ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!


కజకిస్తాన్ లో P5+1, ఇరాన్ ప్రతినిధుల సమావేశం

కజకిస్తాన్ లో P5+1, ఇరాన్ ప్రతినిధుల సమావేశం

ఇది దాదాపు ఎవరూ ఊహించని పరిణామం! అప్పుడే ఒక అవగాహనకు రావడం తొందరపాటే అయినా ఈ మాత్రం సానుకూల వార్త రావడం కూడా అనూహ్యమే. కజకిస్తాన్ పాత రాజధాని అల్మాతిలో ఇరాన్, P5+1 దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల అవగాహనతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి ప్రకటించడం ఇప్పటి ప్రపంచ పరిస్ధితులలో ‘అమ్మయ్య’ అనుకోవాల్సిన వార్త. ఇరాన్ అణు బాంబు తయారు చేస్తోందని చెబుతూ పశ్చిమ రాజ్యాలు ఆ దేశంపై దశాబ్దాలుగా అక్రమ ఆంక్షలు విధించి పసిపిల్లలకు పాల డబ్బాలు, రోగులకు ఔషధాలు అందకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం వలన భారత దేశంతో పాటు అనేక దేశాల ప్రజలకు ‘చమురు వదులుతున్నందున’ ఇరాన్ అణు చర్చల పురోగమనం మనకి కూడా కాస్త శుభవార్త.

P5 అంటే పర్మినెంట్ 5 అని అర్ధం. ఐరాస భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం (వీటో పవర్ తో) కలిగి ఉన్న ఐదు దేశాలను సూచిస్తూ దీనిని వాడుతున్నారు. P5+1 అంటే ఆ ఐదు దేశాలు + జర్మనీ అని అర్ధం. ఇరాన్ తో అణు చర్చలలో ఈ ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. అణు బాంబుల్లో వాడడానికి, అణు విద్యుత్ ఉత్పత్తికి, వైద్య ఉపయోగాలకు శుద్ధి చేసిన యురేనియం అవసరం. ఆయా అవసరాలకు అనుగుణంగా యురేనియం ఖనిజాన్ని శుద్ధి చేయవలసిన శాతాన్ని నిర్ణయిస్తారు. 5 నుండి 20 శాతం వరకు శుద్ధి చేస్తే అది అణు విద్యుత్తు ఉత్పత్తికి సరిపోతుంది. వైద్య ప్రయోజనాలకు ఉపయోగించే ఐసోటోపులు తయారు చేయాలంటే ఇంకా ఉన్నత స్థాయికి శుద్ధి చేయవలసి ఉంటుంది. కానీ 85 శాతం పైగా శుద్ధి చేస్తే దానిని అణు బాంబులకు వినియోగించవచ్చు.

ఇరాన్ 20 శాతానికి పైగా యురేనియం శుద్ధి చేస్తున్నదని, అణు బాంబు తయారీ కోసమే అలా చేస్తున్నదనీ పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. పదే పదే ఆరోపణల బురద జల్లి అది కడగడానికి ఐ.ఎ.ఇ.ఎ (ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజన్సీ) పరిశోధకులను ఇరాన్ అణు శుద్ధి పరిశ్రమలలోకి అనుమతించాలని బలవంతం చేస్తున్నాయి. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగిస్తే ఆ దేశ యురేనియం అవసరాలను తామే తీరుస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ తంతు కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. ఇప్పటికీ అనేకసార్లు ఐ.ఎ.ఇ.ఎ పరిశోధకులను ఇరాన్ తన అణు కేంద్రాలలోకి అనుమతించింది. కానీ వారు చెప్పిన పని మానుకుని అమెరికా కోసం గూఢచర్యం చేయడంతో వారిని ఇరాన్ తన్ని తగలేసింది.

