ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని


రాజీనామా చేసిన విదేశీ మంత్రి గిలియో టెర్జి (ఎడమ) తో ఇటలీ ప్రధాని మెరియో మోంటి

రాజీనామా చేసిన విదేశీ మంత్రి గిలియో టెర్జి (ఎడమ) తో ఇటలీ ప్రధాని మెరియో మోంటి

కేరళ జాలర్లను హత్య చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇటలీ మెరైన్లను ఇండియాకు పంపక పోయి ఉన్నట్లయితే అంతర్జాతీయంగా ఇటలీ ఒంటరి అయుండేది అని ఆ దేశ ప్రధాని మారియో మోంటి గురువారం వ్యాఖ్యానించాడు. మెరైన్లను వెనక్కి పంపడాన్ని వ్యతిరేకిస్తూ ఇటలీ విదేశీ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా చేయడంతో మారియో నాయకత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. న్యూ ఢిల్లీతో సంబంధాల విషయంలో తీవ్రమైన స్ధాయిలో సంక్షోభం ఎదుర్కోవడమే కాక బ్రిక్స్ దేశాల నుండి వ్యతిరేక చర్యలు ఎదురుకావచ్చన్న సూచనలు తనకు అందాయని ప్రధాని మారియో చెప్పడం విశేషం.

విదేశాంగ మంత్రి గిలియో టెర్జీ రాజీనామా వెనుక వేరే ఉద్దేశాలున్నాయని మారియో చెబుతున్నాడు. ఆయన రాజీనామా వెనుక ఒక్క మెరైన్ల విషయం మాత్రమే లేదనీ, ఇంకా విస్తృతమైన ఉద్దేశాలు ఆయనకి ఉన్నాయని తెలిపాడు. టెర్జీ అర్ధాంతర రాజీనామా తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పిన మారియో రాజీనామా చేస్తున్నట్లు ముందస్తు సూచనలేవీ టెర్జీ ఇవ్వలేదని తెలిపాడు. ఇతరేతర ప్రయోజనాలు సాధించే ఉద్దేశాలు ఆయనకి ఉన్నాయి. అవేమిటో సమీప భవిష్యత్తులో స్పష్టం అవుతాయి” అని ఇటలీ వార్తా సంస్థ అన్సా కు టెర్జీ రాజీనామాను ఉద్దేశిస్తూ తెలిపాడు. మెరైన్ల విషయంలో తన అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతూ టెర్జీ మంగళవారం రాజీనామా చేశాడు.

హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ మెరైన్లు మస్సిమిలియనో లతోర్, సాల్వతోర్ గిరోన్ లను ఇండియాకు తిరిగి పంపించక పోయి ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలోని కీలక మైన వాణిజ్య భాగస్వాముల నుండి తీవ్రమైన సమస్యలు ఎదురై ఉండేవి అని మారియో తెలిపాడు. “వారిద్దరిని ఇండియాకు పంపించకపోతే తీవ్రమైన, విశేషమైన ప్రమాదాలు ఎదురై ఉండేవి. అంతర్జాతీయ సమాజంలో ఇటలీ ఒంటరి అయుండేది. ఇండియాతో తీవ్ర స్ధాయిలో సంక్షోభం ఎదుర్కోవలసి ఉండేది” అని బుధవారం రాత్రి ఇటలీ పార్లమెంటులో ప్రసంగిస్తూ మారియో అన్నాడు.

దర్బన్ (సౌతాఫ్రికా)లో ముగిసిన బ్రిక్స్ ఐదో సమావేశం

దర్బన్ (సౌతాఫ్రికా)లో ముగిసిన బ్రిక్స్ ఐదో సమావేశం

మెరైన్లను ఇండియాకు పంపరాదన్న తమ మొదటి నిర్ణయం వాస్తవానికి ఒక వ్యూహంలో భాగమేనని మారియో పార్లమెంటుకు చెప్పడం విశేషం. చర్చల వ్యూహంలో భాగంగా మొదటి ప్రకటన ఇచ్చామని, ఈ విషయం వాస్తవానికి రహస్యంగా ఉండవలసిన విషయం అనీ, కానీ టెర్జీ దూకుడుగా ఇచ్చిన ప్రకటనలు, ఆయన రాజీనామా వలన చెప్పక తప్పడం లేదన్నాడు. టెర్జీ వైఖరి వలన ఇండియా మరింత దృఢ వైఖరి తీసుకోవడానికి దారి తీసిందని విమర్శించాడాయన.

మెరైన్లను ఇండియాకు పంపిన తర్వాత ఇండియాతో సంబంధాలు మెరుగుపడ్డాయని మారియో గుర్తు చేశాడు. తమ చర్య సమస్య త్వరగా పరిష్కారం కావడానికి దారి తీస్తుందని తెలిపాడు. ఆర్ధిక ప్రయోజనాలు తమ నిర్ణయాన్ని ప్రభావితం చేసాయనడాన్ని మారియో తిరస్కరించాడు. ఇటలీ కంపెనీ సరఫరా చేసిన వి.వి.ఐ.పి హెలికాప్టర్ల కుంభకోణంను సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. 3600 కోట్ల రూపాయల హెలికాప్టర్ కాంట్రాక్టు కోసం కంపెనీ భారత నాయకులకు లంచాలు చెల్లించిందని ఆరోపణలు రాగా విచారణను సిబిఐ కి అప్పగించారు. ఈ కుంభకోణం నేపధ్యంలోనే మెరైన్లను తిరిగి ఇండియా పంపారని కొన్ని పత్రికలు రాశాయి. మెరైన్లకు సంబంధించి తాము ఇండియాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని మారియో తెలిపాడు.

మెరైన్లను ఇండియాకు పంపరాదని ఇటలీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత బ్రిక్స్ కూటమి దేశాలు ప్రతీకార చర్యలకు యోచించాయని తమకు సమాచారం అందిందని మారియో తమ సెనేట్ కు తెలిపాడు. “ఇటలీకి వ్యతిరేకంగా బ్రిక్స్ మిత్ర దేశాలు తగిన చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిగణిస్తున్నాయని ఫారెన్ అండర్ సెక్రటరీ స్టాఫ్ఫన్ డి మిస్తురా ప్రభుత్వానికి తెలియజేశాడు” అని మారియో సెనేట్ కు తెలిపాడు. ఏడేళ్ల క్రితం జన్మించిన బ్రిక్స్ కూటమి అప్పుడే అంతర్జాతీయ సంబంధాలలో తన ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పడానికి ఇటలీ ప్రధాని మాటలు ఒక ప్రబల తార్కాణం.

అతి పెద్ద వర్ధమాన దేశాల కూటమిగా బ్రిక్స్ ఇప్పటికే ప్రపంచ దేశాల ఆసక్తిని చూరగొన్నది. అమెరికా ఆధిపత్యాన్ని పూర్వపక్షం చేస్తూ ప్రపంచ గమనం బహుళ ధ్రువం వైపుకు సాగుతున్న నేపధ్యంలో అమెరికా, ఇ.యు, జపాన్ అనే మూడు ధృవాలకు ప్రత్యామ్నాయ ధృవంగా బ్రిక్స్ అవతరించడం నేటి ఆవశ్యకత. ఇది సాకారం కావాలంటే ఇండియా, చైనాలు తమ సరిహద్దు విభేదాలను శాంతియుత పద్ధతుల్లో, ఇచ్చి పుచ్చుకునే రీతిలో పరిష్కరించుకోవడం తక్షణ అవసరం.

One thought on “ఇటలీ ఒంటరి అయుండేది –ఇటలీ ప్రధాని

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s