ప్రైవేటు బ్యాంకులే బ్లాక్ మనీకి ‘అడ్డా’లు; స్టింగ్ ఆపరేషన్


cobrapostనల్ల డబ్బు తెల్ల డబ్బుగా మార్చడం, హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించి తిరిగి పెట్టుబడులుగా దేశంలోకి రప్పించడం ఎక్కడో చీకటి గదుల్లో, మూడో కంటికి తెలియని రహస్య గుహల్లో జరిగే పని అనుకుంటే పొరబాటని భారత దేశంలోని ప్రైవేటు బ్యాంకులపై జరిగిన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడి అయింది. భారత దేశంలో దినదిన ప్రవర్థమానమై వర్ధిల్లుతున్న ప్రైవేటు బ్యాంకులే నల్ల డబ్బుకు అడ్డాలుగా మారాయని కోబ్రా పోస్ట్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ రుజువు చేసింది. దేశంలో అతి పెద్ద ప్రైవేటు బ్యాంకులైన ఐ.సి.ఐ.సి.ఐ, హెచ్.డి.ఎఫ్.సి, యాక్సిస్ బ్యాంకులు కల్పిత రాజకీయ నాయకుడి అక్రమ నల్ల డబ్బును సక్రమ తెల్ల డబ్బుగా మార్చడానికి ఉత్సాహంగా ముందుకొచ్చాయని కోబ్రా పోస్ట్ ఎడిటర్ అనిరుధ్ బహాల్ ఢిల్లీలో విలేఖరులకు తెలిపాడు.

ఐదారు నెలలుగా తమ అసోసియేట్ ఎడిటర్ సయ్యద్ మస్రూర్ హాసన్ దేశంలోని ఐదు జోన్ల లోనూ డజన్ల కొద్దీ బ్యాంకు కార్యాలయాలకు వెళ్ళి నల్ల డబ్బు డిపాజిట్ చేస్తానని కోరగా ఎటువంటి శషభిషలు లేకుండా అందరూ అంగీకరించారని తెలియజేశాడు. స్టింగ్ ఆపరేషన్ లో రహస్య కెమెరాతో రికార్డు చేసిన వీడియోలను కోబ్రా పోస్ట్ పోర్టల్ తమ వెబ్ సైట్ లో పబ్లిష్ చేసింది. ఆపరేషన్ రెడ్ స్పైడర్ పేరుతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. లక్షల, కోట్ల రూపాయల డబ్బును ఆర్.బి.ఐ నిబంధనలను అడ్డంగా ఉల్లంఘించి ఎటువంటి పర్యవేక్షణ, పరిశీలన, పరిశోధన లేకుండా అనామతు ఖాతాల్లో, బినామీ పేర్లతో డిపాజిట్ చేయడానికి స్వయంగా ఉన్నత స్థాయి బ్యాంకు మేనేజర్ల నుండి సాధారణ బ్రాంచి మేనేజర్ల వరకు ముందుకు రావడాన్ని బట్టి ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ మందగమనంలో సైతం ఇబ్బడిముబ్బడిగా లాభాలు ఎలా సంపాదిస్తున్నాయో తేటతెల్లం అవుతోంది.

నిబంధనలు బేఖాతరు

Cobra - banksనల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చడమే తమ లక్ష్యంగా సయ్యద్ మస్రూర్ చెప్పినప్పటికీ బ్యాంకుల అధికారులు అదేదో చాలా మామూలు విషయంగా సిద్ధపడిపోయారు. ఆదాయపన్ను శాఖ నిబంధనలు, ఆర్.బి.ఐ విధించిన KYC (Know Your Customer), మరియు AML (Anti Money Laundering) నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘిస్తూ నల్ల డబ్బును తెలుపు చేసుకోవడానికి వివిధ మార్గాలను ప్రైవేటు బ్యాంకులు అందుబాటులో ఉంచాయని తమ ఆపరేషన్ లో తెలిసి వచ్చిందని కోబ్రా పోస్ట్ తెలిపింది. KYC, AML నిబంధనల ప్రకారం కస్టమర్ పూర్తి వివరాలు, డబ్బు కస్టమర్ దగ్గరకు ఎలా వచ్చింది తెలుసుకోకుండా బ్యాంకులు డిపాజిట్లు ఒప్పుకోకూడదు. ఈ నిబంధనల ద్వారా నల్ల డబ్బు వృద్ధిని అడ్డుకోవాలని ఆర్.బి.ఐ భావిస్తుండగా ప్రైవేటు బ్యాంకులు అందుకు పూర్తి విరుద్ధమైన అక్రమ మార్గాలను అభివృద్ధి చేశాయి.

