(సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఛైర్మన్ కూడా అయిన జస్టిస్ మార్కండేయ కట్జు నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో పేరు సంపాదించాడు. బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర కోసం ముంబై బంద్ చెయ్యడం పైన ఫేస్ బుక్ లో వ్యాఖ్య చేసిన, లైక్ చేసిన ఇద్దరు యువతులపై ఐ.టి చట్టం ప్రయోగించడాన్ని బహిరంగంగా తప్పు పట్టి తద్వారా ధాకరే నివాళుల పర్వంలో బారులు తీరిన పత్రికల పతాక శీర్షికలను ఒక్కసారిగా ‘బావ ప్రకటనా స్వేచ్ఛ’ వైపుకి మళ్లించిన మార్కండేయ కట్జు, ఈసారి ప్రధాన మంత్రి పదవికోసం నరేంద్ర మోడి అభ్యర్థిత్వం చుట్టూ గుమికూడుతున్న బుద్ధి జీవులపై తన దాడి ఎక్కుపెట్టాడు.
గుజరాత్ లో 2002లో ముస్లిం ప్రజలపై సాగిన నరమేధంలో నరేంద్ర మోడికి పాత్ర ఉందని ఖచ్చితంగా తేల్చి చెబుతూ దేశ భవిష్యత్తును కాపాడాలని నేరుగా భారత ప్రజలకే విన్నవించుకోవడం ద్వారా కట్జు ఈ వ్యాసంలో అసాధారణ తెగువ ప్రదర్శించాడు. ఫిబ్రవరి 15, 2013 నాటి ‘ది హిందూ’ లో ప్రచురితమైన కట్జు వ్యాసానికి ఇది యధాతధ అనువాదం)
కష్టాలు చుట్టుముట్టి, గడ్డు పరిస్ధితిలో ఉన్న భారత జనాన్ని పాలు, తేనెలు పొంగి పొర్లే అద్భుత లోకాలకి తీసుకొని వెళ్ళే ‘ఆధునిక మోషె’గా అనేకమంది భారతీయులు నరేంద్ర మోడిని తమ భుజాలకు ఎత్తుకుంటున్నారు. తదుపరి ప్రధాన మంత్రిగా మోడియే తగిన వాడని చెబుతున్నారు. కుంభమేళా వద్ద కేవలం బిజెపి, ఆర్ఎస్ఎస్ సంస్థలు మాత్రమే ఈ సంగతి చెప్పడం లేదు. భారత దేశంలో ఉన్నత విద్యావంతులుగా చెప్పబడుతున్న అనేకమంది భారతీయులు, మోడి ప్రాపగాండాలో కొట్టుకుపోతున్న ఉన్నత చదువుల యువతలో అనేకమంది కూడా ఈ సంగతి చెబుతున్నారు.
ఈ మధ్య నేను ఢిల్లీ నుండి భోపాల్ కు విమానంలో ప్రయాణిస్తున్నాను. నా పక్కనే ఒక గుజరాతీ వ్యాపారి కూర్చొని ఉన్నాడు. మోడి పైన తన అభిప్రాయం ఏమిటని ఆయనను అడిగాను. ఇక ఆయన పొగడ్తల వర్షం కురిపించాడు. నేను మధ్యలో జోక్యం చేసుకుని 2002లో గుజరాత్ లో దాదాపు 2000 మంది ముస్లింలను చంపడం గురించి అడిగాను. గుజరాత్ లో ముస్లింలు ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారని, 2002 తర్వాత వారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచబడ్డారని, అప్పటి నుండి రాష్ట్రంలో ప్రశాంతత నెలకొన్నదని ఆయన బదులిచ్చాడు. అది శ్మశాన శాంతి అని, న్యాయంతో జత కలపకపోతే శాంతి ఎంతో కాలం నిలవదని నేను ఆయనతో అన్నాను. నా వ్యాఖ్యతో ఆయన చిన్నబుచ్చుకుని విమానంలో మరో సీటు చూసుకున్నాడు.