ఈ వివాదం నడుస్తుండగానే ఇప్పటికీ నాలుగు సార్లు ఐరాస ను వినియోగించి ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలను పశ్చిమ దేశాలు విధింపజేశాయి. అవి కాకుండా తమ సొంత ఆంక్షలు విధించి వాటిని అమలు చేయాలని ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చి సఫలం కూడా అయ్యాయి. అయినప్పటికీ ఇరాన్ లొంగలేదు. తాము శాంతియుత ప్రయోజనాల కోసమే యురేనియం శుద్ధి చేస్తున్నామని ఇరాన్ పదే పదే ప్రకటించింది. ఇరాన్ కు అణు బాంబు తయారు చేసే ఉద్దేశం లేదని, ఆ వైపుగా అసలు ప్రయత్నాలే జరగడం లేదని అమెరికా గూఢచార సంస్థ సి.ఐ.ఎ, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ తేల్చి చెప్పాయి. అయినప్పటికీ ఇరాన్ అణు కేంద్రాలపై బాంబులు వేయడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ఉత్సాహం ప్రకటిస్తుంది. “అవసరమైతే ఇజ్రాయెల్ చెప్పినట్లు దాడులకు కూడా సిద్ధమే” అని అమెరికా అధ్యక్షులే సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటిస్తారు. గత డిసెంబరులో బాంబు దాడులు చెయ్యడానికి ఇజ్రాయెల్ ఏర్పాట్లు చేసుకుందని, కానీ అమెరికా నివారించిందని వార్తలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో కజకిస్తాన్ లో మరొకసారి P5+1, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సానుకూల అంచనాతో ముగిసాయని ఇరాన్ ప్రతినిధి సయీద్ జలిలి ప్రకటించాడని ‘ది హిందు’ పత్రిక తెలిపింది. “రెండు రోజుల చర్చలు సానుకూల దిశలో వేసిన ఒక అడుగు. దీనిని నిర్మాణాత్మక వైఖరితో, పరస్పర ప్రతి చర్యలతో పూర్తి చేసుకోవచ్చు” అని జలీలి ప్రకటించాడు. సమావేశాలు ముగిసిన అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో జలీలి మాట్లాడినట్లు పత్రికలు తెలిపాయి. అయితే ఆయన జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాడని అవి తెలిపాయి.

ఇరు పక్షాల మధ్య సంబంధాలు మామూలు స్థితికి రావడానికి నిర్దిష్ట చర్యలు (road map) తీసుకోవడానికి ఒక అవగాహనకి వచ్చిందీ లేనిదీ ఆయన చెప్పలేదని తెలుస్తోంది. మార్చడానికి వీలులేని కొన్ని చర్యలను తాము ప్రతిపాదించామని, విశ్వాసం ప్రోధి చేయడానికి కొన్ని ప్రతిపాదనలు చేశామని వీటిని ఆరు నెలల లోపు దశలవారీగా అమలు చేయాలని కోరామని తెలిపాడు. ఇరు పక్షాలు తమకు అప్పగించబడిన చర్యలను పరస్పరం ఇచ్చి పుచ్చుకునే రీతిలో అమలు కావాలని తాము కోరామని తెలిపాడు. “సమానంతరంగా సంతులిత రీతిలో చర్యలు తీసుకోవాలి. ఆ ప్రతిపాదనలు ఇరాన్ హక్కులను ఏ విధంగానూ ఉల్లంఘించకూడదు” అని ఇరాన్ నొక్కి చెప్పినట్లుగా ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ ఏజన్సీ ని ఉటంకిస్తూ ‘ది హిందు’ తెలిపింది.

తన అణు హక్కుల విషయంలో రాజీ పడేది లేదని ఇరాన్ స్పష్టం చేసినట్లు ఇతర వార్తా సంస్థలు కూడా తెలిపాయి. ‘అణు హక్కులు’ అంటే ఇరాన్ ఉద్దేశంలో ‘యురేనియంను తమ అవసరాలకు అనుగుణంగా శుద్ధి చేసుకునే హక్కులు’ అని. ఐ.ఎ.ఇ.ఎ లో సభ్య దేశం అయినప్పటికీ యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా వదిలి పెట్టాలని అమెరికా, దాని మిత్ర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే 20 శాతం మేరకు యురేనియం శుద్ధి చేయడాన్ని మానుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నదని, 5 శాతం వరకు శుద్ధి చేయడం మాత్రం కొనసాగిస్తానని ఇరాన్ చెబుతోందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.

