పొదుపు విధానాలకు తిరస్కరణ, ఇటలీలో హంగ్ పార్లమెంటు


ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ నాయకుడు బెప్పె గ్రిల్లో

ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ నాయకుడు బెప్పె గ్రిల్లో

ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు బలవంతంగా అమలు చేస్తున్న పొదుపు ఆర్ధిక విధానాలను తిరస్కరిస్తూ ఇటలీ ఓటర్లు తీర్పు చెప్పారు. ఆది, సోమ వారాల్లో జరిగిన ఓటింగ్ ఫలితాలు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వలేదు. కనీసం కూటములు కూడా స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయాయి. యూరోపియన్ మానిటరీ యూనియన్ (యూరోజోన్) నుండి వైదొలగాలని ప్రచారం చేసిన కొత్త పార్టీకి మొదటి ప్రయత్నంలోనే పెద్ద ఎత్తున ఓట్లను కట్టబెట్టి ఇటలీ ప్రజలు తమ ఉద్దేశాలు చాటారు. సెంటర్-లెఫ్ట్ కూటమిగా పత్రికలు అభివర్ణించిన కూటమి 29.5 శాతం ఓట్లు సాధించగా, సెంటర్-రైట్ కూటమిగా అభివర్ణించబడిన కూటమి 29.2 శాతం ఓట్లు సాధించింది. పార్టీల ప్రకారం చూస్తే కమెడియన్ బెప్పే గ్రిల్లో స్ధాపించిన కొత్త పార్టీ ‘ఫైవ్ స్టార్ మూవ్ మెంట్’ (ఇటాలియన్ భాషలో M5S) అత్యధికంగా 25.5 శాతం ఓట్లు సాధించి మొదటి స్ధానంలో నిలవడం విశేషం.

ఇటలీ ప్రధాని మాంటియో మోర్శి కి చెందిన సెంట్రిస్టు కూటమి కనాకష్టంగా 10.5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సెంటర్-లెఫ్ట్ కూటమికి ‘పియార్ లుయీగి బెర్సాని’ నాయకత్వం వహిస్తుండగా, సెంటర్-రైట్ కూటమికి మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని నాయకత్వం వహిస్తున్నాడు. హంగ్ సభ వలన రోజుల తరబడి రాజకీయ సంక్షోభం కొనసాగుతుందన్న అంచనాతో ఇటలీ షేర్ మార్కెట్లు కుప్పకూలి 4 శాతం పైగా నష్టపోయాయి. “ఓటింగు దిగ్భ్రాంతి పరిచింది” అని ఇటలీలో భారీ సర్కులేషన్ ఉన్న ‘కొరియెరే డెల్లా సెరా’ పత్రిక పతాక శీర్షికతో పేర్కొంది. సెంటర్-లెఫ్ట్ కూటమి విజయం సాధించినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం మాత్రం ఆ కూటమికి లేదు. విదేశాల్లో ఉన్న ఇటాలియన్ల ఓట్లు ఇంకా లెక్కించలేదని తెలుస్తోంది. కానీ విదేశీ నివాసుల ఓట్లు, ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపేవి కాదని తెలుస్తోంది.

సెంటర్-లెఫ్ట్ కూటమి నాయకుడు లుయీగి బెర్సాని

సెంటర్-లెఫ్ట్ కూటమి నాయకుడు లుయీగి బెర్సాని

దరిమిలా, బహుశా రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ ఊహించని విధంగా ‘సెంటర్-లెఫ్ట్, సెంటర్-రైట్ కూటములు సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేరుకు లెఫ్ట్ (శ్రామిక ప్రజల పక్షం), రైట్ (ధనిక వ్యాపారుల పక్షం వహించే మితవాదులు), సెంటర్ (మధ్యేవాదులు) పార్టీలు అయినప్పటికీ పొదుపు పేరుతో సామాన్య ప్రజలను, ఉద్యోగులను పన్నులతో, కోతలతో బాదే కార్యక్రమంలో ఈ పార్టీలన్నింటికీ ఏకీభావం ఉన్నది. సెంట్రిస్టు భావాలకు ప్రతినిధిగా భావించే (రాజీనామా చేయనున్న) ప్రధాని మేరియో మోంటి ఉద్యోగాలు ఊడపీకి, భారీ పన్నులు వేస్తూ అత్యంత దారుణమైన పొదుపు విధానాలను అమలు చేయగా ఆయనకు సో కాల్డ్ సెంటర్-లెఫ్ట్ కూటమి నాయకుడు లుయీగి బెర్సాని పూర్తి మద్దతు ఇవ్వడమే అందుకు ప్రబల సాక్ష్యం. లెఫ్ట్ పార్టీల మద్దతు లేనిదే గడచిన ఒకటిన్నర సంవత్సరాలలో మేరియో మోంటి ప్రభుత్వం నిలిచేదే కాదు.

