హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -2


ఛావెజ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుండి అధ్యక్ష భవనానికి తరలిస్తున్న దృశ్యం

ఛావెజ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుండి అధ్యక్ష భవనానికి తరలిస్తున్న దృశ్యం

విదేశీ చమురు కంపెనీలు చెల్లించే రాయల్టీలను గణనీయంగా పెంచి దానిని ప్రజోపయోగాలకు తరలించడానికి ఛావెజ్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. 2001 చట్టం ద్వారా చమురు అమ్మకాల ఆదాయంలో విదేశీ కంపెనీల వాటాను 84 నుండి 70 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. భార చమురు వెలికి తీసే ఒరినికో చమురు బేసిన్ లో చమురు రాయల్టీలను 1 శాతం నుండి 16.6 శాతానికి పెంచింది. ఈ చెల్లింపులకు బడా చమురు కంపెనీలు ఎక్సాన్, కొనొకో ఫిలిప్స్ తిరస్కరించడంతో వాటిని దేశం నుండి బహిష్కరించారు. చెవ్రాన్ కంపెనీ ఒక్కటే ఇపుడు వెనిజులాలో చమురు ఉత్పత్తి చేస్తున్న విదేశీ కంపెనీ, అది కూడా వెనిజులా ప్రభుత్వం విధించిన షరతుల పైనే. విదేశీ కంపెనీలను సంతృప్తి పరచడానికి ప్రతి బడ్జెట్ ను తాకట్టు పెడుతూ వారి షరతులకు సాగిలపడుతున్న భారత పాలకులతో పోలిస్తే ఛావెజ్ ఎక్కడ నిలుస్తాడు? సామ్రాజ్యవాద వ్యతిరేకత నేటి ప్రపంచానికి ఎంత అవసరమో ఛావెజ్ ఆచరణలో నిరూపించాడన్నది కాదనలేని సత్యం.

ఛావెజ్ విధానాలు సహజంగానే ధనికులకు కోపం తెప్పించాయి. ముఖ్యంగా తెల్ల ధనికులు ఆగ్రహోదగ్రులయ్యారు. కానీ ఛావెజ్ కు ప్రజాబలం తోడు నిలవడంతో జాతి విద్వేష వ్యాఖ్యానాలు చేసి సంతృప్తి చెందారు. అమెరికా ప్రభుత్వం, పత్రికలు ఛావెజ్ గురించి అనేక అబద్ధాలు, నిందలు సృష్టించి ప్రచారంలో పెట్టారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ లాంటి వారు సైతం ‘అత్యున్నత స్థాయి ప్రజాస్వామిక ఎన్నికలు’గా కీర్తించిన ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచినప్పటికీ ‘పచ్చి నియంత’ అని ముద్ర వేసి ఆ భ్రమలోనే గడపడం మొదలుపెట్టారు. 2002లో జరిగిన కుట్రలో ఛావెజ్ పదవీచ్యుతుడు అయిన వెంటనే అమెరికా సంతోషాతిరేకాలు ప్రకటించింది. వెనిజులా ప్రజలకు ‘మద్దతు’ తెలుపుతూ, “వెనిజులాలో అన్ని ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పని చేయడానికి ఉత్సుకత’ చూపుతున్నట్లు ప్రకటించింది.

ఛావెజ్ తన కేబినెట్, ఉపాధ్యక్షులను పదవినుండి తొలగించినందునే తిరుగుబాటు తలెత్తిందని పశ్చిమ రాజ్యాలు, పత్రికలు పచ్చి అబద్ధాలు ప్రచారంలో పెట్టారు. కానీ వాస్తవం ఏమిటంటే కుట్రకు నాయకత్వం వహించిన పెట్రో ఎస్టాంగా యే జాతీయ అసెంబ్లీని రద్దు చేయడమే కాక అటార్నీ జనరల్, సుప్రీం కోర్టు, కంప్ట్రోలర్ కార్యాలయాలను మూసేసి పేదలకు ఉద్దేశించిన 48 ఆదాయ పునఃపంపిణీ పధకాలను రద్దు చేస్తూ డిక్రీ జారీ చేశాడు. 1999లో రిఫరెండం ద్వారా ప్రజామోదం పొందిన రాజ్యాంగం రద్దు చేశాడు. వెనిజులా ఛాంబర్ ఆఫ్ కామర్స్ (భారత దేశంలో ఫిక్కీ, సి.ఐ.ఐ తదితర పెట్టుబడిదారుల సంఘాల లాంటిదే ఇది), కొందరు మిలట్రీ అధికారులు ఈ కుట్రలో ప్రధాన పాత్రధారులు. అయితే ఛావెజ్ కు ఉన్న విస్తృత ప్రజా మద్దతుకు మిలట్రీలోని విధేయ అధికారులు తోడు కావడంతో, ఏప్రిల్ 11, 2002 తేదీన అధికారంలోకి వచ్చిన కుట్ర ప్రభుత్వం 47 గంటల్లోనే కూలిపోయింది. కుట్రకు వ్యతిరేకంగా లాటిన్ అమెరికా దేశాలు ఐక్యం కాగా, కుట్ర విఫలం అయ్యాక మాత్రమే ఖండన ప్రకటన జారీ చేసి అమెరికా చేతులు దులుపుకుంది. మరీ చిత్రంగా రాజ్యాంగాన్ని రద్దు చేసిన పెట్రోని వదిలి ‘రాజ్యాంగాన్ని గౌరవించాలని’ ఛావెజ్ కు సుద్దులు చెప్పడానికి పూనుకుంది అమెరికా.

