వెనిజులా చమురు క్షేత్రాల నుండి లాభాల రాశులను తవ్వుకుపోతున్న అమెరికా బహుళజాతి కంపెనీలను ఉరికించి కొట్టిన బొలివారన్ విప్లవ నేత హ్యూగో ఛావెజ్ తుది శ్వాస విడిచాడు. అమెరికా గూఢచారులు ప్రవేశ పెట్టిన కేన్సర్ జబ్బుతో పోరాడి అలసిపోయిన ఛావెజ్ మంగళవారం రాత్రి కన్ను మూశాడు. ప్రపంచ ఖ్యాతి పొందిన క్యూబా డాక్టర్లు నాలుగు సార్లు సర్జరీ చేసినప్పటికీ లొంగని కేన్సర్ కణాలు తమ యజమానులు ఆశించినట్లుగానే ఛావెజ్ ను తుదముట్టించిగాని ఊరుకోలేదు. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులు ప్రపంచ వ్యాపితంగా నిర్దేశించి అమలు చేసిన ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ విధానాలు తప్ప ప్రత్యామ్నాయం లేదంటూ పశ్చిమ పత్రికలు అలుపనేది ఎరగకుండా సాగించిన ప్రచారాన్ని స్వతంత్ర ఆర్ధిక వృద్ధి ద్వారా ‘ఒట్టి అబద్ధం’గా రుజువు చేసిన హ్యూగో ఛావెజ్ మరణంతో ప్రపంచం ప్రభావశీలమైన సామ్రాజ్యవాద పోరాట యోధుడిని కోల్పోయింది.
“మా నాయకుడు చనిపోవడానికి దారితీసిన కేన్సర్ జబ్బు అమెరికా గూఢచారుల వలన వచ్చినదే అనడంలో మాకు ఎటువంటి అనుమానమూ లేదు” అని ఛావెజ్ తన వారసుడుగా సూచించిన నికోలస్ మదురో ప్రకటించాడు. ఛావెజ్ అనారోగ్యం బలవంతంగా ఆయనపై రుద్దినదేనని సైంటిస్టులు రుజువు చేసే రోజు వస్తుందని ఆశాభావం ప్రకటించాడు. తనకేమన్నా జరిగితే తన వారసుడుగా మదురోను ఎన్నుకోవాల్సిందిగా చివరి సర్జరీ కోసం క్యూబా వెళ్లడానికి ముందు హ్యూగో ఛావెజ్ తన దేశ ప్రజలను కోరాడు. ఛావెజ్ మరణాన్ని వెనిజులా ప్రజలకు మొదటిసారి తెలియజేసింది మదురోయే కావడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:25 ని.లకు ఛావెజ్ మరణాన్ని ప్రకటిస్తూ ఉపాధ్యక్షుడు మదురో కన్నీటి పర్యంతం అయ్యాడు. “రెండు సంవత్సరాల పాటు తన జబ్బుపై అత్యంత కఠిన పోరాటం అనంతరం అధ్యక్షుడు మరణించాడు” అని మదురో శోకతప్త హృదయంతో, విషాదం నిండిన మొఖంతో టి.విలో ప్రకటించాడు.
జీవించడం కోసమే చనిపోయినవారిని చనిపోయాడని చెప్పడం తగదు
Those who die for life, can’t be called dead
-వెనిజులా ఉపాధ్యక్షుడు నికొలస్ మదురో
కొత్తగా ఎన్నికలు జరిగే వరకు ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో ఆపద్ధర్మ అధ్యక్షుడుగా వ్యవహరిస్తాడని విదేశీ మంత్రి ఎలియాస్ జౌయ మరణ వార్తకు కొద్ది గంటల తర్వాత తెలిపాడు. ఛావెజ్ కోరిక మేరకు తదుపరి ఎన్నికల్లో అధికార పార్టీ తరపున మదురో అధ్యక్షుడుగా పోటీ చేస్తాడని కూడా జౌయ ప్రకటించాడు. ఛావెజ్ మరణ వార్త ప్రకటించడానికి కొద్ది గంటల ముందు ఉపాధ్యక్షుడు మదురో ఉగ్ర కంఠుడై తీక్షణ ప్రసంగం ఇచ్చాడని పత్రికలు తెలిపాయి. వెనిజులా ప్రజాస్వామ్యానికి చేటు తేవడానికి శత్రువులు అలుపెరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని, శత్రువులను తరిమేసే కృషిలో భాగంగా అమెరికాకు చెందిన ఇద్దరు మిలట్రీ రాయబారులను వెనిజులా నుండి బహిష్కరిస్తున్నామని ప్రకటించాడు. తద్వారా వెనిజులా ప్రజలకు, ప్రజాస్వామ్యానికీ శత్రువులెవరో తేటతెల్లం చేశాడు.
