సమయస్ఫూర్తి ఆ అమ్మాయిని కాపాడింది…


ది హిందు

ది హిందు

ఢిల్లీ బస్సులో జరిగిన ఘోరం లాంటిది తృటిలో తప్పిపోయింది. చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రే, మొబైల్ ఫోన్, అన్నింటికీ మించి ఆమె సమయస్ఫూర్తి… వెరసి ఇంకో అఘాయిత్యం జరగకుండా అడ్డుకున్నాయి. హైదరాబాద్ సైతం అమ్మాయిలకు క్షేమకరం కాని నగరాల జాబితాలో ఉన్నదని నిరూపిస్తున్న ఈ ఘటనలో 22 సంవత్సరాల యువతి కిడ్నాప్ వల నుండి బైటికి దుమికి తప్పించుకుంది. ఇతర ప్రయాణీకులు అందరూ తమ తమ స్టేజీలలో దిగిపోయాక ఒంటరిగా దొరికిన అమ్మాయిని ఏం చేయదలుచుకున్నారో గానీ, ఆటో డ్రైవర్ తో పాటు ఇద్దరు దుండగులు వేగంగా సందు, గొందుల్లో ఆటోని పరుగెత్తించి చాటు మాటు కోసం వెతుకుతుండగా ప్రమాదాన్ని పసిగట్టిన అమ్మాయి తనను బంధించడానికి వెనక్కి వచ్చిన దుండగుడిపై పెప్పర్ స్ప్రే జల్లి, ఆటో నుండి బైటికి దూకి, మరో భద్రమైన చేతుల్లోకి గాయాలతో చేరుకుని, నేరుగా ఆసుపత్రిలో తేలింది. ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆగంతకులను పోలీసులు అరెస్టు చెయ్యడం విశేషం.

సినిమా దృశ్యాన్ని తలపిస్తున్న ఈ ఉదంతం హైదరాబాద్, మాదాపూర్ ఏరియాలో మంగళవారం రాత్రి జరిగింది. ఆ అమ్మాయి మహారాష్ట్ర లోని బిట్స్ (పిలాని) కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఒక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ప్రాజెక్టు వర్క్ చేస్తోంది. నారాయణ గూడలో నివసిస్తున్న అమ్మాయి మంగళవారం సాయంత్రం 7:45 ప్రాంతంలో మాదాపూర్ లోని L’Oreal బ్యూటీ పార్లర్ నుండి బైటికి వచ్చింది. అమీర్ పేటలోని మైత్రీవనం వెళ్లడానికి అయ్యప్ప సొసైటీ వద్ద షేరింగ్ ఆటో ఎక్కింది. యూసఫ్ గూడ చేరుకునే సరికి అమ్మాయి ఒక్కరే ఆటోలో మిగిలిపోయింది.

ఇతర ప్రయాణీకులు దిగిపోయిన తర్వాత ఆటో డ్రైవర్, అతని పక్కనే కూర్చొని ఉన్న మరొక వ్యక్తి ఆటోను గచ్చిబౌలి వీధుల వెంట వేగంగా తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. హైదరాబాద్ తో పెద్దగా పరిచయం లేకపోయినా, పదే పదే రోడ్లు మార్చుతూ, సందు, గొందుల్లో వెతుకుతున్నట్లు కనిపించిన వారి ధోరణితో ఏదో ప్రమాదం ముంచుకొచ్చిందని ఆ అమ్మాయి పసిగట్టింది. వెంటనే ఆమె తన బుర్రకి పని పెట్టడం ప్రారంభించింది. మొబైల్ ఫోన్ తీసి తన స్నేహితురాలికి ‘తాను కిడ్నాప్’ కి గురవుతున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేసింది. అమ్మాయి ప్రయత్నాలు గమనించిన డ్రైవర్ పక్క వ్యక్తి ప్రయాణీకులు కూర్చొనే సీటు మీదికి లంఘించాడు. ఆమెను ఫోన్ చెయ్యకుండా అడ్డుకోవడానికీ, ఆమె కదలకుండా సీటుకి అదిమిపెట్టి ఉంచడానికి ప్రయత్నించాడు. ఈసారి ఆమె మరో ఆయుధం బైటికి తీసింది. అదే పెప్పర్ స్ప్రే. స్ప్రే ని అతనిపై జల్లి అతను కోలుకునే లోపు ఆటో నుండి బైటికి దూకేసింది. ఆమె దూకిన చోటు మాదాపూర్ లోని డి.ఎల్.ఎఫ్ బస్ స్టాపుకి దగ్గర.

