ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం


బంగూయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని) లోని ఎమ్'పోకో విమానాశ్రయం వద్ద ఫ్రెంచి సేనలు

బంగూయి (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని) లోని ఎమ్’పోకో విమానాశ్రయం వద్ద ఫ్రెంచి సేనలు

ఆఫ్రికాలో సాగుతున్న సామ్రాజ్యవాద ప్రచ్ఛన్న యుద్ధం ఇద్దరు భారతీయులను బలి తీసుకుంది. ఆఫ్రికా ఖండంలో అంతకంతకూ పెరుగుతూ పోతున్న చైనా వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీయడానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లు ప్రత్యక్షంగా తీసుకుంటున్న మిలట్రీ చర్యలకు భారతీయులు మూల్యం చెల్లించవలసి వచ్చింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో విమానాశ్రయాన్ని సమీపిస్తున్న మూడు వాహనాల పైకి ఫ్రెంచి సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు భారతీయులు, ఒక  దేశీయుడు చనిపోగా మరొక భారతీయుడు, ఛాద్ పౌరుడు గాయపడ్డారు.

గుర్తు తెలియని వ్యక్తులు తమ సైనికులపై కాల్పులు జరపడంతో వారికి ఇచ్చిన ప్రతిస్పందనలో భారతీయులు చనిపోయారని చెబుతున్న ఫ్రాన్స్ ప్రభుత్వం అదే నోటితో తాము హెచ్చరిక కాల్పులు జరిపినా ఆగకపోవడంతో కాల్పులు జరిపామని కూడా చెబుతోంది. దీనితో ఫ్రెంచి వివరణ పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సి.ఎ.ఆర్) లో సెలెకా (5 తిరుగుబాటు సంస్థల ఉమ్మడి కూటమి) తిరుగుబాటుదారులు ఆదివారం (మార్చి 24) రాజధానిని ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ బొజిజే దేశం విడిచి పారిపోయాడు. పక్కనే ఉన్న కామెరూన్ ప్రభుత్వం ఆయనకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. ఈ నేపధ్యంలో సి.ఎ.ఆర్ రాజధాని బంగుయి లోని విమానాశ్రయాన్ని ఫ్రెంచి సేనలు తమ స్వాధీనంలో ఉంచుకున్నట్లు తెలుస్తోంది.

భారతీయుల మరణానికి దారి తీసిన కాల్పులకు ఫ్రాన్సు ప్రభుత్వం ఇస్తున్న వివరణలో పలు లొసుగులు కనిపిస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెంచి సేనలపై కాల్పులు జరిపారని, ప్రతిగా ఫ్రెంచి సేనలు జరిపిన కాల్పుల్లో భారతీయులు చనిపోయారని చెబుతూ ఫ్రెంచి అధ్యక్షుడు ఒలాండే భారతీయుల మరణం పట్ల విచారణ ప్రకటించాడు. అయితే ముందు హెచ్చరికగా కాల్పులు జరిపినప్పటికీ వాహనాలు వేగంగా వచ్చాయని, దానితో ఫ్రెంచి సైనికులు కాల్పులు జరిపారని కూడా ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రకటన చెబుతోంది. “ఒకానొక నిర్దిష్ట అయోమయ పరిస్ధితిలో” (particularly confusing situation) తమ వాళ్ళు మూడు వాహనాలపై కాల్పులు జరిపారని ఫ్రాన్సు ప్రకటన తెలిపింది. ఈ రెండు కారణాలు ఒకదానికొకటి పొసగడం లేదు.

బెగౌవా పట్నం (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్) లో దక్షిణాఫ్రికా సైనికులు

బెగౌవా పట్నం (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్) లో దక్షిణాఫ్రికా సైనికులు