కోబ్రా పోస్ట్ తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసిన వీడియోలలో అనేకమంది సీనియర్ బ్యాంకు అధికారులు అక్రమ డిపాజిట్లను కెమెరా ముందు అంగీకరిస్తూ దొరికిపోయారు. పెద్దగా శ్రమ లేకుండానే అక్రమ డబ్బును సక్రమం చేసుకునేందుకు తగిన మార్గాలను అధికారులు సూచించిన క్రమం వీడియోలలో స్పష్టంగా రికార్డయింది. హైదరాబాద్ లో ఒక బ్యాంకు అధికారి అయితే తాము కెసిఆర్ బావమరిది డబ్బును అలాగే స్వీకరించామని ఉదాహరణ కూడా చెప్పడం విశేషం. ఎన్ఆర్ఐ ఖాతా ద్వారా డబ్బు డిపాజిట్ చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని, కెసిఆర్ బావమరిది రామచంద్రన్ కి తాము అలాంటి వసతినే కల్పించామని హైదరాబాద్ లోని ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు బ్రాంచి మేనేజర్ ఆర్.గణపతి విలేఖరికి తెలియజేస్తున్న విషయం వీడియోలో రికార్డయింది.

ఇండియన్ బ్యాంకులే స్విస్ బ్యాంకులు

“భారతీయ బ్యాంకులు ఇప్పుడు స్విస్ బ్యాంకులలాగానే వ్యవహరిస్తున్నాయి. దేశ వ్యాపితంగా విస్తరించి ఉన్న ఈ బ్యాంకుల అనేక బ్రాంచులను మా రిపోర్టర్ కలిశాడు. వాళ్ళు Know Your Customer నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ నగదు పెద్ద మొత్తంలో స్వీకరించడానికి నిరభ్యంతరంగా సిద్ధమయ్యారు… అక్రమ డబ్బును అనేక పేర్లతో ఉన్న పెట్టుబడి పధకాలలో పెట్టుబడులుగా స్వీకరించడానికి, వాటిని బినామీ పేర్లతో నడపడానికి సిద్ధపడ్డారని మా స్టింగ్ ఆపరేషన్ చూపుతోంది… దేశంలో అమలులో ఉన్న ఆదాయ పన్ను చట్టాలను, యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలను బ్యాంకులు స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి. వాళ్ళు సమానాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నారు. నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చే నేరానికి పాల్పడుతున్నారు” అని అనిరుధ్ బహాల్ తెలిపాడు.

Aniruddha Bahal

Aniruddha Bahal

నల్ల డబ్బుతో సమానాంతర ఆర్ధిక వ్యవస్థను నడపడం అంటే ఏమిటో అనిరుధ్ బహాల్ మాటలు తెలియజేస్తున్నాయి. సినిమాల్లో చూపినట్లుగా మాఫియా ప్రముఖులు ఎక్కడో పెద్ద పెద్ద భవనాల్లోనో, డజన్ల కొద్దీ జర్మన్ అల్శేషియస్ కుక్కలు కాపలా కాసే విలన్ల డెన్లలోనో నడిచేదే సమానాంతర ఆర్ధిక వ్యవస్థ కాదు. అది శుభ్రంగా నగరాల్లో, పట్టణాలలో మెయిన్ బజార్లలో, ప్రసిద్ధి చెందిన ట్రంకు రోడ్ల కూడళ్లలోనూ, రెసిడెన్షియల్ కాలనీలలోని బహుళ అంతస్థుల మేడల్లోనూ బాహాటంగా అద్దాల వెనుక కనిపించే ఎ.సి గదుల్లో రోజువారీగా మన పక్కనే కార్లలో వెళ్ళే మర్యాదస్తులు నిర్వహించేదే అని అనిరుధ్ మాటలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా విస్తృత వ్యాప్తిలో ఉన్న నల్ల డబ్బే ద్రవ్యోల్బణం లొంగిరాకపోవడానికి ప్రధాన కారణం అని తెలిస్తే ఈ అక్రమ లావాదేవీల వలన ప్రజలకు రోజువారీ సరుకులు కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయని అర్ధం చేసుకోవచ్చు.

