
దర్బన్ (దక్షిణాఫ్రికా)లో న్యాయమంత్రి జెఫ్రీ తమ్సంగతో ప్రధాని మన్మోహన్ (ఎడమ); జపాన్ ప్రధాని షింజో అబె తో భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ (BRICS) సమావేశంలో సహచర ఎమర్జింగ్ దేశాలతో కలిసి “పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని తిరస్కరిద్దాం, బహుళ ధృవ ప్రపంచాన్ని స్ధాపిద్దాం” అని పిలుపు ఇచ్చే భారత పాలకులు ధనిక దేశాల వద్ద దేహి అనడం మాత్రం మానడం లేదు. అలవాటు పడిన ప్రాణం ఏమో గాని, ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టామని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకునే భారత ప్రభుత్వం రైల్వే సబ్ వేల నిర్మాణం పేరిట 2.32 బిలియన్ డాలర్ల కోసం జపాన్ ముందు చేయి చాచి దేబిరించింది. సహాయం పేరుతో అప్పు ఇవ్వడం ధనిక దేశాల కార్యక్రమం అయితే, కాంట్రాక్టులు సహాయకులకే కట్టబెట్టి కమీషన్లు కొట్టేయడం దేశీయ పాలకుల కార్యక్రమం. వెరసి, అంతిమంగా ఋణ భారం ప్రజల నెత్తి పైన.
అమెరికా, యూరప్ ల అధిపత్యానికి ప్రత్యామ్నాయంగా అవతరిస్తోందని కొందరు పరిశీలకులు, అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమి సమావేశాలు ప్రస్తుతం దర్బన్ లో జరుగుతున్నాయి. దర్బన్ సమావేశానికి స్వయంగా హాజరయిన ప్రధాని మన్మోహన్, అదే సమయంలో జపాన్ లో జరుగుతున్న ‘ఇండియా జపాన్ వ్యూహాత్మక ఒప్పందం‘ ఏడవ సమావేశానికి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ను పంపడం విశేషం. మంగళవారం ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో జపాన్ భారత్ కి మొత్తం 3.03 బిలియన్ డాలర్ల సహాయాన్ని (రు, 16,380 కోట్లు) ప్రకటించాడు.
ఇందులో మౌలిక నిర్మాణాల కోసం సహాయంగా 2.32 మిలియన్ డాలర్లు, ముంబైలో సబ్ వే నిర్మాణం కోసం రుణంగా 753.17 మిలియన్ డాలర్లు ఇస్తున్నట్లు జపాన్ విదేశీ మంత్రి ఫుమియో కిషిద తెలిపాడు. ఋణ ప్యాకేజీలో న్యూఢిల్లీ–ముంబై సరుకు రవాణా రైలు ప్రాజెక్టు, దక్షిణ ఇండియాలో సబ్ వే నిర్మాణ ప్రాజెక్టులతో పాటు మొత్తం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయని ‘ది హిందు‘ తెలిపింది. ఈ సహాయ, రుణాలకు మన విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ బహు విధాలుగా కృతజ్ఞతలు తెలిపాడు. “ఇలాంటి సహాయం మా మౌలిక నిర్మాణాలను ఆధునీకరించడానికి వినియోగిస్తున్నాము. ఐకోనిక్ ప్రాజెక్టు అనదగిన ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు ఢిల్లీలోని ‘నేషనల్ కేపిటల్ రీజియన్‘ లోని మిలియన్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతోంది” అని ఖుర్షీద్ తన సంతోషం వెలిబుచ్చాడు.
జపాన్ సాయానికి ప్రతిగా భారత ప్రభుత్వం ఆ దేశానికి అత్యవసరమైన (చైనా వ్యతిరేక) రాయబార మద్దతు అప్పటికప్పుడు ప్రకటించాడు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఇండియా ఎప్పుడూ జపాన్ కే మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించాడు. “ఇరు దేశాలు చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలే. కనుక సముద్ర మధ్యంలో (high seas) స్వేచ్ఛాయుత రవాణా లాంటి ప్రపంచ ఉమ్మడి వ్యవస్థలలో భద్రత ఉండేలా ఇండియా, జపాన్ లు సహకరించుకోవాలన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇండియా జపాన్ తోనే ఉందని. ఏకీభావం ఉన్న ఇతర దేశాలతో కలిసి ఈ లక్ష్యాలు, ఉద్దేశాలు నెరవేర్చుకోడానికి ఇండియా కృత నిశ్చయంతో ఉన్నది” అని సల్మాన్ ప్రకటించాడు.
పసిఫిక్ మహా సముద్రంలో చైనా, జపాన్ ల మధ్య నిత్యం తగవులు తలెత్తుతున్న నేపధ్యంలో సల్మాన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తూర్పు చైనా సముద్రంలో సెంకాకు/దియోయు ద్వీపకల్పం పైన సార్వభౌమాధికారం కోసం జపాన్, చైనాలు అనేకసార్లు వివిధ రూపాల్లో ఘర్షణ పడ్డాయి. దక్షిణ చైనా సముద్రంలో జల రవాణాపై నియంత్రణ కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ దేశాలు పరస్పరం తగువులాడుతున్నాయి. వియత్నాం కోసం భారత ప్రభుత్వ కంపెనీ ‘ఒ.ఎన్.జి.సి విదేశ్‘ చమురు అన్వేషణ సాగిస్తోంది కూడా. ఈ నేపధ్యంలో సల్మాన్ ప్రకటన ఉద్దేశం స్పష్టమే. బ్రిక్స్ కూటమి సభ్య దేశం చైనా పక్షం కాకుండా దానికి వ్యతిరేకులైన జపాన్ పక్షం వహించడానికే భారత్ మొగ్గు చూపుతోందని సల్మాన్ ప్రకటన అర్ధం.
