ఫిజియో ధెరపీ విద్యార్ధిని జ్యోతి సింగ్ పాండే పైన ఢిల్లీ బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతుండగా అతన్ని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జైలులోని ఇతర ఖైదీలు రామ్ సింగ్ ని హత్య చేశారని, హత్య చేశాక సెల్ గేటు ఊచలకు వేలాడగట్టారని వారు ఆరోపిస్తున్నారు. రామ్ సింగ్ ను చంపుతామని ఖైదీలలో కొందరు మొదటి నుండి చెబుతున్నారని, ఆ మేరకు ప్రయత్నాలు కూడా జరిగాయని చెప్పిన కుటుంబ సభ్యులు రామ్ సింగ్ మరణం పైన విచారణ జరిపించాలని కోరారు.
“సెల్ లో సింగ్ ఒక్కడే ఒంటరిగా ఏమీ లేడు. ఇతర ఖైదీలు కూడా ఉన్నారు. ఒక గార్డును కూడా నియమించాము. కానీ ఈ సంగతి ఎవరికీ తెలియలేదు. ఉదయం 5 గంటల కల్లా అతను ఉరికి వేలాడుతూ కనిపించాడు” అని ఒక సీనియర్ జైలు అధికారి చెప్పాడని ‘ది హిందు‘ తెలిపింది. సింగ్ హింసాత్మక ప్రవృత్తి కలవాడని, హెచ్చుతగ్గులతో కూడిన ఉద్వేగాలు ప్రదర్శిస్తుంటాడని, అందువలన ఆయన ఆత్మహత్య చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఎల్లప్పుడూ ‘కనిపెట్టుకుని‘ ఉండేలా ఏర్పాట్లు చేశామని సదరు అధికారి చెప్పాడు. అయినప్పటికీ రామ్ సింగ్ ఆత్మహత్య ఎలా చేసుకోగలిగాడన్నదీ జైలు అధికారులు చెప్పలేకపోతున్నారు. రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమిక విచారణలో తేలిందని కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పడం విశేషం.
“ఇప్పటికే విచారణ ప్రారంభం అయింది. నిందితుడి ఆత్మహత్య పై విచారణ చేయాలని జైలు అధికారులు ఆదేశించారు. ఈ విషయమై మేము విచారణ చేస్తున్నాము” అని కేంద్ర సహాయ హోమ్ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ తెలిపాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రతి రోజు విచారణ జరుగుతున్న నేపధ్యంలో రామ్ సింగ్ ను రోజూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. సోమవారం ఉదయం గేటుకు వేలాడుతూ కనిపించడంతో హుటాహుటిన జైలు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ధృవపరిచారు. అనంతరం పోస్టుమార్టం కోసం దీన్ దయాళ్ ఆసుపత్రికి రామ్ సింగ్ విగత దేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది. జైలు అధికారుల ప్రకారం రామ్ సింగ్ తన బట్టలతో తన సెల్ ఊచలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మమత శర్మ రామ్ సింగ్ మరణం పైన అసంతృప్తి ప్రకటించారు. తీహార్ జైలు పని పద్ధతి పైన ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. అండర్ ట్రయల్ ఖైదీకి రక్షణ కల్పించలేకపోవడం ‘షాకింగ్‘ గా ఉన్నదని చెబుతూ ఆమె మృతిపై విచారణ జరిపించాలని కోరింది. రామ్ సింగ్ ఎటువంటి ‘స్పెషల్ వాచ్‘ లో ఉన్నాడో విచారణ అనంతరమే తేలుతుందని తీహార్ జైలు మాజీ డైరెక్టర్ జనరల్ కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. “ప్రత్యేక నిఘాను తప్పించుకుని ఈ వ్యక్తి ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు? విచారణ ఫలితం కోసం ఎదురు చూద్దాము” అని ఆమె ప్రశ్నించారు.
