ఈ “చెడిపోయిన” సూర్యనెల్లి పిల్ల, మరో మహానది!?


జస్టిస్ ఆర్.బసంత్ -ది హిందూ

జస్టిస్ ఆర్.బసంత్ -ది హిందూ

కమల హాసన్ హీరోగా నటించిన మహానది సినిమా గుర్తుందా? సూర్యనెల్లి అత్యాచార బాధితురాలి సుదీర్ఘ న్యాయ పోరాటం కాస్త అటు ఇటుగా ఆ సినిమాను గుర్తుకు తెస్తోంది. కాకపోతే ఇక్కడ ఒక్క చెల్లెలే ఉంది తప్ప ఆమె తరపున పగ తీర్చుకునే హీరో అన్నయ్యే లేడు. అత్యాచారం చేసినవారు డబ్బు రాజకీయ పలుకుబడి ఉన్నవారయితే అత్యాచార బాధితులే ఎలా నేరస్థులుగా ముద్ర వేయబడతారో సూర్యనెల్లి సామూహిక అత్యాచారం ఒక సజీవ సాక్ష్యం. ప్రత్యేక కోర్టు 35 మంది అత్యాచార నిందితులకు విధించిన జైలు శిక్షలను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసిన అప్పటి కేరళ హై కోర్టు జడ్జి జస్టిస్ ఆర్.బసంత్, ఒక చానెల్ తో మూడు రోజుల క్రితం మాట్లాడుతూ అత్యాచార బాధితురాలి కేరక్టర్ ని నిందించాడు. జరిగింది ‘చైల్డ్ ప్రాస్టిట్యూషన్’ తప్ప అత్యాచారం కాదని అదీ కాక ‘ఆ పిల్ల చెడిపోయింది’ (deviant) అని వ్యాఖ్యానించి మహిళలపై తనకున్న వెనుకబాటు భావాలను వెళ్ళగక్కాడు.

నిందితులను నిర్దోషులుగా చెబుతూ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొద్ది రోజుల క్రితం రద్దు చేసి కేసును పునర్విచారణ చేయాలని తీర్పు చెప్పిన నేపధ్యంలో ఈ ‘పునర్విచారణ’ను ప్రభావితం చేసే దురుద్దేశంతోనే ఇప్పుడు రిటైర్ అయిన ఆర్.బసంత్ తాజా వ్యాఖ్యలు చేశాడని న్యాయ నిపుణులు కొందరు ఆరోపిస్తున్నారు. జడ్జి ఆర్.బసంత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ కృష్ణయ్యర్ కోరగా, బసంత్ కి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలయింది. తన మాటలను టి.వి జర్నలిస్టు రికార్డు చేస్తున్నట్లు తనకు తెలియదని, తాను ప్రైవేటుగా మాత్రమే మాట్లాడాననీ, రహస్య కెమెరాతో తన మాటలను రికార్డు చేశారనీ బసంత్ ఇస్తున్న వివరణ నమ్మదగిందిగా లేదని జస్టిస్ కృష్ణయ్యర్ తిరస్కరించాడు.