కుట్ర ఎందుకు?

కుట్రకు ప్రధాన కారణం చమురు కంపెనీ PDVSA పైన ప్రభుత్వ నియంత్రణ పెంచడానికి ఛావెజ్ చట్టాలు చేయడమే. పేరుకు జాతీయ కంపెనీయే అయినా అది ప్రధానంగా ప్రైవేటు వ్యాపారులు, విదేశీ కంపెనీల అవసరాలను తీర్చే కంపెనీగా తీర్చి దిద్దబడింది. అదీకాక కంపెనీ యాజమాన్యంలో ప్రభుత్వ ఆదేశాల కంటే ప్రైవేటు వ్యక్తులు, విదేశీ ఆదేశాలకే ఎక్కువ చెల్లుబాటు అవుతున్న పరిస్ధితి. ఛావెజ్ మాటల్లో చెప్పాలంటే సదరు కంపెనీ, ప్రభుత్వం (state) లోపల ప్రభుత్వంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ విధులకు తీవ్ర స్ధాయిలో నిధుల కొరత ఏర్పడింది. ఈ పరిస్ధితిని మార్చడానికి చట్టాలు తేవడంతో పాటు నూతన రాజ్యాంగాన్ని రచించి రిఫరెండంలో 72 శాతం ప్రజల మద్దతు సంపాదించాడు. మీడియా ప్రధానంగా యూరోపియన్ పూర్వీకుల సంతతి చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉన్నప్పటికీ వారు ఛావెజ్ పురోగమనాన్ని అడ్డుకోలేకపోయారు. ఛావెజ్ పాలన వలన మెజారిటీ ప్రజలైన స్థానిక సంతతి ప్రజల పైన తమకు ఉన్న రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యం చేజారుతుందన్న భయాలకు ధనికులు గురి కావడం మొదలయింది.

యూరోపియన్ సంతతి తెల్లవారి చేతుల్లో ఉపయోగం లేకుండా పడి ఉన్న భూములను వశం చేసుకోవడం ఛావెజ్ చేసిన మరో ముఖ్య నేరం. పెద్ద పెద్ద భూస్వామ్య ఎస్టేట్లను విడగొట్టడానికి ఛావెజ్ పూనుకున్నాడు. భూసంస్కరణల చట్టం తెచ్చి భారీ ఎస్టేట్లలోని ఖాళీ భూములను వశం చేసుకోవడానికి ఛావెజ్ చర్యలు ప్రారంభించాడు. ఎస్టేట్ యజమానులకు మార్కెట్ ఖరీదు లెక్కగట్టి నష్టపరిహారం చెల్లించినప్పటికీ అది భూస్వాములను సంతృప్తిపరచలేదు. భూములు చేజారడం అంటే భూ యాజమాన్యంతో కలిసి ఉండే ఆధిపత్యం వదులుకోవడమే. ఈ విధంగా ప్రజలకు మేలు చేకూర్చుతూ ఛావెజ్ ఏకంగా 49 చట్టాలు చేశాడు. దారిద్ర్య నిర్మూల పధకాలు అమలు చేయడానికి మిలట్రీ సేవలను వినియోగించాడు. చమురు ఎగుమతి దేశాల కూటమి OPECలో అమెరికా శత్రువు సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని ఇరాక్ తో సంబంధాలు పెంచుకున్నాడు. కొలంబియా తిరుగుబాటుదారులతో సంబంధాలు పెట్టుకుని వారికి కొలంబియా ప్రభుత్వానికి చర్చలు జరగడానికి సహకరించాడు.

