మణిపూర్ ఎన్ కౌంటర్లు బూటకం, సుప్రీం కోర్టు కమిటీ నిర్ధారణ


anti AFSPA stirమణిపూర్ లో భారత సైనికులు పాల్పడిన ఆరు ఎన్ కౌంటర్లు బూటకం అని సుప్రీం కోర్టు కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. 12 సంవత్సరాల బాలుడితో సహా ఎన్ కౌటర్ లో మరణించినవారందరికీ ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని కమిటీ తేల్చి చెప్పింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ లతో కూడిన డివిజన్ బెంచి కమిటీ నివేదికను పరిశీలించింది. కమిటీ ఆరు ఎన్ కౌంటర్ కేసులను విచారించగా, ఆరు కేసులూ నిజమైనవి కాదని తేలిందని సుప్రీం బెంచి గురువారం తెలిపింది.

సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ సంతోష్ హెగ్డే, ఎన్నికల కమిషన్ మాజీ ప్రధాన కమిషనర్ జె.ఎం.లింగ్డో, ఒక సీనియర్ పోలీసు అధికారి లతో సుప్రీం కోర్టు జనవరి 4 తేదీన కమిటీని నియమించింది. మణిపూర్ రాష్ట్రంలో సైనికుల అరాచకాలు, బూటకపు ఎన్ కౌంటర్లకు బలయిన కుటుంబాల వారు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని న్యాయం కోసం పోరాడుతున్నారు.

అసోషియేషన్ దాఖలు చేసిన ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని’ విచారిస్తూ సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. రాష్ట్రంలో 1528 మందిని బూటకపు ఎన్ కౌంటర్లో భారత భద్రతా బలగాలు హత్యలు చేశారనీ, ఈ హత్యలపై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ ఏర్పాటు చేసి విచారించాలని అసోసియేషన్ తమ వ్యాజ్యంలో కోరింది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కూరమైన సైనిక చట్టం ‘భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టం’ (AFSPA) ను సమీక్షించాలని కూడా వ్యాజ్యం కోరింది.

Irom Sharmilaమణిపూర్ లో దాదాపు 2,000 మందికి పైగా బూటకపు ఎన్ కౌంటర్లలో హతులయ్యారని, ఈ హత్యలకు ఎవరినీ ఇంతవరకు బాధ్యులుగా చేయలేదని బాధిత కుటుంబాల అసోసియేషన్ ఆరోపించింది. ఏమాత్రం క్రిమినల్ రికార్డు లేని అనేకమంది అమాయకులు భద్రతా బలగాలు చంపేసినప్పటికీ ఇంతవరకు సరైన విచారణ జరగలేదని ఆరోపించింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు కమిటీ నియమించడానికి నిర్ణయించింది.

మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్ విచారణ ఆరు ఎన్ కౌంటర్ల పైన అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ విచారణ తగినది కాదని సుప్రీం బెంచి అప్పట్లో వ్యాఖ్యానించింది. “మెజిస్టీరియల్ విచారణ సంతృప్తికరంగా జరగలేదు. సైనిక అధికారులతో సహా ఎవ్వరూ ఆ విచారణలో హాజరు కాలేదు. అందువలన అది నమ్మకాన్ని ప్రేరేపించేది కాదు” అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని ‘ది హిందు’ తెలిపింది. అయితే AFSPA చట్టం యొక్క చట్టబద్ధతను విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఈ చట్టానికి వ్యతిరేకంగానే మణిపూర్ మహిళ ఈరోమి షర్మిల గత 11 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తోంది. ఆమెకు ముక్కులో ట్యూబ్ ద్వారా ద్రవాహారాన్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఆత్మహత్య నేరం కావడంతో ఆమె అప్పటి నుండి జైలులో గడుపుతోంది. అయితే ఆత్మహత్య నేరానికి గరిష్ట శిక్ష ఒక సంవత్సరమే. దానితో జైలు శిక్ష పూర్తి అయ్యాక ఆమె విడుదల కావడం, నిరాహార దీక్ష కొనసాగిస్తున్నందుకు మళ్ళీ అరెస్టు చెయ్యడం, మళ్ళీ కోర్టులు జైలు శిక్ష వేయడం ఇలా జరుగుతూ వస్తోంది.