ఒకరు, ఇద్దరూ కాదు

పోలీసులకు దొరక్కపోయినా టి.విలో ప్రత్యక్షమైన ధర్మరాజన్ -ది హిందూ

పోలీసులకు దొరక్కపోయినా టి.విలో ప్రత్యక్షమైన ధర్మరాజన్ -ది హిందూ

1996లో కేరళ రాష్ట్రంలో 16 సంవత్సరాల బాలికపై 42 మంది కీచకులు నలభై రోజుల పాటు తమ బందీగా ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రాసిక్యూషన్ ప్రకారం ఇడుక్కి జిల్లాలో సూర్యనెల్లి అనే ఊరికి చెందిన 16 సంవత్సరాల బాలికను రాజు అనే పేరుగల కండక్టర్ జనవరి 16, 1996 తేదీన అటకాయించి, బెదిరించి (ది హిందు) లైంగికంగా ఉపయోగించుకున్నాడు. అనంతరం బాలికను మరో ఇద్దరు కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మద మృగాలకు అప్పజెప్పాడు. ఈ ఇద్దరిలో ఒకరు లాయర్ కూడా అయిన ప్రధాన నిందితుడు. ఆయన పేరు ధర్మరాజన్ అని తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి బాలికను మరింత మంది మద మృగాల కోరికలు తీర్చడానికి ఎరగా వేశారు. ఆ విధంగా ఒకరి తర్వాత మరొకరు చేతులు మారుతూ 42 మంది చెరలో 40 రోజుల పాటు బాలిక తన ఇష్టానికి వ్యతిరేకంగా గడపవలసి వచ్చింది. ఫిబ్రవరి 26, 1996 తేదీన మాత్రమే కిడ్నాపర్ల నుండి బాలిక విముక్తి పొందగలిగింది.

కేసును విచారించిన ప్రత్యేక కోర్టు 36 మందిని దోషులుగా నిర్ధారించి వివిధ కాలాల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సెప్టెంబర్ 6, 2000 తేదీన తీర్పు వెలువరించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, కిడ్నాపింగ్ నేరాలకు నిందితులు పాల్పడ్డారని స్పెషల్ కోర్టు నిర్ధారించింది. 42 మంది నిందితుల్లో పి.జె.కురియన్ (ప్రస్తుతం రాజ్యసభ ఉపాధ్యక్షుడు) కూడా ఒకరు. మొదటి నిందితుడు కండక్టర్ రాజు, రెండో నిందితురాలు ఉష లకు 13 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు మరో 4 సంవత్సరాలు అదనపు సాధారణ జైలు శిక్ష వేసింది. మూడో నిందితుడు ధర్మరాజన్ విచారణ సమయంలో పరారీ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసినప్పటికీ బెయిలు ఉల్లంఘించి మళ్ళీ పరారీలో ఉన్నాడు.

తనను నిర్దోషిగా చెప్పుకుంటున్న పి.జె.కురియన్ నిజానికి నిర్దోషి కాదని, అనేక ఒత్తిడులు తెచ్చి సాక్ష్యులను ప్రలోభ పెట్టి, సాక్ష్యాలను తారుమారు చేసి నిర్దోషిగా బయటపడ్డాడని ఆరోపిస్తూ ధర్మరాజన్ సోమవారం ఒక మళయాళం టి.విలో ప్రత్యక్షమై ఆరోపించడంతో సంచలనం రేగింది. ఢిల్లీ అత్యాచారం ఘటన పైన కన్నీళ్లు పెట్టుకున్న రాజ్య సభ సభ్యురాలు జయ బాధురి, వీరాలాపాలు పలికిన సోనియా, సుష్మా స్వరాజ్, మహిళల రక్షణే తమ ప్రధమ ప్రాధాన్యం అని ప్రకటించిన ప్రధాని మన్మోహన్ తదితర పెద్దలు, మహిళా నాయకురాళ్లు కురియన్ విషయంలో నేర సమానమైన మౌనం పాటిస్తున్నారు.

ప్రత్యేక కోర్టు నిందితులకు మూకుమ్మడిగా కఠిన శిక్షలు విధించినప్పటికీ బాధితురాలికి న్యాయం దక్కలేదు. కేరళ హై కోర్టు 2005 జనవరిలో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. కేవలం ఒక్కరినీ మాత్రమే –ధర్మరాజన్- దోషిగా తీర్పు చెప్పింది. అతని శిక్షను కూడా 5 సంవత్సరాలకు తగ్గించింది. బాధితురాలి తరపున నిలబడి న్యాయం చేయవలసిన ద్విసభ్య బెంచి (జస్టిస్ కె.ఎ.అబ్దుల్ గఫూర్, జస్టిస్ బసంత్) తిరిగి ఆమెనే తప్పు పడుతూ తీర్పు వెలువరించింది. బాధితురాలు వేశ్య కనుక జరిగింది అత్యాచారం కిందికి రాదని స్పష్టం చేస్తూ 35 మంది నిందితులకు విధించిన శిక్షలను రద్దు చేసింది.

