సిబిఐ పుణ్యమాని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి.నారాయణ స్వామి వార్తల్లో నానుతున్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె, యుపిఎ ను వదిలి వెళ్ళిన మరుసటి రోజే ఆ పార్టీ నేత కరుణానిధి తనయులు స్టాలిన్, అళగిరి ఇళ్లపైన సిబిఐ చేత దాడి చేయించడం ద్వారా అన్ని పక్షాల నుండి ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దురుద్దేశం ఏమీ లేదని సిబిఐ తన పని తాను చేసుకుందే తప్ప ప్రభుత్వానికి దానికి సంబంధం లేదనీ, అది స్వతంత్ర సంస్థ అనీ నారాయణ స్వామితో పాటు ఇతర పెద్దలు సమర్ధించుకొచ్చారు.
విచిత్రం ఏమిటంటే సిబిఐ, తద్వారా నారాయణ స్వామి అటు ప్రతిపక్షాల విమర్శలతో పాటు ప్రభుత్వ విమర్శలు కూడా ఎదుర్కోవడం. సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ ల నుండి చిదంబరం వరకూ సిబిఐ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పైన అనుమానం కలిగించేలా జరిగిన తనిఖీలను తాము ఖండిస్తున్నామని వారు ప్రకటించారు.
ఇంతకీ కాంగ్రెస్ పెద్దలు ఖండిస్తున్నది ఎవరిని? సిబిఐ దాడులను ఖండిస్తే ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది‘ అంటూ పాలకులు ఇష్టంగా వల్లించే సామెతకు అర్ధం ఏమిటన్నట్లు? సిబిఐ ని ఖండిస్తే మరి స్టాలిన్, అళగిరి లు పన్ను ఎగవేసి దిగుమతి చేసుకున్న విదేశీ కార్ల సంగతిని ఎవరు విచారిస్తారు? సిబిఐ సంస్థకు చట్టం నిర్దేశించిన పని చేయనివ్వకుండా ప్రభుత్వమే అడ్డుకోవడం ఏమిటి?
మంత్రి నారాయణ స్వామికి, సిబిఐ కి బహుశా ఇంతకంటే యూదృచ్ఛికమైన ‘బేడ్ టైమ్‘ మరొకటి ఉండదేమో!