మా కోర్టుల గురించి మీరేమనుకుంటున్నారు? –ఇటలీతో సుప్రీం


sc-of-india

భారత సుప్రీం కోర్టు సోమవారం ఉగ్రరూపం దాల్చింది. హామీని ఉల్లంఘించిన ఇటలీ రాయబారి డేనియల్ మాన్సిని పైన విరుచుకుపడింది. దేశం విడిచి వెళ్లరాదని మార్చి 14 తేదీన తాము ఇచ్చిన ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు పొడిగించింది. వియన్నా సదస్సు లో అంగీకరించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ రాయబారులకు వర్తించే నేర విచారణ నుండి మినహాయింపు (immunity) డేనియల్ కు వర్తించదని స్పష్టం చేసింది. ఒక పిటిషనర్ గా కోర్టులో ఒక ప్రక్రియను ప్రారంభించిన తర్వాత ఇక రాయబార హోదాకు వర్తించే Diplomatic Immunity ని వదులుకున్నట్లేనని స్పష్టం చేసింది. “మా న్యాయ వ్యవస్థ గురించి మీరేమనుకుంటున్నారు?” అని తీవ్రంగా ప్రశ్నించింది.

ఇటలీ ప్రభుత్వం, ఆ దేశ రాయబారి డేనియల్ తరపున వకీలుగా హాజరయిన సీనియర్ లాయర్ ముకుల్ రోహ్తగి తమ క్లయింటుకు రాయబార హోదా ద్వారా సంక్రమించే ఇమ్యూనిటీ వర్తిస్తుందని చేసిన వాదనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. దేశం విడిచి వెళ్లరాదంటూ మార్చి 14 తేదీన ఇచ్చిన ఆదేశాలను ఏప్రిల్ 2 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తులు ఆదేశం జారీ చేసిన అనంతరం రోహ్తగి, డిప్లొమేటిక్ ఇమ్యూనిటీ తన క్లయింటుకు వర్తిస్తుందని గుర్తు చేశాడు. అయితే విచారణ బెంచికి నేతృత్వం వహిస్తున్న చీఫ్ జస్టిస్ ఆల్తమస్ కబీర్ దానిని తిరస్కరించారు. ఇటాలియన్ రాయబారి తమకు అండర్ టేకింగ్ ఇచ్చిన విషయాన్ని ఆయన రోహ్తగి కి గుర్తు చేశారు.

ఒక అండర్ టేకింగ్ ఇచ్చాక మీరు ఇటలీ వెళ్ళిపోయారు. ఇటలీ రాయబారి ఈ విధంగా ఉల్లంఘనకు పాల్పడతారని మేము అసలు ఊహించలేదు, మేము అసలు నమ్మలేదు” అని బెంచి పేర్కొంది. రాయబారికి ఉండే పరిహార వర్తింపును గుర్తు చేసినపుడు బెంచి తీవ్రంగా స్పందించింది. “మేము దేనినీ గుర్తించదలుచుకోలేదు. ఆయన హామీ (undertaking) ఇచ్చారు. ఆయన ప్రకటనను మేము అంగీకరించం. ఆయన స్టేట్ మెంటుని నమ్మదలచుకోలేదు. ఆయన (మా) నమ్మకాన్ని కోల్పోయారు” అని బెంచి పేర్కొంది.

“ఈ కోర్టులోకి పిటిషనర్ గా అడుగు పెట్టాక ఆయనకి మినహాయింపు వర్తిస్తుందని మేము భావించడం లేదు” అని బెంచి స్పష్టం చేసింది. “ఆయనకి ఎటువంటి మినహాయింపు లేదు. మా న్యాయ వ్యవస్థ గురించి మీరు ఏమనుకుంటున్నారు?” అని తీవ్రంగా ప్రశ్నించింది. ఈ ప్రశ్న ద్వారా బహుశా నేరస్థులను మెల్లగా ఏదో ఒక వంక పెట్టుకుని దేశం దాటించేస్తే ఆ తర్వాత డిప్లొమేటిక్ ఇమ్యూనిటీని అడ్డం పెట్టుకుని అండర్ టేకింగ్ ను ఉల్లంఘించిన నేరం నుండి బయటపడవచ్చని భావించి ఉంటే అది తప్పని బెంచి స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. అంత తేలికగా తప్పించుకోగల లొసుగులు తమ న్యాయ వ్యవస్ధలో లేవనీ, ఓటు వేయడానికి తాము అంత తేలికగా అంగీకరించలేదని బెంచి పరోక్షంగా ఉద్దేశించినట్లు కనిపిస్తోంది.