కేరళ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం, బాధితురాలు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు జనవరి 31, 2013 తేదీన తీర్పు వెలువరిస్తూ హై కోర్టు తీర్పుపైన దిగ్భ్రాంతి ప్రకటించింది. అవసరమైన, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను హై కోర్టు పరిగణించలేదన్న పిటిషనర్ల వాదనలో నిజం ఉందని ప్రకటించింది. ధర్మరాజన్ మొదటి అప్పీలులోని సాక్ష్యాలను పట్టించుకోకుండా, రెండో అప్పీలులోని సాక్ష్యాలను మాత్రమే పరిగణించడం ద్వారా హై కోర్టు తప్పు చేసిందన్న కేరళ ప్రభుత్వ లాయర్ వాదనను అంగీకరించింది. 35 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన హై కోర్టు తీర్పును రద్దు చేసి కేసును హై కోర్టు తిరిగి విచారించాలని కోరింది. 35 మంది నిందితులు తిరిగి తాజాగా బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. తన తీర్పు నుండి ప్రభావితం కాకుండా నిందితుల బెయిలు దరఖాస్తులను హై కోర్టు పరిశీలించాలని కూడా సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచి (ఎ.కె.పట్నాయక్, జ్ఞాన సుధా మిశ్రా) ఆదేశించింది. ఆరు నెలలోపు విచారణ పూర్తి చేయాలని కోరింది.

పుచ్చిపోయిన భావజాలం

ఈ నేపధ్యంలో ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయ వాద వృత్తిని ప్రాక్టీసు చేస్తున్న జస్టిస్ ఆర్.బసంత్, బాధితురాలి గుణగణాలలో దోషం ఎత్తి చూపుతూ మాట్లాడిన మాటలు వార్తా చానెల్ లో ప్రసారం కావడం తీవ్ర కలకలం రేపింది. (బసంత్ మాటలను ఇక్కడ వీడియోలో చూడవచ్చు.) “ఆమెను బాలికా వేశ్యగా వాడుకున్నారు. బాలికా వేశ్యరికం (child prostitution) అనైతికమే గాని అత్యాచారం కిందికి రాదు… చూడండి, మామూలు అమ్మాయి కానటువంటి వ్యక్తి ఈమె. ఆ పిల్ల “చెడిపోయింది.” (oxford meaning of ‘deviant’ = diverging from usual or accepted standards, especially in social or sexual behavior) ఇదంతా జడ్జిమెంటులోనే ఉంది” అని బసంత్ వ్యాఖ్యానించాడు. 2005 నాటి తమ తీర్పు చదవకుండా వ్యాఖ్య చెయ్యడం సబబు కాదని ఆయన వాదించాడు. సుప్రీం కోర్టు కూడా తమ తీర్పు చదవకపోవడం వల్లనే దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని కూడా బసంత్ తీవ్రంగా వ్యాఖ్యానించాడు.

టి.వి చానెల్ లో తన మాటలు ప్రసారం కావడంతో విలేఖరికి సుద్దులు చెప్పడానికి బసంత్ సిద్ధపడ్డాడు. తన అనుమతి లేకుండా తన మాటలను రికార్డు చెయ్యడం మోసం అనీ, అనుచిత ప్రవర్తన అనీ వ్యాఖ్యానించాడు. జర్నలిస్టు వృత్తికి ఇది కళంకం అని మరో తీర్పు ప్రకటించాడు. జర్నలిజం వ్యాపారీకరణ సమస్త పరిమితులను ఉల్లంఘించిందని బాధపడ్డాడు. కెమెరా ఆఫ్ చేసిన తర్వాతే తాను మాట్లాడాననీ, ప్రైవేటుగా సంభాషించే ఉద్దేశంతో మాట్లాడిన మాటలను రహస్య కెమెరాతో రికార్డు చేశారని ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలు ఆయన విమర్శకులను సంతృప్తిపరచలేదు. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ కృష్ణ అయ్యర్ బసంత్ పై విరుచుకుపడ్డాడు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. బసంత్ వ్యాఖ్యలపై కేరళ వ్యాపితంగా నిరసనలు పెల్లుబుకాయి.

