్లాడుతాడని భావిస్తే వాటి జోలికే రాహుల్ పోలేదని ఇతర రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు.

చివరికి పొగడ్తలైనా, తెగడ్తలైనా రాహుల్ ప్రసంగం ఆయనకే భారంగా మారినట్లుందని, వివిధ కోణాలలో ఆయనపై పెరిగిన అంచనాల భారం ఆయన ప్రసంగం అదనంగా తెచ్చి పెట్టిందని కార్టూనిస్టు భావనలా కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి