హ్యూగో ఛావెజ్ ఎందుకు స్మరణీయుడు? -1


తన వారసుడుగా ప్రకటించిన నికొలస్ మదురో తో ఛావెజ్

తన వారసుడుగా ప్రకటించిన నికొలస్ మదురో తో ఛావెజ్

అది న్యూయార్క్ నగరం లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రం. ప్రపంచ రాజకీయ ఆధిపత్య సాధనకు అమెరికా పనిముట్టుగా తిరుగులేని రికార్డు సంపాదించిన ఐరాస జనరల్ అసెంబ్లీ కార్యాలయ భవనంలో అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత రోజే అదే చోట ప్రసంగించడానికి పోడియం ఎక్కిన వ్యక్తి ఒక అభివృద్ధి చెందిన దేశానికి నాయకుడు. తమ దేశంలోని ఆయిల్ వనరులను ప్రజల జీవన స్థాయిని పెంచడానికి వినియోగ పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అమెరికా, యూరప్ తదితర పశ్చిమ రాజ్యాల ఆగ్రహాన్ని చవిచూస్తున్న ఆ వ్యక్తి హ్యూగో ఛావెజ్. తన ప్రసంగం ప్రారంభం కావడంతోనే అమెరికా కుట్ర రాజకీయాలపై ఏకబిగిన దాడి మొదలయింది.

“నిన్న, ఇక్కడికి ఒక దెయ్యం వచ్చింది.” ఈ మాటలతో సభాసదులంతా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. “ఇక్కడే. ఇక్కడే. నేను మాట్లాడుతున్న చోట; నా ముందున్న ఈ టేబుల్, ఈ రోజు, ఇప్పటికీ ఇంకా గంధకపు కంపు కొడుతోంది.” అమెరికా, యూరప్ తదితర మిత్ర రాజ్యాలు సామూహిక విధ్వంసక మారణాయుధాలతో ఇరాక్ లో మారణహోమం సాగిస్తున్న ఆ సెప్టెంబరు 2006 నెల కాలానికి ఛావెజ్ మాటలు సరిగ్గా సరిపోతాయి. అమెరికా చేత తప్పు ఎంచబడం తప్ప అమెరికా తప్పులను ఏమాత్రం ఎంచి ఎరగని ప్రపంచ నాయకులు, వెనిజులా నాయకుడు మెరుపులాంటి మాటలతో సాగించిన ప్రవాహ ప్రసంగం వింటూ చేష్టలుడిగిపోయారు. తమ దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా వ్యవహరిస్తూ అమెరికా, యూరప్ కంపెనీల గొంతెమ్మ కోర్కెలను తిరస్కరించే నాయకులను దెయ్యాలుగా, మూర్ఖులుగా అభివర్ణిస్తుంటే ఆ వార్తలను పరవశంతో పులకించిపోయి పతాక శీర్షికలతో ప్రచురించుకునే పశ్చిమ పత్రికలు హ్యూగో ఛావెజ్ సాహసాన్ని భరించలేకపోయాయి. ఆ రోజు హ్యూగో ఛావెజ్ ను పరుష పదజాలంతో, నిందలతో ముంచెత్తాయి.

మధ్య ప్రాచ్యాన్ని రక్తపుటేరుల్లో ముంచెత్తుతున్నందుకు అమెరికాను గొప్ప సాతాను (Great Satan) గా ఇరాన్ పాలకులు అభివర్ణించినప్పుడు కూడా పశ్చిమ పత్రికలు ఇంతగా విరుచుకుపడలేదేమో. ద నేషన్ పత్రికలో గ్రెగ్ గ్రాండిన్ వ్యాఖ్యానించినట్లు పశ్చిమ పత్రికలను ఆగ్రహపరిచింది ఒక లాటిన్ అమెరికా దేశ నాయకుడు అమెరికా గడ్డపై నిలబడి అమెరికా అధ్యక్షుడిని దెయ్యంగా అభివర్ణించడం కాకపోవచ్చు. శత్రు దేశాల నాయకులను ఆ దేశ ప్రజలు ఎన్నుకున్న న్యాయబద్ధమైన నాయకులుగా కాక జీవించి ఉన్న దెయ్యంగా అభివర్ణించడం తరతరాలుగా కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన హక్కు. అర్జెంటీనా నాయకుడు జువాన్ పెరోన్ నుండి వెనిజులా నాయకుడు ఛావెజ్ వరకు అమెరికా తన గురించి తాను చెప్పుకునే పరిపక్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రాతినిధ్యం వహించినవారే. అయినప్పటికీ వారిని మూర్తీభవించిన పచ్చి నియంత అని చెప్పడానికే అమెరికా నాయకులు, పత్రికలు ఇష్టపడతాయి. అలాంటి హక్కుని ఛావెజ్ లాక్కోవడం పశ్చిమ పత్రికలకు నచ్చలేదని గ్రెగ్ చేసిన సూచన నిందా స్తుతిగా కనిపించినా, వాస్తవం కావచ్చు.

