చైనాలో కోకాకోలా గూఢచర్యం?


Photo: Russia Times

Photo: Russia Times

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య సైబర్ గూఢచర్యం ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి.

చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే పనిలో కోకాకోలా నిమగ్నం అయిందని చైనా అధికారులు ఆరోపించారు. ఈ మేరకు కంపెనీపై విచారణ జరుపుతున్నామని చైనా అధికారి హాన్ తెలిపాడని ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్.టి) ను ఉటంకిస్తూ రష్యా టైమ్స్ (ఆర్.టి) తెలిపింది. విచారణాంశాలు సున్నితం అయినందున వివరాలు చెప్పడం లేదని హాన్ తెలిపాడు. అయితే పరిశోధన పూర్తయ్యాక ఫలితాలు చెబుతామని ఆయన తెలిపాడు. తమ రహస్య పరిశోధన గురించి పత్రికలకు తెలియడం పట్ల హాన్ ఆశ్చర్యం వెలిబుచ్చినట్లు ఆర్.టి తెలిపింది.

తాము కస్టమర్ సేవలు మెరుగుపరుచడానికే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కోకాకోలా కంపెనీ వివరణ ఇస్తోంది. “గత అనేక సంవత్సరాలుగా చైనాలోని మా స్థానిక బాట్లింగ్ కర్మాగారాల్లో కొన్ని మా కస్టమర్‌లకు సేవలు పూర్తి స్ధాయిలో మెరుగుపరచడానికి రవాణా పరిష్కారాలను చేపట్టాము. ఇ-మేపింగ్‘, లొకేషన్ ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థల అభివృద్ధి వీటిలో ఉన్నాయి. స్థానిక సరఫరాల నుండే ఈ కస్టమర్ లాజిస్టిక్స్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి” అని కోకాకోలా ప్రతినిధి ఎ.ఎఫ్.పి వార్తా సంస్థకు చెప్పాడని ఆర్.టి తెలిపింది. తాము నైఋతి రాష్ట్రం యూనాన్ ప్రభుత్వ విచారణలో పూర్తిగా సహకరిస్తున్నామని కూడా ఆ ప్రతినిధి చెప్పినట్లు తెలుస్తోంది.

విచారణ ముగిసాక ఫలితాలు వెల్లడిస్తామని హాన్ తెలిపాడు. “అంతా ముగిసాక ఫలితాలు వెల్లడిస్తాం. ఇది సున్నితమైన వ్యవహారం. దీని గురించి పత్రికల్లో ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు” అని హాన్ అన్నాడని ఎఫ్.టి తెలిపింది.

ప్రవేశం లేని చోట్లకు జి.పి.ఎస్ పరికరంతో ప్రవేశించడం అంటే అది చైనా జాతీయ భద్రతకు ప్రమాదం అని చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ప్రతినిధి ఒకరు చైనా అంతర్జాతీయ పత్రిక గ్లోబల్ టైమ్స్ కు తెలిపాడు. “కొన్ని ప్రాంతాలకు మిలటరీ ప్రాముఖ్యత ఉండడం వలన అవి సున్నిత ప్రాంతాలుగా ఉంటాయి. అనధికార వ్యక్తులు లేదా సంస్థలు జి.పి.ఎస్ పరికరంతో అలాంటి చోట్లకు వెళ్ళి ఖచ్చితంగా మేపింగ్ చేసి, వాటిని రాజకీయ లక్ష్యాలకు వినియోగిస్తే మా దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది” అని సదరు ప్రతినిధి తెలిపాడు.

యూనాన్ అధికారుల ప్రకారం కోకాకోలా వ్యవహారం తాము పరిశోధిస్తున్న 21 ఘటనల్లో ఒకటి. అక్రమంగా సర్వే చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. మిలటరీ మేప్ లను అక్రమంగా ఆన్ లైన్ లో అమ్మడం, పైలట్లు లేని విమానాలతో ఏరియల్ ఫొటోలు తీయడం, మిలట్రీ స్ధలాలను అనుమతి లేకుండా సర్వే చేయడం… మొదలైన ఘటనల పైన తాము విచారణ చేస్తున్నామని వారు తెలిపారు. అక్రమ మేపింగ్ చేస్తే శిక్ష తప్పదని కోకాకోలా వ్యవహారంలో విచారణ చేస్తున్న లీ మింగ్డే చైనా జాతీయ రేడియోలో మాట్లాడుతూ అన్నట్లు కూడా తెలుస్తోంది. విదేశీ గూఢచర్య సంస్థలకు మేప్ లు, తదితర సమాచారం అమ్మి లాభాలు పెంచుకుంటున్నారని ఆయన తెలిపాడు.

