కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు


ది హిందు నుండి

ది హిందు నుండి

ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీల స్పెక్యులేటివ్ ఆటలకు అప్పజెప్పడానికి ఆర్.బి.ఐ గేట్లు బార్లా తెరిచింది. ప్రైవేటు రంగంలో కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి బడా కార్పొరేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి నిర్ణయించినట్లు శుక్రవారం అంతిమ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ సూత్రాల ప్రకారం కార్పొరేట్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు), NOHFCలు (Non-Operative Financial Holding Company) ఇకనుండి యథేచ్ఛగా బ్యాంకులు పెట్టుకోవచ్చు. నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం కొత్త బ్యాంకులకు లైసెన్సుల కోసం జులై 1 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్.బి.ఐ గడువు విధించింది.

“ప్రమోటర్లు/ప్రమోటర్ గ్రూపులు గతంలో మంచి చరిత్ర, సమగ్రత కలిగి ఉండాలి. ఆర్ధికంగా ఉన్నత స్ధాయిలో ఉండాలి. తమ వ్యాపారాలను కనీసం 10 సంవత్సరాల పాటు విజయవంతంగా నిర్వహించిన చరిత్ర ఉండాలి” అని ఆర్.బి.ఐ మార్గదర్శక సూత్రాలు నిర్దేశిస్తున్నాయి. ప్రమోటర్ గ్రూపుల వ్యాపార నమూనా గాని, వ్యాపార సంస్కృతి గాని బ్యాంకింగ్ నమూనాతో సంకీర్ణం చెంది ఉండరాదని, వారి వ్యాపారం బ్యాంకును గాని, బ్యాంకు కార్యకలాపాలను గాని ప్రమాదంలో పడవేయరాదని కూడా ఆర్.బి.ఐ షరతులు విధించింది. అయితే ఏ ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారో వాటినే షరతులుగా విధించడం, అది కూడా కట్టుబాటు లేని విధంగా నీతి బోధ చేస్తున్నట్లు ఆ షరతులు ఉండడం బట్టి ప్రమాదం ఏ వైపునుండి పొంచి ఉన్నదో ఇట్టే అర్ధం అవుతోంది.

బ్యాంకులు పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రమోటర్ల గ్రూపుల వ్యాపార కార్యకలాపాలు “స్పెక్యులేటివ్ స్వభావం కలిగి ఉండరాదు. చంచల పూరితమైన అత్యధిక ధరల ఆస్తులతో ముడిపడి ఉండరాదు” అని ఆర్.బి.ఐ నిర్దేశిస్తోంది. కానీ ఆధునిక కార్పొరేట్ ప్రమోటర్లు మరియు, ప్రమోటర్ గ్రూపుల ప్రధాన లక్షణమే ప్రమాదకరమైన స్పెక్యులేటివ్ పెట్టుబడులతో ప్రమాదకర పద్ధతుల్లో ఆటాడుకోవడం. వాటికి హై రిస్క్ షేర్లలో పెట్టుబడులు పెట్టి సొమ్ము చేసుకోవాలన్న యావ తప్ప ప్రజలు దాచుకున్న కష్టార్జితాన్ని జాగ్రత్తగా కాపాడుదామన్న బాధ్యత గాని, దృష్టి గాని ఉండదు.

స్వార్ధపూరితమైన స్పెక్యులేటివ్ వ్యాపార కార్యకలాపాలకు బడా కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎన్.బి.ఎఫ్.సి లు పాల్పడడం వల్లనే 1995 నాటి ఆసియా టైగర్ల సంక్షోభం, 2007-08 నాటి ప్రపంచ ద్రవ్య సంక్షోభం సంభవించిందని గుర్తు చేసుకుంటే ఆర్.బి.ఐ విధిస్తున్న షరతులు ఎంత హాస్యాస్పదమో అర్ధం కాగలదు. మాంసాహారం ఒంటికి మంచికి కాదని మృగరాజు కి బోధించడం, ఆ బోధలను మృగరాజు గారు పాటిస్తారని ఆశించడం ఎంత మోసపూరిత అమాయకత్వమో ప్రైవేటు ద్రవ్య సంస్థలు స్పెక్యులేటివ్ పెట్టుబడుల జోలికి పోవద్దని చెప్పడమూ అంతే మోసం. తాము జాగ్రత్త పాటిస్తున్నామని ప్రజలకు నచ్చజెప్పడానికి ప్రభుత్వం ఆర్.బి.ఐ బోధలను ముసుగుగా వినియోగిస్తున్నది.

