ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా, అమెరికాలు మళ్ళీ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. గతంలో ఎన్నడూ లేనట్లుగా అమెరికా బి-2 బాంబర్లు కొరియా గగనతలం పైన ఎగరడంతో ఉత్తర కొరియా కలవరపాటుకు గురవుతోంది. ఆ దేశ అత్యున్నత మిలట్రీ కమాండ్ అత్యవసర సమావేశం జరిపి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఖండాంతర క్షిపణులను అప్రమత్త స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అమెరికా భూభాగం పైకి దాడి చేయడానికి వెనుదీయమని ప్రకటించింది. దక్షిణ కొరియా, అమెరికాలు యుద్ధ విన్యాసాలు వెంటనే ఆపాలని కోరింది.
ఉత్తర కొరియా ప్రకటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దక్షిణ కొరియాతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా ప్రకటనల దరిమిలా అదనపు రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ఉత్తర కొరియా ఇలాంటి ప్రకటనలు గతంలోనూ చేసిందని గుర్తు చేసింది. ఉత్తర కొరియా నూతన నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ కు ప్రజలనుండి మద్దతు సమకూర్చడానికే ఆ దేశం హడావుడి చేస్తోందని కూడా అమెరికా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారికంగా మాత్రం ఉత్తర కొరియా ప్రకటనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
దక్షిణ కొరియాలో తిష్ట వేసిన అమెరికా సైనిక స్థావరాలపై అణు చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా నాయకులు ప్రకటించారని ఆ దేశ వార్తా సంస్థ కె.సి.ఎన్.ఎ ని ఉటంకిస్తూ వివిధ పత్రికలు తెలిపాయి. ఆ మేరకు సరిహద్దు వద్దకు క్షిపణులు తరలిస్తున్నట్లు పేర్కొంది. అవసరమైతే అమెరికా భూభాగం పైకి ఖండాంతర క్షిపణులతో దాడి చేస్తామని ఆ దేశం హెచ్చరించింది. దక్షిణ కొరియాతో తాము ‘స్టేట్ ఆఫ్ వార్’ లో ఉన్నామని ప్రకటించింది.

అమెరికాను తాకగల క్షిపణులు ఉత్తర కొరియా వద్ద లేవని పరిశీలకుల అంచనా – ఇమేజ్: రష్యా టైమ్స్ (క్లిక్ చేసి పెద్ద ఇమేజ్ చూడండి)
“ఉత్తర కొరియా నుండి కొత్తగా వెలువడిన అసంబద్ధ ప్రకటనల రిపోర్టులను మేము చూశాము. వీటిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. మా మిత్రులు దక్షిణ కొరియాతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్నాము” అని అమెరికా జాతీయ భద్రతా కౌన్సిల్ ప్రతినిధి కైట్లిన్ హేడెన్ అన్నారని ‘ది హిందు’ తెలిపింది. “కానీ ఉత్తర కొరియా గతంలో కూడా ఇలాగే జగడాలమారి ప్రకటనలు ఇచ్చిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుంటున్నాం” అని హేడెన్ తెలిపింది. ఉత్తర కొరియా దాడులు ఎదుర్కోవడానికి అమెరికా పూర్తి సంసిద్ధతతో ఉన్నదని తమ డిఫెన్స్ సెక్రటరీ చక్ హేగెల్ చెప్పిన విషయాన్ని హేడెన్ గుర్తు చేసింది.
“ఉత్తర కొరియా బెదిరింపులకు వ్యతిరేకంగా అదనపు చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాం. ముందే చెప్పినట్లు అమెరికా భూభాగం పైన క్షిపణులను అడ్డుకునే ఇంటర్ సెప్టార్లను మోహరించడం, ముందస్తు హెచ్చరికలు చేసే రాడార్లు మోహరించడం కూడా ఇందులో భాగమే. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా), అమెరికాలు బెదిరింపు వ్యతిరేక పధకం పైన ఇటీవలే సంతకం చేశాయి” అని హేడెన్ తెలిపింది. అయితే ఉత్తర కొరియా బెదిరింపులు కొత్త కాదని దక్షిణ కొరియా ప్రకటించింది. తమ వార్షిక సంయుక్త మిలట్రీ విన్యాసాలకు ఉత్తర కొరియా ఇస్తున్న స్పందనలకు ఇది కొనసాగింపేనని ఆ దేశం ప్రకటించిందని రష్యా టైమ్స్ తెలిపింది.
ఇదిలా ఉండగా కొరియాల వద్ద ఉద్రిక్తతలకు ఉత్తర కొరియా, అమెరికా లు రెండూ కారణమేనని రష్యా ప్రకటించింది. పరిస్ధితి అనూహ్య మలుపులు తిరిగి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చవచ్చని హెచ్చరించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని రేఖ దాటవద్దని కోరింది. బ్రిటన్, ఫ్రాన్సు లు కూడా ఉద్రిక్తతల పట్ల స్పందించాయి. యుద్ధ హెచ్చరికలను ఆపాలని అవి ఉత్తర కొరియాను కోరాయి. బెదిరింపులు ఆ దేశానికి నష్టమని హితవు పలికాయి. అయితే అమెరికా బి-2 బాంబర్ల విన్యాసాలపై అవి నోరు మెదపలేదు.
ఉద్రిక్తతలు మరింతగా కొనసాగడం పట్ల జర్మనీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ శాంతికి, భద్రతకు నష్టకరమని తెలిపింది. ఆస్ట్రేలియా ఒక అడుగు ముందుకేసి ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరింది.
పశ్చిమ దేశాల అభ్యంతరాలను త్రోసిరాజని ఫిబ్రవరిలో ఉత్తర కొరియా మూడోసారి అణు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ పరీక్షల గురించి ఉత్తర కొరియా తమకు ముందే తెలియజేసిందని అమెరికా ఆ తర్వాత ప్రకటించడం విశేషం. మూడో విడత అణు పరీక్షల అనంతరం ఐరాస భద్రతా సమితి ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.
1950-53 కొరియా యుద్ధం అనంతరం శాంతి ఒప్పందం ఏదీ కుదరలేదు. దానితో ఇరు దేశాలు సాంకేతికంగా ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్లే అర్ధమని తెలుస్తోంది.