ది హిందు

ది హిందు

తమ పక్కనే వెళుతున్న ఆటో నుండి ఉన్నట్లుండి ఒక అమ్మాయి బైటికి దూకడంతో రోడ్డు పై వెళుతున్నవారు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. వారిలో విప్రో కంపెనీలో పని చేస్తున్న నవీన్ ఒకరు. టూవీలర్ పై ప్రయాణిస్తున్న నవీన్ ఆటోను వెంబడించడానికి విఫలయత్నం చేశాడు. కానీ వారు అప్పటికి తప్పించుకోగలిగారు. నవీన్ వెనక్కి వచ్చి ఇతరులతో కలిసి అమ్మాయిని దగ్గరలోనే ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. “ఆమె చాలా ధైర్యవంతురాలు. తెలివైనది కూడా. ఆబోతును దాని కొమ్ములనే పట్టి నిలువరించింది. భయభ్రాంతురాలు కావడం మాని, సమయస్ఫూర్తితో స్పందించడంతో తనను తాను కిడ్నాపర్ల నుండి కాపాడుకోగలిగింది. గాయాలు అయితేనేం, ప్రమాదం నుండి బయటపడింది” అని వెస్ట్ జోన్ డి.సి.పి జి. సుధీర్ బాబు చెప్పాడని ది హిందు తెలిపింది.

“డ్రైవర్, అతని సహచరుడు ఆమెను కిడ్నాప్ చేయాలని భావించారు. ఆమె ఒంటరిగా ఉండడాన్ని అవకాశంగా తీసుకోవాలనుకుని రూటు మార్చారు. నిజానికి ఆమె అమీర్ పేటలో మైత్రీవనం వద్ద దిగాలి” అని పోలీసులు చెప్పారు. అమ్మాయికి హైదరాబాద్ తెలియదు. ఐనా వేగంగా పోవడం, రూట్లు మార్చడం ఆమెకు అనుమానం తెప్పించిందని పోలీసులు చెప్పారు. గట్టిగా అరుస్తే చంపేస్తామని కూడా వారు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ లోపు ఆమె స్నేహితురాలు నార్త్ జోన్ డి.సి.పి సి.హెచ్.శ్రీకాంత్ కి ఫిర్యాదు చెయ్యడంతో ఆయన సుధీర్ బాబును అప్రమత్తం చేశారు.

అమ్మాయి మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమె అమీర్ పేట ఆసుపత్రిలో ఉన్నట్లు కనుగొన్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. కిడ్నాప్ ప్రయత్నం కేసు నమోదు చేసి నిందితులను వెతకడానికి పెద్ద ఎత్తున ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మాదాపూర్ లోని రెండు జంక్షన్ల వద్ద నెలకొల్పిన సర్వైలెన్స్ కెమెరాల వీడియో ఫుటేజీ ద్వారా ఆటోను కనిపెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. 24 గంటల్లోనే ఫలితం సాధించారు. బుధవారం నాటికి ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఒక కాల్ సెంటర్ ఉద్యోగి అయిన 28 సంవత్సరాల బితిన్ కుమార్, ఆటో డ్రైవర్ ఎ.జంగయ్య లను నిందితులుగా విలేఖరుల ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వారి నుండి అమ్మాయికి చెందిన బ్యాక్ పాక్, మొబైల్ ఫోన్, పర్సు లను స్వాధీనం చేసుకున్నారు. “మేము మత్తులో ఉన్నాము. ఇతర ప్రయాణికులు దిగిపోయాక అమ్మాయి ఒంటరిగా ఉండడంతో కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నించాము” అని ప్రెస్ కాన్ఫరెన్సులో బితిన్ కుమార్ విలేఖరులకు తెలిపాడు. “వారు అమ్మాయికి హాని చేసి ఉండేవారు. తనతో తెచ్చుకున్న పెప్పర్ గన్ ని ఉపయోగించి డి.ఎల్.ఎఫ్ బస్ స్టాప్ దగ్గరలో ఆటో నుండి బైటికి దూకి బతికిపోయింది” అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

కీలక క్లూ ఇచ్చిన నవీన్

అమ్మాయి ఆటో నుండి బైటికి దూకడంతో అప్రమత్తమై ద్విచక్ర వాహనం పై ఆటోను వెంబడించిన నవీన్, ఆటోను గుర్తించడానికి కీలకమైన క్లూ అందించినట్లు తెలుస్తోంది. ఆఫీసు నుండి ఇంటికి వస్తున్న నవీన్ ఆటోని పట్టుకోవడానికి విఫలయత్నం చేసి అనంతరం గాయపడి ఉన్న అమ్మాయిని ఆసుపత్రికి తరలించాడు. వేగంగా దూసుకుపోతున్న ఆటోను చూశానని నవీన్ చెప్పడంతో అతని మాటల ఆధారంగా మాదాపూర్

ది హిందు

ది హిందు

పోలీసులు సర్వైలెన్స్ కెమెరాలు రికార్డు చేసిన వీడియోలో ఆటోలను చూపగా అతను గుర్తించినట్లు తెలుస్తోంది. బ్లూ రంగు టాప్ ఉన్న ఆటోని నవీన్ గుర్తించాక దానిని పోలీసులు సమీపం నుండి పరిశీలించి ఇటీవల విడుదల అయిన మిర్చి సినిమా టైటిల్ దానిపై ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు తేలిక అయింది.

ఆధునిక నగరాలు అమ్మాయిలకు ప్రమాదకరంగా ఉండడం కొనసాగుతోందని హైదరాబాద్ ఘటన మరోసారి చాటి చెప్పింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ఇచ్చిన ప్రకటన ప్రత్యేకంగా గమనార్హం. “హై టెక్ సిటీలో స్థానిక ఐ.టి కంపెనీల సహకారంతో 4 కోట్ల ఖర్చుతో ప్రత్యేకమైన సర్వైలెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ పోలీసులు చెప్పి ఎంతో కాలం కాలేదు. అది ఎక్కడుంది? అమెరికా మరియు యూరోపియన్ క్లయింటుల కోసం అనువుగా ఉండే విధంగా మాదాపూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పని గంటలను, పని పరిస్ధితులను మార్చేశారు. కానీ భద్రమైన ప్రజా రవాణా వ్యవస్థ మాటేమిటి? ఆటో డ్రైవర్లు పేర్లు, ఫొటోలు, ఐడి నంబర్లు ప్రదర్శించడం తప్పనిసరి చేయాలి” అని సంధ్య అన్నట్లు ది హిందూ తెలిపింది.

“ఔటర్ రింగ్ రోడ్, ఎక్స్ ప్రెస్ హైవే తదితర మెగా ప్రాజెక్టులు వచ్చాక నగర పరిసరాలు మరింతగా ఒంటరి ప్రాంతాలుగా మారుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రోడ్లు వారికి అబద్రతగా మారుతున్నాయి. సమర్ధవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం వలన ప్రైవేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తోంది” అని మరో మహిళా కార్యకర్త సజయ చెప్పిన మాటలు కూడా పరిగణించాల్సి ఉంది. శారీరక, మేధో శ్రమలను సొమ్ము చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఆ శ్రమను అందించేవారికి తగిన సౌకర్యాలు కల్పించడంలో కంపెనీలకు లేకపోయింది. నిజానికి అలాంటి సౌకర్యాలు కల్పించే ఖర్చు తగ్గించుకోవడానికే అనేక కంపెనీలు అమెరికా, యూరప్ లనుండి ఇండియా, చైనా లాంటి చోట్లకు తరలి వస్తున్నాయి. కనుక లోపం ఎక్కడ ఉన్నదీ స్పష్టమే.