ఆ సంగతి ఆర్.బి.ఐ నిర్దేశక సూత్రాల్లోనే పరోక్షంగా స్పష్టం అవుతోంది. అత్యంత చంచల స్వభావం కలిగిన స్పెక్యులేటివ్ రంగాలను –రియల్ ఎస్టేట్, షేర్ల బ్రోకరేజి కంపెనీలు మొ.వి- బ్యాంకులు నెలకొల్పకుండా పరిమితి విధించకపోవడంలోనే ప్రభుత్వ/ఆర్.బి.ఐ ఉద్దేశాలు స్పష్టం అవుతున్నాయి. నిజానికి తన ముసాయిదా మార్గదర్శక సూత్రాలలో ఆర్.బి.ఐ ఈ పరిమితి విధించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, బ్రోకరేజి కంపెనీలకు కొత్త బ్యాంకులు నెలకొల్పడానికి లైసెన్సులు ఇవ్వరాదని ప్రతిపాదించింది. కానీ అంతిమ సూత్రాలకు వచ్చేసరికి ఈ షరతును ఆర్.బి.ఐ ఎత్తివేసింది. ప్రైవేటు ద్రవ్య కంపెనీల ఒత్తిడికి తలొగ్గడం వల్లనే నామ మాత్రంగా ఉన్న రక్షణలను కూడా ప్రభుత్వం/ఆర్.బి.ఐ ఎత్తివేసిందని విమర్శకులు సూచిస్తున్నారు.

కొత్త బ్యాంకులకు ఆర్.బి.ఐ విధించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ప్రారంభ పెయిడ్ అప్ పెట్టుబడి రు. 500 కోట్లు ఉంటే చాలు. ఎన్.ఓ.హెచ్.ఎఫ్.సి లకు ప్రారంభ పెట్టుబడిలో 40 శాతం కలిగి ఉంటే చాలు. 12 సంవత్సరాల తర్వాత దీనిని 15 శాతానికి తగ్గించడం గమనార్హం. కొత్త బ్యాంకులు వ్యాపారం మొదలు పెట్టిన మూడు సంవత్సరాలలో తమ షేర్లు షేర్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయని ఆర్.బి.ఐ భరోసా ఇచ్చింది.

బ్యాంకులో విదేశీ కంపెనీలకు గరిష్ట వాటా ఇవ్వడానికి ఆర్.బి.ఐ నిరభ్యంతరంగా మొగ్గు చూపింది. ప్రస్తుతానికి విదేశీ వాటా 49 శాతం మించడానికి లేదని చెప్పినప్పటికీ 5 సంవత్సరాల తర్వాత దీనిని పెంచుకోవచ్చని ఆర్.బి.ఐ తెలిపింది. నామమాత్ర వాటాతోనే భారత దేశ ప్రభుత్వరంగ కంపెనీలను టాటా లాంటి ప్రైవేటు ధనికులు దశాబ్దాల తరబడి నియంత్రించారు. అలాంటిది ఏకంగా 49 శాతం వాటా అంటే విదేశీ ప్రైవేటు కంపెనీలదే ఇష్టారాజ్యం అవుతుందనడంలో సందేహం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం వచ్చినప్పుడల్లా నిధులు సమకూర్చి పెడుతున్న ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాలు అమ్మేయడం ద్వారా బంగారు గుడ్లు పెట్టే బాతులను కోసుకుని తింటున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ప్రజల పొదుపును నేరుగా ప్రైవేటు కంపెనీలకు కొత్త బ్యాంకుల రూపంలో అప్పజెప్పడం బాధ్యతారాహిత్యం.

