ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు


ఈ ఇరానియన్ తల్లి, కూతుళ్ల దుఃఖానికి ఏ పేరు పెట్టాలి? ఏ పేరు పెడితే వారు అనుభవిస్తున్న వేదన అంతా ఒక్క ముక్కలో అర్ధం అవుతుంది? పోనీ ఎన్ని పదాలు కలిపి ప్రయోగిస్తే వారి నిరామయ దుఃఖ సారం నిండుగా వ్యక్తీకరించబడుతుంది? ఎన్ని రాత్రుళ్లు, పగళ్ళు పొగిలి పొగిలి ఏడ్చితే తీరే దుఃఖం వీరిది!

ఆమె పేరు సొమాయే మెహ్రి. వయసు 29. ఆమెతో ఉన్నది మూడేళ్ల కూతురు రానా. సొమాయే భర్త అమీర్ అఫ్ఘనిపూర్ అకృత్యానికి బలై ఈ పరిస్ధితిలో ఉన్నారు. ఇరాన్ లో అత్యంత పేదరికంతో అల్లాడుతున్న ప్రాంతంలోని ఒక చిన్న పట్నం వీరి నివాసం.

అమీర్ ప్రవృత్తి రీత్యా దొంగ. మాదక ద్రవ్యాలకు బానిస కూడా. ఫలితంగా కుటుంబ భారంతో పాటు భర్త వ్యసనాల భారం కూడా ఆ ఇల్లాలే మోయవలసిన పరిస్ధితి. భర్త చేతుల్లో అనేకసార్లు శారీరక, మానసిక హింస అనుభవించింది. అనేకసార్లు ఆమెను ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్లిపోయేవాడు. ఇక సహించలేనని నిర్ణయించుకుని ఆమె విడాకుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

భార్య విడాకుల కోసం ప్రయత్నించడం అమీర్ కి ససేమిరా నచ్చలేదు. ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తే తన మొఖంతో జీవించలేని పరిస్ధితి కల్పిస్తానని హెచ్చరించాడు. ఒక రోజు రాత్రి అన్నంత పనీ చేశాడు. 2011 జూన్ నెలలో తల్లి, కూతుళ్లు ఇద్దరు గాఢ నిద్రలో ఉండగా బకెటుతో యాసిడ్ (ఆమ్లం) తెచ్చి వారిపై పోసాడు. ఫలితంగా వారి మొఖాలు, చేతులు, శరీరాలు తీవ్రంగా కాలిపోయాయి.

సొమాయేకు చూపు పూర్తిగా పోయింది. కూతురు రానా ఒక కంటి చూపుతో మిగిలింది. వారికి సాధ్యమైనంతగా రూపం తెప్పించడానికి డాక్టర్లు శాయశక్తులా శ్రమిస్తున్నారు. సొమాయేకు ఇంకా వందకు పైగా ఆపరేషన్లు చేయాలట. కూతురుకి మరో 70 సార్లు ఆపరేషన్ చేస్తే సరిపోతుందట(!)

మరి డబ్బు? అసలే పేదరికంలో ఉన్న వీరికి డబ్బు ఎలా? ప్రభుత్వం కొంత డబ్బు భరిస్తోంది. ఆ మిగిలింది వారి ఊరి వాళ్ళు భరిస్తున్నారట. కొంతమందయితే తల్లి, కూతుళ్లకు వైద్య చికిత్స, ఆపరేషన్లు చేయించే ఖర్చు కోసం తమ పొలాలను కూడా అమ్మేసారట. ఎంతటి మానవత్వం! మానవత్వంతో చలించిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం ఒక విషయం అయితే దానిని ఆస్తులు అమ్మేయడం వరకూ కొనసాగించి బాధితులకు సాయం చెయ్యడానికి సిద్ధపడడం నిజంగా అపూర్వమైన విషయం.

ప్రపంచంలో జరుగుతున్న యాసిడ్ దాడుల్లో తొంభై శాతం పైగా మహిళలపైనే జరుగుతున్నాయని వినికిడి. యాసిడ్ దాడులకు ప్రేరేపిస్తున్న కారణం ఏమిటో ఈ ఒక్క వాస్తవమే వివరిస్తోంది. ఒక మహిళకు తన ముఖాకృతే శతృవుగా మారుతున్న దీన, విచిత్ర, వికృత, విపరీత పరిస్ధితికి దారితీస్తున్న మగాధిపత్యం అంతం కావడానికి ఎన్ని చట్టాలు చేస్తే ఏం ప్రయోజనం, సమాజ ఉమ్మడి చేతనలో మార్పు రాకుండా?

ఇరానియన్ ఫోటోగ్రాఫర్ ఇబ్రహీం నొరూజీ వీరి వ్యధాభరిత గాథను వెలుగులోకి తెచ్చాడు. వరల్డ్ ప్రెస్ ఫోటో వారు నిర్వహించిన పోటీలో ‘Observed Portraits’ విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్నాయి ఈ ఫొటోలు. “VICTIMS OF FORCED LOVE’ అనే శీర్షిక కింద ఈ ఫొటోలను వరల్డ్ ప్రెస్ ఫోటో వారు తమ వెబ్ సైట్ లో ప్రదర్శనకు ఉంచారు.

ఈ ఫొటోలు చూడదలుచుకున్నవారు ముందు మీకు మీరే కొంత ధైర్యం నూరి పోసుకోవాలని సలహా. గుండె చిక్కబట్టుకుని జారిపోకుండా జాగ్రత్తపడుతూ చూడగలిగితేనే చూడండి. ఆ తర్వాత నన్నని ప్రయోజనం లేదు.

కానీ, ఆమ్ల దుఃఖం, వేదన ఎలా ఉంటుందో తెలియాలంటే కనీసం వారిని చూడగలగాలి. ఆ తర్వాతే వారి వాస్తవ బాధను కొంతమేరకయినా గ్రహించగలమేమో.

ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు ఒక్కో యుగంగా గడపవలసిన వీరి జీవితం నిత్య పోరాటం అంటే చాలా తక్కువ. పంచుకోవడానికి కూడా వీలులేని భావోద్వేగాలు, అద్దాన్ని ద్వేషించవలసిన రూపం, చర్మం, కండరాలు స్వాధీనంలో లేకుండా చిత్తానుసారం బిగుసుకుపోయిన, సాగిపోయిన పరిస్ధితిలో నవ్వు, బాధ, నెప్పి లాంటి మామూలు శరీర స్పందనలు సైతం వీలు కాని పరిస్ధితిలో, శూన్యంలోకి సారించే చూపు కూడా మృగ్యమైన ఖాళీ భవిష్యత్తు వైపుకి అడుగులు వేయడం ఎలా సాధ్యం?

3 thoughts on “ఈ తల్లీ కూతుళ్లది ఆమ్ల దుఃఖం అనొచ్చా? -ఫొటోలు

  1. KVSV గారి ప్రశ్ననే రిపీట్ చేయాలనిపిస్తోంది. నేను మొత్తం ఫొటోలు చూడలేదు. చూడలేను కూడా! ఆ బిడ్డ తల్లి మెడ చుట్టూ చేయి వేసిన ఫొటో చూస్తున్నప్పటికే నా చూపు మసకబారి పోయింది .

    ఆ భర్తను ఏమి చేస్తే అతడి నేరానికి తగిన శిక్ష? ఎన్ని చావులు చంపితే అతడికి తను చేసిన పని ఎలాటిదో అర్థమవుతుంది?

    ఎన్ని అకృత్యాలు చూడాలి ఇలా మనం ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s