బాలికలను వేశ్యలుగా మార్చి వినియోగించడం లైంగిక అత్యాచారం కిందికి రాదని బసంత్ చెప్పడం మరింత ఆందోళనకరం. ప్రత్యేకంగా ఈ వాదనతోనే అనేకమంది న్యాయ నిపుణులు విభేదించారు. 16 సంవత్సరాల లోపు బాలికను ఆమె ఇష్టం ఉన్నా లేకపోయినా లైంగికంగా ఉపయోగించుకుంటే అది అత్యాచారం కిందికి వస్తుందని ఐ.పి.సి సెక్షన్ 375 స్పష్టంగా చెబుతున్నదనీ ఈ అంశాన్ని బసంత్ కావాలనే విస్మరిస్తున్నాడని వారు ఆరోపించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కేరళ రాష్ట్ర కార్యదర్శి బి.రాజేంద్రన్, బసంత్ వాదనలను తప్పు పట్టాడు. పునర్విచారణ చేయనున్న కేరళ హైకోర్టు డివిజన్ బెంచి ఆలోచనా దృక్పథాన్ని (మైండ్ సెట్) పభావితం చేసే దురుద్దేశంతో బసంత్ ఈ విధంగా వ్యాఖ్యానించాడని ఆయన ఆరోపించాడు. అసలు వేశ్యా వృత్తినే చట్టం నిషేధించగా బాలికను వేశ్యగా వినియోగించడం లైంగిక అత్యాచారం కాదని బసంత్ ఎలా చెబుతాడని ఆయన ప్రశ్నించాడు.

కేరళ హై కోర్టు లాయర్ కాళీశ్వరం రాజ్ ఈ బసంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ లేవనెత్తిన అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి. “బసంత్ వ్యాఖ్యలు అనేక విధాలుగా, తీవ్రంగా దురదృష్టకరం, సమర్థించలేనివి. బాధితురాలు జీవించి ఉన్న ఒక మనిషి అని ఆయన దృష్టిలో ఉంచుకోవాలి. అత్యంత క్రూరమైన తన గతంతో, గ్యారంటీ లేని భవిష్యత్తుతో ఆమె పోరాడుతోందని గమనంలో ఉంచుకోవాలి. మరే ఇతర వ్యక్తీ కోరుకోని జీవితాన్ని గడుపుతున్న ఒక బాధితురాలు ఆమె. అలాంటి వ్యక్తిపైన అలాంటి వ్యాఖ్యలు చాలా అన్యాయం” అని రాజ్ వ్యాఖ్యానించాడు. “సూర్యనెల్లి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మధ్య యుగాల నాటి స్త్రీ-పురుష సంబంధాలను, పిల్లల హక్కులను ప్రతిబింబిస్తున్నాయి. తీర్పులో వ్యక్తమైన ‘బాధితురాలు అంగీకరించే ఉంటుంది’ అన్న భావన, ఈ అంశంపై వెలువడిన అనేక సుప్రీం కోర్టు తీర్పులను తిరస్కరిస్తోంది” అని రాజ్ తెలిపాడు.