ఈ చర్యలతో పిచ్చి పట్టిన ధనిక వర్గాలు ‘డెమోక్రటిక్ యాక్షన్’ పేరుతో ఛావెజ్ కు మతి చలించిందేమో పరిశీలించాలంటూ సుప్రీం కోర్టును కోరారు. తద్వారా ఛావెజ్ ను పదవినుండి తప్పించాలని వారు తలపోశారు. అమెరికా పత్రిక ‘న్యూస్ వీక్’ ఈ వార్తను పట్టుకుని ‘ఛావెజ్ కు పిచ్చి ముదిరిందా?’ అంటూ కధలు ప్రచురించి ఆనందం పొందింది. 2001 డిసెంబరులో ప్రతిపక్షాలు దేశవ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చి సమ్మెను విజయవంతంగా నిర్వహించారు. పత్రికలు, పాఠశాలలు, స్టాక్ ఎక్ఛేంజీ మొ.వి సమ్మె పాటించడంతో ఛావెజ్ కు మద్దతు లేదని ప్రతిపక్షాలు నిర్ధారణకు వచ్చాయి.

2002 ప్రారంభం నుండి కుట్రకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. సమ్మెలకు పిలుపు ఇవ్వడంతో పాటు అమ్ముడుపోయిన మిలట్రీ అధికారుల చేత ఛావెజ్ గద్దె దిగాలంటూ ప్రకటనలు ఇప్పించారు. వీరికి అమెరికా నుండి ఒక్కొరికి లక్ష డాలర్లు నిధులు అందాయని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించడం గమనార్హం. చమురు కంపెనీ జాతీయకరణ అమలు చేయడానికి ఛావెజ్ చేసిన ప్రయత్నాలను యాజమాన్యం, అధికారులు సహాయ నిరాకరణ చేశారు. ధనికుల ప్రేరేపిత సమ్మెలకు ప్రైవేటు ధనికుల మీడియా విస్తృత ప్రచారం ఇచ్చింది. ఛావెజ్ వ్యతిరేక కుట్ర సందర్భంగా కూడా వాస్తవ పరిస్ధితులకు బదులు ఎంచుకున్న వార్తలను ప్రసారం/ప్రచురణ చేసి కుట్రకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలను కవర్ చేయడానికి మీడియా నిరాకరించింది. మిలట్రీ అధికారులు అనేకులు కుట్రను వ్యతిరేకించిన విషయాన్ని కూడా అవి దాచిపెట్టడానికి ప్రయత్నించాయి. ఎన్ని చేసినప్పటికీ కుట్రను విఫలం చేయడంలో ప్రజలు, ఛావెజ్ విధేయ మిలట్రీ నాయకులు సఫలం అయ్యారు.

ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెద్ద ఎత్తున స్థాపించి బడ్జెట్ లోటును తీవ్రం చేశాడని ఛావెజ్ పై అమెరికా పత్రికలు ప్రచారం చేసినప్పటికీ అనేక యూరోపియన్ దేశాలతో పోలిస్తే వెనిజులాలో ప్రభుత్వరంగం పెద్దదేమీ కాదు. ఉదాహరణకి నార్వేలో కార్మికులు, ఉద్యోగులలో 29 శాతం మంది ప్రభుత్వ రంగంలో ఉంటే వెనిజులాలో వారి సంఖ్య 18.4 శాతం మాత్రమే. 2012లో వెనిజులా బడ్జెట్ లోటు జి.డి.పి లో 51.3 శాతం కాగా యూరోపియన్ యూనియన్ దేశాల సగటు బడ్జెట్ లోటు 82.5 శాతం. ద్రవ్యోల్బణం 2010లో 27 శాతం ఉండగా ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. 2002 నాటి మిలట్రీ కుట్రను ఆహ్వానించిన ‘న్యూయార్క్ టైమ్స్’ లాంటి పత్రికలు “చమురు వనరులు ఐపోతే వెనిజులా ఏమి చేస్తుంది?” వెనిజులాను అడుగుతాయి కానీ చమురు ఎగుమతులపై ఆధారపడిన సౌదీ అరేబియా, కెనడా లాంటి దేశాలను అడగవు. వెనిజులా చమురు ఎగుమతుల ఆదాయంలో వడ్డీ చెల్లింపులు కేవలం 3 శాతం మాత్రమే అన్న వాస్తవాన్ని కూడా అవి గుర్తించవు. 2013-14 బడ్జెట్ కోసం చిదంబరం తెస్తానన్న అప్పుల్లో మూడొంతులకు వడ్డీ చెల్లింపులకే అని తెలిపిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

