పాలుగారే పసికూనలు వాళ్ళు; అత్యాచారం చేసి చంపేశారు


టి.వి9 యూ ట్యూబ్ వీడియో నుండి

టి.వి9 యూ ట్యూబ్ వీడియో నుండి

ఆకలితో ఉన్న తండ్రి లేని ముగ్గురు పేద పసి బాలికలను ఆకర్షించి దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన దారుణం మహారాష్ట్ర, భండారా జిల్లాలో జరిగింది. ఇళ్ళలో పాచి పని చేసుకుని బతికే తల్లికి పుట్టినవారు కావడంతో వారి ఊరి వాళ్లని తప్ప దేశ ప్రజలని పెద్దగా కదిలించలేకపోయింది. ఫలితంగా ఘటన జరిగి పది రోజులు కావస్తున్నప్పటికీ దోషులు ఇంతవరకు కనీసం అరెస్టు కాలేదు. స్టేషన్ ఎస్.ఐ ని సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోగా, బాధిత బాలికల తల్లికి 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసుకుంది. ఆ తల్లి మాత్రం తనకు డబ్బు వద్దని, ఆ డబ్బేదో దోషులను వెతకడానికి ఉపయోగ పెట్టమని తెగేసి చెబుతోంది.

జీ న్యూస్ ప్రకారం భండారా జిల్లాలోని లఖాని పట్టణ సమీపంలో ముర్మడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు అక్క చెల్లెళ్లు. వారి వయసు 11, 8, 6 సంవత్సరాలు. ఫిబ్రవరి 14 తేదీన బడికి వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. వారి స్కూల్ లోని ఇతర పిల్లలు అక్క చెల్లెళ్ల పుస్తకాల సంచులను సాయంత్రం ఇంటికి తెచ్చి ఇచ్చారు. దానితో ఆ తల్లి గ్రామంలో తీవ్రంగా వెతికి పిల్లలు కనపడకపోయేసరికి ఆ రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నట్లు చెప్పారే గాని వెతికే ప్రయత్నం చేయలేదు. రెండు రోజుల తర్వాత ఒక బావిలో ముగ్గురు పిల్లలు శవాలుగా తేలడంతో ప్రమాదకర మరణంగా పోలీసులు కేసు మార్చుకున్నారు.

కానీ వాస్తవం ఏమిటో పోస్టుమార్టంలో (అటాప్సీలో) తేలింది. ముగ్గురు బాలికల పైన అసహజ పద్ధతిలో (sodomy) అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసి ఆ తర్వాత బావిలో పడవేశారని తేలింది. బావికి సమీపంలోనే ఒక వ్యవసాయ క్షేత్రం (farm house), ఒక దాబా ఉన్నట్లు ది హిందూ, జీ న్యూస్ తెలిపాయి. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పత్రికలు సూచించినా పోలీసులనుండి అటువంటి సమాచారం ఏమీ లేదు. అప్పటి నుండి దోషుల కోసం వెతుకుతున్నట్లు చెప్పడమే గానీ ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ముగ్గురిని అనుమానితులుగా ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు రెండు రోజుల క్రితం చెప్పారు. కానీ వారే దోషులుగా ఇంకా నిర్ధారించలేదు. శనివారం నాటికి అనుమానితులు కూడా ఎవరూ లేనట్లుగా జీ న్యూస్ సూచించింది.

పసి మొగ్గల పైన ఇంత ఘోరం జరపడానికి మనసెలా ఒప్పిందో గాని, వారు పశువులతో పోల్చడానికి కూడా అనర్హులు. ఏ జాతి పశువుని చూసినా ప్రకృతి సిద్ధమైన ఒక క్రమపద్ధతిని పాటించడం తెలిసిన విషయమే. ప్రకృతిని జయించిన మనిషి ప్రకృతిని, పర్యావరణాన్ని మాత్రమే కాక తనను తాను నాశనం చేసుకుంటున్నాడని చెప్పడానికి భండారా దురంతం ఒక సూక్ష్మ రూపం మాత్రమే కావచ్చు. “పోస్టుమార్టం నివేదికలో ఉన్న మేరకు ముగ్గురు పాపలు లైంగిక అత్యాచారానికి గురయ్యారని స్పష్టం అయింది. కానీ వారు ఎలా హత్యకు గురయినది నివేదికలో చెప్పలేదు” అని నాగపూర్ రేంజి ఐ.జి రాజేంద్ర సింగ్ చెప్పాడని ‘ది హిందు’ తెలిపింది.

స్థానిక రాజకీయనాయకులు ఈ దుర్ఘటన పైన గళం ఎత్తారు. పసిపాపల పైన అసహజ రీతిలో అత్యాచారం జరిగిందని తెలిసాక భండారా జిల్లాలో స్వల్పంగా ఉద్రిక్త పరిస్ధితులు నెలకున్నాయి. బాలికలు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారని పోలీసులు చెప్పడం, అది నిజం కాదని పోస్టుమార్టంలో తేలడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. లఖాని, ముర్మడి గ్రామాలతో పాటు పరిసర గ్రామాల నుండి వేలాది ప్రజలు బుధవారం ఆరవ నెంబరు జాతీయ రహదారి పైకి చేరి ఆరు గంటలపాటు రాస్తా రోకో నిర్వహించారు. రాజకీయ పార్టీలు భండారా జిల్లా బందుకు పిలుపునిచ్చారు.