విదేశీ పెట్టుబడుల కోసమే ప్రభుత్వ కంపెనీలలో పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామని, చిల్లర వర్తకం లాంటి ప్రజా ఆదాయ వనరులను ఎఫ్.డి.ఐ లకు అప్పజెపుతున్నామని, ఇపుడు విదేశీ ప్రైవేటు కంపెనీలకు బ్యాంకులు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నామని మన పాలకులు చెబుతున్నారు. కానీ వాస్తవానికి నికరంగా చూస్తే పెట్టుబడులు దేశం నుండి బైటికి వెళుతున్నాయే తప్ప బైటి నుండి దేశంలోకి రావడం లేదని అమెరికాకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత అయిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ ఇటీవల ఇండియాలో పర్యటిస్తూ చెప్పాడు. ఎఫ్.డి.ఐ లను ఆహ్వానించడంలో అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం.

బీహార్ ముఖ్యమంత్రితో జోసెఫ్ స్టిగ్లిట్జ్

బీహార్ ముఖ్యమంత్రితో జోసెఫ్ స్టిగ్లిట్జ్

“ఇప్పటికైతే భారతదేశం పెట్టుబడిని ఎగుమతి చేస్తున్నది. పొదుపు రేటుని పెంచుకోవలసిన అవసరం భారతదేశానికి బాగా ఉన్నది. ఇండియా భారీ సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికులను సరఫరా చేస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేక ఇతర దేశాలకు పారిశ్రామికవేత్తలను అది సరఫరా చేస్తోంది” అని జోసెఫ్ స్టిగ్లిట్జ్ తెలిపాడు. ఫైనాన్స్ కంపెనీలను దేశంలోకి అనుమతించేటప్పుడు ఇండియా జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించాడు. “ద్రవ్య (ఫైనాన్షియల్) ఉత్పత్తులకు మార్కెట్లను తెరిచే ముందు వృద్ధిని పెంచడానికి వారు ఏమి చేయదలిచారో ఇండియా వారిని అడగాలి. ఈ ద్రవ్య పరికరాలే (ఫైనాన్షియల్ ఇన్ స్ట్రుమెంట్స్ – సి.డి.ఒలు, సి.డి.ఎస్ లు, ఇన్సూరెన్స్ వెహికల్స్ లాంటి సంక్లిష్టమైన ద్రవ్య ఉత్పత్తులు లేదా పరికరాలే 2008లో మొదలయిన ప్రపంచ స్థాయి ఆర్ధిక మాంద్యానికి దారితీశాయని అమెరికా, యూరప్ లు కూడా అంగీకరించే విషయం) అస్ధిరతకు దోహదం చేస్తాయని బ్రహ్మాండమైన సాక్ష్యాలు ఉన్నందున తీవ్రమైన జాగ్రత్త తప్పనిసరి” అని జోసెఫ్ స్టిగ్లిట్జ్ జనవరి మూడవ వారంలో ఇండియా పర్యటించినపుడు హెచ్చరించాడు.

పెట్టుబడిని నియంత్రించడంలో గాని, ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించడంలో గాని ప్రభుత్వానికే ప్రధాన పాత్ర ఉండేలా చూసుకోవాలని కూడా జోసెఫ్ తేల్చి చెప్పాడు. అంతటితో ఆయన ఊరుకోలేదు. అమెరికా ప్రభుత్వం తన పాత్రను సరిగ్గా పోషించకపోవడం వల్లనే ఆర్ధిక సంక్షోభం సంభవించిందని ఆయన కుండ బద్దలు కొట్టాడు. “(అమెరికాలో) 1992-93 మధ్య వ్యవసాయ ఆదాయాలు తీవ్రంగా పడిపోయాయి. ప్రభుత్వమే పూనుకుని ప్రజలను వ్యవసాయం నుండి తయారీ రంగంలోకి తరలించే వరకూ ఆర్ధిక వ్యవస్థ తనను తాను పునర్నిర్మించలేకపోయింది. మార్కెట్లు తమంతట తాము అభివృద్ధి చెందలేవు, ప్రభుత్వాలే వాటిని (మార్కెట్లను) సృష్టించవలసిన అవసరం ఉంది.” అని జోసెఫ్ అసలు గుట్టు విప్పాడు. స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక విధానంలోని మౌలిక సూత్రాన్ని జోసెఫ్ ప్రశ్నించడం ఇక్కడ గమనించవలసిన విషయం.