గంటల తరబడి ప్రసంగాలతో శ్రోతలను నిలబెట్టగల హ్యూగో ఛావెజ్ రాజకీయంగా గొప్ప సాహసాన్ని, లక్ష్య సాధనపై సాటిలేని నిబద్ధతను ప్రదర్శించాడని ది హిందు అభివర్ణించింది. 1954లో ఉపాధ్యాయ జంటకు జన్మించిన ఛావెజ్ నేషనల్ మిలట్రీ అకాడమీలో మిలట్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో ఉత్తీర్ణత సాధించాడు. పారాట్రూపర్ యూనిట్ లో అధికారిగా చేరిన తర్వాత 1980ల ప్రారంభంలో రాజకీయాల్లో ఆసక్తి చూపడం ప్రారంభించాడు. లాటిన్ అమెరికా స్వతంత్రం కోసం పోరాడిన రివల్యూషనరీ బొలివారన్ మూవ్ మెంట్ అనే రహస్య సంస్థను స్థాపించి మిలట్రీలో అనుచరులను కూడగట్టి 1992లో మిలట్రీ కూ నిర్వహించాడు. అది విఫలం కావడంతో అరెస్టయి రెండేళ్లు జైలుపాలయ్యాడు.

క్షమాభిక్షతో విడుదలయ్యాక మూవ్ మెంట్ ఆఫ్ ఫిఫ్త్ రిపబ్లిక్ స్థాపించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజేతగా నిలిచాడు. (నాలుగేళ్ల క్రితం ఇతర గ్రూపులను కూడా కలుపుకుని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా –PSUV– ని ఛావెజ్ ఏర్పరిచాడు) సోషలిస్టు మేనిఫెస్టో పేరుతో శ్రామిక ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆయిల్ కంపెనీలకు లాభాలను, ధనికులకు విలాసవంతమైన జీవితాలను ఇవ్వడానికి ఉపయోగిస్తున్న చమురు వనరులను ప్రజలకోసం వినియోగిస్తానని హామీ ఇచ్చాడు. తాను బతికున్నంతవరకూ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఛావెజ్ నిబద్ధతతో ప్రయత్నించాడు. ప్రైవేటు యాజమాన్యానికి ప్రోత్సాహం ఇస్తూనే ప్రజోపయోగ సంక్షేమ విధానాలు అమలు చేశాడు. ఈ విధానాల వలన అమెరికా ఆయిల్ కంపెనీలు వెనిజులా వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. ఛావెజ్ ను గద్దె దింపడానికి అమెరికా చేయని కుట్ర లేదు. 2002లో మిలట్రీ కుట్ర కొద్ది రోజులు నిలబడినా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఛావెజ్ మళ్ళీ అధ్యక్ష పదవిని అధిష్టించే వరకు శాంతించలేదు.

ఆ తర్వాత కూడా అమెరికా అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయింది. ఇటీవలి అక్టోబరు ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఒక తాటి మీదకు తెచ్చి నిధులు ప్రవహింపజేసి ఛావెజ్ ను ఓడించడానికి విఫలయత్నం చేసింది. పాలస్తీనా నాయకుడు అరాఫత్ కు విషం ఇచ్చి చంపినట్లుగానే ఛావెజ్ కేన్సర్ జబ్బు వెనక కూడా అమెరికా హస్తం ఉన్నదని అనేకమంది అనుమానిస్తున్నారు. ఛావెజ్ కూడా ఆ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఆరోపణలను అమెరికా తోసిపుచ్చినప్పటికీ హంతక చరిత్ర మాత్రం దానికి ఉంది. లాడెన్ ను, టెర్రరిజాన్ని అడ్డు పెట్టుకుని విదేశాల్లో హత్యలు చేయడానికి సి.ఐ.ఎ పైన ఉన్న నిషేధాన్ని జార్జి బుష్ రద్దు చేసిన సంగతి మననం చేసుకుంటే ఛావెజ్ అనుమానాలలో నిజం ఉండడానికి అవకాశాలు ఉన్నాయని అర్ధం అవుతుంది.