“(ఈ క్లిష్ట సమయంలో) బలహీనులము కావద్దు. హింస వద్దు, విద్వేషం అసలే వద్దు. మన హృదయాలలో ఒకే ఒక భావోద్వేగం ఉండాలి – ప్రేమ. ప్రేమ, శాంతి, క్రమ శిక్షణ పాటించాలి” అని మదురో పిలుపునిచ్చాడు. 14 యేళ్ళ పాలనలో వెనిజులా చమురు వనరులలో గణనీయ మొత్తాన్ని శ్రామిక ప్రజలకు పంచి పెట్టిన హ్యూగో ఛావెజ్ మరణ వార్త విని ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. విపరీతమైన దుఃఖోద్వేగంతో అనేకమంది వీధుల్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. “నేనే ఛావెజ్” అని తెలియజేసే బ్యానర్లతో, ఛావెజ్ ఫోటోలతో వీధులను ముంచెత్తారు. దివంగత అధ్యక్షుడు గౌరవార్ధం వారం రోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అన్నింటినీ మూసేశారు. రాజధాని ‘కారకాస్’ లో షాపులు, హోటల్లు మూసేసి అనేకమంది పరుగున ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. నమ్మలేని వాస్తవాన్ని విన్నట్లుగా అనేకమంది కనిపించారని పత్రికలు, ఛానళ్లు తెలిపాయి.
గత అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధ్యక్షుడుగా ఎన్నికయిన హ్యూగో ఛావెజ్ జనవరి 10 తేదీ నుండి కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించవలసి ఉన్నది. అయితే ఆయన కేన్సర్ జబ్బు మళ్ళీ తిరగబెట్టడంతో నాలుగో సర్జరీ కోసం క్యూబా ఆసుపత్రిలో చేరడంతో ప్రమాణ స్వీకారం సాధ్యం కాలేదు. వెనిజులా రాజ్యాంగం ప్రకారం నూతనంగా ఎన్నికయిన అధ్యక్షుడు నిర్దిష్ట తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్ధితిలో ఉన్నా, చనిపోయినా నెల రోజుల లోపు తిరిగి ఎన్నికలు జరపవలసి ఉంటుంది. అయితే గడువు తేదీ నాటికి ఆసుపత్రిలో ఉండడంతో ఛావెజ్ ప్రమాణ స్వీకారం చేయలేకపోయాడు. అయినప్పటికీ వెనిజులా పార్లమెంటు సమావేశమై అసాధారణ రీతిలో ఛావెజ్ ప్రమాణ స్వీకారానికి గడువు పొడిగించింది.
అయితే ఛావెజ్ శరీరంలోని కేన్సర్ కణాలు పరమ మొండిగా మారాయి. తాజా సర్జరీ పైన నమ్మకం పెట్టుకున్నది చాలా తక్కువ మందే అయినప్పటికీ డాక్టర్లు ఏదయినా అద్భుతం చేయకపోరా అని ప్రపంచ వ్యాపితంగా అనేకమంది ఆశావహులు ఎదురు చూశారు. సర్జరీ అనంతరం తీవ్ర స్ధాయిలో ఊపిరి సమస్యలు ఛావెజ్ ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలతో ఉండగానే ఆయన వెనిజులా చేరడంతో ఆయన పని ముగిసినట్లేనని కొందరు ఊహించారు. పశ్చిమ పత్రికలు పరమ నాసిరకమయిన పుకార్లు ప్రచారంలో పెట్టారు. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలకు మిత్రులయిన వెనిజులా ప్రతిపక్షాల గొంతుతో పశ్చిమ పత్రికలు ఛావెజ్ ఆరోగ్యం పైనా, ప్రభుత్వం పైనా అనుమానాలు ప్రచారం చేశాయి. ఆయన ఆరోగ్యంపై క్రమం తప్పకుండా బులెటిన్లు విడుదల చేసిన్నప్పటికీ ‘ఏదో దాస్తున్నారని’ అదే పనిగా ప్రచారం చేశాయి. ఇప్పటికీ అదే రాస్తున్నాయి కూడా. ప్రభుత్వం ఎప్పుడూ ఛావెజ్ ఆరోగ్యం గురించి నిజాలు చెప్పలేదని, ప్రజలకు అనేక అనుమానాలు మిగిల్చారని బిబిసి, సిఎన్ఎన్, రాయిటర్స్ లాంటి పత్రికలు ఆయన మరణానంతరం కూడా కధలు అల్లి ప్రచారంలో పెట్టాయి.
