ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)


Arundhati Royఅవును కదా? నా ఉద్దేశం నిన్నటి రోజు అని. వసంతం ఢిల్లీలో తనను తాను ప్రకటించుకుంది. సూర్యుడు ఉదయించాడు, చట్టం తన పని తాను చేసుకుని పోయింది. బ్రేక్ ఫాస్ట్ కి కొద్దిసేపటి ముందు, 2001 నాటి పార్లమెంటు దాడి కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురు రహస్యంగా ఉరితీయబడ్డాడు. అతని విగత దేహాన్ని తీహార్ జైలులోనే పూడ్చిపెట్టారు. మక్బూల్ భట్ కి పక్కనే ఆయనను పూడ్చిపెట్టారా? (1984లో ఉరి తీయబడిన మరో కాశ్మీరీ ఆయన. ఆయన సంవత్సరీకాన్ని కాశ్మీరీలు రేపు జరుపుకోబోతున్నారు.) అఫ్జల్ భార్య, కుమారులకు ఈ విషయమై సమాచారం లేదు. “అధికారులు సమాచారాన్ని ఆయన కుటుంబానికి స్పీడ్ పోస్టులో, రిజిస్టర్డ్ పోస్టులో తెలియజేశారు” అని హోమ్ సెక్రటరీ పత్రికలకు చెప్పాడు. “వారికి ఆ సమాచారం చేరిందో లేదో తెలుసుకొమ్మని జమ్ము&కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కి చెప్పాము” అని కూడా ఆయన చెప్పాడు. ఇది పెద్ద విషయం ఏమీ కాదు, వారు కేవలం ఒక కాశ్మీరీ టెర్రరిస్టు కుటుంబం మాత్రమే మరి.

అత్యంత అరుదైన ఐకమత్య పూరిత క్షణాల్లో దేశం లేదా కనీసం ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి, సిపిఎం (‘ఆలస్యం’, ‘సమయం’ లాంటి చిన్న చిన్న తేడాలు మినహాయించి) ఒకే గొంతుతో చట్టం సాధించిన విజయం పట్ల సంబరం ప్రకటించారు. ఈ దేశ ఆత్మ చైతన్యం, ఈ రోజుల్లో ఇది టి.వి స్టూడియోల నుండి లైవ్ లో ప్రసారం అవుతోంది, తన ఉమ్మడి మేధస్సును –కరుణామయ ఆవేశం (papal passion), నిజాలను కప్పి ఉంచే సున్నితమైన పట్టు (delicate grip on facts) ల సహజ మిశ్రమమైన కాక్ టైల్ – మన పైకి దూకించింది. ఆ వ్యక్తి చనిపోయి వెళ్ళిపోయినా, సమూహాలుగా వేటాడే పిరికివాళ్ల వలే తమ ధైర్యాన్ని కూడగట్టుకోడానికి వారు ఒకరికొకరు అవసరం అయినట్లుంది.

నిజాలు ఏమిటి?