అధికారంలోకి వచ్చాక ఛావెజ్ అవినీతి మిలట్రీ అధికారులను తొలగించాడు. జాతీయ సంస్కరణల కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం వెనిజులాలో 1.36 ట్రిలియన్ బారెళ్ళ చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని మరే ఇతర దేశం కంటే ఎక్కువ. ఈ చమురు వెలికి తీస్తున్న కంపెనీలలో అతి పెద్ద కంపెనీని జాతీయం చేయడం ద్వారా ఛావెజ్ తన సంస్కరణలను ప్రారంభించాడు. భారతదేశం లాంటి దేశంలో సంస్కరణ అంటే జాతీయ కంపెనీలను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడం. అమెరికా, యూరప్ తదితర బహుళజాతి కంపెనీలకు ప్రభుత్వరంగ కంపెనీల వాటాలను అయినకాడికి అమ్మడాన్ని అత్యంత అవసరమైన సంస్కరణలుగా భారత పాలకులు చెబుతారు. తద్విరుద్ధంగా ఛావెజ్ తన పాలనలో సంస్కరణలను ప్రజలకు ఎలా ఉపయోగపెట్టవచ్చో అమలుచేసి చూపించాడు. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష కూటమి ప్రభుత్వం కూడా రైతుల భూములను లాక్కుని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పడమే కాక తిరగబడిన రైతులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న పరిస్ధితుల్లో అనేక పరిమితులు ఉన్నప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఛావెజ్ కృషి చేసిన తీరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

ది హిందు ప్రకారం 2000-2010 మధ్య కాలంలో సామాజిక కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 772 బిలియన్ డాలర్లకు (దాదాపు రు. 42.5 లక్షల కోట్లకు లేదా పాతిక 2జి కుంభకోణాలకు సమానం) చేరుకుంది. దీని ఫలితంగా వెనిజులా, లాటిన్ అమెరికాలోనే అత్యంత తక్కువ అసమానతలు ఉన్న దేశంగా అవతరించింది. జిని సూచికలో వెనిజులా 54 పాయింట్లు (100 పాయింట్లయితే ఖచ్చితమైన సమానత 1 పాయింటయితే అత్యంత అసమానత ఉన్నట్లు) నమోదు చేయడం విశేషం (భారతదేశ జిని సూచి 33). 1996లో దరిద్రం 71 శాతం ఉండగా 2012 నాటికి 21 శాతానికి తగ్గిపోయింది. తీవ్ర దరిద్ర (extreme poverty) శాతం 40 నుండి 7.3 శాతానికి పడిపోయింది. ఛావెజ్ పాలనా కాలంలో సంస్కరణల లబ్దిదారులు 2 కోట్లకు పెరగగా, వృద్ధాప్య పింఛనుదారుల సంఖ్య 7 రెట్లు పెరిగి 21 లక్షలకు చేరుకుంది. 3 కోట్ల జనాభా కలిగిన వెనిజులాలో సంస్కరణలు ప్రజలకు ఏ స్ధాయిలో ఉపయోగపడిందీ ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి.

ఛావెజ్ అమలు చేసిన విధానాలు దేశాన్ని స్థూల స్ధాయిలో సైతం అగ్ర పీఠాన నిలబెట్టాయి. స్వయం సమృద్ధి సాధించడానికి వీలు కల్పించాయి. 1990ల్లో దేశ ఆహార వినియోగంలో 90 శాతం దిగుమతుల ద్వారానే తీరగా ఇప్పుడు అది 30 శాతం మాత్రమే. పోషకాహార లోపం తగ్గించడంతో పాటు పసి పిల్లల మరణాలను కూడా బాగా తగ్గించగలిగారు. 1996లో ప్రతి పది వేల జనాభాకు 13 మంది డాక్టర్లే ఉండగా వారి సంఖ్య ఇప్పుడు 58. దేశంలో 96 శాతం మందికి ఇపుడు పరిశుభ్రమైన నీరు ఉచితంగా అందిస్తున్నారు. పాఠశాలల్లో హాజరు శాతం 85 శాతానికి చేరుకోగా ప్రతి ముగ్గురులో ఒకరు యూనివర్సిటీ చదువు వరకూ ఉచితంగా పొందుతున్నారు.

… … … ఇంకా ఉంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s