అమానుష క్రీడకు సాక్షి ఈ బావి

అమానుష క్రీడకు సాక్షి ఈ బావి

పసి పాపలు ఐదు సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయారు. వారి తల్లి, తాత, నాయనమ్మల వద్ద పెరుగుతున్నారు. ఇళ్ళలో పాచి పని చేసి పిల్లలను సాగుతున్న ఆ తల్లి ముగ్గురు పిల్లలు దూరం కావడంతో గర్భ శోకంతో తల్లడిల్లుతోంది. తల్లి పనికి వెళ్లడంతో పిల్లలు ఆకలిని తీర్చుకునే క్రమంలో దుండగుల వలలో చిక్కుకుని ఉండవచ్చని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. ప్రజల రాస్తారోకో తో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక బృందాలను నియమించి దోషులను వెతుకుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర హోమ్ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ బాధితుల తల్లిని స్వయంగా కలిసి ఓదార్చినట్లు పత్రికలు తెలిపాయి.

కేంద్ర కేబినెట్ లో కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని దాని ఫలితంగానే 10 లక్షల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని జీ న్యూస్ తెలిపింది. ప్రజలు శాంతం వహించాలని ముఖ్యమంత్రి చవాన్ కోరాడు. “ఈ ఘటన అత్యంత గర్హనీయం, బాధాకరం. శాంతం వహించి చట్టం అమలు చేయడానికి సహకరించాలని కోరుతున్నాను” అని ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ కోరినట్లు జీ న్యూస్ తెలిపింది. సంఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్ తెలిపాడు.

అయితే బాలికల తల్లి ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం తనకు వద్దని చెప్పేసింది. ఆ డబ్బు ఉపయోగించి తన కూతుళ్లను తనకు కాకుండా చేసిన దుర్మార్గులను పట్టుకోవాలని, వారిని నడి బజారులో ఉరి తీయాలని కోరుతోంది. తాను ఫిర్యాదు చేసిన రాత్రే పోలీసులు వెతికినట్లయితే తన పిల్లలు దక్కేవారని ఆమె ఆక్రోశించింది. “పోలీసులు మా ఫిర్యాదుని అసలు సీరియస్ గా తీసుకోలేదు. రెండు రోజుల వరకు వారు ఏమీ చేయలేదు” అని ఆమె ఆరోపించిందని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ తెలిపింది.

“మా మనవరాళ్లు ఇంటికి రాకపోవడంతో ఫిబ్రవరి 14 తేదీన ఊరంతా వెతికాను. రాత్రి 9 గంటలకి లఖాని పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేశాము. కానీ మా ఫిర్యాదుని ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 1:30కి మాత్రమే నమోదు చేశారు” అని బాలికల తాత చెప్పాడని ది హిందు తెలిపింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు లఖాని పోలీసు స్టేషన్ ప్రధాన అధికారి ప్రకాష్ ముండేను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్.పి ఆరతి సింగ్ తెలిపింది. పది బృందాలను నియమించి నిందితులను వెతుకుతున్నామని ఆమె తెలిపింది.

4 thoughts on “పాలుగారే పసికూనలు వాళ్ళు; అత్యాచారం చేసి చంపేశారు

  1. <>

    రాజ్యం ఎవరి ప్రయోజనాలకోసం ఉందో ఇలాంటి సంఘటనలు నిత్యం గుర్తు చేస్తుంటాయీ వ్యవస్థలో. తనకు నష్టపరిహారం వద్దని , ఆ మొత్తాన్ని తన బిడ్డలను తనకు కాకుండా చేసిన వారిని పట్టుకోవడానికి ఉపయోగించాలని ఆ తల్లి చెప్పడం డబ్బుతో మనిషి విలువను కట్టలేమని , ప్రభుత్వాల అసమర్ధతను తెలియజేస్తుంది. ఇలాంటి అకృత్యాలకు ఒడిగట్టే వాళ్లను పశువులతో పోల్చితే పశువులను అవమానించినట్లే. ఇలాంటి అవస్థలతో ఉండే ఈ వ్యవస్థలో మార్పుకోసం సంఘటిత పోరాటాలే మార్గం.

  2. వ్యవస్థ లో మార్పులు మానవులలో మృగత్వాన్ని మటు మాయం చేస్తాయనుకోవడం అత్యాశే ! అత్యంత హేయమైన ఈ పని చేసింది మనుషులే కదా !

  3. వ్యవస్థలు మనుషుల్లోని మృగత్వాన్ని నాశనం చేస్తాయనుకోవడం అత్యాశే…కావచ్చు కానీ, కింది స్థాయి పౌరుల బాధ్యతను, రక్షణను పట్టించుకోని దుస్థితిలో పాలకులు ఉన్నపుడు అలా ఆశించడం తప్ప మరో మార్గం లేదు.
    వ్యవస్థలు మనుషుల మృగత్వాన్ని నాశనం చేస్తాయా ? అవునో, కాదో చెప్పలేకున్నా… కొన్ని వ్యవస్థలు మనుషుల్ని సరైన మార్గంలో నడిపించేందుకు, మరో మనిషి హింస, దోపిడీ నుంచి రక్షణ కల్పించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటాయి.

    సాధారణ ప్రజలు రాజ్యాధికారం చేజిక్కించుకున్న రోజు, పాలనా విధానాలు అందరికీ సమానంగా అమలైన రోజే వీటికి పరిష్కారం లభిస్తుంది. అది ఎలాగన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s