ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది.
ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ సంస్థ. శ్రీలంక ఈశాన్య ప్రాంతంలోని రేవు పట్టణం ట్రింకోమలిలో ఈ కంపెనీకి 99 ట్యాంకుల సామర్ధ్యం కలిగిన స్టోరేజి ఉన్నది. దీనిని శ్రీలంకలో ‘లంక ఐఒసి‘ గా పిలుస్తారు. ఈ స్టోరేజిలో ఐఒసి ఉపయోగించని ట్యాంకులను తాము స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయించామని శ్రీలంక సమాచార మంత్రి కహేలియా రంబూకవెల్ల విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.
2003లో శ్రీలంక ప్రభుత్వానికి చెందిన చమురు చిల్లర వ్యాపారంలో మూడో వంతు భాగాన్ని లంక ఐఒసి కొనుగోలు చేసింది. దేశంలోని చమురు వ్యాపారాన్ని ప్రైవేటీకరించే విధానాల్లో భాగంగా శ్రీలంక ప్రభుత్వం ఈ అమ్మకం చేపట్టింది. దరిమిలా ట్రింకోమలి లోని 99 స్టోరేజి ట్యాంకులను ఐఒసి నిర్వహిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ చమురు ట్యాంకులను నిర్మించినట్లు తెలుస్తోంది. గురువారం ఐరాస మానవ హక్కుల సంస్ధలో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి ఇండియా అనుకూలంగా ఓటు వేసినందునే శ్రీలంక ప్రభుత్వం ప్రతీకార చర్య చేపట్టిందని భారత పత్రికలు అంచనా వేస్తున్నాయి.
లంక ఐఒసి 99 ట్యాంకుల్లో 15 మాత్రమే వినియోగిస్తున్నట్లు పిటిఐ తెలిపింది. మరో రెండు ట్యాంకులను వినియోగంలోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తోంది. వినియోగంలో లేని ట్యాంకులు కూడా లంక ఐఒసి ఆధీనంలోనే ఉన్నాయి. ఇలా ఉపయోగించని ట్యాంకులు మాత్రమే తాము స్వాధీనం చేసుకుంటామని, 2003లో జరిగిన కొనుగోలు ఒప్పందంలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాటు ఉన్నదని సమాచార మంత్రి తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ ‘సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్‘ (సి.పి.సి) నిలువ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి తమ చమురు మంత్రి గత జనవరి నుండి ఏర్పాటు చేస్తున్నాడని, అందులో భాగమే తాజా నిర్ణయమని ఆయన తెలిపాడు.
“ఈ ట్యాంకులను వారు వినియోగించకపోతే సి.పి.సి వాటిని వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. వాటిని సద్వినియోగం చెయ్యాలన్నదే మా ఆలోచన” అని కహెలియా తెలిపాడు. “లంక ఐఒసి వాటిని వాడకపోతే, భవిష్యత్తులో ఉపయోగించకపోతే, సి.పి.సి కి అవి కావాలి. అవన్నీ మా దేశం కోసమే కదా” అని కహెలియా అన్నాడు. శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం తమకు తెలియదని లంక ఐఒసి అధిపతి సుబోద్ తెలిపాడు. 17 మిలియన్ డాలర్ల ఖర్చుతో మరో రెండు ట్యాంకులను నవీకరిస్తున్నామని ఆయన తెలిపాడు.
వ్యతిరేక ఓటుకు ప్రతీకార చర్య కాదని శ్రీలంక ప్రభుత్వం నమ్మబలుకుతోంది. మానవ హక్కుల తీర్మానానికి తమ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని కహెలియా తెలిపాడు. కానీ ఓటింగు ముగిసిన వెంటనే ఐఒసి ఆధీనంలోని ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడానికి నిర్ణయించినట్లు ప్రకటించడంతో ఆ మాటలు నమ్మశక్యంగా లేవు. అంతర్జాతీయ సంబంధాలలో పొరపాటు అవగాహన లేకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం సహజం. కానీ ఆ జాగ్రత్త తీసుకోవడానికి కూడా శ్రీలంకకు ఆసక్తిగా లేదంటే ఆ దేశ పాలకులు తమ ఉద్దేశ్యం ఏమిటో పరోక్షంగా చెప్పదలిచారన్నమాటే.
శ్రీలంక దేశంలో వాణిజ్య కార్యకలాపాల పైన ఆ దేశ ప్రభుత్వానికి సార్వభౌమ హక్కు ఉండడం నిజమే. కానీ ఆ హక్కు శ్రీలంక ప్రజల కోసం కాక అక్కడి పాలక వర్గాల ప్రతీకార చర్యలకు లొంగిపోవడమే విశేషం. ‘కాదు, ప్రతీకారమే అని చెబుతారా, అప్పుడయితే అది ఓకే.