హ్యాకింగ్ దాడుల్లో సగం అమెరికా నుండి వస్తున్నవే -చైనా


Photo: Russia Times

Photo: Russia Times

2013 సంవత్సరంలో చైనా దేశం పైన జరిగిన హ్యాకింగ్ దాడుల్లో సగానికి పైన అమెరికానుండి వచ్చినవేనని చైనా ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా ను ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం తెలిపింది. అమెరికాతో పాటు ప్రపంచంలో జరుగుతున్న ఇంటర్నెట్ హ్యాకింగ్ దాడులకు షాంఘై లోని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కి చెందిన ఒక భవంతి ప్రధాన కేంద్రంగా ఉందంటూ అమెరికా సైబర్ కంపెనీ మాండియంట్ఒక నివేదిక వెలువరించిన మూడు వారాల లోపే చైనా ప్రత్యారోపణలు వెలువడడం గమనార్హం.

కొత్త సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో అమెరికాలోని 2,196 కంట్రోల్ సర్వర్లు చైనా లోని 1.29 మిలియన్ల కంప్యూటర్లను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయని చైనా వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. చైనా కంప్యూటర్ల పై జరుగుతున్న హ్యాకింగ్ దాడుల్లో ఇవి సగం కంటే ఎక్కువని ఆ సంస్థ తెలిపింది. చైనా సర్వర్ కంప్యూటర్లు, హోస్ట్ కంప్యూటర్లు అన్నీ ఈ హ్యాకింగ్ దాడులకు గురవుతున్నాయని తెలిపింది.

ఇతర దేశాల నుండి చైనా పైన జరుగుతున్న దాడులు కూడా అంతకంతకూ తీవ్ర స్వభావం సంతరించుకుంటున్నాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. రాయిటర్స్ వార్తా ప్రకారం చైనా ప్రభుత్వం అత్యున్నత ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ అయిన కంప్యూటర్ నెట్వర్క్ ఎమర్జన్సీ రెస్పాన్స్ కోఆర్డినేషన్ సెంటర్ (CNCERT) కూడా ఈ ఆందోళనలో భాగం పంచుకుంది.

“సైబర్ దాడులకు ప్రధాన బాధితులుగా ఉన్న దేశాల్లో చైనా ఒకటని అనేక సంవత్సరాలుగా నమోదయిన నిజాల ద్వారా రుజువవుతోంది” అని చైనా నేషనల్ ఇంటర్నెట్ కార్యాలయం అధికారులు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. ఫిబ్రవరిలో రక్షణ మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ తో పాటు చైనా మిలట్రీకి చెందిన రెండు వెబ్ సైట్లు నెలకు 144,000 సార్లు చొప్పున గత సంవత్సరంలో హ్యాకింగ్ దాడులకు గురయ్యాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

చైనా, అమెరికా దేశాల మధ్య సైబర్ ఆరోపణలకు సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈనాటివి కాదు. 2010లో చైనా ప్రభుత్వం షరతులను సాకుగా చూపుతూ చైనా నుండి వెళ్లిపోతానని గూగుల్ కంపెనీ బెదిరించినప్పటినుంచి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష, పరోక్ష మాటల యుద్ధం అడపాదడపా చెలరేగుతూనే ఉంది.

గూగుల్ కంపెనీ చైనా ప్రభుత్వం పై ప్రకటించిన యుద్ధంలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా జొరబడి గూగుల్ కంపెనీకి మద్దతుగా ప్రకటనలు జారీ చేసింది. వ్యాపార కంపెనీలకు మరింత స్వేచ్ఛను ఇస్తూ ప్రజాస్వామిక సూత్రాలు అలవరచుకోవాలని చైనాకు బోధనలు కూడా చేసింది. గూగుల్ లాగానే యాహూ, మైక్రో సాఫ్ట్ కంపెనీలు కూడా తగిన నిర్ణయం తీసుకోవాలని హిల్లరీ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసి విఫలం అయింది. గూగుల్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమ వ్యాపారాలకు ఇబ్బందులు ఏమీ లేవని ఆ రెండు కంపెనీలు చెబుతూ గూగుల్ ప్రకటనల యుద్ధంలో చేరడానికి నిరాకరించాయి.

హిల్లరీ బోధనలను చైనా గోంగూరలో పురుగు లెక్కన తీసిపారేసింది. చైనాలో వ్యాపారం చెయ్యాలనుకుంటే చైనా షరతుల ప్రకారం చేసుకో, లేదంటే శుభ్రంగా దేశం వదిలి వెళ్లిపోవచ్చు అని గూగుల్ కి చెప్పేసింది. కొద్ది నెలల పాటు సాగిన ఈ గొడవ గూగుల్ కిక్కురుమనకుండా షరతులకు ఒప్పుకోవడంతో ముగిసింది.

గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా పేరుతో చైనా ప్రభుత్వం దేశంలోకి వచ్చే ఇంటర్నెట్ సమాచారం పైన గట్టి నిఘా ఉంచుతుంది. పోర్న్ సైట్లను దేశంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వెబ్ సైట్లకు కూడా చైనాలో ప్రవేశం ఉండదని చెబుతారు. గూగుల్, ఫేస్ బుక్ లాంటి వెబ్ సైట్లను తలదన్నే రీతిలో బైదు లాంటి సెర్చ్ ఇంజన్లు, ఇతర సామాజిక వెబ్ సైట్లు చైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దానితో చైనీయులకు గూగుల్, ఫేస్ బుక్ లతో అవసరం లేకుండా పోయింది. సెర్చ్ మార్కెట్లో అక్కడ బైదు దే ఆధిపత్యం.

రాజకీయంగా ఇబ్బంది కలిగించే సమాచారాన్ని కూడా చైనా ప్రభుత్వం ఫైర్ వాల్ ద్వారా ఫిల్టర్ చేస్తుంది. ఈ ఆటంకాలు లేకుండా చేయాలని గూగుల్ శత విధాలా ప్రయత్నించి సహకారం లేక ప్రస్తుతం నోరు మూసుకుంది.

ఈ నేపధ్యంలో చైనా ఎక్కు పెట్టిన హ్యాకింగ్ ఆరోపణాస్త్రాలు ఇరు దేశాల మధ్య మరొకసారి అసౌకర్యవంతమైన వ్యాపార ఉద్రిక్తతలు తలెత్తడానికి అవకాశం ఏర్పడింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s