తాను ఇటలీ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ రాయబారికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని రోహ్తగి ధర్మాసనానికి తెలియజేయగా దానికి “డేనియల్ మాన్సిని విషయమే మాకు కావాలి. మిస్టర్ డేనియల్ మాన్సిని! ఏమిటి మీ ఉద్దేశ్యం (intention)?” అని బెంచి రిటార్టు ఇచ్చింది. “ఆయన ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలియాలి. ఈ ఆదేశాలను (దేశం విడిచి వెళ్లరాదన్న ఆదేశాలు) మీరు పాటిస్తారా, లేదా? అది తప్ప మాకు ఇంకే విషయమూ పట్టదు” అని బెంచి స్పష్టంగా పేర్కొంది.

ఇటలీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేస్తామని వెళ్ళిన ఇటలీ మెరైన్లు ఇండియాకి తిరిగి రావడం లేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇటలీ రాయబారిని దేశం విడిచి వెళ్లరాదని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ సందర్భంగా మెరైన్లకు ఇచ్చిన గడువు ఇంకా ముగిసిపోలేదని బెంచి గుర్తు చేసింది. ఓటు వేసి ఇండియాకి తిరిగి రావడానికి తాము నాలుగు వారాలు గడువు ఇచ్చామని, అది మార్చి 22 తేదీన ముగుస్తుందని కనుక మెరైన్లు ఇంకా తమ ఆదేశాలను ఉల్లంఘించినట్లు కాదని తెలిపింది. “మేము అండర్ టేకింగ్ ను గౌరవించి వెళ్ళి రావడానికి నాలుగు వారాల పాటు వారికి గడువు ఇచ్చాము. అది మార్చి 22 తో ముగుస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే వారు ఇంకా ఆదేశాలను ఉల్లంఘించలేదు.” అని బెంచి తెలిపింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో విషయం పీట ముడి పడినట్లే కనిపిస్తోంది. రాయబార చర్చల ద్వారా పరిష్కరించుకోవడం తప్ప వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు చేసిన సూచనలు సుప్రీం ధోరణితో తల్లకిందులయ్యాయి. ఒక పిటిషనర్ గా భారత కోర్టులను ఆశ్రయించిన తర్వాత రాయబారి అయినా నేర విచారణ మినహాయింపును కోల్పోతారని కొందరు సూచించినప్పటికి అవి బలహీనంగా వ్యక్తం అయ్యాయి.

సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని యూరోపియన్ యూనియన్ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన సలహా కూడా ఇప్పుడు పని చేయబోదు. ఇండియాలో ఉన్న ఇటలీ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా కేరళలో ఉన్న వారు తగిన భద్రత లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని ఇటలీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

ఇటలీ ప్రభుత్వ ధోరణి అంతర్జాతీయ సంబంధాలకు ఎలాంటి గౌరవాన్ని తెచ్చేది కాదు. పైగా ఇటలీ ఉల్లంఘన సఫలం అయితే భవిష్యత్తులో ఇదే విధమైన ఉల్లంఘనలకు ఇతర దేశాల సంబంధాలలో కూడా ప్రవేశించడం ఖాయం. తద్వారా దశాబ్దాల అనుభవం ద్వారా అభివృద్ధి చేసుకున్న అంతర్జాతీయ సంబంధాలలో అవాంఛనీయమైన రీతిలో పరస్పర అపనమ్మకాలు, ఒకరి హామీలను మరొకరు అనుమానించే ధోరణి పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ దృష్ట్యా, సుప్రీం కోర్టు అనుసరిస్తున్న పద్ధతి సముచితమే కాగలదు.

