బడ్జెట్ 2013-14: మాటలు సామాన్యుడికి, మూటలు కార్పొరేట్లకు


Photo: Reuters

Photo: Reuters

చిదంబరం బడ్జెట్ చిదంబర రహస్యాలతో నిండిపోయింది. ఆదర్శాలు వల్లించడానికే తప్ప ఆచరించడానికి కాదని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మాటలు సామాన్యుడికి మూటలు కార్పొరేట్లకు పంచి పెట్టింది. దొడ్డి దారిలో మూటల్ని దాటించి, సింహద్వారంలో ఆదర్శాల మాటలు వేలాడగట్టింది. ఆహార భద్రత చట్టం గురించి ఘనంగా చెప్పుకుని అందుకోసం ముష్టి 10 వేల కోట్లు విదిలించింది. దేశ ప్రజలకు పూర్తిస్థాయి ఆహార భద్రత కల్పించాలంటే 84,000 కోట్లు అవసరమని చెప్పిన తన మాటలు తానే ఉల్లంఘించింది. 16.65 లక్షల కోట్ల ఘనమైన బడ్జెట్ లో నూటికి 60 మంది ఆధారపడే వ్యవసాయ రంగానికీ 27 వేల కోట్లు విదిలించి చేతులు దులుపుకుంది. ఇందులో 3.4 వేల కోట్లు వ్యవసాయ పరిశోధనకు అప్పజెపుతున్నట్లు ఘనంగా చాటుకుంది. కార్పొరేటు కంపెనీలకు ఇస్తున్న 6 లక్షల కోట్ల రాయితీల గురించి ఒక్క ముక్క కూడా చెప్పకుండా తన వాస్తవ ప్రాధామ్యాలపై దాపరికం ప్రదర్శించింది.

ఖజానా లోటు (fiscal deficit) 5.2 కి తగ్గించామని ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. పెట్రోలు, గ్యాస్, ఎరువులు, ఆహారం తదితర నిత్యజీవితావసరాల పైన ప్రజలకు ఇస్తున్న రాయితీలకు కోత పెట్టడం ద్వారా ఖజానా నింపుకున్న సంగతిని మాత్రం దాచిపెట్టాడు. అంటే సామాన్యుల కోసం పెట్టే అరకొర ఖర్చులు కూడా తగ్గించుకుని ఖజానా కదలకుండా చూసుకోవడం, ఆనక ఆ నిధుల్ని కార్పొరేట్లకు తరలించి లోటు పెరిగిందని బీద అరుపులు అరవడం, వెరసి కాకులను కొట్టి గద్దలకి పెట్టడం. పైగా ఇదంతా తమ ప్రతిభే అని పార్లమెంటులో కూర్చొని మరీ బల్లలు చరుచుకోవడం. స్వాతంత్ర్యం వచ్చిందని చెబుతున్న దగ్గర్నుండీ ఇదే మన పాలకుల ప్రతిభా పాటవం. ఇందులో కూడా ఖజానా లోటు ఎంత తక్కువ ఉంటే అంతగా పెట్టుబడిని ఆకర్షించవచ్చన్న యావ తప్ప లోటు తగ్గితే ప్రజలకు ఎక్కువ ఖర్చు పెట్టవచ్చన్న ఆదర్శం మాత్రం కాదు.

2012-13కి ఖజానా లోటు 5.2 శాతం (జి.డి.పిలో) దగ్గర నిలిపామని చెప్పిన మంత్రి 2013-14 కి దీనిని ఇంకా తగ్గించి 4.8 శాతానికి చేర్చనున్నట్లు తెలిపాడు. అంటే, సామాన్యుడికి ఇచ్చే అరకొర సబ్సిడీలో మరింతగా కోతలు పెట్టనున్నారని అర్ధం. దానికి చేసుకున్న ఏర్పాట్లలో భాగమే ఆధార్ కార్డుతో గ్యాస్, రేషన్ తదితర సబ్సిడీలకు ముడి పెట్టడం. ఈ లెక్కన ఆహార భద్రతకు విదిలించిన 10 వేల కోట్లు కూడా లక్ష్యాన్ని చేరేది అనుమానమే.