కమెడియన్ బెప్పే గ్రిల్లో స్ధాపించిన కొత్త పార్టీ M5S ఏకంగా 25.5 శాతం ఓట్లు సాధించడం ఊహించని విశేషంగా భావిస్తున్నారు. కూటములను విడదీసి పార్టీల వారీగా చూస్తే ఆ పార్టీకే ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఐదు ప్రాంతాల్లో కూటముల కంటే పెద్ద పార్టీగా M5S అవతరించడం మరో విశేషం. లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలన్నీ కూడబలుక్కుని అమలు చేసిన వినాశకర పొదుపు ఆర్ధిక విధానాల పట్ల ప్రజల్లో ఎంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అయిందో M5S పార్టీ సాధించిన మద్దతు స్పష్టం చేస్తోంది. పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవడానికే తాము ఇష్టపడుతున్నట్లు ఆ పార్టీ నేతల ప్రకటనల ద్వారా తెలుస్తోంది. ఆ చివర, ఈ చివర ఉన్న బెర్లుస్కోని, బెర్సాని లు ఐక్యమై ప్రభుత్వం ఏర్పాటు చేసి ధనిక వర్గాల కోసం, కార్పొరేట్ వ్యాపార కంపెనీల కోసం పొదుపు విధానాలను మరింత తీవ్రంగా అమలు చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మేరియో మోంటి ప్రభుత్వం పన్నులు విపరీతంగా పెంచడమే కాక పెన్షన్ సంస్కరణలు, కార్మిక చట్టాల సంస్కరణలు ప్రవేశపెట్టి అప్రతిష్ట మూటకట్టుకుంది. ఈ విధానాలకు సెంటర్-లెఫ్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చి మోంటి ప్రభుత్వం పడిపోకుండా కాపాడాయి. ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అమలు చేస్తూ యూరోజోన్ లో భాగంగా ఉండడం వల్లనే తమ ఆర్ధిక వ్యవస్థ పైన ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు పెత్తనం సాగిస్తున్నాయని కనుక యూరోజోన్ నుండి బైటికి రావాలని వాదించిన M5S పార్టీకి ప్రజలు భారీగా మద్దతు ఇవ్వడంతో కంపెనీలను, ధనికులను సంతృప్తిపరచడానికి సో కాల్డ్ లెఫ్ట్, రైట్ ఒక్కటి కావడమే ఇక మిగిలి ఉంది. పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ద్వారా వ్యవస్ధలో మౌలిక మార్పులు తెస్తామని వాదించే లెఫ్ట్ పార్టీలేవీ వాస్తవానికి లెఫ్ట్ పార్టీలు కాదని ఇటాలియన్ సెంటర్-లెఫ్ట్ కూటమిలోని లెఫ్ట్ పార్టీలు నిర్ద్వంద్వంగా నిరూపించాయి. భారత దేశంలో 2004 ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన యుపిఎ -1 ప్రభుత్వం కూడా సెంటర్-లెఫ్ట్ కూటమే అని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

సెంటర్-రైట్ కూటమి నాయకుడు సిల్వియో బెర్లుస్కోని

సెంటర్-రైట్ కూటమి నాయకుడు సిల్వియో బెర్లుస్కోని

ఇటలీలో ఎగువ సభను సెనేట్ అని, దిగువ సభను ఛాంబర్ ఆఫ్ డిప్యుటీస్ (క్లుప్తంగా ఛాంబర్) అని పిలుస్తారు. సెనేట్ లో లుయీగి బెర్సాని నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ కూటమికి 31.6 శాతం సీట్లు గెలుచుకోగా, బెర్లుస్కోని నేతృత్వంలోని సెంటర్-రైట్ కూటమికి 30.7 శాతం సీట్లు గెలుచుకుంది. ప్రాంతాల వారీగా వచ్చిన ఓట్లను బట్టి సెనేట్ సీట్లను నిర్ణయిస్తారు. సెనేట్ మెజారిటీకి 158 సీట్లు అవసరం కాగా రెండు కూటములు చెరో 120 సీట్లు మాత్రమే సాధించాయి. కాగా M5S 60 సీట్లు సాధించింది.

పొదుపు విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఇటలీ రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నప్పటికి ఆ విధానాలను ఇంతటితో ఆపేస్తామని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఆర్ధిక మాంద్యం, అవినీతి వలన ప్రజల్లో రాజకీయ పార్టీలంటేనే ఏవగింపు కలిగిందని వివిధ పార్టీల నాయకులు ఒక పక్క ప్రకటిస్తూనే ఇటలీ భవిష్యత్తును కాపాడే పేరుతో పొదుపు విధానాల కొనసాగింపుకే వివిధ పార్టీల కూటములు మొగ్గు చూపుతున్నాయి.

రెండో స్ధానంలో నిలిచిన సెంటర్-రైట్ కూటమి నాయకుడు బెర్లుస్కొని అనేక కుంభకోణాలలో ఇరుక్కుని ఉన్నాడు. పన్నుల చెల్లింపులో మోసానికి పాల్పడ్డాడన్న నేరంతో పాటు మైనర్ బాలికతో వ్యభిచారం చేసిన నేరానికి కూడా ఆయన కోర్టు కేసులను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపధ్యంలో బెర్లుస్కొనికి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశ్యం లేదని, తగిన సీట్లు సంపాదించి తనపై విచారణ సాగకుండా ఉండేలా బేరం ఆడడమే ఆయన ఉద్దేశ్యమని బెర్లుస్కొని పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటలీలో భారీ మీడియా సామ్రాజ్యానికి అధిపతి అయిన బెర్లుస్కొని డిసెంబరులో ప్రత్యర్థుల కంటే 15-20 పాయింట్లు వెనకబడినప్పటికీ, ఫిబ్రవరి మొదటి వారానికల్లా ఆ తేడాను 5 పాయింట్లకు తగ్గించుకున్నాడని మీడియా చేత చెప్పించుకున్నాడు. దానితో అభిప్రాయ సేకరణ ఓటింగులపై ప్రభుత్వం నిషేధం విధించవలసి వచ్చింది. అయినప్పటికీ బెర్లుస్కొని మొదటి స్ధానంలో వచ్చిన కూటమి కంటే అతి కొద్ది శాతం ఓట్ల తేడాతో రెండవ స్ధానంలో తన కూటమిని నిలిపాడు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s