నేటి నిజం ఏమిటంటే, గుజరాత్ లో ముస్లింలు భయ భ్రాంతులై ఉన్నారు. 2002 నాటి ఘోరాలకు వ్యతిరేకంగా గొంతెత్తితే తమపై మళ్ళీ దాడులు జరుగుతాయని, మళ్ళీ బాధితులుగా మార్చుతారనీ వారు భయపడుతున్నారు. భారత దేశం మొత్తం మీద చూస్తే ముస్లిం ప్రజలు (20 కోట్ల మందికి పైగా వాళ్ళు ఉన్నారు) మోడిని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు (కొన్ని కారణాల వల్ల ఈ అభిప్రాయంతో విభేదించే కొద్ది మంది ముస్లింలు ఉన్నప్పటికీ).
‘ఐచ్ఛికత’ మోసపూరితం
గోద్రా రైలులో 59 మంది హిందువులను చంపినందుకు హిందువులు ఐచ్ఛికంగా ప్రతిస్పందించిన (ప్రతిక్రియ) ఫలితమే గుజరాత్ లో అలా జరగడానికి కారణమని మోడి మద్దతుదారులు చెబుతున్నారు. ఈ కధని నేను నమ్మడం లేదు. మొదటి విషయం, గోధ్రాలో నిజంగా ఏం జరిగింది అన్న విషయంలో ఇప్పటికీ మిస్టరీ దాగి ఉంది. రెండో విషయం, గోద్రా హత్యలకు కారకులైన నిర్దిష్ట వ్యక్తులను తప్పనిసరిగా గుర్తించి కఠినంగా శిక్షించాలి. కానీ ఈ గుజరాత్ లో మొత్తం ముస్లిం ప్రజలపై జరిపిన దాడిని ఇది ఎలా న్యాయబద్ధం చేయగలదు? గుజరాత్ మొత్తం జనాభాలో కేవలం 9 శాతం మాత్రమే ముస్లింలు, మిగిలిన వారంతా హిందువులే. 2002లో ముస్లింలను సామూహికంగా చంపేశారు. వారి ఇళ్లు తగులబెట్టారు. వారిపైన ఇతర అకృత్యాలు కూడా సాగించారు.
2002 నాటి ముస్లింల హత్యాకాండ ఐచ్ఛిక ప్రతిస్పందన అన్న వాదన 1938 నవంబరులో జర్మనీ లోని ‘క్రిస్టల్నాచ్’లో జరిగిన ఘటనను గుర్తుకు తెస్తోంది. నాజీల చేతుల్లో చిత్రహింసలకు గురయిన ఒక యూదు యువకుడు పారిస్ లోని జర్మనీ రాయబారిని కాల్చి చంపిన తర్వాత అప్పట్లో జర్మనీ వ్యాపితంగా యూదు ప్రజలందరి పైనా దాడులు జరిగాయి. అనేకమంది హత్య చేయబడ్డారు. వారి ‘సినొగోగ్’ లను తగులబెట్టారు. వారి షాపులపై పడి విధ్వంసం సృష్టించారు. అదంతా కేవలం జర్మనీ ప్రజల ‘ఐచ్ఛిక ప్రతిస్పందన’ అని నాజీ ప్రభుత్వం అప్పట్లో వాదించింది. కానీ వాస్తవం ఏమిటంటే నాజీ అధికారులు ఒక పధకం ప్రకారం హింసోన్మత్త గుంపులను రెచ్చగొట్టి నిర్వహించినదే ‘యూదు హత్యాకాండ.’
చారిత్రక పరిణామాల పరంగా చూస్తే, ఇండియా స్థూలంగా వలస వచ్చినవారితో నిండిన దేశం. దరిమిలా అద్భుతమైన వైవిధ్యం ఉన్న నేల, భారతదేశం. కనుక, భారత దేశాన్ని కలిపి ఉంచగల, దానిని ప్రగతి మార్గంలో ముందుకు తీసుకెళ్లే ఏకైక విధానం, సెక్యులరిజం –సకల మతాలు, తెగల ప్రజలను సమానంగా గౌరవించి వ్యవహరించే విధానం. ‘ద గ్రేట్ ఎంపరర్’ ఐన అక్బర్ విధానం ఇదే. మన దేశ వ్యవస్థాపక నాయకులు (పండిట్ నెహ్రూ మరియు ఆయన సహ నాయకులు) కూడా దానినే అనుసరించారు. గొప్ప లౌకిక రాజ్యాంగాన్ని వారు మనకు అందించారు. ఈ విధానాన్ని అనుసరిస్తే తప్ప, మన దేశం ఒక్క రోజు కూడా బతికి బట్ట కట్టదు. ఎందుకంటే అనేకానేక మతాలు, కులాలు, భాషలు, తెగల సమూహాలు విరివిగా ఉన్న వైవిధ్యం దానికి ఉన్నది.
