–
2013-14 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఆర్ధిక మంత్రి చిదంబరం ప్రతిపాదించిన మహిళా బ్యాంకుల స్వరూపం మెల్లగా రూపు దిద్దుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళా బ్యాంకు విధి, విధానాలు రూపొందించడానికి వివిధ బ్యాంకర్లు, ఇతర నిపుణులతో ఒక కమిటీ నియమిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి శుక్రవారం ప్రకటించాడు. జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చింతన శిబిరంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ చేసిన సూచన మేరకే తాను బడ్జెట్ లో మహిళా బ్యాంకు స్థాపించనున్నట్లు ప్రకటించానని మంత్రి చెప్పుకొచ్చాడు. దేశంలోని ఆరు ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున మహిళా బ్యాంకు బ్రాంచులు నెలకొల్పుతామని మంత్రి చెప్పినట్లు పిటిఐ తెలిపింది.
ఫిబ్రవరి 28 తేదీన బడ్జెట్ ప్రతిపాదిస్తూ అందరూ మహిళలే పని చేసే మహిళా బ్యాంకుల కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళా బ్యాంకు నెలకొల్పుతామని చెప్పడమే గాని మంత్రి పెద్దగా వివరాలేవీ ఇవ్వలేదు. మహిళా బ్యాంకు స్వరూప స్వభావాలపై మంత్రికే ఒక ఐడియా లేదని నేటి కమిటీ ఏర్పాటు ప్రకటన ద్వారా అర్ధం అవుతోంది. శుక్రవారం ‘అంతర్జాతీయ మహిళా దినం’ సందర్భంగా మహిళా బ్యాంకు కోసం కమిటీ ఏర్పాటు ప్రకటన ఇచ్చారా అన్నది తెలియలేదు. బడ్జెట్ అనంతరం ఆర్.బి.ఐ గవర్నరుతో జరిగిన సాంప్రదాయక సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడినట్లు పత్రికలు తెలిపాయి.
“ఏప్రిల్ 30 లోపు మహిళా బ్యాంకుకు సంబంధించిన బ్లూ ప్రింట్ సమర్పించాలని కమిటీని కోరాము” అని చిదంబరం ఆర్.బి.ఐ గవర్నర్ తో సమావేశం అనంతరం తెలిపాడని ‘ఎకనమిక్ టైమ్స్’ తెలిపింది. నవంబరు నెలకల్లా బ్యాంకు పని చేయడం ప్రారంభిస్తుందని మంత్రి తెలిపాడు. “నవంబరుకల్లా బ్యాంకు ప్రారంభం అవుతుంది. మొదటగా దేశంలోని ప్రధాన ప్రాంతాలలో కనీసం ఒక బ్రాంచి ఉండేట్లు కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంటర్, నార్త్, నార్త్-ఈస్ట్ ఇలా ఆరు ప్రాంతాలు. దానర్థం వెనువెంటనే ఆరు బ్రాంచులతో మహిళా బ్యాంకు ప్రారంభం అవుతుంది” అని ఆర్ధిక మంత్రి పి.చిదంబరం తెలిపాడని పిటిఐ ని ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది.
“మహిళలకు బ్యాంకు నెలకొల్పాలన్న జైపూర్ డిక్లరేషన్ లో భాగం ఇది. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి ఈ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. నా సొంత సహజాతాలు, మొగ్గులతో (instincts and leanings) ఇది పూర్తిగా ఏకీభవిస్తోంది. కనుక ఈ ఐడియాను నేను వెంటనే అంగీకరించి మహిళల కోసం జాతీయ బ్యాంకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించాను” అని చిదంబరం తెలిపాడు.
జాతీయ మహిళా బ్యాంకు బ్లూ ప్రింట్ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిటీకి పురుష బ్యాంకర్ నాయకత్వం వహించడం విశేషం(?). కెనరా బ్యాంకు మాజీ ఛైర్మన్ ఎం.బి.ఎన్ రావు కేంద్రం ప్రకటించిన కమిటీకి నాయకుడు. మొత్తం ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు పురుషులు కాగా ముగ్గురు మహిళలు. SEWA సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జయశ్రీ వ్యాస్, ఎస్.బి.ఐ కేప్స్ ఎం.డి & సి.ఇ.ఒ అరుంధతి భట్టాచార్య, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉషా అనంత సుబ్రమణియం లు కమిటీలోని మహిళా సభ్యులు.
ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు ఎం.డి చంద్ర కొచ్చార్, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడానికి మహిళా బ్యాంకు నెలకొల్పుతున్నారని ఊహించారు. ఆమె ఊహే నిజం అయితే మహిళా బ్యాంకులు దేశంలోని మహిళల కోసం ప్రత్యేకంగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే, అలాంటి మహిళలు దేశంలో ఎక్కువ సంఖ్యలో కాకపోయినా గణనీయంగానే ఉన్నారు. వారి వలన మహిళలకు అదనంగా సమకూరుతున్న సాధికారత ఏమీ లేదు. మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా రాజకీయవేత్తలు లేదా ఇతర రంగాలలోని మహిళా నాయకురాళ్ల సంఖ్య పెరుగుతున్న దామాషాలో చూసినా సామాన్య మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష తగ్గుతున్న దాఖలాలు ఏమీ లేవు.
పైగా మహిళలు తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటున్న క్రమంలోనే అసహనం పెరిగి వారిపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక నిపుణులు చెబుతున్నదే. చట్టాలు, విధానాలు చేసినంత సులువుగా వాటి అమలు లేకపోవడం ఒక పెద్ద సమస్య అని వారు అనేకసార్లు స్పష్టం చేశారు. చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయడం ప్రభుత్వాల చేతుల్లోని పని. దాన్ని వదిలి అలంకార ప్రాయమైన చర్యలు ప్రకటిస్తూ శ్రామిక మహిళలను విస్మరించి ధనిక వర్గాలకు మరిన్ని నిధులు సమకూర్చడం వలన ఆదాయ అంతరాలు మరింత పెరిగి ఇంకాస్త వివక్ష పెరుగుతుందేమో గానీ తగ్గే ప్రసక్తే ఉండదు.
మహిళలపై జరుగుతున్న దారుణాలు కూడా ధనికుల ఆస్తులు పెరగడానికే దోహదపడడం ఒక పెద్ద అభాస!