జలియన్‌వాలా బాగ్: క్షమాపణకు బ్రిటిష్ ప్రధాని నిరాకరణ


జలియన్‌వాలా బాగ్ స్మారక చిహ్నం వద్ద బ్రిటిష్ ప్రధాని కామెరూన్ (ఫొటో: బి.బి.సి)

జలియన్‌వాలా బాగ్ స్మారక చిహ్నం వద్ద బ్రిటిష్ ప్రధాని కామెరూన్ (ఫొటో: బి.బి.సి)

అమృత్ సర్ లోని జలియన్‌వాలా బాగ్ ను సందర్శించిన బ్రిటిష్ ప్రధాని కామెరూన్ నాటి మారణకాండకు క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించాడు. మాజీ బ్రిటిష్ ప్రధాని చర్చిల్ చెప్పినట్లే మొక్కుబడిగా విచారం ప్రకటించి ఊరుకున్నాడు. కుంటిసాకులు చెప్పి క్షమాపణ చెప్పడానికి నిరాకరించాడు. తాను బ్రిటన్ దేశ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి అన్న విషయం మరిచి ‘జలియన్‌వాలా బాగ్ దుర్మార్గం’ జరిగినప్పటికి తాను అసలు పుట్టనే లేదని అసందర్భ వ్యాఖ్యలు చేసి తప్పించుకున్నాడు. హిల్స్ బరో ఫుట్ బాల్ స్టేడియం తొక్కిసలాటకు బ్రిటిష్ అధికారులు ప్రతిస్పందించిన పద్ధతికి, ఉత్తర ఐర్లండ్ లో బ్రిటిష్ సైన్యాలు సాగించిన అకృత్యాలకు క్షమాపణలు చెప్పిన కామెరూన్, జలియన్‌వాలా బాగ్ దురాగతానికి అపాలజీ చెప్పాలన్న డిమాండ్ ను తిరస్కరించడం భారత ప్రజల పట్ల ఆయనకి ఉన్న తృణీకార భావనకు చిహ్నంగా భావించాలి.

భారత దేశ ప్రజలు శతాబ్దాల పాటు సాగించిన స్వాతంత్రోద్యమంలో జలియన్‌వాలా బాగ్ దురంతం ఒక చీకటి అధ్యాయం. ఏప్రిల్ 1919లో జలియన్‌వాలా బాగ్ పార్కులో శాంతియుతంగా సమావేశం అయి ఉన్న నిరాయుధ ప్రజలను బ్రిటిష్ సైనికులు నలువైపులా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో వందల మంది చనిపోగా 1200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 379 మంది చనిపోయారని బ్రిటిష్ ప్రభుత్వం వాదిస్తే 1000కి పైగా చనిపోయారని భారత నాయకులు వెల్లడించారు. బ్రిగేడియర్ జనరల్ రెగినాల్డ్ డయ్యర్ ఈ అకృత్యానికి నాయకత్వం వహించాడు. బైటికి వెళ్ళే దారులు మూసేసి, ఎటువంటి హెచ్చరికలు చెయ్యకుండా సాగించిన ఈ ఘోరంపై అప్పట్లో దేశ వ్యాపితంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగి బ్రిటిష్ పాలకుల్ని గడగడలాడించాయి. ఈ దుర్ఘటనకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ ను అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వాలు నిరాకరిస్తూ వస్తున్నాయి.

తాను పుట్టడానికి 40 సంవత్సరాల ముందే జలియన్‌వాలా బాగ్ దుర్ఘటన జరిగిందని, కనుక “చరిత్రలో మళ్ళీ వెనక్కి వెళ్ళి క్షమాపణలు చెప్పవలసిన ఘటనల కోసం వెతకడం సరైంది కాదు” అని కామెరూన్ నీతి బోధ చేశాడు. “జరిగిన విషయం అంగీకరించడం, గుర్తు తెచ్చుకోవడం, జరిగినదానికి గౌరవం ప్రకటించి అర్ధం చేసుకోవడం మనం చేయవలసిన సరైన పని అని నేను భావిస్తున్నాను” అని కామెరూన్ వ్యాఖ్యానించాడు.

అయితే కామెరూన్ నీతి బోధ లోని డొల్లతనాన్ని బ్రిటిష్ పత్రికలు కూడా ఎండగట్టాయి. కామెరూన్ ప్రధానిగా క్షమాపణలు చెప్పుకున్న సందర్భాలను అవి గుర్తుకు తెచ్చాయి. 1989లో హిల్స్ బరో స్టేడియం వద్ద ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 96 మంది మరణించగా నెపాన్ని మ్యాచ్ చూడడానికి వచ్చినవారి పైకి నెట్టి నిర్వాహకులు తప్పుకున్నారు. అప్పటి విచారణ నివేదికలను 2012లో వెల్లడి చేయగా పోలీసులు, ప్రభుత్వాధికారులు సాక్ష్యాలు తారుమారు చేసి నేరం తమ పైకి రాకుండా చూసుకున్నారని, వారి నిర్వాకం వల్లనే తొక్కిసలాట జరిగిందని తెలిసి వచ్చింది. దీనితో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు రావడంతో కామెరూన్ వెనువెంటనే క్షమాపణలు చెప్పుకున్నాడు. అప్పుడాయన ఎప్పుడో 23 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రలో క్షమాపణలకు కారణాలు వెతకడం సరైంది కాదని హిత బోధకు దిగలేదు.

జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఊహాచిత్రం -ది టైమ్స్

జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఊహాచిత్రం -ది టైమ్స్

“బ్లడీ సండే” గా ప్రసిద్ధిగాంచిన 1972 నాటి ఉత్తర ఐర్లండ్ నరమేధం విషయంలో కూడా కామెరూన్ క్షమాపణలు చెప్పుకున్నాడు. జనవరి 30, 1972 తేదీన పౌరహక్కుల సంస్థల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన జరుగుతుండగా బ్రిటిష్ సైనికులు వారిపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరపడంతో 13 మంది చనిపోగా, 14 మంది గాయపడ్డారు. ప్రదర్శకులు కాల్పులు జరపడంతో సైన్యం స్పందించిందని చెబుతూ అప్పట్లో ప్రభుత్వం చెప్పి విచారణ చేయాలన్న డిమాండును తోసిపుచ్చింది. కానీ టోనీ బ్లెయిర్ ప్రధాని ఉండగా ‘బ్లడీ సండే’ కు దారి తీసిన కారణాలు విచారించాలని ‘సవిల్లే ట్రిబ్యునల్’ నియమించింది. 2010 జూన్ నెలలో సమర్పించబడిన సవిల్లే నివేదిక సైనికులను తీవ్రంగా తప్పు పట్టింది. ప్రదర్శకులు పెట్రోలు బాంబులు విసిరారని, రాళ్లు రువ్వారని చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. ఈ నివేదికను పత్రికలకు విడుదల చేస్తూ ప్రధాని కామెరూన్ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించాడు. సంఘటన జరిగి 38 సంవత్సరాలు గడిచాయి గనుక చరిత్రను తవ్వడంలో అర్ధం లేదని నీతి బోధలు ఆయన చేయలేదు.

అలాంటి కామెరూన్ జలియన్‌వాలా బాగ్ దుర్మార్గానికి వచ్చేసరికి చరిత్రలోకి వెళ్లనవసరం లేదని బోధించడం మరో దుర్మార్గంతో సమానం. భారత దేశంతో ‘ప్రత్యేక సంబంధాలు’ కోరుకుంటున్నట్లు భావోద్వేగాలు జత చేసి మరీ ప్రకటించిన కామెరూన్ భారత ప్రజల భావోద్వేగాలను పట్టించుకోడన్నమాట! ఆకాడికి అమృత్ సర్ వెళ్లవలసిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నకు జవాబు బ్రిటిష్ పత్రికలు చెప్పాయి. బ్రిటన్ లో పెద్ద సంఖ్యలో ఉన్న సిక్కుల ఓట్ల కోసమే ఆయన జలియన్‌వాలా బాగ్ సందర్శించాడని బిబిసి లాంటి పత్రికలు సూచించాయి. జలియన్‌వాలా బాగ్ ను ఇంతవరకు ఏ బ్రిటిష్ ప్రధానీ సందర్శించలేదు. ఆ పని తాను చేశానని చెప్పుకుని రానున్న ఎన్నికల్లో సిక్కుల ఓట్లకు గాలం వేయడానికే కామెరూన్ అమృత్ సర్ వెళ్లాడని ఇతర బ్రిటిష్ పత్రికలు సైతం ఘోషించాయి. అప్పటి దురాగతంలో మృతులైన వారి బంధువులను ఇంటర్వ్యూ చేసి బిబిసి ప్రచురించడం గమనార్హం. వారంతా కామెరూన్ ‘క్షమాపణలు’ చెప్పడానికి నిరాకరించడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. “సిగ్గుపడుతున్నాను” అని చెప్పటానికీ, బాధ్యత వహించి క్షమాపణలు చెప్పడానికీ చాలా తేడా ఉండని వారు స్పష్టం చేశారు.

‘సిగ్గుపడుతున్నామని” ప్రకటించడం వెనుక కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు ఉండవచ్చని కామెరూన్ పర్యటన సందర్భంగా బ్రిటిష్ పత్రికలు ప్రపంచానికి చాటిన ఒక చేదు నిజం. పత్రికలు చెప్పని, దాచి ఉంచే చేదు నిజాలు వేలు, లక్షలు ఉంటాయన్నది మరో చేదు నిజం.

2 thoughts on “జలియన్‌వాలా బాగ్: క్షమాపణకు బ్రిటిష్ ప్రధాని నిరాకరణ

  1. the west openly behaves in a biased way. And still we listen to them like anything. What if we stand on our own with our spines intact? Nobody is going to kill a nation of 1 billion. If we are right nothing can effect us.Our mindsets need a revolutionary change.
    They come, do their work for their betterment ,we submit knowingly. why cant we stand on our own feet? Are we afraid of? what is this policy of sort of submission?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s