సూర్యనెల్లి సామూహిక అత్యాచారం కేసు రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ ను వదలకుండా వెంటాడుతోంది. బాధితురాలి పట్టు విడవని ప్రయత్నాలు కేరళ కాంగ్రెస్ నాయకుడికి రాజకీయంగా చివరి రోజులు ఖాయం చేసినట్లు కనిపిస్తోంది. తన పైన అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన పి.జె.కురియన్ పైన పునర్విచారణ చేయాలని మార్చి నెల ఆరంభంలో బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ ను పెరుమాదె జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 2 తేదీన కొట్టివేసింది. అయినప్పటికీ పట్టు విడవకుండా బాధితురాలు ప్రయత్నాలు కొనసాగించడంతో తోడుపుఝ సెషన్స్ కోర్టు పి.జె.కురియన్ కు తాజాగా నోటీసులు జారీ చేయడానికి నిర్ణయించింది. దానితో బాధితురాలి పోరాటం కొంత మేరకు సఫలం అయినట్లేనని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు.
సూర్యనెల్లి బాధితురాలు బుధవారం తొడుపుఝ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన సెషన్స్ కోర్టు కురియన్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఇది నూతన పరిణామమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కురియన్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించడం అంటే బాధితురాలి ఆరోపణలో ప్రాధమికంగా సాక్ష్యాలు ఉన్నట్లు కోర్టు నమ్మినట్లేనని వారు చెబుతున్నారు. ది హిందు పత్రిక ప్రకారం సెషన్స్ కోర్టు జడ్జి కె.అబ్రహాం మాధ్యూ, కురియన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, పి.కె.జమాల్, ఉన్నికృష్ణన్ నాయర్, ధర్మరాజన్ లకు నోటీసులు జారీ చేయడానికి నిర్ణయించింది.
కొట్టాయం లోని ప్రత్యేక కోర్టు గతంలో మూడో నిందితుడు జమాల్ మరియు ఆరో నిందితుడు ఉన్నికృష్ణన్ నాయర్ లకు చెరో 13 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రు. 20,000 జరిమానా విధించింది. ఆ తర్వాత కేరళ హై కోర్టు ఈ శిక్షలన్నింటినీ రద్దు చేసి అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ధర్మరాజన్ మాత్రం పరారీలో ఉండగానే దోషిగా నిర్ధారించి అతని జీవిత కారాగార శిక్షను 7 సంవత్సరాలకు హై కోర్టు తగ్గించింది. కేసు తీర్పు సందర్భంగానూ, అనంతరం ఇటీవల ఒక చానల్ ఇంటర్వ్యూ సందర్భంలోనూ అప్పటి హై కోర్టు జడ్జి జస్టిస్ బసంత్ బాధితురాలికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. (కేసు వివరాల కోసం చూడండి: ఈ “చెడిపోయిన” సూర్యనెల్లి పిల్ల మరో మహానది!?)
శిక్ష పడిన అనంతరం బెయిలులో ఉండగా పరారీ అయిన ఎస్.ఎస్.ధర్మరాజన్ ఇటీవల ఒక టి.వి ఛానల్ లో ప్రత్యక్షమై అత్యాచారంలో పి.జె.కురియన్ కూడా పాల్గొన్నాడని ఆరోపించడంతో బాధితురాలి ఆరోపణలకు మద్దతు లభించింది. బాధితురాలు ఉన్న గెస్ట్ హౌస్ కి కురియన్ తానే స్వయంగా తన కారులో తీసుకెళ్లానని ధర్మరాజన్ ఆరోపించాడు. గతంలో విచారణ చేసిన అధికారుల బలవంతం మీదనే తాను కురియన్ పేరు చెప్పలేదని కూడా ఆయన వివరించాడు. దానితో కురియన్ పై మళ్ళీ విచారణ చేయాలని బాధితురాలు వేసిన పిటిషన్ ను పెరుమాదే కోర్టు కొట్టివేసినప్పటికీ తోడుపుఝ కోర్టు స్వీకరించడమే కాక కురియన్ కి నోటీసులు జారీ చేయడం తాజా సంచలనం.
తాజా నిర్ణయంతో బాధితురాలు దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్ ను కోర్టు కొట్టివేయడం ఇక లెక్కలోకి రాదని న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. మారిన పరిస్ధితుల్లో కురియన్ గతంలో వలే తేలికగా తప్పించుకోవడం కష్టమేనని కేరళ హై కోర్టు లాయర్ జయశంకర్ ని ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. ధర్మరాజన్ వెల్లడించిన నూతన వాస్తవాల ఆధారంగా తాము రివిజన్ పిటిషన్ వేశామని, ధర్మరాజన్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ తాజా సాక్ష్యం కిందికి వస్తుందని బాధితురాలి అడ్వకేట్ ఎ.జె.విల్సన్ తెలిపాడు.
సూర్యనెల్లి అత్యాచారం విషయంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇంతవరకు నోరు మెదపలేదు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సైతం ఎప్పటిలా మౌన ముద్రలో ఉన్నారు. సెషన్స్ కోర్టు నోటీసుల తర్వాతయినా తమ నాయకుడిని రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి నుండి తొలగిస్తారా లేదా అనేది తేలవలసి ఉన్నది. లేనట్లయితే ఢిల్లీ అత్యాచారం సందర్భంగా భారత దేశ మహిళల భద్రత గురించి వారు చేసిన బాసలు, గడప దాటని అడుగులేనని మరోసారి రుజువవుతుంది.
ఎదురుదెబ్బలు తగిలినా వెరవకుండా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి పట్టుదల, ఓపిక నిజంగా స్పూర్తిదాయకం.