“సుప్రీం కోర్టు (హై కోర్టు) తీర్పును పక్కన పెట్టిన తరువాత, ఆ తీర్పును రచించినవారిలో ఒకరయిన బసంత్, ప్రైవేటు సంభాషణలలో కూడా తన తీర్పును న్యాయబద్ధంగా చెప్పి ఉండకూడదు. ఇక ఎంత మాత్రం ప్రైవేటు కానటువంటి అంశం పైన ఆయన మాట్లాడుతున్నాడు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత తన తీర్పు ఇక ఎంతమాత్రం ఉనికిలో ఉండదని ఆయన నిజాయితీగా అంగీకరించి ఉండాల్సింది… మహిళలపై హింసకు సంబంధించి మానవ హక్కుల ‘న్యాయశాస్త్ర మీమాంస’ (jurisprudence) లో ఇటీవలి సంవత్సరాలలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. దురదృష్టం ఏమిటంటే, మన న్యాయమూర్తులు ఒక విధమైన బందిఖానాలో నివసిస్తున్నారు. అక్కడ వినూత్న భావాలకు, ఆలోచనలకు ప్రవేశం ఖచ్చితంగా నిషిద్ధం. బహుశా ఈ కారణం వల్లనే బసంత్ తన వాదనలను ఇంకా గట్టిగా నమ్ముతున్నాడు” అని రాజ్ అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది.

ఢిల్లీ బస్సు సామూహిక అత్యాచారం కేసు దరిమిలా దేశంలో మహిళల వ్యక్తిత్వాలకు, హక్కులకు అనుకూలంగా కొద్దిపాటి స్ధాయిలో అయినా ఒక వాతావారణం ఏర్పడి ఉంది. ముఖ్యంగా ఢిల్లీ అత్యాచారంపై ఎన్నడూ లేని విధంగా పెల్లుబుకిన ప్రజాగ్రహం రోజుల తరబడిన ఆందోళనలకు దారి తీసిన తర్వాత దేశ వ్యాపితంగా న్యాయ, పోలీసు వ్యవస్థలలో సైతం ఏదో మేరకు మహిళల సమస్యల పట్ల సానుకూల ధోరణి కొత్తగా ప్రవేశించింది. లేదా ‘ఏమంటే, ఏమవుతుందో’ అన్న భయం అయినా చోటు చేసుకుని ఉంది. ఇది కూడా బసంత్ వ్యాఖ్యల్లో వీసమెత్తయినా కనిపించకపోవడం అత్యంత గర్హనీయం. మధ్య యుగాల నాటి పుచ్చిపోయిన భావజాలాన్నే పట్టుకుని బసంత్ ఇంకా వేలాడుతున్నాడని రాజ్ చేసిన విశ్లేషణ సరైనది.

17 యేళ్ళ నరకం

బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురు గడిపిన జీవితాన్ని నరకంగా అభివర్ణించారు. “గత 17 సంవత్సరాలు నరకప్రాయంగా గడిచాయి. బంధువులు, స్నేహితులు మమ్మల్ని బహిష్కరించారు. మా ఇద్దరు కూతుళ్లు బైట ప్రపంచంతో సంబంధాలు రద్దు చేసుకుని ఇంటికే పరిమితం కావలసి వచ్చింది. ఈ కాలమంతా వారు ఏ ఒక్క ఫంక్షన్ కి కూడా హాజరు కాలేదు. కనీసం చర్చికి కూడా వెళ్లలేదు. చిన్న కూతురు (బాధితురాలు) కి ఇల్లు, ఆఫీసు తప్ప మరో ప్రపంచం లేకపోయింది. టి.వి పైన కూడా తనకు ఆసక్తి లేకపోయింది” అని వారు తెలిపారు. ఘటన జరిగినపుడు సూర్యనెల్లిలో ఉన్న వారి కుటుంబం ఇరుగు పొరుగు ప్రవర్తనతో కొట్టాయం పట్నానికి తరలిపోయింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో వారికి పోయిన ప్రాణం తిరిగి లేచి వచ్చినట్లే అయింది. కానీ మళ్ళీ కేరళ హై కోర్టే విచారించాలన్న వార్త వారికి ఆశనిపాతం అయింది.