ఉపాధ్యక్షుడు మదురో ఆరోపణలను అమెరికా తిరస్కరించింది. ‘ఆబ్సర్డ్’ గా కొట్టిపారేసింది. అయితే ఇలాంటి ‘ఆబ్సర్డ్’ పనులు చేయడంలో అమెరికాకు ఉన్న చరిత్ర తక్కువ కాదు. పనామా దేశాధ్యక్షుడు నోరీగా ‘పనామా కాలువ ఆదాయం పనామా ప్రజలకే చెందేలా చేయడానికి ప్రయత్నించినందుకు ఆయనపై మాదక ద్రవ్యాల అక్రమ ఆరోపణలు మోపి దొంగ విచారణలు సాగించి తమ జైళ్లలోనే ఖైదు చేసిన దేశం అమెరికా. రీగన్ అధ్యక్షరికంలో గడాఫీ నివాస భవనం పైనే నేరుగా బాంబులు వేసిన చరిత్ర, లేని ‘సామూహిక విధ్వంసక మారణాయుధాల’ను సాకుగా చూపి ఇరాక్ పై దురాక్రమణ దాడి చేసి సెక్యులర్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను ఉరితీసిన చరిత్ర, తానే యుద్ధం ప్రకటించిన ఆల్-ఖైదా టెర్రరిస్టులతో కలిసి లిబియా ప్రజల జీవన ప్రమాణాలను ఉన్నత స్ధాయిలో నిలిపిన గడాఫీని హత్య చేసిన చరిత్ర, ముస్లిం టెర్రరిస్టులతో జట్టు కట్టి కిరాయి తిరుగుబాటు జరిపిస్తూ సిరియాను బాంబు పేలుళ్లతో టెర్రరిస్టు దాడులు చేయిస్తున్న వర్తమాన చరిత్ర… ఇవన్నీ అమెరికా ‘ఆబ్సర్డ్’ చరిత్రలో కొన్ని మాత్రమే.
ఇలాంటి అమెరికా పాలకులకు ఒకప్పుడు తన పెరటి దొడ్డిగా భావించిన లాటిన్ అమెరికాను తనకు కాకుండా చేస్తున్న హ్యూగో ఛావెజ్ ఆరోగ్యానికి హాని తలపెట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. ఛావెజ్ ను పదవీచ్యుతుడిని చెయ్యడానికి 2002లో జరిగిన మిలట్రీ కుట్రలో అమెరికా ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు అమెరికానుండే నిధుల ప్రవాహం జరిగిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అమెరికా సాగించిన కుట్రలు వెనిజులాలో ఛావెజ్ మరింత బలపడడానికి దోహదం చేశాయి. ఛావెజ్ ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయితే ప్రజలు ఆందోళనతో వీధులకు ఎక్కే పరిస్ధితి.
