విషవాయువు విడుదల, స్టెరిలైట్ కంపెనీ మూసివేతకు ఆర్డర్


స్టెరిలైట్ కాపర్ కంపెనీ -ది హిందు

స్టెరిలైట్ కాపర్ కంపెనీ -ది హిందు

మార్చి 23 తేదీన విషపూరితమైన సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేసి పరిసర గ్రామాల ప్రజలను అనారోగ్యానికి గురిచేసిన ‘స్టెరిలైట్ కాపర్’ కంపెనీని మూసివేయాల్సిందిగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. చుట్టుపక్కల గ్రామాల పొలాలను పనికి రాకుండా చేసిన ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామీణులు అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సమీప గ్రామాల ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. టపాకాయాలు కాల్చి తమ సంతోషాన్ని తెలియజేశారు.

మార్చి 23 తేదీ తెల్లవారు ఝామున ఫ్యాక్టరీ నుండి విషవాయువులు విడుదల కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అనేకమందికి ఊపిరి ఆడలేదు. ముక్కులు, కళ్ళల్లో మండుతున్న పరిస్ధితిని ఎదుర్కొన్నారు. కాపర్ ప్లాంటుతో పాటు ఫ్యాక్టరీలోని ఉప ఉత్పత్తులతో సల్ఫూరిక్ ఆసిడ్ తయారీ కర్మాగారం, పాస్ఫారిక్ ఆసిడ్ కర్మాగారంలను కూడా స్టెరిలైట్ కాపర్ కంపెనీ నడుపుతోంది. ఈ ఫ్యాక్టరీల నుండే సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును విడుదల చేశారని ప్రజలు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.

ప్రజల ఫిర్యాదును పురస్కరించుకుని స్ధానిక ఆర్.డి.ఓ ఘటనకు వివరణ ఇవ్వాల్సిందిగా ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేశారు. ఆర్.డి.ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో కూడిన బృందం ఫ్యాక్టరీ పరిసరాలను శుక్రవారం తనిఖీ చేశారు. విషవాయువులు స్టెరిలైట్ కాపర్ నుండే వెలువడ్డాయని బృందం భావించడంతో ఫ్యాక్టరీ మూసివేయాల్సిందిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరా కత్తిరించామని తమిళనాడు రాష్ట్ర విద్యుత్ సంస్ధ అధికారులు తెలిపారని ‘ది హిందు’ తెలిపింది.

అయితే ప్రభుత్వం, కాకపోతే కోర్టులు

ఫ్యాక్టరీ అధికారులు మాత్రం తిరిగి ఉత్పత్తి ప్రారంభిస్తామన్న ధీమా కనబరుస్తున్నారు. ప్రభుత్వం కాకపోతే కోర్టులు, కోర్టులు కాకపోతే ప్రభుత్వం ఎప్పటికప్పుడు విషవాయు దాతలకు అండగా నిలుస్తారని గత రెండు దశాబ్దాల చరిత్ర చెబుతున్న నేపధ్యంలో ఫ్యాక్టరీ అధికారుల ధీమాకు కారణం అర్ధం కాగలదు.

‘వేదాంత గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ స్ధాపించిన ‘స్టెరిలైట్ కాపర్’ ఆది నుండి వివాదాలను సొంతం చేసుకుంది. పచ్చని పొలాల మధ్య స్ధాపించిన ఈ ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లోని పంట భూములను ఎందుకూ పనికిరాని చవుడు భూములుగా మార్చడంతో దీనికి వ్యతిరేకంగా ప్రజలు మొదటి నుండి ఆందోళనలు చేస్తూ వచ్చారు. ‘కాపర్ ఆనోడ్’ ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్సు 4,000 కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందని తెలుస్తోంది. 1993లో జయలలిత పాలనలోనే ఈ ఫ్యాక్టరీ స్ధాపనకు అనుమతి లభించడం గమనార్హం.

ఫ్యాక్టరీ తెరిచినందుకు కాదు, మూసినందుకే ఈ సంబరాలు -ది హిందు

ఫ్యాక్టరీ తెరిచినందుకు కాదు, మూసినందుకే ఈ సంబరాలు -ది హిందు

అనుమతి ఇచ్చిన దగ్గర్నుండి స్ధానిక ప్రజల నుండి ఫ్యాక్టరీ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంది. కంపెనీ విడుదల చేసే వ్యర్ధాలు సముద్రంలో కలపడం వలన చేపలు చచ్చిపోతాయని మత్స్యకారులు భయపడడంతో ఎం.డి.ఎం.కె నేత వైకో నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళనను చల్లార్చడానికి కంపెనీ మత్స్యకారుల నుండి తగిన అర్హతలు ఉన్నవారిని ఫ్యాక్టరీలో పనికి రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆందోళనకారులు రాజీపడలేదు. స్ధానిక డి.ఎం.కె నేతలు ఈ ఆందోళనను రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నం చేశారు. కానీ 1997లో డి.ఎం.కె ప్రభుత్వం లోనే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించడంతో ఆ పార్టీపై ప్రజల భ్రమలు పటాపంచలయ్యాయి.