సామాన్యులు బ్యాంకు ఖాతాలు తెరవడానికి వెళితే అక్కడి సిబ్బంది సవాలక్ష నియమ నిబంధనలు చెప్పి విసిగించి వేధిస్తారు. రిజర్వు బ్యాంకు రూపొందించిన KYC నిబంధనల ప్రకారం ఖాతాదారు గుర్తింపును ధృవపరిచే రెండు ధృవీకరణలను సమర్పించాలంటారు. తెలిసిన ఖాతాదారుడు సిఫారసు చేయాలంటారు. ఫోటో కావాలని, పాన్ కార్డు నెంబరు తప్పనిసరి అనీ చెబుతారు. ఇవన్నీ చేసినా కోబ్రా పోస్ట్ సంప్రదించిన మూడు ప్రైవేటు బ్యాంకులు పెద్ద మొత్తంలో ఖాతాలో ఎప్పుడూ నిలవ ఉండాలని నిబంధన విధిస్తారు. ఇలాంటి బ్యాంకులు నల్ల డబ్బు అనేసరికి ఎలాంటి నిబంధనలు వర్తించని ఇన్వెస్టుమెంటు పధకాలను, ఇన్సూరెన్స్ పాలసీలను రూపొందించి అక్రమాసురులకు తగిన మార్గాలను సిద్ధం చేశాయని స్టింగ్ ఆపరేషన్ ద్వారా అర్థమవుతోంది.

కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ కు ఆర్ధిక మంత్రి చిదంబరం తనదైన రీతిలో స్పందించారు. తాను రెండు బ్యాంకుల అధికారులతో మాట్లాడానని వారు ఆరోపణలను తిరస్కరించారని ఆయన విలేఖరులకు తెలిపారు. “ఇది పూర్తిగా తప్పుడు కధనం అని వారు (రెండు బ్యాంకుల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు) అన్నారు. ఈ విషయమై వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేస్తారు. ప్రకటన కాపీ నాకు కూడా పంపుతామని చెప్పారు. మూడో బ్యాంకు అధికారి దేశంలో లేడు” అని చిదంబరం విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. ఇ.డి (Enforcement Directorate) విచారణ చేస్తుందా అన్న ప్రశ్నకు ఆయన “మేము మీడియా కాదు. నిమిషాల్లో మేము ఒక అభిప్రాయానికి వచ్చేయము” అని వ్యాఖ్యానించారు.

ఐదారు నెలలు కష్టపడి కెమెరాల సాక్షిగా సేకరించిన సాక్ష్యాలను నిమిషాల మీద నమ్మని చిదంబరం ప్రైవేటు బ్యాంకులు ఇదంతా అబద్ధం అని చెప్పేయగానే ఎలా నమ్మారో అర్ధం కాని విషయం!

కాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సి.బి.డి.టి) కి చెందిన ముంబై అధికారి కె.వి.చౌదరి తాము విచారణ చేస్తామని చెప్పినట్లుగా ది హిందు తెలిపింది. “కోబ్రా పోస్ట్ స్టోరిని మేము పరిగణనలోకి తీసుకున్నాము. ఈ విషయంలో విచారణ ప్రారంభించాము” అని ఆయన తెలిపాడు. హెచ్.డి.ఎఫ్.సి, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకులు కూడా తాము అంతర్గత విచారణ చేయనున్నట్లు తెలిపారు. ఆర్.బి.ఐ నియమ నిబంధనలకు తాము కట్టుబడి ఉన్నామని వారు నొక్కి వక్కాణించారు. యాక్సిస్ బ్యాంకు అధికారులు కూడా తాము విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆశీస్సులు లేకుండా కింది అధికారులు ఇంత బహిరంగంగా, ఎటువంటి జంకు గొంకు లేకుండా, వచ్చింది ఎవరైనది కూడా తెలుసుకోకుండా నల్ల డబ్బు అక్రమాలకు అంగీకరిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

2 thoughts on “ప్రైవేటు బ్యాంకులే బ్లాక్ మనీకి ‘అడ్డా’లు; స్టింగ్ ఆపరేషన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s