Manipuri nude protestకొద్ది సంవత్సరాల క్రితం ఒక మణిపూర్ మహిళను భద్రత బలగాలు అత్యాచారం చేసి చంపేసి రోడ్డు మీద పడేశారు. అత్యాచారానికి వ్యతిరేకంగా మణిపూర్ అట్టుడికిపోయింది. ఒక డజను మంది మహిళలు పూర్తిగా వివస్త్రలై ‘భారత సైనికుల్లారా మమ్మల్నీ అత్యాచారం చేయండి’ అంటూ భారత సైనికుల స్ధావరం ముందు ప్రదర్శన నిర్వహించిన ఘటన ఇప్పటికీ సంచలనమే. భారత భద్రతా బలగాలు ఇన్ని అకృత్యాలకు పాల్పడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ దోషులను శిక్షించిన పాపాన పోలేదు. కనీసం విచారణ కూడా చేయలేదు. AFSPA చట్టం ప్రకారం హత్యలు చేసినప్పటికీ సైనికులు కారణాలు చెప్పవలసిన అవసరం లేదు. అత్యాచారాలు చేసినా సాధారణ అత్యాచార నేరాల కింద విచారణ చేయడానికి వీలు లేదు.

ఇదే చట్టం కాశ్మీరులోనూ అమలవుతోంది. కాశ్మీరు యువకులను అర్ధరాత్రి ఇళ్లనుండి పట్టుకెళ్ళి మాయం చేయడం భద్రతా బలగాలకు సాధారణ చర్య. వారి పైన మిలిటెంటు ముద్ర వేసి నానా అకృత్యాలకు పాల్పడడం భద్రతా దళాల హక్కుగా చెలామణి అవుతోంది. కాశ్మీరు ఆడపిల్లలపై అత్యాచారాలు జరిపి మిలిటెంట్లుగా ముద్రవేసి నేర విచారణ నుండి తప్పించుకుంటున్నారు. సర్వీసులో ప్రమోషన్ కోసం అమాయక యువకులను పట్టుకెళ్ళి కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని కట్టుకధ అల్లిన ఉదాహరణ గత సంవత్సరం వెలుగులోకి వచ్చింది. సోపోర్ అమ్మాయిల అత్యాచారం పైన భద్రతా దళాలు అత్యాచారం చేసి చంపేయడంతో ఆందోళన వెల్లువెత్తింది. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించి కాశ్మీరు ప్రజల సమస్యలను తెలుసుకోవాలని కోరింది. ఆ కమిటీ కూడా AFSPA ను ఎత్తేయాలని సిఫారసు చేసింది. ఇటీవల ఢిల్లీ యువతి అత్యాచారం సందర్భంగా కూడా జస్టిస్ వర్మ కమిటీ AFSPA కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది.

ఆర్మీ AFSPA రద్దుకు ఒప్పుకోవడం లేదని ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ప్రకటించడం ఒక విడ్డూరం. ఆర్మీ అంటే అదేదో ప్రభుత్వం చేతుల్లో లేనట్లుగా ఆర్ధిక మంత్రి మాట్లాడారు. చట్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం. దాన్ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అలాంటిది దానిని తొలగించడానికి ఆర్మీ అనుమతితో పనేమిటి? ఆర్మీకి చెప్పి పరిపాలన చేస్తారా లేక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనా చేస్తారా? ఇక ప్రజాస్వామ్యం పేరుతో ఎన్నికలెందుకు జరుపుతున్నట్లు?

మణిపూర్ 1951లో ఇండియన్ యూనియన్ లో విలీనం అయిన ప్రాంతం. కానీ 1972లో మాత్రమే దానికి రాష్ట్ర హోదా ఇచ్చారు భారత పాలకులు. ఈ లోపు అక్కడ ప్రజలు తమ జాతీయ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం లభించక తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దాని ఫలితంగా అనేక మిలిటెంటు సంస్ధలు ఉద్భవించాయి. ప్రజలలో వీరికి విస్తృతమైన మద్దతు లభిస్తోంది. మణిపూర్ ప్రజల జాతీయ ఆకాంక్షలకు విలువ ఇచ్చి తగిన చట్టాలు చేసే బదులు వారిని అణచివేయడానికే వరుస ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ మొగ్గే వారిని బూటకపు ఎన్ కౌంటర్ల పట్ల ఉదాసీనతతో వ్యవహరించేలా చేస్తోంది. భారత పాలకులకు మణిపూర్ రాష్ట్ర వనరులు, ఆస్తులు, ఆదాయాలతోనే అవసరం తప్ప అక్కడి ప్రజలతో కాదు.  వాటి కోసం వారికి AFSPA కావాలి. కానీ అది ఉన్నంతవరకు మిలిటెన్సీ పెరుగుతుందే తప్ప తగ్గదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s