కనుక, భారత దేశం కేవలం హిందువులకు మాత్రమే చెందిన దేశం కాదు. ముస్లింలకు, సిక్కులకు, క్రైస్తవులకు, పార్శీలకు, జైనులకు కూడా సమానంగా చెందిన దేశం అది. అంతే కాకుండా, హిందువులు మాత్రమే మొదటి తరగతి పౌరులుగా, ఇతరులు రెండవ, మూడవ తరగతి పౌరులుగా నివసించే దేశం కాదు భారతదేశం. అందరూ మొదటి తరగతి పౌరులే ఇక్కడ. 2002లో గుజరాత్ లో వేలాది మంది ముస్లింలను హత్య చేసి, వారిపై అనేక అత్యాచారాలు సాగించిన దుర్మార్గం ఎన్నటికీ మర్చిపోలేనిది, క్షమించరానిది. ఈ విషయంలో మోడి పైన ఉన్న మచ్చను అరేబియాలోని అత్తరులు అన్నీ తెచ్చి కడిగినా తుడిచివెయ్యలేము.
హత్యాకాండలో మోడి హస్తం లేదని ఆయన మద్దతుదారులు చెబుతారు. ఏ కోర్టు కూడా ఆయనను దోషిగా నిర్ధారించలేదని కూడా వారు వాదిస్తారు. మన న్యాయ వ్యవస్థ పైన వ్యాఖ్యానించడం నాకు ఇష్టం లేదు. కానీ 2002 నాటి గుజరాత్ ఘటనల్లో మోడి హస్తం లేదన్న కధనాన్ని నేను ససేమిరా అంగీకరించను. అంత భారీ స్ధాయిలో అత్యంత దారుణమైన ఘటనలు జరిగిన ఆ సమయంలో ఆయన గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటప్పుడు, వాటిలో ఆయన హస్తం లేదని చెబితే నమ్మగలమా? కనీసం నా వరకు తీసుకున్నా, అలా నమ్మడం అసాధ్యమని చెప్పగలను.
కేవలం ఒకే ఒక్క ఉదాహరణ చెప్పనివ్వండి. ఎహసాన్ జాఫ్రీ గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో చమన్ పురా లోకాలిటీలో నివసిస్తున్న గౌరవనీయుడైన పార్లమెంటు మాజీ సభ్యుడు. ముస్లింలు అత్యధికంగా నివసించే ‘గుల్బర్గ హౌసింగ్ సొసైటీ’లో ఆయన నివసిస్తుంటాడు. వయో వృద్ధురాలు అయిన ఆయన భార్య జకియా చెప్పగా రికార్డు చేసిన సాక్ష్యం ప్రకారం హింసోన్మాదులయిన గుంపులు ఫిబ్రవరి 28, 2002 తేదీన గ్యాస్ సిలిండర్లు తెచ్చి గుల్బర్గ హౌసింగ్ సొసైటీ సెక్యూరిటీ గోడలు పేల్చివేశారు. వాళ్ళు ఎహసాన్ జాఫ్రీని ఇంటినుండి బైటికి ఈడ్చుకొచ్చి బలవంతంగా బట్టలు ఊడపీకారు. కత్తులతో ఆయన చేతులు, కాళ్లు నరికేశారు. అనంతరం ఆయన బతికి ఉండగానే దహనం చేశారు. అనేకమంది ఇతర ముస్లింలను కూడా చంపి, వారి ఇళ్లను తగులబెట్టారు. చంపన్ పురా కి కేవలం కిలో మీటర్ దూరంలోనే ఒక పోలీసు స్టేషన్ ఉంది. అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం అక్కడికి రెండు కిలోమీటర్ల లోపే ఉంది. అక్కడ ఏం జరుగుతున్నదో ముఖ్యమంత్రికి తెలియదని చెబితే అది నమ్మశక్యమా? జకియా జాఫ్రీ అప్పటినుంచి, అత్యంత పాశవికంగా హత్యకు గురయిన తన భర్తకు న్యాయం చేయాలని కోరుతూ పరుగులు పెట్టని చోటు లేదు. (సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యం లేదని చెబుతూ అంతిమ నివేదిక సమర్పించిన నేపధ్యంలో) మోడీకి వ్యతిరేకంగా ఆమె దాఖలు చేసిన క్రిమినల్ కేసును జిల్లా కోర్టు బైటికి విసిరేసింది. కేవలం ఈ మధ్యనే (10 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత) ట్రయల్ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఆమె దాఖలు చేసిన ‘ప్రొటెస్ట్ పిటిషన్’ ను పరిగణించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కేసు ఇంకా న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున ఈ విషయంలో నేను మరింత ముందుకు వెళ్ళడం లేదు.