తమపై ఎవరు కాల్పులు జరిపారో ఫ్రాన్సు ప్రకటన చెప్పకపోవడం అనుమానం కలిగిస్తోంది. గుర్తు తెలియని వారు తమపై కాల్పులు జరిపారని వారి వివరణ చెబుతోంది. విమానాశ్రయం దగ్గర తిరుగుబాటుదారులు ఉన్నట్లు ఏ పత్రికా చెప్పలేదు. మరి ఫ్రెంచి బలగాలపైన కాల్పులు ఎవరు జరిపినట్లు? కాల్పులు జరుగుతున్న చోట భారతీయులు ఉన్న వాహనాలు ఎలా వస్తాయి? అందునా, ముందస్తు హెచ్చరికగా కాల్పులు జరుపుతున్నా, వేగంగా ఎలా వస్తాయి. పోనీ, వచ్చారే అనుకుందాం. అలా వేగంగా రావడం వలన పొరబడి ఫ్రెంచి సైనికులు కాల్పులు జరిపారు అనుకున్నా, ఎవరో కాల్పులు జరపడం వలన ప్రతి కాల్పులు జరిపామని ఎందుకు చెబుతున్నట్లు? హెచ్చరిస్తున్నా వినకుండా వేగంగా వచ్చినందుకు కాల్పులు జరిపారా లేక గుర్తు తెలియని వారు కాల్పులు జరిపినందుకు ప్రతిగా కాల్పులు జరిపారా? ఈ రెండింటిలో ఏది నిజం?

“ఈ వాహనాలు కెనడా మరియు భారత జాతీయులను రవాణా చేస్తున్నాయి. విమానాశ్రయానికి కాపలా కాస్తున్న సైనికులు హెచ్చరిక కాల్పులు జరిపినప్పటికీ వాహనాలు వేగంగా వస్తున్నాయి. ఇద్దరు భారతీయులు చనిపోయారు. ఫ్రెంచి సైనికులు వెనువెంటనే గాయపడిన ఒక భారతీయుడిని, ఛాద్ పౌరుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమీపంలోని సహాయ కేంద్రానికి తరలించాయి” అని సోమవారం నాటి ఫ్రెంచి ప్రభుత్వ ప్రకటన తెలిపిందని ప్రెస్ టి.వి తెలిపింది.

ఇంతకీ ఫ్రెంచి సేనలు సి.ఎ.ఆర్ విమానాశ్రయాన్ని ఎందుకు కాపలా కాస్తున్నట్లు? ది హిందూ రిపోర్టు ప్రకారం కూల్చివేయబడిన ప్రభుత్వానికి మద్దతుగా అవి అక్కడ ఉన్నాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఒక సార్వభౌమ దేశం. ఆ దేశంలో తిరుగుబాటు తలెత్తినా, మరొకటి తలెత్తినా ఆది ఆ దేశానికి సంబంధించిన సమస్య. అంతగా అవసరమైతే సలహా ఇవ్వడానికీ, స్నేహపూరిత చర్చలు సాగించడానికి ఆఫ్రికా దేశాల కూటమి ఆఫ్రికన్ యూనియన్ (ఎ.యు) ఉన్నది. ఆఫ్రికా ఖండంలోనే వివిధ ప్రాంతీయ కూటములు కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, తిరుగుబాటు కూటమిలోని ఒక ముఠా నాయకుడు నెల్సన్ ఎన్’జడ్డర్ పారిస్ కేంద్రంగా పని చేయడం మరో ఎత్తు. అంటే తిరుగుబాటుదారులకు ఫ్రెంచి సామ్రాజ్యవాదుల మద్దతు కూడా ఉన్నదని స్పష్టం అవుతున్నట్లే. నూతన అధ్యక్షుడుగా ప్రకటించుకున్న మైఖేల్ జొటోడియాకు తమ మద్దతు లేదని నెల్సన్ ప్రకటించడాన్ని బట్టి కొత్త పాలకులపై పట్టు సాధించడానికి ఫ్రాన్సు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని భావించవచ్చు.