కోకాకోలా మేపింగ్ పైన తాము ఎందుకు ఆందోళన చెందుతున్నదీ లీ ఉదాహరణతో వివరించాడు. 1999లో అమెరికా బెల్ గ్రేడ్ (సెర్బియా రాజధాని) లోని తమ ఎంబసీ పైనే ఒకసారి బాంబులు వేసుకుందనీ, తమకు అందిన మేప్ లు సక్రమంగా లేకపోవడం వల్లనే ఈ పొరబాటు జరిగిందని అప్పట్లో అమెరికా ప్రకటించిందని ఆయన గుర్తు చేశాడు. కాబట్టి మేపింగ్ సమాచారం శత్రువులకు బాగా ఉపయోగపడుతుందని దీని ద్వారా స్పష్టం అవుతోందని లీ తెలిపాడు.

పరస్పర ఆరోపణలు

అమెరికా, చైనాలు ఈ మధ్య కాలంలో సైబర్ దాడుల గురించి పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. తమ దేశం పైనా, ప్రభుత్వ సంస్థలు, కంపెనీల పైన జరుగుతున్న హేకింగ్ దాడుల్లో అత్యధికం చైనా నుండే వస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించగా, కొద్ది రోజుల తర్వాత చైనా కూడా అమెరికాపై అదే ఆరోపణ చేసింది. అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం చైనా పైన సైబర్ దాడుల ఆరోపణలు చేశాడు.

NSA director Keith Alexander (RT)

NSA director Keith Alexander (RT)

తమ వ్యాపార సమాచారాన్ని సైబర్ దాడులతో దొంగిలిస్తున్నారని అమెరికా వ్యాపార సంస్థలు చెప్పడం పెరిగిందని, చైనా నుండే ఈ దాడులు జరుగుతున్నాయని వారు చెబుతున్నారని కనుక చైనా ప్రభుత్వం ఈ దాడులను నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఒబామా మార్చి రెండో వారంలో ప్రకటించాడు. చైనా పైన కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ ల సభ్యులు కొందరు డిమాండ్ చేశారు కూడాను. ఈ ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నాయని చైనా ప్రత్యారోపణ చేసింది.

అమెరికా అధ్యక్షుడు స్వయంగా చైనా పైన సైబర్ దాడుల ఆరోపణలు చేయడం అంతర్జాతీయ పరిశీలకులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సంస్థ అధిపతి జనరల్ కీత్ అలెగ్జాండర్ చేసిన ఒక ప్రకటనతో వారి ఆశ్చర్యం కనుమరుగయింది. సైబర్ కమాండ్ ఆధ్వర్యంలో పని చేసేందుకు కొత్తగా 40 దళాలను ఏర్పాటు చేస్తున్నట్లు అలెగ్జాండర్ మార్చి 13 తేదీన ప్రకటించాడు. వాటిలో 13 దళాలు కేవలం విదేశాలపైన సైబర్ దాడులు జరపడానికే ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపాడు.

తాము విదేశాల పైన భవిష్యత్తులో చేయబోయే అక్రమ సైబర్ దాడులను సమర్థించుకోడానికే బారక్ ఒబామా ప్రత్యేకంగా చైనాను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశాడని పరిశీలకులు భాష్యం చెప్పారు. తమ వ్యతిరేకులను చంపడానికి టెర్రరిస్టులనో, టెర్రరిస్టులను సమర్ధిస్తున్నారనో ముద్రవేసి డ్రోన్ దాడుల్లో చంపేసినట్లే తమపై దాడులు జరుగుతున్నాయి కనుక మేము కూడా దాడులు చేస్తాం అని సాకు చెప్పడానికే ఒబామా ప్రకటన ఉద్దేశించబడిందని వారి అభిప్రాయం. తమపై దాడులు జరిగే వరకూ చేతులు ముడుచుకు కూర్చబోమని, శత్రువుల నుండి రక్షించుకోడానికి ముందే దాడులు చేస్తామని అలెగ్జాండర్ ప్రకటించడం (రష్యా టైమ్స్) గమనార్హం.

2 thoughts on “చైనాలో కోకాకోలా గూఢచర్యం?