“ట్రయల్ కోర్టులో కేసు నడుస్తున్నపుడు మేము అనుభవించిన వ్యథ మాకు మాత్రమే తెలుసు” అని తల్లి వ్యాఖ్యానించింది. కేసు మళ్ళీ విచారణకు రావడం ఒకవైపు సంతోషం కలిగించినా, ఇప్పటికీ వరకూ తాము గడిపిన సాపేక్షక అజ్ఞాత జీవనం ఇక దూరం అవుతుందన్న ఆందోళన కూడా వారికి కలుగుతోంది. “మా కూతురు ఇంకా ఎన్నాళ్లు జనం దృష్టిలో నానాలో నాకు తెలియడం లేదు. ఆఫీసుకి వెళ్ళి ఆమెను కలతపరచవద్దని నేను మీడియాను కోరుతున్నాను” అని తండ్రి విన్నవించాడని ‘ది హిందూ’ తెలిపింది. ఉన్న బాధ చాలదన్నట్లు, క్లాస్ IV ఉద్యోగిని అయిన తమ కూతురు పైన అవినీతి ఆరోపణ రావడం కుటుంబాన్ని మరింతగా కుదిపేసింది.

కమర్షియల్ టాక్స్ ఆఫీసు లో ఉద్యోగిని అయిన బాధితురాలి పై అధికారులు ఇద్దరు ఆమెను ఒక అవినీతి కేసులో ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆరు రోజుల పాటు తమ కూతురుకి బెయిలు నిరాకరించారని, తొమ్మిది నెలల పాటు ఆఫీసుకి రానివ్వలేదని వారు తెలిపారు. మహిళా కార్యకర్తల ఆందోళన, మీడియా వెలుగు చూపిన నిజాల తర్వాతే తిరిగి ఉద్యోగం లోకి రానిచ్చారని తెలిపారు. “బంధువులు, కొంతమంది జనం విపరీత ధోరణిలో ప్రవర్తించినప్పటికీ, తమకు తోడు నిలిచినందుకు తాము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వారు కూడా అనేకమంది ఉన్నారని తెలిపారు. సిపిఎం నాయకుడు వి.ఎస్.అచ్యుతానందన్ కు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

“ఢిల్లీ సామూహిక అత్యాచారం జరగనట్లయితే మా కేసులో మరింత జాప్యం జరిగి ఉండేది” అని బాధితురాలి తండ్రి చేసిన వ్యాఖ్య ప్రస్తావనార్హం. “అమర వీరుల సమాధులు చూడడానికి నేను కొహిమా (రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దాడిని ప్రతిఘటించి తిప్పికొట్టిన యుద్ధంలో అమరులైన భారత సైనికులను పూడ్చిన సమాధులు) వరకు వెళ్ళి వచ్చాను. ఈ అమ్మాయిలను చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. తమ సోదరీమణులు ఈ రోజు ప్రశాంతంగా జీవించడానికి వీరంతా తమ జీవితాలనే పణంగా పెట్టారు కదా అని. వారు తమ జీవితాలను కోల్పోయారు. కానీ న్యాయం జరగనంతవరకు వారి బాధలకు అర్ధం ఉండదు” అని ఆయన మహిళా పోరాట వీరులకు నీరాజనంలు పలికాడు. చనిపోయిన తర్వాత కూడా మరింత మంది బాధితులు ‘తమకు తోడుగా నిలిచింది’ అన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తున్న జ్యోతి సింగ్ పాండే అమర జీవి అనడంలో సందేహం లేదు.

కోర్టు ధిక్కార పిటిషన్

కేరళ హై కోర్టులో మాజీ ఉద్యోగి అయిన ఎం.ప్రకాష్ , ఆర్.బసంత్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాడు. హై కోర్టులో తాను నిర్వహించిన పదవికే ఆయన అవమానం తెచ్చాడని, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశాడని, న్యాయ వ్యవస్థను నేరపూరితంగా ధిక్కరించాడని పిటిషన్ లో పేర్కొన్నాడు. పిటిషన్ స్వీకరణకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనుమతి అవసరం కావడంతో ఆయన వద్ద పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