ఇప్పటివరకూ ప్రపంచంలో అత్యధిక చమురు వనరులు ఉన్న దేశం సౌదీ అరేబియా అని భావిస్తుండగా, వెనిజులాలో కనుగొన్న విస్తారమైన చమురు వనరులతో ఆస్థానాన్ని వెనిజులా లాగేసుకుంది. దానితో పశ్చిమ దేశాల చమురు కంపెనీలు, ముఖ్యంగా అమెరికా కంపెనీలకు చమురు దాహం పెరిగిపోయింది. పశ్చిమ ప్రభుత్వాల అండతో అక్కడి చమురు కంపెనీలు ఛావెజ్ ను కూల్చడానికి సకల ప్రయత్నాలు చేసి విఫలం అయ్యి విసిగిపోయాయి. ఆ క్రమంలోనే 2011 లో ఛావెజ్ కేన్సర్ జబ్బు బైటికి వచ్చింది. ప్రపంచ వనరులను, వాణిజ్యాన్ని చేజిక్కించుకోవడానికి దేశాలకు దేశాలనే వలసలుగా మార్చుకున్న పశ్చిమ రాజ్యాల కుట్రలు, కుతంత్రాలు తెలిసినవారికి అనూహ్య పరిస్ధితుల్లో ఛావెజ్ శరీరంలో బయటపడిన కేన్సర్ వ్యాధికి మూలం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. క్యూబా అధ్యక్షుడు కాస్ట్రోను తుదముట్టించడానికి అమెరికా చేసిన వందలాది ప్రయత్నాలు తెలిసినవారికి ఛావెజ్ అమలు చేస్తున్న ’21వ శతాబ్దపు సోషలిజం’ విధానాలు ఎవరికి రుచించవో ఇట్టే అర్ధం అవుతుంది.
ఛావెజ్ ప్రతిపాదించి అమలు చేస్తున్న ’21వ శతాబ్దపు సోషలిజం’ విధానాలు వాస్తవానికి ‘సోషలిజం’ విధానాలని భ్రమలు పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ 1980ల చివరి నుండి GATT General Agreement on Trade and Tariff) అనే దగుల్బాజీ సంస్థను ఏర్పరిచి, దాని ఆధ్వర్యంలో డంకెల్ ఒప్పందాన్ని రూపొందించి దానిని ‘ఆమోదిస్తే పూర్తిగా ఆమోదించండి లేదా పూర్తిగా తిరస్కరించండి” అంటూ ప్రపంచ దేశాలపై బలవంతంగా రుద్దడం ద్వారా ‘సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ’ విధానాలను అమలు చేయడం తప్ప మూడో ప్రపంచ దేశాలకు ‘మరో ప్రత్యామ్నాయం లేదు’ అనే భావనను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన పరిస్ధితుల్లో ‘కాదు. ప్రత్యామ్నాయం ఉంది. దేశీయ విధానమే ప్రత్యామ్నాయం. దేశ ప్రజల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా చేసుకునే విధానాలే ప్రత్యామ్నాయం’ అని ఆచరణ ద్వారా నిరూపించినవాడు ‘హ్యూగో రఫెల్ ఛావెజ్ ఫ్రియాస్’. ‘ప్రైవేటు కంపెనీలకు భారత దేశంలో వ్యాపారం చెయ్యడం కష్టమైపోయింది’ అని ఒబామా ప్రకటించిన కొద్ది నెలలకే వాల్ మార్ట్ లాంటి బహుళజాతి చిల్లర వర్తక కంపెనీల కోసం దేశంలో 4.5 కోట్ల కుటుంబాల ఉపాధి కూల్చడానికి నిర్ణయించిన భారత దేశ పాలకుల లాంటి వారు మెజారిటీ మూడో ప్రపంచ దేశాలను ఏలుతున్న పరిస్ధితిలో హ్యూగో ఛావెజ్ లాంటి ‘నిబద్ధత’ గల దేశభక్తుల విలువ అనేక రెట్లు పెరుగుతుంది.
(హ్యూగో ఛావెజ్ అమలు చేసిన విధానాలు, వాటి ద్వారా శ్రామిక ప్రజలు ఎలా లబ్ది పొందినదీ మరో టపాలో చూద్దాము.)
Red Salute to Comrade Chavez!