తాను గుజరాత్ ను అభివృద్ధి చేశానని మోడి చెప్పుకుంటున్నాడు. అందుకని ‘అభివృద్ధి’కి అర్ధం ఏమిటో పరిగణించవలసిన అవసరం వచ్చిపడింది. నా ఉద్దేశంలో ‘అభివృద్ధి’ అనే దానికి కేవలం ఒకే ఒక అర్ధం ఉంటుంది, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే ఆ అర్ధం. బడా పారిశ్రామిక కంపెనీలకు రాయితీలు ఇవ్వడం, వారికి భూములు, విద్యుత్తు అతి చౌకగా ఇవ్వడం… ఇలాంటివి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచకపోతే గనక, వాటిని అభివృద్ధిగా చెప్పడం చాలా కష్టం.
ప్రగతి సందేహాస్పదం
ఈ రోజు 48 శాతం గుజరాతీ పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం జాతీయ సగటు కంటే ఇది ఎక్కువ. గుజరాత్ లో, పసిపిల్లల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నది. మాతృ మరణాల రేటు కూడా ఎక్కువే. గిరిజన ప్రాంతాల్లోను, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాల్లోనూ ప్రజలు 57 శాతం దరిద్రంలో మగ్గుతున్నారు. ‘ది హిందు’ పత్రికలో ఇటీవల రామచంద్ర గుహ రాసిన ఆర్టికల్ లో (“ద మేన్ హు వుడ్ రూల్ ఇండియా”, ఫిబ్రవరి 8) చెప్పినట్లుగా వాతావరణ క్షయం అక్కడ పెరిగిపోతోంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. పిల్లల్లో పోషకాహార లోపం అసాధారణ స్ధాయిలో ఎక్కువగా ఉంది. గుజరాత్ లో మూడొంతులకు పైగా పెద్దవారికి శరీర ద్రవ్యరాశి సూచిక (body mass index) 18.5 కంటే తక్కువగా ఉంది (దేశంలో హీన స్ధాయిలో ఉన్న రాష్ట్రాల్లో ఏడో స్ధానం). 2010 నాటి యు.ఎన్.డి.పి నివేదిక అభివృద్ధికి సంబంధించిన బహుళ దిశల అంచనాలో –ఆరోగ్యం, విద్య, ఆదాయ స్థాయి మొ.వి- గుజరాత్ ను 8 వ స్ధానంలో ఉంచింది.
గుజరాత్ లో వ్యాపారులకు స్నేహ పూరిత వాతావరణాన్ని మోడి సృష్టించాడని వ్యాపారవేత్తలు భావిస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. కానీ భారత దేశంలో కేవలం వ్యాపారులు మాత్రమే ప్రజలా?
దేశం యొక్క భవిష్యత్తు గురించి భారతదేశ ప్రజలు నిజంగా పట్టించుకున్నట్లయితే ఈ అంశాలను పరిగణించాలని నేను విన్నవిస్తున్నాను. లేకపోతే, 1933లో జర్మన్లు చేసిన తప్పునే మళ్ళీ వాళ్ళు చేయవచ్చు.
First time I am visiting this site today. Excellent. As you said in Eenadu Chaduvu paper today, this site is very very useful to all students. Thank you very much..
Good to know this site today, As a civil service candidate it will be very useful to understand very easily about current affairs in telugu. Thanks
The article is ery good and some informative.But it is very brief. So more detailed article would be more useful in unveiling the real face of Mr. Narendra Modi.Anyhow thanks to Mr.Katzoo.