వెనిజులా అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ కేన్సర్ జబ్బుతో మరణించడం వెనుక అమెరికా పధకం ఉండవచ్చని రష్యా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు గెన్నడీ జుగనోవ్ తెలిపాడు. లాటిన్ అమెరికాలో తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించే ప్రక్రియను అమెరికా అభివృద్ధి చేసి ఉండవచ్చని రష్యాలో రెండవ అతి పెద్ద పార్టీకి నాయకుడైన జుగనోవ్ వ్యాఖ్యానించాడు.
“అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించిన జాబితాలో ఉన్న, స్వతంత్రమైన, సార్వభౌమ రాజ్యాలను ఏర్పరుచుకునే కృషిలో భాగంగా ఒక ప్రభావవంతమైన కూటమిలో సభ్యులుగా ఉన్న ఆరు లాటిన్ అమెరికా దేశాల నాయకులు ఒకేసారి ఒకే జబ్బుతో బాధపడడం ఎలా సంభవం?” అని జుగనోవ్ రష్యా ప్రభుత్వ టెలివిజన్ లో మాట్లాడుతూ ప్రశ్నించాడని రష్యా టైమ్స్ తెలిపింది. “నా దృష్టిలో ఇది యాదృచ్చికత (coincidence) ఎంతమాత్రం కాదు” అని జుగనోవ్ ముక్తాయించాడు.
జుగనోవ్ వ్యాఖ్యానం వెనిజులా ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవిస్తోంది. సామ్రాజ్యవాదులు అమలు చేసిన పన్నాగంలో తమ నాయకుడు హ్యూగో ఛావెజ్ బలయ్యాడని మదురో గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నాడు. “మా పితృభూమి పాత శత్రువులు ఆయన ఆరోగ్యానికి హాని చేసే మార్గం కోసం వెతుకులాడారు” అని మదురో ఆరోపించాడు. ఛావెజ్ మరణ వార్తా దేశ ప్రజలకు తెలియజేస్తున్నపుడు కూడా మదురో తమ అనుమానాలను పునరుల్లేఖించాడు. ఛావెజ్ ఆరోగ్యం చెడిపోవడం వెనుక తమ శత్రువుల పాత్రం ఉందనడంలో తమకు ఎట్టి అనుమానమూ లేదని ఆయన తెలిపాడు.
58 యేళ్ళ వయసులో కేన్సర్ తో పోరాడి అలసిపోయిన ఛావెజ్ కూడా తాను బతికి ఉన్నపుడు సందేహాలు వెలిబుచ్చాడు. తన శత్రువులకు కేన్సర్ జబ్బు తగిలించడానికి అమెరికా కొన్ని పద్ధతులు అభివృద్ధి చేసి ఉండవచ్చని ఆయన ఊహించాడు.
“కేన్సర్ ని వ్యాపింపజేయడానికి వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసి ఉన్నట్లయితే, మరో 50 సంవత్సరాల వరకు మనకు దాని గురించే తెలియనట్లయితే అదేమన్నా కొత్త విషయమా?” తనకు కేన్సర్ అని తెలిసిన తర్వాత 2011లో ఛావెజ్ వేసిన ప్రశ్న ఇది. ఐరాసలో ఇచ్చిన సంచలన ప్రసంగంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ను ‘దెయ్యం‘గా అభివర్ణించిన ఛావెజ్ అలాంటి దెయ్యాల కార్ఖానాతో తలపడి వెనిజులా ప్రజల గుండెల్లో స్ధానం సంపాదించాడు.
అమెరికా పక్కలో బల్లెం ఫెడల్ కాస్ట్రో తనను అమెరికా దుష్ట పన్నాగాల గురించి హెచ్చరించేవాడని హ్యూగో ఛావెజ్ చెప్పేవాడు. “ఫెడల్ నాకు ఎప్పుడూ చెబుతుంటారు. ‘ఛావెజ్ జాగ్రత్తగా ఉండు. వాళ్ళ వద్ద అభివృద్ధి చెందిన టెక్నాలజీ ఉన్నది. నువ్వు మరీ నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఏం తింటున్నావో జాగ్రత్తపడు, వాళ్ళు నీకు తినడానికి ఏమి ఇస్తున్నారో జాగ్రత్తగా చూసుకుని తిను… నీకు ఇంజెక్ట్ చేసే చిన్న సూది చాలు, అదెలాంటిదో నేను చెప్పలేను‘ అని 2011 చివర్లో నాకు కేన్సర్ ఉందని చెప్పినపుడు నాతో అన్నారు” అని ఛావెజ్ అన్నాడని గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది.
కేన్సర్ జబ్బు ఉందని తేలిన లాటిన్ అమెరికా వామపక్ష నాయకుల్లో (పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలను ప్రతిఘటిస్తున్న లాటిన్ అమెరికా నాయకులను వామపక్ష నాయకులనే పత్రికలు సంబోధిస్తాయి) ఇతరులు: బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, పాత అధ్యక్షుడు లూల డి సిల్వా, పరాగ్వే నాయకుడు ఫెర్నాండో లుగో.