తాజా సమావేశం తర్వాత మరిన్ని చర్చలకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. మార్చి 17-18 తేదీలలో టర్కీ నగరం ఇస్తాంబుల్ లో సమావేశం కావడానికి అంగీకారం కుదిరింది. ఆ తర్వాత ఏప్రిల్ 6 న తిరిగి అల్మతిలో ‘రాజకీయ’ సమావేశం జరుగుతుందని జలీలిని ఉటంకిస్తూ వార్తా సంస్థలు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం ఇస్తాంబుల్ సమావేశంలో పశ్చిమ దేశాలు తమ ప్రతిపాదనలను ఇరాన్ ముందు ఉంచుతాయి. అనంతరం ఆల్మతిలో జరిగే సమావేశంలో వాటికి ఇరాన్ తన ప్రతిస్పందన తెలుపుతుంది.

క్వోమ్ నగరం సమీపంలో కొండలను తొలిచి అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిర్మించిన ఫోర్డో అణు శుద్ధి కేంద్రం గురించి పశ్చిమ దేశాలు సమావేశంలో చర్చించలేదని తెలుస్తున్నది. ఇంతకాలం పశ్చిమ దేశాలు ఈ కేంద్రాన్ని మూసివేయాలని డిమాండ్ చేశాయి. ఈసారి ఫోర్డో కేంద్రాన్ని మూసివేయాలని పశ్చిమ దేశాలు కోరలేదని జలీలి విలేఖరులకు తెలిపాడు. దీనితో ఫోర్డో మూసివేత డిమాండును పశ్చిమ దేశాలు వదులుకున్నాయా అన్న ప్రశ్న తలెత్తింది. అదే జరిగితే అది నిస్సందేహంగా ఇరాన్ అనుకూల చర్యలేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకుముందు బాగ్దాద్, మాస్కో లలో జరిగిన రెండు సమావేశాలలోనూ ’20 శాతం వరకు యురేనియం శుద్ధి చేస్తున్న ఫోర్డో కేంద్రాన్ని మూసివేసి ఇప్పటివరకు శుద్ధి చేసిన యురేనియంను విదేశాలకు తరలించాలని పశ్చిమ దేశాలు డిమాండ్ చేశాయి. ఈసారి ఆ డిమాండ్ ఎత్తకపోవడం పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. పశ్చిమ దేశాల వ్యూహం ఏమిటో తెలియనప్పటికీ ఇప్పటికైతే అది ఇరాన్ కి అనుకూలమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఫార్స్ వార్తా సంస్థ ప్రకారం “పశ్చిమ దేశాలు అనూహ్య రీతిలో తాము నిలబడిన చోటునుండి వెనకడుగు వేశాయి.”