8 thoughts on “సమయస్ఫూర్తి ఆ అమ్మాయిని కాపాడింది…

 1. ఇలాంటి సంఘటనల వలన ఈ కార్మికులు, కూలీ నాలీ చేసుకుని బ్రతికే వాల్లు, డ్రైవర్లు, క్లీనర్లు మొదలైన వారి మీద ఉన్న సానుభూతి పోతుంది. వాళ్లంటేనే భయం వేస్తుంది.

  ఒక సారి మా మామయ్య కూతురి స్కూల్ ఆటొ డ్రైవర్ తన దిద్దులు, గొలుసు కాజేశాడు. అడుగుదామని మా మామయ్య వాళ్ల ఇల్ల దగ్గరకు వెళితే వాళ్లందరూ కలసి మామయ్య మీద తిర్గబడ్డారు. వాళ్ల కాలనీ కి వెళ్లాలంటేనే అక్కడి జనాలకి భయం. అలాంటిది ఆ కాలనీ వాడికి స్కూల్ డ్రైవర్ ఉద్యోగం ఎలా ఇచ్చారో కానీ… చివరకి పోలీసుల కంప్లయింట్ వలన తను తీసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేశాడు. ఆ స్కూల్ వాళ్లు తనని ఉద్యోగం లో నుంచి తీసేశారు. తరువాత వాడు తాగి మా మామయ్య ఇంటి మీద కు వచ్చి, వాళ్లు కంప్లయింట్ ఇవ్వటం వల్లనే తన ఉద్యోగం పోయిందని 500/- అడిగాడు. వాళ్ల కాలనీ లో కొందరి కుర్రాళ్ల సపోర్ట్ ఒకటి మళ్లీ. ఆ కాలనీ లో అపర్ట్మెంట్లు పడటం వల్ల వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. లేకపోతే ఇలాంటివి చాలా జరిగేవి.

  ఇలాంటి వాళ్లంటేనే భయం వేస్తుంది. Why does this happen in India only sir?

 2. @Sireesha, @ venkat

  ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు నేర ప్రవృత్తితో వ్యవహరించారని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లందరినీ నేరస్ధులుగా మీరు ముద్ర వేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ లెక్క ప్రకారం లక్షల కోట్లు కుంభకోణాలు చేస్తున్న మంత్రులు, ఐ.ఎ.ఎస్ అధికారులను చూపి ఉన్నత స్ధాయి మంత్రులు, అధికారులు అందరూ దొంగ వెధవలే అని చెప్పాల్సి ఉంటుందేమో! దిద్దులు, గొలుసు కాజేస్తేనే ఆటో ఎక్కడానికి భయపడితే లక్షల కోట్లు కాజేస్తున్న గొప్పవారిని చూసి ఈ దేశంలో బతకడానికి ఇంకెంత భయపడాలో గదా?

  కాయకష్టం చేసేవాళ్లు చూడడానికి చిరాకుగా ఉంటారని ఈసడించుకోవడం చాలా ఘోరం. ఇతరుల కష్టంపై ఆధారపడడం మానేసి మనమే కష్టం చేయాల్సిన పరిస్ధితులు వస్తే, అప్పుడు చూడాలి మనం ఎదుటివారికి కలిగించే చిరాకు ఏ స్ధాయిలో ఉంటుందో. ఇకనుండి ఆటోలు ఎక్కడం మాని నడిచివెళ్లడం గానీ, బస్సుల్లో పడి, పడి వెళ్లడం గానీ చేసినా చాలు ఆ చిరాకు ఎంత అన్యాయమో అర్ధం కావటానికి.

  సమాజంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి వస్తువుకి శ్రమే కారణం. వస్తువులు తయారు చెయ్యడం గొప్ప గానీ, అనుభవించడం కాదు. అలాంటి శ్రమ జీవులని ‘ఆటో డ్రైవర్లను’ అడ్డు పెట్టుకుని దులపరంగా మాట్లాడుతున్న మీరు ఎంత అందంగా ఉంటారో, కాయ కష్టం చేశాక ఆ అందం ఎంతగా ద్విగుణీకృతం అవుతుందో నాకు చూడాలని ఉందంటే, ఆ కోరికను అన్యధా భావించవలదని విన్నవించుకుంటున్నాను.

 3. అవును కదా శేఖర్ గారు.
  హైదరాబాద్ లో కొన్ని వందల ఆటోలు ఉన్నాయి. రోజూ వేలాది మంది ప్రయాణిస్తూనే ఉంటారు. అందరూ ఇలాగే చేయడం లేదు కదా.
  నేర ప్రవృత్తిని కొన్ని ప్రాంతాలకు లేదా కొన్ని వృత్తులకు పరిమితం చేయడం సమంజసం కాదు.

  ఆడవాళ్లని ( లైంగింకంగా ) వేధించడం కేవలం చదువులేని వాళ్ళు, కాయకష్ఠం చేసేవాళ్లు మాత్రమే చేస్తారనుకుంటే అమాయకత్వం, అంతకు మించిన అహంకారం తప్ప మరోటి కాదు.
  పేద అమ్మాయిలను వంచించి , వేశ్యాగృహాలకు సరఫరా చేసిన వాళ్లలో… సంపన్న వర్గాలు,
  రాజకీయ నాయకులు, మంత్రులు కూడా లేకపోలేదు. ఆఖరుకు ఓ గవర్నర్ పైన
  కూడా ఆరోపణలున్న సంగతి అందరికీ తెలిసిందే కదా..

 4. Prejudice-preconceived opinion that is not based on reason or actual experience.

  పల్లెటూర్లలో తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఒక నేరం చేస్తే అతన్ని ఆ కులం పేరు పెట్టి నిదించడమే కాకుండా, ఆ నేరం చేసే గుణాన్ని ఆ కులం లోని మిగతా అందరికి కుడా ఆపాదిస్తారు. అదే ఎక్కువ కులం లోని వారు ఎవరైనా నేరం చేస్తే, ఆ నేరానికి ఆ వ్యక్తిది తప్పంటారు గాని, ఆ కులం లోని వాళ్ళందరూ అలంటి వాళ్ళే అని అనరు.
  ఇదే పద్ధతి సామాజిక హెచ్చు తగ్గుల నుంచి నుంచి ఆర్ధిక హెచ్చుతగ్గులకు కు కుడా పాకినట్లు ఉంది. దొంగతనం చేసింది ఆటో డ్రైవర్ లు కాబట్టి, ఆ వృత్తి చేసే వాళ్ళందరూ ఇంతే అనే అభిప్రాయం వచ్చింది. ఇదే దొంగతనం ఒక సాఫ్ట్ వేర్ జాబ్ చేసే వాళ్ళో, బ్యాంకు లో పని చేసే వాళ్ళో చేసి ఉంటె, ఆ పని చేసిన వ్యక్తిని దొంగ అనే వాళ్ళు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులు లేదా బ్యాంకు ఉద్యోగస్తులు అందరూ దొంగలే అనే అభిప్రాయం వచ్చేది కాదు.
  పోతే మీరు అందం గురించి వ్రాసిన కామెంట్ కుడా సరియినది అనిపించలేదు. బతకడానికే కష్ట పడుతున్న బీద వాళ్ళు, శుబ్రత మీద తగినంత శ్రద్ద తీసుకొనే సమయం గాని, డబ్బు గాని ఉండవు. కాని దానికి అందం తో ఏమి సంభందం లేదు.

 5. చంద్ర గారు అందం గురించి మీ అభిప్రాయమే నా అభిప్రాయమూను. “అసలు వాళ్లను చూడడానికే చిరాకుగా ఉంటారు” అన్న వ్యాఖ్యాత వ్యాఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆ అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ అది రాసాను. అది నా అభిప్రాయం కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s