సౌత్ ఆఫ్రికా, ఎ.యు ల మధ్యవర్తిత్వంలో గత జనవరిలోనే బొజిజే ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు మధ్య చర్చలు జరిగాయి. జనవరి 11 తేదీన ఇరు పక్షాల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా బొజిజే తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ తిరుగుబాటుదారులు మళ్ళీ సాయుధ చర్య చేపట్టామని చెబుతున్నారు. ఈ పరిస్ధితుల్లో సి.ఎ.ఆర్ ను 1960 వరకూ వలసగా పాలించిన ఫ్రెంచి సేనలు ఆ దేశంలో కొనసాగడం తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే తప్ప వారి ఉనికి ద్వారా శాంతి ఎంతమాత్రం చేకూరదు. ఇప్పటికే 250 మంది సేనలను సి.ఎ.ఆర్ లో మోహరించిన ఫ్రాన్సు, పొరుగు దేశం గాబన్ నుండి మరో 300 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నదని రాయిటర్స్ తెలిపింది. ఫ్రాన్సుకు ఇది ఎంతమాత్రం తగని పని.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ బంగారం, వజ్రాలు, యురేనియం గనులకు నిలయం. కానీ అక్కడి ప్రజలు అత్యంత పేదలు. ఈ దేశం వనరుల పైన పట్టు కోసం దక్షిణ ఆఫ్రికా దేశం కూడా కన్నేసింది. దక్షిణాఫ్రికా సేనలు కొందరు తిరుగుబాటుదారుల చేతుల్లో చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అధ్యక్షుడు బొజిజే ఫ్రాన్సు, ఛాద్ దేశాల మద్దతుతో 2003లో మిలట్రీ కుట్ర ద్వారా అధికారంలోకి వచ్చినవాడే. అధికారాన్ని తద్వారా సంపదలను పంచుకోవడంలో వచ్చిన విభేదాలు సి.ఎ.ఆర్ లో నిరంతరం కుట్రలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ కుట్రల వెనుక ఫ్రాన్సుతో పాటు అమెరికా, దక్షిణాఫ్రికా, ఛాద్ తదితర దేశాల ప్రయోజనాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దానితో సి.ఎ.ఆర్ ప్రజలకు శాంతి, సంపదలు సుదూర స్వప్నంగా మిగిలాయి.

జనవరి ఒప్పందం ప్రకారం తిరుగుబాటు సైనికులను జాతీయ సైన్యంలో కలిసి పోవడానికి ఏర్పాట్లు చేయవలసి ఉండగా అధ్యక్షుడు బొజిజే అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందాన్ని అధ్యక్షుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ తిరుగుబాటు సంస్థలు గత వారం నుండి మరోసారి సాయుధ ఘర్షణలు ప్రారంభించాయి. ఆదివారం నాటికి రాజధానిని ఆక్రమించి ప్రభుత్వ స్ధానాలను వశం చేసుకున్నాయి. ఈ పరిస్ధితుల్లో దేశం నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న భారతీయులు ఫ్రాన్సు సేనల పాలబడి ప్రాణాలు కోల్పోయారు. చేయాల్సింది చేసేసి ఫ్రాన్సు తీరికగా ఇప్పుడు సంతాపం ప్రకటిస్తోంది.

తమ వైపు వేగంగా వస్తే కాల్పులు జరిపి చంపేయవచ్చన్న సూత్రాన్ని పశ్చిమ దేశాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాల్పులు జరపడానికి తగిన పరిస్ధితులు ఏమన్నా ఉన్నదీ లేనిదీ వివరించడానికి కూడా పూనుకోకపోవడం గర్హనీయం. నిజానికి వారు వేగంగా వస్తున్నారన్న ఆరోపణ చంపేశాక, తమ చర్యను సమర్థించుకోడానికి చెబుతున్నట్లుగానే ఉంది. ఇద్దరు కేరళ జాలర్లను ఇటలీ మెరైన్లు కాల్పులు జరిపి చంపేసి ఆనక ఇదే కారణం చెప్పారు. పర్షియా అఖాతంలో గత సంవత్సరం యు.ఎ.ఇ కంపెనీలో పని చేస్తున్న ఒక భారతీయుడిని అమెరికా సైనికులు కాల్చి చంపారు. వారు కూడా తమ ఓడ వైపు వేగంగా వస్తున్నారని, వార్నింగ్ షాట్స్ పేల్చినా ఆగలేదని అందుకే చంపేశామని అమెరికా ప్రభుత్వం చెప్పింది. ఘటన పైన నిష్పాక్షికంగా విచారణ చేస్తామన్న అమెరికా ఇంతవరకు ఆ విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పిన పరిస్ధితి లేదు. భారత ప్రభుత్వం కూడా అడిగిన దాఖలాలు లేవు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లో భారతీయుల మరణానికి కూడా అదే గతి పడుతుందనడంలో సందేహం అనవసరం.

One thought on “ఆఫ్రికా: ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన ఫ్రెంచి సైన్యం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s