16.65 లక్షల కోట్ల మహా బడ్జెట్ లో 6.29 లక్షల కోట్లు అప్పు తెచ్చి పూడ్చుతారట. అంటే బడ్జెట్ లో 38 శాతం అప్పులే తప్ప ఆదాయం కాదన్నమాట. అప్పుల భారం మళ్ళీ సామాన్యుడి పైనే. ఈ అప్పుల్లో మెజారిటీ భాగం వడ్డీ చెల్లింపుల కోసమే వెళుతుందని గ్రహిస్తే ఏటికేడూ పెరిగే అప్పే తప్ప తరిగేది కాదని అర్ధం కాగలదు. పోనీ అదేమన్నా సామాన్యుడికి తిరిగి వస్తుందా అంటే, కార్పొరేట్లకు ఇస్తున్న 6 లక్షల కోట్ల రాయితీలు గుర్తుకు తెచ్చుకుంటే ఆ ఆశలు కూడా ఆవిరి.

16.65 లక్షల కోట్ల బడ్జెట్ లో ప్రణాళికా వ్యయం 5.5 ల. కోట్లు గాను, 11.1 ల. కోట్లు ప్రణాళికేతర వ్యయం గానూ ఆర్ధిక మంత్రి ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా క్రమబద్ధమైన ఆస్తులను సృష్టించే ఉత్పాదక వ్యయాన్ని ప్రణాళికా ఖర్చు గాను, సబ్సిడీలు, రక్షణ, జీత భత్యాలు మొదలయిన ఖర్చులను ప్రణాళికేతర ఖర్చు గాను చెబుతారు. ఈ తేడాలను రద్దు చేసి మొత్తాన్ని కేవలం ‘ఖర్చు’గానే చెప్పాలని ప్రణాళికా కమిషన్ ఆర్ధిక సలహాదారు, ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ కూడా అయిన సి. రంగరాజన్ కమిటీ రెండేళ్ల క్రితం ప్రతిపాదించింది. ప్రణాళిక, ప్రణాళికేతర విభజనను ఆర్థికమంత్రి కొనసాగించడాన్ని బట్టి ఆ ప్రతిపాదనకు ప్రభుత్వంలో మద్దతు లేనట్లు కనిపిస్తోంది. ఏ పేరు పెట్టినా ఖర్చుల లక్ష్యం సామాన్యుడి ఉత్పాదక సంక్షేమం కానప్పుడు వాటి గురించి చర్చించుకుని లాభం లేదు.

2013-14లో ప్రధాన సబ్సిడీల బిల్లు 2.48 ల. కోట్లు ఉంటుందని ఆర్ధిక మంత్రి అంచనా. (గత సంవత్సరం ఇది 1.82 ల. కోట్లు.) ఇందులో పెట్రోలియం సబ్సిడీకి 65,000 కోట్లు, ఆహార సబ్సిడీలు 90,000 కోట్లు అని అంచనా వేశారు. ఎరువుల సబ్సిడీ ఎంతో బైటికి రాలేదు. ఈ సబ్సిడీల మొత్తంలో కార్పొరేట్ కంపెనీలు కాజేసేదే అధికం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల కోసం ఉద్దేశించిన సబ్సిడీలు కూడా ఎలా పక్కదారి పడతాయో ఇటీవల నెల్లూరులో పట్టుబడిన డూప్లికేట్ ఆధార్ కార్డులు చక్కగా చెబుతాయి.