ధనిక దేశాలకు ఆధిపత్యం ఇచ్చే ఏకధ్రువ ప్రపంచానికి వ్యతిరేకంగా బహుళ ధృవ ప్రపంచం ఏర్పాటుకు గాను బ్రిక్స్ లోని ఇతర దేశాలతో జట్టు కట్టానని చెబుతున్న ఇండియా, సల్మాన్ ప్రకటన ద్వారా ప్రపంచానికి ఏ సందేశం ఇస్తోంది? ధనిక దేశాల పెత్తనానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలతో జతకట్టామని భారత్ చెప్పడం ఒట్టిమాటేనా? బ్రిక్స్ ఆవిర్భావం అమెరికా కేంద్రంగా ఉన్న ఏక ధృవ ప్రపంచం అంతరించి అమెరికా, జపాన్, యూరప్, బ్రిక్స్, లాటిన్ అమెరికా (సెలాక్, అల్బా) మొదలైన బహుళ కేంద్రాలు గల బహుళ ధృవ ప్రపంచం ఆవిర్భవించడానికి బాటలు ఏర్పరుస్తుందని అనేక వర్ధమాన దేశాలు పెంచుకున్న ఆశలు అడియాసలే అని భారత్ చెప్పదలుచుకున్నదా?
భారత్ చేపట్టిన ‘లుక్ ఈస్ట్ పాలసీ’ నిజానికి పశ్చిమ దేశాలతో జట్టు కట్టేందుకేనని (Looking East to Look West) అనేకమంది జాతీయ, అంతర్జాతీయ విశ్లేషకులు వివరించి ఉన్నారు. చైనాకు వ్యతిరేకంగా ‘ఆసియా పివోట్’ వ్యూహాన్ని ఒబాబా ప్రకటించి అందుకోసం ఇండియాను భాగస్వామిగా చేసుకున్న నేపధ్యంలో బహుశా భారత్ అంతర్జాతీయ ఎత్తుగడలు, విదేశాంగ విధానం అంత ఊహించలేనిది ఎమీ కాదు. కాకపోతే ఈ సంగతిని భారత ప్రజలే గుర్తించి తగిన విధంగా భారత పాలకులను దారికి తేవలసి ఉంది. పార్లమెంటరీ ప్రాతినిధ్య వ్యవస్ధలో అందుకు మార్గం ఉన్నదా అన్నదే సమస్య.
Impressive article. Yes, whatever the things still USA is playing key role in Asia and all over the world.
టపా శీర్షిక బాగుంది!
shekar ji ,is there any similar blog like theluguvartalu in English…?
క్రిష్ గారు మీ ఉద్దేశం అర్ధం కాలేదు సరిగా. like theluguvartalu అంటే? మీకు ఏం కావాలో నాకు అర్ధం అయితే ఆలోచించే అవకాశం ఉంటుంది.
ante oka issue ni anni dimensions lo historical background to saha meru baga analyse chestunnaru sir,it will defiantly help me in my groups preparation.More importently kevalam politics ke parimitham kakuna environment,economy,culture ela anni apects baga cover chestunnaru. so what i meant to say english lo elanti analysis kosam emaina other blogs nu suggest cheyagalara…?
క్రిష్ గారు, మీ భావం ఇప్పుడు అర్ధం అయింది.
“బ్లాగ్ గురించి” పేజిలో చెప్పినట్లు నేను వివిధ వార్తా వెబ్ సైట్ల నుంచి సమాచారం సేకరించి వాటిని ఇక్కడ విశ్లేషిస్తున్నాను. ఈ బ్లాగ్ ప్రారంభించక ముందే నాకు వివిధ పరిణామాలపై బ్రాడ్ గా ఉన్న ఒక అవగాహన ఈ విశ్లేషణకు ఉపకరిస్తోంది. మీరు చెప్పిన వివిధ అంశాలను ఒకే చోట విశ్లేషిస్తున్న ఇంగ్లీష్ బ్లాగ్ ఉన్నదీ లేనిదీ నాకు తెలియదు. అన్నీ కాకపోయినా కొన్ని అంశాలనయినా విశ్లేషించే బ్లాగ్ లు లేకుండా పోవు. మన అవసరానికి అనుగుణంగా వెతికితే దొరక్కపోవు.
అంతర్జాతీయంగా monthlyreview.org మీరు చెప్పిన కోణంలో ఉపయోగపడుతుంది. జేమ్స్ పెట్రాస్ బ్లాగ్ అని ఒకటి ఉంది. అడ్రస్: petras.lahaine.org. అలాగే countercurrents.org కూడా ఉపయోగపడవచ్చు.
tq sir