డిసెంబర్ 13, 2001 తేదీన ఐదుగురు సాయుధులు పేలుడు పదార్ధాలు బిగించిన ఒక తెల్ల అంబాసిడర్ కారులో పార్లమెంట్ హౌస్ గేట్ల గుండా దూసుకొచ్చారు. వారికి ప్రతిఘటన ఎదురు కావడంతో కారు నుండి బైటికి దూకి కాల్పులు ప్రారంభించారు. ఎనిమిది మంది భద్రతా బలగాలను, ఒక తోటమాలిని వారు చంపేశారు. అనంతరం జరిగిన తుపాకి యుద్ధంలో దాడి చేసిన అయిదుగురిని చంపేశారు. అఫ్జల్ గురు పోలీసుల వద్ద చెప్పిన అనేక ఒప్పుకోళ్ళలో ఆ ఐదుగురిని మహమ్మద్, రాణా, రాజా, హంజా, హైదర్ లుకా గుర్తించాడు. వారి గురించి మనకు తెలిసింది ఈ రోజుకి కూడా ఇంతే. అప్పటి హోమ్ మంత్రి ఎల్.కె.అద్వాని “వాళ్ళు పాకిస్థానీల వలె కనిపించారు” అని ప్రకటించాడు. (తానే సింధీ అయినందున పాకిస్థానీలు ఎలా ఉంటారో ఆయనకి బాగానే తెలిసి ఉండాలి, అవునా?) కేవలం అఫ్జల్ గురు ఒప్పుకోళ్ళపై ఆధారపడే (‘లోపాలు ఉన్నాయని’, “ప్రొసీజరల్ రక్షణలను ఉల్లంఘించారని’ చెబుతూ సుప్రీం కోర్టు వీటిని పక్కన పెట్టింది) భారత ప్రభుత్వం పాకిస్ధాన్ నుండి తన రాయబారిని వెనక్కి పిలిపించుకుని అర మిలియన్ (5 లక్షలు) సైనికులను పాక్ సరిహద్దుకి తరలించింది. అప్పట్లో అణు యుద్ధం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయాలు ‘ట్రావెల్ అడ్వైజరీ’లు జారీ చేసి తమ సిబ్బందిని అక్కడినుంచి ఖాళీ చేయించాయి. ఈ ప్రతిష్టంభన కొన్ని నెలల పాటు కొనసాగి ఇండియాకి వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చిపెట్టింది.

Afzal Guru 07డిసెంబర్ 14, 2001 తేదీన ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ కేసును తాము ఛేదించామని ప్రకటించింది. పార్లమెంటు దాడి కేసులో ‘మాస్టర్ మైండ్’ ప్రొఫెసర్ ఎస్.ఎ.ఆర్ జిలానీని ఢిల్లీలో అరెస్టు చేశామని, శ్రీనగర్ పండ్ల మార్కెట్ నుండి షౌకత్ గురు, అఫ్జల్ గురులను అరెస్టు చేశామని వారు ప్రకటించారు. అనంతరం షౌకత్ గురు భార్య అఫ్సన్ గురు ని కూడా వాళ్ళు అరెస్టు చేశారు. మీడియా అత్యంత ఉత్సాహంతో పోలీసుల కధనాన్ని ప్రసారం చేసింది. కొన్ని పతాక శీర్షికలు ఎలా ఉన్నాయో చూడండి: ‘డి.యు (ఢిల్లీ యూనివర్సిటీ) లెక్చరరే ఉగ్రవాద పధక రచనకు కేంద్రం’, “డాన్ ఫిదాయిలకు మార్గదర్శకత్వం వహించిన వర్సిటీ డాన్’, ‘ఖాళీ సమయాల్లో ఉగ్రవాదం బోధించిన డాన్’. జీ టి.వి అయితే ‘డిసెంబర్ 13’ పేరుతో ఒక ‘డాక్యుడ్రామా’ను ప్రసారం చేసింది. “పోలీసు ఛార్జి షీటుపై ఆధారపడిన నిజాలు” అని దాని గురించి జి టి.వి చెప్పుకుంది. (పోలీసుల కధనమే నిజం అయితే ఇక కోర్టులు ఎందుకు ఉన్నట్లు?) ప్రధాన మంత్రి వాజ్ పేయి, ఎల్.కె.అద్వాని బహిరంగంగా ఈ ఫిల్మ్ ని మెచ్చుకున్నారు. మీడియా జడ్జీలను ప్రభావితం చేయలేదు అని చెబుతూ సుప్రీం కోర్టు ఈ ఫిల్మ్ ని ప్రదర్శించకుండా అడ్డుకోడానికి నిరాకరించింది. అఫ్జల్, షౌకత్, జిలానీలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణ శిక్ష విధించడానికి కొద్ది రోజుల ముందే ఈ ఫిల్మ్ ప్రసారం చెయ్యబడింది. దరిమిలా, హై కోర్టు ‘మాస్టర్ మైండ్’ ఎస్.ఎ.ఆర్ జిలానీ, అఫ్సన్ గురు లను నిర్దోషులుగా విడుదల చేసింది. సుప్రీం కోర్టు కూడా వారి నిర్దోషిత్వాన్ని సమర్థించింది. కానీ ఆగస్టు 5, 2005 నాటి తన తీర్పులో మహమ్మద్ అఫ్జల్ కి మూడు జీవిత కారాగార శిక్షలు, మరో రెండు మరణ శిక్షలు విధించింది.

