పాక్ తో అణు సంబంధాలు కొనసాగుతాయి -చైనా


Image Source: Institute for Science and International Security

Image Source: Institute for Science and International Security

ఎవరేమనుకున్నా పాకిస్ధాన్ తో తమ అణు వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని చైనా స్పష్టం చేసింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడే తాము పాకిస్ధాన్ కు అణు రియాక్టర్లు సరఫరా చేస్తున్నామని న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్.ఎస్.జి) నిబంధనలు కూడా తాము అతిక్రమించడం లేదని చైనా తెలిపింది. కనీసం రెండు కొత్త అణు రియాక్టర్ల నిర్మాణానికి చైనా సహకరిస్తోందని, ఇది అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో చైనా తన అణు వ్యాపారాన్ని గట్టిగా సమర్థించుకుంది.

ఎన్.ఎస్.జి నియమాల ప్రకారం ఎన్.పి.టి (Nuclear Non-Proliferation Treaty) ఒప్పందం పైన సంతకం చేయని దేశాలకు అణు పరికరాలను, టెక్నాలజీని సరఫరా చేయకూడదు. ఎన్.ఎస్.జి అణు వాణిజ్య గ్రూపులో ఇటీవలి సంవత్సరాలలో సభ్యత్వం పొందిన చైనా, సభ్యత్వ నిబంధనలకు విరుద్ధంగా పాకిస్ధాన్ కు అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని, అణు రియాక్టర్లను సరఫరా చేస్తున్నదని ఎన్.ఎస్.జి లోని కొన్ని సభ్య దేశాలు ఆరోపిస్తుండగా వాటిని చైనా కొట్టిపారేసింది.

కొత్తగా 1000 మెగావాట్ల సామర్ధ్యం గల అణు రియాక్టర్ నిర్మించడానికి చైనా గత నెలలో పాకిస్ధాన్ తో ఒప్పందం కుదుర్చుకుందని అమెరికాకి చెందిన వెబ్ సైట్ ఒకటి (Washington Free Beacon) వెల్లడించింది. పాకిస్ధాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అధికారులు ఫిబ్రవరి 15, 18 తారీఖుల మధ్యలో చైనా పర్యటించారని, ఈ పర్యటన సందర్భంగా ఇప్పటికే రెండు అణు రియాక్టర్లు ఉన్న చష్మా అణు విద్యుత్ కేంద్రం వద్ద మరో రియాక్టర్ నిర్మించడానికి ఒప్పందం కుదిరిందని సదరు వెబ్ సైట్ శుక్రవారం తెలిపింది. తన నివేదికకు ఆధారంగా అమెరికా గూఢచార సంస్థలను వాషింగ్టన్ ఫ్రీ బీకాన్ ఉటంకించడం విశేషం.

అయితే ఈ నివేదికను చైనా అధికారులు వ్యతిరేకించలేదని ది హిందు సోమవారం తెలిపింది. సంబంధిత నివేదికను మేము పరిగణనలోకి తీసుకున్నాం అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హాంగ్ లీ వ్యాఖ్యానించాడని ది హిందు విలేఖరి అనంత కృష్ణన్ తెలిపాడు. పాకిస్ధాన్ తో తమ అణు సహకారం కొనసాగుతుందని ఈ సందర్భంగా హాంగ్ లీ స్పష్టం చేశాడు. “ఎన్.ఎస్.జి నిర్దేశించిన సంబంధిత నియమాలను చైనా, పాక్ దేశాల అణు సహకారం ఉల్లంఘించడం లేదని నేను చెప్పదలుచుకున్నాను. పౌర అణు సహకార రంగంలో ఇటీవలి సంవత్సరాలలో చైనా, పాకిస్ధాన్ లు కొంత ముందుకు వెళ్ళాయి. ఈ సహకారం అంతా శాంతియుత ప్రయోజనాల కోసమే. ఐ.ఎ.ఇ.ఎ నిర్దేశించిన రక్షణలకు సంబంధించిన అంతర్జాతీయ బాధ్యతలకు ఇది అనుగుణంగానే ఉంది” అని హాంగ్ లీ తెలిపాడు.