పన్నుల విషయానికి వస్తే సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం దాటినవారి పైన 10 శాతం సర్ ఛార్జి ప్రతిపాదించారు. పెద్దోళ్లయినా వదలం అని చెప్పుకోవడానికి ఇది పనికొస్తుందేమో గానీ ఖజానా నింపడానికి మాత్రం పనికిరాదు. ఎందుకంటే ఆస్తులు, ఆదాయాలు దాచిపెట్టుకోవడానికి అనేక మార్గాలు వారు ఏర్పాటు చేసుకున్నారు. హవాలా మార్గాల్లో స్విస్ బ్యాంకులకు తరలించడం దగ్గర్నుండీ ఎవరికీ అంతుచిక్కని విధంగా ద్రవ్య మార్కెట్లలో షేర్ల రూపంలో దాచుకోవడం వరకు ధనికుల కోసం ప్రత్యేకంగా వేయబడిన అంతర్జాతీయ హై వే లు. ఆ హైవేలను తనిఖీ చేసే అధికారం, అవకాశం ఏ ప్రభుత్వమాత్రులకీ (మానవమాత్రులు తరహా) లేవు. అదీ కాక ఆదాయాలు, సంపదలు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అయ్యాక ఎంత మంది కోటీశ్వరులను పట్టుకుంటే ఖజానా లోటు తీరుతుంది? 10 కోట్లు ఆదాయం దాటిన దేశీయ కంపెనీల పైన మరో 10 శాతం వడ్డిస్తానన్న చిదంబరం విదేశీ కంపెనీల కార్పొరేట్ టాక్స్ పైన సర్ ఛార్జి మాత్రం తమలపాకుతో తట్టినట్లు స్వల్పంగా 2 నుండి 5 శాతానికి పెంచారు. అయినోడికి ఆకులు, కానోడికి కంచాలు!

విచిత్రం ఏమిటంటే ఒక పక్క ప్రజల ఖర్చు విషయంలో బీద అరుపులు అరుస్తూ, పొదుపు మంత్రాలు పఠించిన మంత్రివర్యులు విదేశాల నుండి డివిడెండ్లు అందుకునే దేశీయ కంపెనీలకి 15 శాతం పన్ను రాయితీని కొనసాగించడం. దొంగ చాటుగా విదేశాలకు తరలి వెళ్లిన నల్ల డబ్బు దర్జాగా రాచమార్గంలో బయలుదేరిన చోటికి రావడానికి ఇదొక మార్గమా? 2007 నుండి సేవల పన్నులను ఎగవేస్తూ వచ్చిన కంపెనీలకు, వ్యాపారులకు క్షమాభిక్ష ప్రసాదించి చిదంబరం ఔదార్యం చాటుకున్నారు. ఎగవేతదారుల వద్ద ఉండే ఔదార్యం కష్టజీవులయిన రైతులు, కార్మికుల దగ్గర ఇట్టే అదృశ్యం అవుతుంది.

ఆదాయం విషయానికి వస్తే తాజా బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రత్యక్ష పన్నుల ద్వారా 13,300 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా 4,700 కోట్లు ఆదాయాన్ని చిదంబరం అంచనా వేశాడు. ప్రభుత్వరంగ పరిశ్రమల వాటాలు అమ్మేసి (బంగారు బాతు పీక నులిమి) 55,814 కోట్లు సంపాదించాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. స్పెక్ట్రమ్ వేలం, గాలి తరంగాల అమ్మకం, లైసెన్స్ ఫీజులు మొదలైన వాటి ద్వారా 40,850 కోట్లు రాబడతారట.

కరెంటు ఖాతా లోటు (Current Account Deficit -CAD) పూడ్చాలంటే రానున్న 13 నెలల్లో ఏకంగా 75 బిలియన్ డాలర్లు (4.12 లక్షల కోట్ల రూపాయలు) అవసరం అని ఆర్ధిక మంత్రి అంచనా వేశాడు. దేశంలో సేవింగ్స్ సరిపోక ఆ లోటు విదేశాల నుండి తెచ్చే అప్పులతో పూడ్చుకోవడాన్ని ‘కరెంటు ఖాతా లోటు’ గా పిలుస్తారు. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన కొత్త సరళీకరణ చర్యలు (చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ లలో ఎఫ్.డి.ఐ మొ.వి) విదేశీ పెట్టుబడిదారులకు ఏ మాత్రం విశ్వాసం కలగజేసినట్లు?