Salute to Comrade Chavez
ప్రత్రికలన్నీ అక్కడ సొషలిజం ఉందనే తెలిపాయి. సొషలిజం అంటె ఏమిటి అనేది అపార్దాలకు తావులేకుండా మీ టపాలొ ఇంకొంచం వివరించి ఉండవలసింది. సి. పి, యం పార్టీ వాళ్ళు చైనాలొ కమ్యునిజం ఉందనే ఇప్పటికీ చెప్పుతున్నారు. సి, పి, ఐ వాళ్ళు రష్యా మహాసభలకు వెళ్ళివచ్చి అక్కడా కమ్యునిజం ఉందనే చెపుతున్నారు. కమ్యునిజం అంటె పూర్తిగా అర్దం మారిపొయింది. దాని లక్ష్యాలూ వేరయిపొయాయి. బుర్జువా పాలనే కమ్యునిజమనే అర్దానికి తీసుకవచ్చారు. ఆవిధంగా బుర్జువా కమ్యునిస్టులు సఫలమైనారు,
వెనిజులాలొ సామ్రాజ్య విదానానికి వ్యెతిరేకంగా పొరాడినందుకు అభినంధించాలి. అక్కడి సమురులొ ప్రజలకు పంచారన్నారు అంటె దానిలొ వచ్చే లాబాలు పంచి వుంటారు.పెత్తనమంతా ప్రభుత్వానిదై వుంటుంది. ఒక విధంగా అదీ మంచిదే . అయితే అదే సొషలిజం కాదు. దాని మీద కార్మికులకు అధికారం వుండదు. జరగవలసిన మార్పులొ ఒక అడుగు మాత్రమే ముందుకు వేశారు. నడవాల్సింది వెయ్యీడుగులుంది.
రామమోహన్ గారు సోషలిజం గురించి వివరించడం ఈ టపా పరిధిలోనిది కాదని రాయలేదు. మీరు ఇచ్చిన వివరణ కొంతవరకు సరిపోవచ్చు.
చమురు వనరుల్ని పంచడం అంటే మీరు చెప్పిన అర్ధం లోనే. వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో శ్రామికులకు కూడా వాటా పంచాడని నా అర్ధం. స్టేట్ కేపిటలిజం ద్వారా ఆ పని చేసారు. భారత దేశంలో నెహ్రూ నుండి రాజీవ్ వరకు స్టేట్ కేపిటలిజం అమలయినా దాన్ని మోసపూరితంగా అమలు చేశారు. ప్రవేటు పెట్టుబడిదారులకు పెట్టుబడి సమూర్చడానికీ, విదేశీ పెట్టుబడికి సేవ చేయడానికి దానిని ఉపయోగించారు. వెనిజులాలో అలా కాకుండా ప్రజలపట్ల సాపేక్షికంగా నిబద్ధతతో వ్యవహరించాడు ఛావెజ్. సామ్రాజ్యవాద వ్యతిరేకతలో ఉన్న నిబద్ధత దేశంలో కూడా కనబరిచాడు. స్టేట్ కేపిటలిజాన్ని ప్రజలకు ఎలా వినియోగపెట్టవచ్చో ఉదాహరణగా నిలిచాడు.
కాని దీనికి అనేక పరిమితులు ఉన్నాయి. కార్మికవర్గానికి అధికారం అనే అర్ధంలో కాకుండా కార్మికవర్గానికి కూడా కొంత వాటా అనే అర్ధంలో సోషలిజాన్ని వాడుతున్నారు. సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల మార్కెట్ అవసరాలను తీర్చే మార్కెట్ ఎకానమీ ని భారత దేశం లాంటి ఇతర మూడో ప్రపంచ దేశాలు ఆవాహన చేసుకుంటున్న పరిస్ధితుల్లో ఛావెజ్ అమలు చేస్తున్న ‘వాటా పంపిణీ విధానం’ పెద్ద ఎత్తున సానుకూల ప్రభావం పడేస్తోంది. ఏ చెట్టూ లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం అన్నట్లు. అక్కడ కూడా ప్రవేటు పెట్టుబడిదారులు ఉన్నారు. మీడియాలో చాలా భాగం ప్రవేటు పెట్టుబడి చేతుల్లోనే ఉంది. ప్రతిపక్షాలను ఐక్యం చేసి వాళ్ల ద్వారా ఆ కాస్త విధానాలను కూడా రద్దు చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఛావెజ్ మరణంతో వారికి కొంత శ్రమ తప్పింది.
కొత్త ఎన్నికల్లో ఇక ప్రతిపక్షాలను గెలిపించడానికి అమెరికా సర్వశక్తులూ ఒడ్డుతుంది. కుదరకపోతే ఛావెజ్ అనుచరులనే కొనేస్తుంది. అదీ కుదరకపోతే మిలట్రీని కొనెయ్యడానికి ప్రయత్నిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉన్నా ఛావెజ్ లాంటి నాయకుడు లేకపోతే కష్టమే. ఏమవుతుందో వేచి చూడాలి.
Reblogged this on Raja's Realms.