పాకిస్ధాన్ లో చష్మా-1, చష్మా-2 అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించింది చైనాయే. చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్ 2009లో చష్మా-3, చష్మా-4 అణు విద్యుత్ కేంద్రాలను కొత్తగా నిర్మించడానికి పాక్ తో ఒప్పందంపై సంతకం చేయడంతో అంతర్జాతీయంగా గగ్గోలు పుట్టింది. 2008లో భారత దేశంతో అమెరికా,
పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం చైనా, పాక్ లు చష్మా-3,4 రియాక్టర్ల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలాంటిదే తమకూ కావాలని పాకిస్ధాన్ కోరినప్పటికీ అమెరికా నిరాకరించింది. అందుకు చైనా ముందుకు రావడంతో అమెరికా నానా యాగీ చేసింది. మీరు భారత్ తో కుదుర్చుకోగా లేనిది, నేను పాకిస్ధాన్ తో కుదుర్చుకుంటే అభ్యంతరం ఎందుకు?’ అని చైనా ప్రశ్నించడంతో అమెరికా నుండి సమాధానం కరువైంది.

లెఫ్ట్ పార్టీలతో దోస్తీని పణంగా పెట్టి యు.పి.ఎ-1 ప్రభుత్వం అమెరికాతో పౌర అణు ఒప్పందం పైన సంతకం చేసింది. ఒప్పందం కుదరకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రధాని మన్మోహన్ కాంగ్రెస్ పెద్దలను బెదిరించాడని అప్పట్లో పత్రికలు తెలిపాయి. ఈ ఒప్పందంతో అణు ఏకాకితనం నుండి భారత్ బైట పడిందని భారత పాలకులు గొప్పలు చెప్పుకోవడం ఇప్పుడు పరిపాటి. కానీ అందుకు భారత్ అంగీకరించిన షరతులు అత్యంత ఘోరంగా ఉండడమే అసలు సంగతి. అణు కర్మాగారాల్లో నిత్యం నిఘా పెట్టడానికి అమెరికాకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అమెరికా కంపెనీల గొంతెమ్మ కోర్కెలను నెరవేర్చడానికి అంగీకరించింది. 123 అగ్రిమెంట్ పేరుతో అమెరికా పార్లమెంటు విధించిన అనేక విషమ షరతులను సైతం భారత్ అంగీకరించింది. ఇంత చేసినా భారత పార్లమెంటు ఆమోదించిన అణు ప్రమాద పరిహార చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలని అమెరికా మరిన్ని షరతులు విధిస్తోంది.

ఈ నేపధ్యంలోనే పాక్, చైనాల మధ్య మరో రెండు అణు రియాక్టర్లు (చష్మా-3, చష్మా-4) నిర్మించడానికి చైనా ముందుకొచ్చింది. దానికి అమెరికా నుండి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం అయినప్పటికీ చైనా లెక్క చేయలేదు. పైగా అమెరికా, భారత్ పైన విధించిన షరతులేవీ చైనా, పాక్ పైన విధించలేదు. ఎన్.పి.టి పైన పాక్ సంతకం చేయలేదు కనుక చైనా దానికి అణు రియాక్టర్లు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం అని అమెరికా ఆరోపించింది. భారత్ తో మీరు చేసింది అదే కదా?’ అని చైనా బదులిచ్చి తన పని తాను చేసుకుపోయింది. విచిత్రం ఏమిటంటే అమెరికా అంత యాగీ చేసినా ఎన్.ఎస్.జి చష్మా-3, చష్మా-4 లకు మార్చి 2011లో ఆమోద ముద్ర వేసింది.

అయితే, గత ఫిబ్రవరిలో చైనా, పాకిస్ధాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం ఈ రెండు రియాక్టర్లకు సంబంధించినదేనా లేక మరొక కొత్త రియాక్టర్ నిర్మాణానికి సంబంధించినా అనేది తెలియలేదు. పాత ఒప్పందాన్ని తాజాకరించారా లేక ఐదవ రియాక్టర్ నెలకొల్పనున్నారా అన్నది వాషింగ్టన్ ఫ్రీ బీకాన్ నివేదిక కూడా స్పష్టంగా చెప్పలేదని ది హిందూ తెలిపింది. చష్మా-1, చష్మా-2 రియాక్టర్ల కోసం ఒప్పందం కుదిరినప్పుడే 3, 4 రియాక్టర్ల కోసం ఒక అంగీకారం కుదిరిందని చైనా వాదిస్తున్నందున గత ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందం మరో కొత్త రియాక్టర్ కోసం అయి ఉండవచ్చని అనుమానాలు తలెత్తాయి. ఎవరెన్ని అనుమానాలు వ్యక్తం చేసినా చైనా మాత్రం పాకిస్ధాన్ తో సహకరించడంలో వెనకడుగు వేయడం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s