జోసెఫ్ స్టిగ్లిట్జ్ చెప్పిన ఇతర అంశాలు ఇలా ఉన్నాయి:

“అమెరికా ముందు ఉన్న సమస్య ఇప్పుడు సేవల రంగం పైన ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థ వైపుకి ప్రయాణించడం. విజయం సాధించాలంటే పెట్టుబడిదారీ విధానానికి, ప్రభుత్వ మరియు పౌర సమాజాలకూ మధ్య సమతుల్యత సాధించడం చాలా ముఖ్యం. జి.డి.పి అంకెల చుట్టూ తిరిగే వ్యామోహం పైన ఆధారపడిన లేదా విజయాల లెక్కలపై ఆధారపడిన వృద్ధి కాదు కావలసింది; నిరంతర సుస్థిరత, పంపిణీ, సాధారణ ప్రజల బాగోగుల పట్టింపు… వీటి పైన ఆధారపడిన వృద్ధి అత్యవసరం.”

“ప్రజలకు స్నేహ పాత్రమైన విధానాలను ప్రభుత్వాలు చేపట్టాలి. వృద్ధి అనేది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం (crony capitalism) పైన ఆధారపడజాలదు… సామాజిక రక్షణ, సామాజిక న్యాయం అందజేయడంలో ప్రభుత్వ పాత్ర చాలా అవసరం.”

“అమెరికా నమూనాలోని పెట్టుబడిదారీ విధానాన్ని గుడ్డిగా అనుసరించకూడదు. విపరీతంగా అసమానతలు ఉన్న వ్యవస్థలు సరిగ్గా పని చేయవు. అమెరికా నమూనాను అనుకరించడానికి అనేక ఆర్ధిక వ్యవస్థలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికాని మక్కీకి మక్కీ అనుసరిస్తే అమెరికాలో ఉన్నట్లే భారీ అసమానతలను వారు ఎదుర్కోవలసి ఉంటుంది.”

భూతల స్వర్గంగా భావిస్తున్న అమెరికా వాస్తవానికి భారీ అసమానతలకు నిలయం అని నోబెల్ ఆర్థికవేత్త జోసెఫ్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు వల్లించే నామమాత్ర ఆదర్శాలు కూడా పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలు ఉన్న దేశాలు అమలు చేయడం లేదని కూడా ఆయన మాటల్లో తెలుస్తున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అర్రులు చాచడం అంటే భారీ అస్ఢిరతలను తెలిసి తెలిసి ఆహ్వానించడమేనని, ముఖ్యంగా ప్రపంచ స్థాయి సంక్షోభాలకు బాటలు వేసిన ద్రవ్య ఉత్పత్తులకు అనుమతి ఇవ్వవద్దని జోసెఫ్ చేసిన హెచ్చరిక చెవి ఒగ్గి ఆలకించవలసి ఉండగా వాటిని విస్మరించడానికే భారత ప్రభుత్వ నేతలు నిర్ణయించారని బ్యాంకింగ్ సంస్కరణలు చెబుతున్నాయి. ఇక జాగ్రత్తలు తీసుకోవలసింది ప్రజలే.

4 thoughts on “కంపెనీలకు బ్యాంకులు, జనానికి చిల్ల పెంకులు

  1. నిజమే, ఈ వార్త చదివాక సత్యం కంప్యుటర్స్ గుర్తుకు వస్తుంది. హైదరబాద్ లో ఒక ఎలక్ర్టానిక్ డిస్ ప్లే బోర్డ్ తయారీ సంస్థ షేర్ విలువ 4 నుంచి 1000 కి పెంచి ప్రమోటర్లు షేర్లు అమ్మేసుకున్నారు. ఉద్యోగుల జీతాల నుండి కట్ చేసి 10 కి షేర్ అమ్మారు. ఇపుదు అది 4 ఐంది. ఇపుడు జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదు .ఇలా వెలుగులోకి రాకుండా ఎన్నో లాబీయింగ్ చేస్తున్నారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s