 1. ——: నా వ్యాఖ్య ఈ అంశానికి సంబంధించినది కాదు.;—-

  విశేఖర్ గారు ఇవాళ ఈనాడులో మీ విశ్లేషణ చదివాను. ఒక సమస్య ను ఎలా చూడాలో…ఎన్ని కోణాల్లో విశ్లేషించాలో చాలా చక్కగా వివరించారు.

  కాశ్మీరు సమస్య వెనుక భారత్-పాక్ ల ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయా ? వీలైతే ఎప్పుడైనా వివరించగలరు.

  తెలుగు విద్యార్ధుల్లో జాతీయ అంతర్జాతీయ అంశాల పట్ల అవగాహన పెంచేందుకు మీరు చేస్తున్న కృషికి, మీ శ్రమకు తెలుగు విద్యార్ధులందరి తరపునా ధన్యవాదాలు.

 2. చందుతులసి గారూ

  ఆర్ధిక ప్రయోజనాలు లేకుండా ఆ సమస్య ఇంతకాలం ఉండదు. కాశ్మీరు ప్రజల స్వాతంత్ర్య కాంక్ష వెనుక అక్కడి ప్రజలు, పెట్టుబడిదారుల ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నట్లే భారత్, పాక్ లకు కూడా ఉన్నాయి. భారత్, పాక్ అంటే అక్కడి పెట్టుబడిదారులు, భూస్వాములు అని అర్ధం చేసుకోవాలి.

  మిలట్రీ పరంగా కూడా కాశ్మీరు, భారత్, పాక్ లకు ముఖ్యమైనది. నిజానికి భారత్, పాక్ లు ప్రాక్సీలు మాత్రమే. అసలు ప్రయోజనాలు సామ్రాజ్యవాదులవి. అప్పట్లో అమెరికా, రష్యాల కోల్డ్ వార్ లో భాగంగా కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ లని మిలిటరీకరణ చేసారు. ఇప్పుడు చైనాకి వ్యతిరేకంగా అమెరికా పావులు కదుపుతున్న నేపధ్యంలో కాశ్మీరు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రాముఖ్యత రీత్యా కాశ్మీరు ప్రజలు తమకిక దేశం వద్దనుకున్నా వెనక ఉన్నవాళ్లు ఊరుకోరు. హత్యలు, పేలుళ్లతో కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించయినా సరే అక్కడ మిలట్రీ మొహరించే అవకాశాన్ని కల్పిస్తారు.

  కాశ్మీరులో శాంతి నెలకొనడం అంటే అక్కడ మిలట్రీ అవసరం లేకపోవడం. కాని అక్కడ మిలట్రీ అవసరం కొనసాగడమే జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలకు కావాలి. అగ్ర రాజ్యాల జియో-పొలిటికల్ వ్యూహ, ప్రతివ్యూహాల్లో కాశ్మీరుకు ఒక ముఖ్యమైన పాత్ర ఉన్నది.

  ప్రపంచంలో అగ్రరాజ్యాల వ్యూహాలకు అనువుగా ఉన్న హాట్ స్పాట్స్ లో పాలస్తీనా, ఆఘనిస్ధాన్ ల తర్వాత స్ధానం కాశ్మీరుది. కనుక కాశ్మీరుకు సంబంధించి అక్కడి ప్రజల, పెట్టుబడిదారుల ఆర్ధిక ప్రయోజనాలకు, భారత్, పాక్ ల ఆర్ధిక ప్రయోజనాలకు మించిన ప్రాముఖ్యత వచ్చి చేరింది.

  ఇలాంటి హాట్ స్పాట్స్ ఆధారంగా అమెరికా టెర్రరిజం అనే భూతాన్ని పెంచి పోషిస్తుంది. మళ్లీ ఆ భూతాన్నే చూపిస్తూ రాజకీయ, సైనిక జోక్యాలకు పూనుకుంటుంది. అంటే ఆల్-ఖైదా లాంటి టెర్రరిస్టు సంస్ధలు అమెరికాకు వ్యూహాత్మక మిత్రులే తప్ప శత్రువులు కాదు. ప్రపంచంలోని అనేక టెర్రరిస్టు సంస్ధలకు వాల్ స్ట్రీట్ కంపెనీలే పోషకులని తెలిస్తే దిగ్భ్రమ కలగక మానదు. (‘ది ఇంటర్నేషనల్’ అనే హాలీవుడ్ సినిమా ఈ కోణాన్ని చూపిస్తుంది.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s