దేశీయ వనరులు, మార్కెట్లు అన్నీ అప్పగిస్తూ కూడా అనేక రాయితీలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు బడ్జెట్ ప్రతిపాదించింది. ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించే బాండ్లు జారీ చేయడం, 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే 15 శాతం పెట్టుబడి భత్యం (capital allowance), విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు (ఎఫ్.ఐ.ఐ – ప్రమాదం అనుకుంటే తుర్రున పారిపోయే పెట్టుబడిదారులు వీళ్ళు) కార్పొరేట్ మరియు ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టుకునే అవకాశం ఇవ్వడం, విదేశీ షేర్ పెట్టుబడులకు కె.వై.సి (know your customer) నిబంధనలనుండి (ఈ నిబంధనలు అడ్డు పెట్టుకుని బ్యాంకులు సాధారణ ఖాతాదారుల ప్రాణాలు తోడేస్తున్నాయి) మినహాయింపు ఇవ్వడం, ద్రవ్య సంస్కరణలను త్వరితగతిన అమలు చేస్తామని గట్టి హామీ ఇవ్వడం, ఫ్యాక్టరీ గేటు పన్ను తగ్గింపు మొదలయినవన్నీ కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేటు మార్కెటీర్లకు భారత ప్రభుత్వం ఉత్సాహంగా అందించిన తాయిలాలు. బడ్జెట్ బ్రహ్మాండం అని సి.ఐ.ఐ, ఫిక్కీ లాంటి పారిశ్రామికవేత్తల సంఘాలు పొగుడుతున్నాయంటే ఊరకే పొగుడుతారా మరి?

విద్యుత్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వ్యవసాయ రంగానికి కనీసం 7 గంటలు కూడా విద్యుత్ ఇవ్వని పరిస్ధితి. సూర్య విద్యుత్తు, పవన విద్యుత్తు పట్ల పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతూ అద్భుత ఫలితాలను కూడా సాధిస్తున్నాయి. రెండు రోజులపాటు దేశానికి అవసరమైన మొత్తం విద్యుత్తును కేవలం సూర్య విద్యుత్తు ద్వారానే ఉత్పత్తి చేసి జర్మనీ వార్తల్లో నిలిచింది. ఫుకుషిమా అణు ప్రమాదం తర్వాత అణు విద్యుత్ పరిశ్రమలను మరో పదేళ్ళలో పూర్తిగా స్వస్తి పలకడానికి జర్మనీ నిశ్చయించుకుంది. పవన విద్యుత్తుకి పెద్ద ఎత్తున భూములు అవసరం అవుతాయని బొగ్గు, అణు కంపెనీల లాబీలు ఇన్నాళ్లూ భయపెట్టాయి. అదేమీ లేదని, ఖాళీగా ఉన్న ఎందుకూ పనికిరాని బంజరు భూములు, ఇళ్ల పై కప్పులు మొదలయిన ప్రదేశాలను వినియోగిస్తే అసలు బొగ్గు, అణువులతో పని లేకుండానే సరిపోయినంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇటీవలే సంబంధిత శాస్త్రవేత్తలు బ్రహ్మాండమైన శుభవార్త చెప్పారు. అంటే సూర్య, పవన విద్యుత్తులు లాంటి సంప్రదాయేతర విద్యుత్ వనరుల పైన దృష్టి పెడితే కాలుష్యం బారిన పడకుండా నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మార్గాలు అందుబాటులో ఉన్నా తాజా బడ్జెట్ దాని గురించి పట్టించుకున్నదే లేదు. పవన విద్యుత్తును ప్రోత్సహించడానికి కేవలం 800 కోట్లు మాత్రమే ఆర్ధిక మంత్రి ప్రతిపాదించాడు. విద్యుత్ నియంత్రణ మండలిలను అడ్డు పెట్టుకుని విద్యుత్ చార్జీలను ప్రతి నెలా పెంచుతున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ వనరుల వైపు ఎందుకు దృష్టి పెట్టవు? చిదంబరం