మాస్కో చర్చల సందర్భంగా ‘యురేనియం శుద్ధి చేయడానికి ఇరాన్ కి గల హక్కులను P5+1 దేశాలు గుర్తించినట్లు బహిరంగంగా ప్రకటించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దానికి ప్రతిగా తాము భవిష్యత్తులో ఎన్నడూ మిలట్రీ ప్రయోజనాల కోసం అణు శుద్ధి చేపట్టబోమని హామీ ఇస్తామని ఇరాన్ తెలిపింది. అణు బాంబు తయారు చేయడానికి వ్యతిరేకంగా తమ మతనాయకుడు ఖోమైనీ ఫత్వా జారీ చేసిన విషయాన్ని కూడా ఇరాన్ గుర్తు చేసింది. ఇరాన్ పై విధించిన ఆంక్షలన్నింటిని దశలవారీగా ఎత్తివేసినట్లయితే తమ పార్శ్చిన్ మిలట్రీ కాంప్లెక్స్ ను తనిఖీ చేసుకోవడానికి ఐ.ఎ.ఇ.ఎ కు పూర్తి స్వేచ్ఛ ప్రసాదిస్తామని కూడా ఇరాన్ ప్రతిపాదించింది. అంతిమంగా ఐరాస భద్రతా సమితి విధించిన ఆంక్షలను రద్దు చేస్తే తాము యురేనియంను 20 శాతం మేరకు శుద్ధి చేయడం కూడా మానుకుంటామని ప్రతిపాదించింది. 20 శాతం వరకు యురేనియంను శుద్ధి చేయగలిగితే ఆ తర్వాత హై గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఎంతో దూరం ఉండదు. పశ్చిమ దేశాల భయం కూడా ఇదే. అణు బాంబుకు కొద్ది అడుగుల దూరంలోనే ఇరాన్ ఉన్నదని అవి అనేకసార్లు భయాలు వ్యక్తం చేశాయి.

పశ్చిమ దేశాలు గుట్టలుగా పేర్చుకున్న అణ్వాయుధాల ద్వారా రాని ముప్పు, అసలు తయారే కానీ ఇరాన్ అణు బాంబు వలన ప్రపంచానికి వస్తుందని పశ్చిమ దేశాలు చెప్పడం, దానిని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నెత్తిన వేసుకుని ప్రచారం చెయ్యడమే అంతుబట్టని విషయం.

2 thoughts on “ఇరాన్, పశ్చిమ దేశాల అణు చర్చలు సానుకూలం?!

  1. @పశ్చిమ దేశాలు గుట్టలుగా పేర్చుకున్న అణ్వాయుధాల ద్వారా రాని ముప్పు, అసలు తయారే కానీ ఇరాన్ అణు బాంబు వలన ప్రపంచానికి వస్తుందని పశ్చిమ దేశాలు చెప్పడం, దానిని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నెత్తిన వేసుకుని ప్రచారం చెయ్యడమే అంతుబట్టని విషయం.

    ఎందుకంటే నీతులు ఉన్నది పక్క వాళ్లకు చెప్పడానికే.

    పశ్చిమ దేశాల ప్రజలకు నాయకులకు బ్రతుకు విలువ తెలుసనీ, అందుకే వాళ్ళు అణ్వాయుధాల ప్రయోగం విషయం లో బాద్యతాయుతం గా ఉంటారు అని, అదే అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల నాయకులకు ఆ బాద్యత ఉండదు అని చెప్పుకుంటారు. కాని ఇప్పటిదాకా అణ్వాయుధ ప్రయోగం చేసిన ఏకైక దేశం అమెరికానే. ఒకవేళ ఇరాన్, ఉత్తర కొరియా లేదా ప్రపంచం లో మరే అభివృద్ధి చెందని/చెందుతున్న దేశం, అణ్వాయుధాలు సమకుర్చుకున్నా, వాటిని ప్రయోగించకుండా అడ్డుకోగల/నాశనం చేయగల సాంకేతికత అమెరికా మరియు ఇతర పశ్చిమ దేశాల దగ్గర ఉంది . ఇతర దేశాల వనరుల మీద, రాజకీయ విధానాల మీద ఆధిపత్యం కొనసాగించడం కోసం అమెరికా అనుసరించే అనేక వ్యూహాల లో అణ్వాయుధాల ముప్పు గురించి ప్రచారం చేయడం కుడా ఒకటి.

    అణ్వాయుధాల గురించిన ఏ చర్చల లో అయినా, ప్రపంచం లో ఎవరి దగ్గర అణ్వాయుధాలు గాని వాటిని తయారు చేయగల సాంకేతికత గాని ఉండకూడదు అనేది మొదటి అంశం ఎందుకు కాదో మరి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s