గత రెండు రోజులుగా రామ్ సింగ్ డిప్రెషన్ లో ఉన్నాడని, గత సాయంత్రం భోజనం కూడా చేయలేదని జైలు అధికారులను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది. దుర్ఘటన జరిగిన రోజున డ్రైవర్ రామ్ సింగ్ బస్సు స్టీరింగ్ ముందు తన సోదరుడిని కూర్చోబెట్టాడు. అత్యాచారం అనంతరం జ్యోతి, ఆమె స్నేహితుడిని బస్సు బైటికి నెట్టివేసిన రామ్ సింగ్ తదితరులు బాధితురాలిపైన బస్సు నడిపించి చంపడానికి ప్రయత్నించిన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. అరెస్టు అనంతరం నేరాన్ని అంగీకరిస్తూ తనను ఉరి తీయాలని కోరిన రామ్ సింగ్ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని అతని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
“అతన్ని హత్య చేసి అనంతరం జైలులో వేలాడదీశారు. జైలులో తనను చంపుతామని బెదిరిస్తున్నారని మాకు అనేకసార్లు చెప్పాడు. ఈ విషయమై మేము ఫిర్యాదు కూడా చేశాము. అది ఆత్మహత్య కాదు” అని రామ్ సింగ్ తండ్రి మంగీ లాల్ పత్రికలకు తెలిపాడు. “అత్యాచారానికి ఒడిగట్టానని అతను అంగీకరించాడు. తనకు మరణ శిక్ష వేయాలని కోరాడు. అతన్ని ఉరి తీయాల్సిందేనని మేము కూడా చెప్పాము. జైలులోని ఖైదీలు అతన్ని అనేకసార్లు కొట్టారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టుల కోసం మేము ఎదురు చూస్తున్నాం. అతని చొక్కా చిరిగిపోయి ఉంది. దాన్నిబట్టే ఏదో మోసం ఉందని అర్ధం అవుతోంది” అని మంగీ లాల్ అన్నాడు. రామ్ సింగ్ తల్లి తీహార్ జైలు బయట మాట్లాడుతూ “అతను నేరాన్ని అంగీకరించినందున ఆత్మహత్య చేసుకుని ఉండడు. మరణం పైన విచారణ జరిపించాలి” అని కోరింది.
తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గదిలో రామ్ సింగ్ ని ఉంచారు. అయినప్పటికీ అతను ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు. ఇందులో జైలు అధికారుల పాత్ర పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామ్ సింగ్ ని కనిపెట్టుకుని ఉండడానికి అతని గది బైట ఒక గార్డును నియమించారు. గదిలో ఇతర ఖైదీలు కూడా ఉన్నారు. రామ్ సింగ్ ఉరి వేసుకున్నాడని తమకు కూడా తెలియదని ఇతర ఖైదీలు చెప్పినట్లు జైలు అధికారులు చెప్పినట్లు ది హిందు తెలిపింది.
రామ్ సింగ్ ఆత్మహత్య పైన మంగళవారానికల్లా విచారణ నివేదికను తమ ముందు ఉంచాలని అత్యాచారం కేసు విచారిస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. ఈ కేసులో నిందితులైన ఇతర ఖైదీల రక్షణ ఏర్పాట్లను ప్రతి రోజూ సమీక్షించాలని కూడా అడిషనల్ సెషన్స్ జడ్జి యోగేష్ ఖన్నా కోరాడు. గత నాలుగైదు రోజులుగా జైలు అధికారులు తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఇతర నిందితులు ముకేష్ వినయ్ శర్మ, పవన్ గుప్త, అక్షయ్ సింగ్ సోమవారం జడ్జి ముందు ఆరోపించడం గమనార్హం. ఒక పక్క విచారణ జరుగుతుండగా ఖైదీలను హింసించవలసిన అవసరం జైలు అధికారులకు ఎందుకు వచ్చిందో అర్ధం కాని విషయం.
ప్రస్తుతం ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యుల సాక్ష్యాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టు వింటున్నది. ఇప్పటివరకు 45 మంది సాక్ష్యాలను కోర్టు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
I think he got the same treatment that was given to them who attacked Swapnika and Pranitha. Any way, it is not right to do extra-judicial killings.