బడ్జెట్ లో ఒక విశేషం మహిళా బ్యాంకు, నిర్భయ ఫండ్. ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత దేశం మొత్తం పెద్ద పెట్టున ఉద్యమించిన దానికి ఆర్ధిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ లో ఇలా స్పందించాడు. ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశ పెడుతూ అక్టోబరులో మహిళా (ఆల్ వుమెన్) బ్యాంకు ప్రారంభం అవుతుందని మంత్రి చెప్పడం తాము వేగంగా స్పందించామని చెప్పడమా లేక నత్త కూడా తమ ముందు బలాదూరే అని నిర్ధారించడమా? ఒక బ్యాంకు ప్రారంభం కావడానికి ప్రభుత్వానికి ఎనిమిది నెలలు కావాలా? దేశం మొత్తానికి ఒక మహిళా బ్యాంకు పెట్టి ఊరుకుంటారా లేక మరిన్ని నెలకొల్పుతారా అనేది స్పష్టత లేదు. లేక కావాలనే స్పష్టత ఇవ్వలేదా? దేశంలో అనేకమంది మహిళా పారిశ్రామికవేత్తలు, అధికారులు ఉన్నారని మంత్రికి తెలియదా? తమ పార్టీ నాయకురాలు, లోక్ సభ స్పీకర్ కూడా మహిళలే అని మరిచారా? ఒక ఆల్ వుమెన్ బ్యాంకు ప్రకటించి చిదంబరం ఏమి సాధించదలిచారు?

ఇక నిర్భయ ఫండ్ గురించి తలచుకోకుండా ఉండడమే మేలేమో! వెయ్యి కోట్లు నిర్భయ ఫండ్ గా చిదంబరం ప్రకటించాడు. తద్వారా మరింత మంది నిర్భయలకు ఆయన గ్యారంటీ ఇస్తున్నట్లు ఉంది తప్ప నివారించడానికి పధకం వేస్తున్నట్లు లేదు. ఒక వేళ ఆ నిధులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం అయితే వెయ్యి కోట్లతో ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని భావిస్తున్నారు? జనాభాలో సగభాగం అయిన మహిళలు ప్రతిచోటా వివక్షకు గురవుతున్నారని లోకం తెలిసిన ప్రతి ఒక్కరు నిర్ధారిస్తుంటే, ఆ పరిస్ధితిని నివారించడానికి సమగ్ర విధానం అమలు చేయడం మాని వేగ్ గా వెయ్యి కోట్లు నిర్భయ ఫండ్ అని ప్రకటించడం బాధ్యతారాహిత్యం. భారత దేశంలో కోట్లాది శ్రామిక మహిళలకు కనీస వైద్య, ఆరొగ్య సౌకర్యాలు గానీ, గర్భిణీ స్త్రీలకు వసతి సౌకర్యాలు గానీ లేవు. వైద్యుల కొరత చెప్పనే అవసరం లేదు. వేలాది గ్రామాలకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక జబ్బులను ముందుగా కనిపెట్టి నివారించే సౌకర్యాలు అసలే లేవు. ఈ సమస్యలు ఆర్ధిక మంత్రి దృష్టిలో ఉన్నాయా? ఉంటే వెయ్యి కోట్లతో ఆ సమస్యలు ఎలా తీరుస్తారు? లేకపోతే వెయ్యి కోట్లు ఎందుకు ప్రకటించినట్లు? ఘోరం ఏమిటంటే ఈ వెయ్యి కోట్లు ఖర్చు చెయ్యడానికి మార్గాలు వెతకాలని చిదంబరం స్వయంగా స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రి కృష్ణ తీర్ధని కోరడం. ఆర్ధిక మంత్రిగారి మహీళా అభివృద్ధి దృక్కోణం ఇలా తగలడిందని సరిపెట్టుకోవాలా?

మొత్తం మీద చూస్తే చిదంబరం బడ్జెట్ ఎప్పటి లాగానే నూతన ఆర్ధిక విధానాలకు కొనసాగింపులో భాగం. స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు దోచి పెట్టి, సామాన్యుడికి నామ మాత్రంగా ఇస్తున్న సబ్సిడీలలో మరింత కోతపెట్టడానికి ఉద్దేశించిన బడ్జెట్ ఇది. మాటల్లో సామాన్యుడికి మద్దతు పలుకుతూ చేతల్లో కార్పొరేట్ కంపెనీలకు మరిన్ని వరాలు కురిపించిన బడ్జెట్.

One thought on “బడ్జెట్ 2013-14: మాటలు సామాన్యుడికి, మూటలు కార్పొరేట్లకు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s