సంవత్సరానికి 1.5 లక్షల తన్నుల రాగి ఉత్పత్తి లక్ష్యంతో స్టెరిలైట్ కాపర్ ప్రారంభం అయింది. కానీ ఆరేళ్ళలోనే, 2003 నాటికల్లా ఉత్పత్తిని 4 లక్షల టన్నులకు పెంచారు. రాగికి మార్కెట్ లో విపరీతమైన డిమాండు పెరగడంతో స్టెరిలైట్ కాపర్, స్ధానికుల పొట్టకొడుతూ దిన దిన ప్రవర్ధమానమయింది. ఫ్యాక్టరీ ఉప ఉత్పత్తులకు -సల్ఫూరిక్ యాసిడ్, పాస్ఫారిక్ యాసిడ్, జిప్సం, ఐరన్ సిలికేట్- కూడా దక్షిణ భారతంలో మంచి డిమాండ్ రావడంతో ప్రజల పంట పొలాలు నాశనం అవుతున్నాయన్న శంక, అటు ఫ్యాక్టరీకి గానీ, ఇటు వారి కమిషన్లు మేసిన రాజకీయ పార్టీలకు గానీ ఎన్నడూ రాలేదు. మొక్కుబడిగా సాయంత్రం పాఠశాలలు నడపడం, స్వయం సహాయక గ్రూపులకు కాస్త విదిలించడం, నామమాత్ర ఆరోగ్య శిబిరాలు లాంటివి నిర్వహించి తాను స్ధానికులకు గొప్ప సేవ చేస్తున్నానని కంపెనీ చెప్పుకుంటుంది.

కానీ ప్రజలకు నిత్యం ఇబ్బందులు ఎదురుకావడంతో వారిలో వ్యతిరేకత చల్లారలేదు. ఎం.డి.ఎం.కె, లెఫ్ట్ పార్టీలు తర్వాత కాలంలో కూడా ఆందోళనలు నిర్వహించాయి. వైకో ఆధ్వర్యంలో కోర్టులో కూడా పోరాటం నడిచింది. ఈ కేసు ఫలితంగా ఫ్యాక్టరీ మూసేయాలని హై కోర్టు సెప్టెంబరు 28, 2010 తేదీన తీర్పు చెప్పింది. కానీ అక్టోబరు 18, 2010 తేదీన సుప్రీం కోర్టు ఈ తీర్పుపై స్టే ఇచ్చింది. నవంబరు 6, 2011 తేదీన ఈ స్టేను మరింత పొడిగిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. దానితో ఫ్యాక్టరీ సైరన్ ఇప్పటికీ స్ధానిక ప్రజల చెవుల్లో మృత్యు నాదంగా మారుమోగుతూనే ఉంది. ఫ్యాక్టరీని మరింత విస్తరించడానికి వేదాంత ప్రస్తుతం ప్రయత్నిస్తోంది.

ఫ్యాక్టరీలో అనేకసార్లు ప్రమాదాలు జరిగాయి. వీటిలో కొన్ని సార్లు ప్రాణ నష్టం కూడా జరిగింది. ప్రమాదాల్లో కార్మికులు చనిపోవడం ఒక ఎత్తైతే, ఫ్యాక్టరీ విడుదల చేసే విషవాయువులు మరొక ఎత్తు. 1997లో ఫ్యాక్టరీ విష వాయువు పీల్చి సమీపంలోని ఇద్దరు కూలీలు మరణించడంతో కొద్ది రోజులు మూసివేతకు గురయింది. ఆ తర్వాత దళారీ రాజకీయ నాయకుల అండతో తిరిగి ఉత్పత్తి ప్రారంభించింది. మళ్ళీ వారం రోజుల క్రితం విషవాయువు విడుదల కావడంతో ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించడం తప్ప ప్రభుత్వానికి మరో గత్యంతరం లేకపోయింది.

ఈ ఆటంకాన్ని కూడా త్వరలోనే అధిగమిస్తామని కంపెనీ అధికారులు నమ్మకంతో ఉన్నారని ది హిందూ పత్రిక చెబుతోంది. దానికి కారణం వారికి తమ ధనబలం పైన ఉన్న నమ్మకమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మళ్ళీ కోర్టును ఆశ్రయించే ఉద్దేశంలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కాకపోతే కోర్టులు, కోర్టులు కాకపోతే ప్రభుత్వం అన్నది అందుకే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s