విదేశీ విధానం

ఛావెజ్ చమురు ఆదాయాన్ని లాటిన్ అమెరికా వరకే పరిమితం చేసేలా వాణిజ్య, విదేశాంగ విధానాలను అమలు చేశాడు. సౌదీ అరేబియా చమురు విధానం దీనికి భిన్నం. పెట్రో డాలర్లతో అమెరికా ప్రభుత్వం జారీ చేసే ట్రెజరీ బిల్లులను, ఇతర ద్రవ్య ఆస్తులను సౌదీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే సౌదీ ఆదాయాన్ని అమెరికాకు తరలించడమే సౌదీ అరేబియా ప్రధానం విధానం. ఛావెజ్ నేతృత్వంలోని వెనిజులా ఈ విధంగా చేయడానికి నిరాకరించింది. అమెరికాలోని తమ నిధులను ఉపసంహరించుకోవడానికి కూడా ఛావెజ్ వెనుకాడలేదు. ఒక దశలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు నుండి ఒకేసారి 20 బిలియన్ డాలర్లను ఛావెజ్ వెనక్కి తీసుకున్నాడు. 2007 నుండి ఇతర లాటిన్ అమెరికా దేశాలకు 36 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సమకూర్చిపెట్టాడు. దానితో లాటిన్ అమెరికాలో ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్ లకు మించిన ఋణదాతగా వెనిజులా అవతరించింది.

ఇరాన్, ఇండియాలతో కూడా ఛావెజ్ స్నేహ సంబంధాలు పెంపొందించుకున్నాడు. 2008లో ఇండియా పర్యటించి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. లాటిన్ అమెరికా దేశం ఉరుగ్వే నుండి చమురు అమ్మి ఆవులను కొనడానికి కూడా ఛావెజ్ సిద్ధపడ్డాడంటే ప్రాంతీయ స్నేహ సహకారాలకు ఆయన ఇచ్చిన విలువ ఊహించుకోవచ్చు. ఒకప్పుడు ఒకే దేశంగా ఉండి నిత్యం అనవసర వివాదాలతో కీచులాడుకునే భారత ఉపఖండం దేశాలు లాటిన్ అమెరికా నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ (OAS) లో అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరిచే విధంగా వెనిజులా అవలంబించిన విధానాలు లాటిన్ అమెరికా దేశాలను శక్తివంతం కావించాయి. కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ స్టేట్స్ – సెలాక్ (Celac) స్థాపించడంలో ఛావెజ్ చేసిన కృషి ముఖ్యమైనది. క్రైస్తవ మతస్థుడే అయినప్పటికీ దేశ రాజకీయాలలో చర్చి జోక్యాన్ని ఆయన తిరస్కరించాడు. ‘సోషలిస్టును’ అని చెప్పుకున్నా ప్రైవేటు స్వంతాస్తి విధానానికి మద్దతుగా నిలిచాడు. ’21వ శతాబ్దపు సోషలిజం’ అంటూ ఛావెజ్ ప్రవచించే విధానాలు వాస్తవానికి సోషలిజం కాదు. నెహ్రూ ప్రవచించిన ‘మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ’ విధానాలను మోసపూరితంగా కాకుండా చిత్తశుద్ధితో అమలు చేయడమే ఛావెజ్ ప్రత్యేకత తప్ప వాటిని సోషలిస్టు విధానాలని చెప్పలేము. ప్రతిపక్షాలు అధికారంలోకి రావడంలో సఫలం అయితే ఈ విధానాలను తిరగదోడడానికి పెద్ద శ్రమ అవసరం లేదు.

శ్రామికుల దోపిడికి పునాది అయిన ఉత్పత్తి సంబంధాలను, ఆస్తి సంబంధాలను కదిలించకుండా ప్రజానుకూల సంస్కరణలు చేస్తే అవి ‘సంస్కరణల’ లక్షణమైన పరిమిత ఉపయోగాన్నే ప్రజలకు చేకూర్చుతాయి. వీటికి శాశ్వత లక్షణం రావాలంటే ఉత్పత్తి సంబంధాలను సమూలంగా మార్చడానికి పూనుకోక తప్పదు. అదే జరిగితే హింసాత్మక ప్రతిఘటన అనివార్యం. కార్మిక వర్గానికి వర్గ చైతన్యం లేకపోతే వారు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత తరగతుల నుండి వచ్చే ప్రతిఘటనను ఎదుర్కోవడం అసాధ్యం. కనుక ’21వ శతాబ్దపు సోషలిజం’ అంటూ ఛావెజ్ అమలు చేసిన విధానాలు మహా అయితే సామ్రాజ్యవాద వ్యతిరేక విధానాలు అవుతాయే తప్ప సోషలిస్టు విధానాలు కాజాలవు.

… … …అయిపోయింది

One thought on “హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -2

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s