రికార్డులు తిరగ రాస్తున్న యూరోజోన్ నిరుద్యోగం


బర్గోస్ (స్పెయిన్)లో ఉపాధి కార్యాలయం ముందు నిరుద్యొగుల క్యూ

బర్గోస్ (స్పెయిన్)లో ఉపాధి కార్యాలయం ముందు నిరుద్యొగుల క్యూ

17 ఐరోపా దేశాల మానిటరీ యూనియన్ ‘యూరోజోన్’ నిరుద్యోగంలో తన రికార్డులు తానే తిరగ రాస్తోంది. ఉమ్మడి యూరో కరెన్సీ ఉనికిలోకి వచ్చిన గత 13 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా 12 శాతం నిరుద్యోగాన్ని నమోదు చేసింది. జనవరిలో 11.9 శాతంగా ఉన్న నిరీద్యోగ శాతం మరో 33,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఫిబ్రవరిలో 12 శాతానికి పెరిగింది. ఐరోపా వ్యాపితంగా అధికారిక నిరుద్యోగుల సంఖ్య 1.91 కోట్లకు పై చిలుకేనని ఐరోపా గణాంక సంస్ధ యూరోస్టాట్ తెలియజేసింది. గత నవంబరులో వీరి సంఖ్య 1.88 కోట్లు.

ఋణ పీడిత యూరో జోన్ లో స్పెయిన్, గ్రీసు దేశాలు అత్యధిక నిరుద్యోగం కలిగి ఉన్నాయి. ఫిబ్రవరి నెల నాటికి అవి రెండూ చెరో 26 శాతం నిరుద్యోగం నమోదు చేశాయి. ఫలితంగా రెండు దేశాలూ సమ్మెలతో, ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. 2010, 2011 సంవత్సరాలలో ఇరు దేశాలలో ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు భారీగా పెరిగాయని యూరోస్టాట్ ని ఉటంకిస్తూ ‘రష్యా టైమ్స్’ తెలిపింది. 2008 ఆర్ధిక సంక్షోభానికి మునుపు గ్రీసులో ఆత్మహత్యలు లక్షకు 2.8 మాత్రమే. అప్పట్లో ఆత్మహత్యలు అతి తక్కువగా ఉన్న దేశాల్లో గ్రీసు ఒకటి. ఋణ సంక్షోభం దరిమిలా కంపెనీల కోసం అమలు చేస్తున్న పొదుపు విధానాలు ఈ సంఖ్యను రెట్టింపు చేశాయి.

స్పెయిన్, గ్రీసు, పోర్చుగల్, ఇటలీ దేశాలు అధిక సంఖ్యలో నిరుద్యోగులను కలిగి ఉండగా, ఐరోపాలోని ధనిక దేశాల పరిస్ధితి అంత తీవ్రంగా లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరి చివరి నాటికి జర్మనీ 5.4 శాతం, లక్సెంబర్గ్ 5.5 శాతం, ఆస్ట్రియా 4.8 శాతం, నెదర్లాండ్స్ 6.2 శాతం నిరుద్యోగం నమోదు చేశాయి. అయితే ఈ పరిస్ధితి ఎంతోకాల కొనసాగదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జర్మనీ ఆర్ధిక వృద్ధి ఇప్పటికే మందగించిందని, వచ్చే సంవత్సరానికి జర్మనీ అసలు జి.డి.పి వృద్ధి నమోదు చేయకపోవడమో లేదా ప్రతికూల వృద్ధి నమోదు చేయడమో జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇ.యు కేంద్రం బ్రసెల్స్ (బెల్జియం)లో పొదుపు విధానాలపై నిరసన -రష్యా టైమ్స్

ఇ.యు కేంద్రం బ్రసెల్స్ (బెల్జియం)లో పొదుపు విధానాలపై నిరసన -రష్యా టైమ్స్

జర్మనీ ఉత్పత్తులను కొనే మార్కెట్లు అటు అమెరికా, ఇటు యూరప్ రెండూ మాంద్యంలో ఉండడం దీనికి కారణం. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు బొటాబొటిగా నమోదు చేస్తున్న వృద్ధి, ప్రభుత్వాల జోక్యంతోనూ, కంపెనీలకు, ఇబ్బడి ముబ్బడిగా బెయిలౌట్లు పందేరం పెట్టడం ద్వారానూ కృత్రిమంగా నమోదు చేస్తున్నదేనని విశ్లేషకుల అభిప్రాయం. రికార్డు స్ధాయి నిరుద్యోగంతో పాటు స్పెయిన్, గ్రీసు లాంటి దేశాల్లో వేతనాలు, పెన్షన్లు కూడా 40 శాతం పైగా కోత పెట్టడంతో కంపెనీల ఉత్పత్తులకు కొనుగోలుదారులు లేకుండా పోయారు. దాని ఫలితమే కృత్రిమ వృద్ధిని సృష్టించడానికి ప్రయత్నాలు. 

యూరో జోన్ యువతలో నిరుద్యోగం ఇంకా తీవ్రంగా ఉన్నది. 27 దేశాల యూరోపియన్ యూనియన్ లో 25 సంవత్సరాల లోపు యువకులు 56.94 లక్షల మంది నిరుద్యోగంతో సతమతం అవుతున్నారని తెలుస్తోంది. వీరిలో 35.81 లక్షల మంది 17 దేశాల యూరో జోన్ దేశాలవారు. గ్రీసు యువతలో నిరుద్యోగం అత్యంత ఘోరంగా ఉంది. అక్కడ 25 ఏళ్ల లోపు యువకుల్లో 60 శాతం మంది నిరుద్యోగులే. స్పెయిన్ దీ అదే పరిస్ధితి. ఆ దేశంలో 25 యేళ్లలోపు వారిలో 55.7 శాతం నిరుద్యోగులు.

ఐరోపాలో 27 దేశాలు సభ్య దేశాలుగా యూరోపియన్ యూనియన్ ఏర్పడగా అందులో 17 దేశాలు మాత్రమే ‘యూరో’ ను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించాయి. ప్రధాన దేశాలు జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్, ఇటలీ యూరో జోన్ లోనివే. కాగా బ్రిటన్ యూరో జోన్ లో లేదు. బ్రిటన్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ అంతర్జాతీయ కరెన్సీలలో ఒకటిగా చెలామణిలో ఉన్నది.

గత నవంబరులో యూరో జోన్ 11.8 శాతం నిరుద్యోగం నమోదు చేసింది. అప్పటికి అదే రికార్డు. ఫిబ్రవరిలో ఆ రికార్డును తిరగరాసి 12 శాతానికి యూరో జోన్ నిరుద్యోగం చేరింది. అంటే, ఋణ సంక్షోభానికి పరిష్కారంగా ఐరోపా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలు కంపెనీలకు మేలు చేస్తుండగా ప్రజలను వీధుల్లోకి నెడుతున్నాయని స్పష్టం అవుతోంది. ఫిబ్రవరి నిరుద్యోగంలో సైప్రస్ సంక్షోభం ప్రభావం కలవలేదని తెలుస్తోంది. సైప్రస్ కి బెయిలౌట్ ఇస్తున్నందుకు ప్రతిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోతకు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు షరతులు విధించాయి. ఈ షరతుల ప్రభావం కలిస్తే యూరో జోన్ నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s