6 thoughts on “మా కోర్టుల గురించి మీరేమనుకుంటున్నారు? –ఇటలీతో సుప్రీం

  1. “ముఖ్యంగా కేరళలో ఉన్న వారు తగిన భద్రత లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని ఇటలీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం”
    ఇటలి ప్రభుత్వ హెచ్చరిక లోని డొల్లతనం యల్ కె జి పిల్ల వాడికి కూడా అర్థమౌతుంది. ఈ సంఘటన దేశ ప్రజలకు కనువిప్పు కావాలి. చట్టాలాంటే ఎంతో గౌరవం ఉన్నట్లు, చట్ట ప్రకారం నడుచుకోవాలని నొక్కి వక్కాణించే యురోదేశాల వారి సంగతి ఈ సంఘటనతో బట్ట బయలైంది. ఆమాధ్య అబార్షన్ చేయమని వేడుకొన్న భారత యువతికి మత పరమైన కారణాలు చూపుతూ ఐర్లాండ్ డాక్టర్లు తిరస్కరించి, ఆమే చావుకు కారణమైనారు.ఆతరువాత ఆమే పెట్టుకొన్న అర్జి పత్రం రికార్డుల నుంచి మాయం చేశారు. అది వారి దేశల లో ఉన్న వ్యవస్థ. ఏ ఇతర వెనుక బడిన దేశాలతో వాళ్లు తీసిపోరు. ఈ 21వ శాతాబ్దంలో, మత పరమైన నమ్మకాలలో, మనదేశంలోని పల్లెటురి వారికన్నా వెనుకబడిన మనస్తత్వం గల యురోప్ దేశాలవారు, అభివృద్ది చెందిన వారిగా ఇంతకాలం నటించి, ఎంతో కాలం మన దేశం గురించి ఎన్నో అబ్బద్దాలను ప్రపంచ వ్యాప్తం గా ప్రచారం చేశారు. వాళ్ల ప్రాపగండాతో మన ముందుతరం వారి ఆత్మ విశ్వాసాన్ని బాగా దెబ్బతీశారు. అది ఎంతగా అంటే మనం నిజంగా వెనుకబడిన వాళ్లమని ఒకప్పుడు మన పెద్దలు అనుకొనేవారు. మన అదృష్టం వలన ఇప్పుడు అందరి సంగతులు బయటపడుతున్నాయి.

  2. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఇటలీ ప్రభుత్వానికి… సుప్రీం కోర్టు ఆదేశాలు చెవికెక్కగలవా? అంతర్జాతీయ సమాజం (ముఖ్యంగా భారతీయుల) ముందున్న ప్రధాన సమస్య..

  3. @వెంకట్,
    ఇటువంటి పనుల వలన అంతర్జాతీయ సమాజంలో ఇటలిని ఏ ఇతర దేశాలవారు ఎలా నమ్ముతారను కొంట్టున్నారు? ఆదేశం విలువ ఆమాంతం పడిపోయింది. ఎవరికి వారు ఆదేశం తో వ్యవహరించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటారు ఈ ఘటనతో!

  4. యురోపియెన్ చరిత్ర చదవని వారికి, వారి కుయుక్తులు తెలియని వారికి ఉన్నట్టుండి ఇలాంటి సంఘటనలు జరిగినపుడు యెలా స్పందించాలో తెలియదు.వారికి అర్ధమయ్యేది ఒక్కటే…బలాన్ని ప్రదర్శించగలగడం.. అది యే రకంగానైనా సరే..!బైటకి చెప్పే diplomatic కబుర్లన్ని వ్యర్ధమైనవనే సంగతి వాళ్ళకి బాగా తెలుసు. ఇలాంటి వ్యూహ,ప్రతివ్యూహాల్లో వాళ్ళతో పోల్చితే మనం చాలా చిన్న పిల్లలం…అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి వెనుకాడని జాతులకి మాత్రమే వాళ్ళు విలువ నిస్తారు తప్ప నోటితో వీరోచిత చెత్త ని మాట్లాడేవారికి వాళ్ళు విలువనివ్వరు..!ఇది చరిత్ర నిరూపిస్తున్న సత్యం…!

  5. Very good decision from SC, Now they are talking about ‘Immunity’, we have to ask as question now ‘ What type of value is there to mansini’s undertaking which is submitted to SC? if he is not taking responsibility now.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s