పి.జె.కురియన్ పాత్ర

16 సంవత్సరాల బాలికను చెరపట్టి నలభై రోజులపాటు లైంగిక కోరికలు తీర్చుకోవడానికి వినియోగించుకున్నారని ఆరోపణలు ఎదుర్కున్న 42 మందిలో పి.జె.కురియన్ ఒకరు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని ప్రత్యేక కోర్టు వదిలి పెట్టింది. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పులో సైతం ఆయన బతికిపోయాడు. మిగిలిన 41 మందిలో ఒకరు చనిపోగా, మరొకరు ఎవరైంది గుర్తించలేదు. మిగిలిన 39 మందిపై పోలీసులు ఛార్జి షీటు నమోదు చేశారు. మళ్ళీ వారిలో 35 మందికి వివిధ కాలాల పాటు ట్రయల్ కోర్టు శిక్షలు విధించింది. మూడో నిందితుడు ధర్మరాజన్ తప్పించుకుని పారిపోయి కొద్ది రోజుల క్రితం టి.వి చానెల్ లో ప్రత్యక్షమై పి.జె.కురియన్ కూడా అమ్మాయిపై అత్యాచారం చేశాడని చెప్పడంతో ఆయన దోషిత్వం/నిర్దోషిత్వం మళ్ళీ మొదటికొచ్చింది.

రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ -ఎన్.డి.టి.వి

రాజ్య సభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ -ఎన్.డి.టి.వి

కొంత వివరంగా చూస్తే… ప్రత్యేక కోర్టు విచారణ సందర్భంగానే పోలీసులకు ధర్మరాజన్ దొరకలేదు. 60 రోజుల తర్వాత కర్ణాటకలోని గ్రానైట్ క్వారిలో పని చేస్తూ దొరికిపోవడంతో పట్టుకొచ్చి కోర్టులో హాజరు పరిచారు. ఆయనకి జీవిత ఖైదు శిక్ష విధించాక జులై 13, 2002 తేదీన పూజాప్పుర సెంట్రల్ జైలులో వేశారు. అయితే అక్టోబరు 25, 2002 తేదీన హై కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బైటికి వచ్చిన తర్వాత బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి తప్పించుకున్నాడు. ఆయన బెయిల్ లో ఉండగానే హై కోర్టు 35 మంది నిందితుల శిక్షలను రద్దు చేస్తూ ధర్మరాజన్ శిక్షను ఐదు సంవత్సరాలకు తగ్గించింది. అప్పట్నుంచీ ధర్మరాజన్ పోలీసులకు మళ్ళీ దొరకలేదు.

అలాంటి ధర్మరాజన్ సోమవారం మాత్రభూమి అనే మళయాళం చానెల్ లో ప్రత్యక్షం అయి ఇంటర్వ్యూ ఇచ్చాడు. గుర్తు తెలియని చోటునుండి ఇంటర్వ్యూ ఇచ్చాడని పత్రికలు రాశాయి. బాధితురాలు చెబుతున్నట్లుగా కురియన్ కూడా అత్యాచారం చేసిన వారిలో ఒకరని ధర్మరాజన్ టి.వి ఇంటర్వ్యూలో ఆరోపించాడు. అమ్మాయి బందీగా ఉన్న కుమిలి లోని గెస్ట్ హౌస్ వద్దకు కురియన్ ను తానే, తన కారులోనే తీసుకెళ్లానని, అక్కడ కురియన్ ఆమెపై అత్యాచారం చేశాడని తెలిపాడు. తనను విచారణ చేసిన అప్పటి ప్రధాన పరిశోధనాధికారి, ఇప్పటి రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిబి మాధ్యూస్ కురియన్ పేరు చెప్పొద్దని తనపై వత్తిడి తెచ్చాడని, అందుకే తాను ఆయన పేరు చెప్పలేదని కూడా తెలిపాడు. కేరళ హై కోర్టు దోషిగా తేల్చిన ఏకైక నిందితుడు ధర్మరాజన్ ఆరోపణలు కురియన్ చుట్టూ ఉన్న ఉచ్చును మరింత బిగించాయి.

ఈ నేపధ్యంలో కురియన్ ను రాజ్య సభ ఉపాధ్యక్ష పదవి నుండి తొలగించాలని రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాను నిర్దోషిని కనుక రాజీనామా చేయనని కురియన్ స్పష్టం చేస్తున్నాడు. ధర్మరాజన్ చేసిన ఆరోపణల రీత్యా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ తీవ్రతరం చేసినా సోనియా, ప్రధాని తదితర పెద్దలు నోరు మెదపడం లేదు. ఇపుడు 33 సంవత్సరాల వయసుకు చేరిన బాధితురాలు మొదటి నుండి కురియన్ పై మళ్ళీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ ఆరోపణలని చెబుతూ కురియన్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బి.జె.పి పార్టీది వింత పరిస్ధితి. ఆ పార్టీ కేరళ విభాగం, రాష్ట్ర మహిళా విభాగం కురియన్ రాజీనామా డిమాండ్ చేస్తుండగా, వారి అగ్రనాయకుడు మురళీ మనోహర్ జోషి మాత్రం కురియన్ నిర్దోషి అని తేల్చేస్తూ ప్రకటన జారీ చేసాడు.

ఇదీ పరిస్ధితి. వ్యవస్థకు కాపలా కాస్తూ, ప్రజలు సరైన మార్గంలో నడవడానికి మార్గ దర్శనం చేయవలసిన స్ధానంలో జస్టిస్ ఆర్.బసంత్, రాజ్య సభ వైస్ ఛైర్మన్ పి.జె.కురియన్ లు ఉన్నారు. వ్యవస్థను శాసించే స్ధానాల్లో స్థిరపడిపోయిన ఇలాంటి పెద్దలు ఒక 16 సంవత్సరాల బాలికను ‘చెడిపోయింది’ అని ముద్ర వేయదలుచుకుంటే, అది ఎంత తేలికో ఈ కేసు స్పష్టం చేస్తున్నది. 40 రోజుల పాటు చెరబట్టి 42 మంది దుండగులు అత్యాచారం జరిపిన బాలికకు న్యాయం చెయ్యడం మాని ఆమె గుణగణాల పైన తీర్పు ప్రకటించే పరిస్ధితిలో ఈ దేశ న్యాయ స్ధానాలు ఉన్నాయి. అత్యాచారం జరిపిన పెద్దలు కూర్చొని ఉన్న పీఠాలు తమను అధిష్టించిన వారిని భరిస్తున్నందుకు ఎంతగా సిగ్గుపడుతున్నాయో చెప్పలేక పోవచ్చు. కానీ బాధితురాలే స్వయంగా నోరు విప్పి చెబుతున్నా, నాయకురాలు సోనియమ్మ, లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలు, ప్రధాని మన్మోహన్… ఇంకా అనేకానేక పెద్దలకు వినిపించదా?

4 thoughts on “ఈ “చెడిపోయిన” సూర్యనెల్లి పిల్ల, మరో మహానది!?

  1. వివరంగా, సమగ్రంగా సమాచారం అందించారు, మీ వ్యాఖ్యలను మిళితం చేస్తూ!

    దారుణమైన అమానవీయమైన వ్యాఖ్యలు చేసి, వాటికి సిగ్గుపడి విచారం వ్యక్తం చేయకపోగా బయటపెట్టిన మీడియాను తప్పుబట్టే న్యాయమూర్తులూ; ఆరోపణలు ఎదుర్కొంటున్నా నిరసనలను పట్టించుకోని, పీఠం వదలని రాజకీయ నాయకులూ … వీరిని చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతోంది.

    శీర్షికలో ‘చెడిపోయిన’ అనే మాట వాడకుండా ఉండాల్సింది. కనీసం కొటేషన్లలో పెట్టాలి. లేకపోతే అపార్థానికి తావిస్తుంది.

  2. cant expect a high court judge to stoop down to such a level.On top of that he is supporting it by saying against the girl.
    The Indian penal code and all associated must be changed so that richer culprits be fined heavily (as in Scandinavian countries) and punishment must be more for persons with higher positions because despite being aware of things they commit crimes.This will avoid or reduce white collar criminals.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s