ప్రసిద్ధ సీనియర్ జర్నలిస్టులు ప్రచారంలో పెట్టిన అబద్ధాలు అభివర్ణించిన దానికి భిన్నంగా అఫ్జల్ గురు “డిసెంబర్ 13, 2001 తేదీన పార్లమెంట్ హౌస్ పైకి దూసుకెళ్లిన టెర్రరిస్టుల్లో ఒకరు” కాదు. “ఆరుగురు భద్రతా బలగాలపై కాల్పులు జరిపి అందులో ముగ్గురిని చంపేసిన వారిలో ఒకరు” కూడా కాదు. (బి.జె.పి రాజ్యసభ సభ్యుడు చందన్ మిత్ర ‘ది పొయినీర్’ పత్రికకు అక్టోబర్ 7, 2006 తేదీన రాసిన వ్యాసంలో ఈ సంగతి స్పష్టం చేశాడు.) పోలీసుల ఛార్జి షీటు కూడా అఫ్జల్ పైన ఆ నేరాలను మోపలేదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అఫ్జల్ కి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు “పరిస్ధితులకు సంబంధించినవి” (circumstantial) మాత్రమే. తీర్పు ఇలా పేర్కొంది: “కుట్రలను నిరూపించడానికి ఎక్కువ కేసుల్లో సాక్ష్యాధారాలు ఉండనట్లుగానే ఈ కేసులో కూడా నేర పూరిత కుట్ర జరిగిందనడానికి నేరుగా సాక్ష్యాలు లేవు… భారీ స్ధాయిలో ప్రాణ నష్టం జరిగిన ఈ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసింది. నేరస్థుడికి మరణ శిక్ష విధిస్తేనే సమాజం యొక్క ఉమ్మడి ఆత్మకు సంతృప్తి లభిస్తుంది.”

పార్లమెంటుపై దాడి కేసులో మన ఉమ్మడి ఆత్మకు రూపకల్పన చేసిన నిపుణులు ఎవరు? వార్తా పత్రికలనుండి మనం ఏరుకున్న నిజాలే దానికి కర్తలా? టి.విలో మనం చూసిన ఫిల్ములా?

కోర్టులు ప్రొఫెసర్ ఎస్.ఎ.ఆర్ జిలానీని నిర్దోషిగా విడుదల చేయడం, అఫ్జల్ ని దోషిగా నిర్ధారించడం అన్న వాస్తవమే విచారణ నిష్పాక్షికంగా జరిగిందని చెప్పడానికి రుజువు అని వాదించేవారు కొందరు ఉన్నారు. నిజమా అది?

ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మే 2002లో మొదలయింది. 9/11 (టెర్రరిస్టు దాడుల) అనంతర వెర్రి ఉద్రేకంలో ప్రపంచం అప్పటికి ఇంకా ఊగిపోతోంది. ఆఫ్ఘనిస్థాన్ లో ‘విజయం’ సాధించానని అమెరికా తొందరపడి గొప్పలు చెప్పుకోవడం కూడా మొదలు పెట్టింది. గుజరాత్ లో సామూహిక మారణకాండ ఇంకా కొనసాగుతున్న రోజులవి. మరి పార్లమెంటుపై దాడి కేసులో చట్టం నిజంగా తన పని తాను చేసుకుని పోతోంది! ఒక క్రిమినల్ కేసు యొక్క అత్యంత కీలక దశలో: సాక్ష్యాలు ప్రవేశపెట్టబడినపుడు, సాక్షులను క్రాస్-ఎగ్జామిన్ చేస్తున్నపుడు, వాదం యొక్క ప్రధాన పునాదిని నిర్మిస్తున్న సమయంలో –హై కోర్టు, సుప్రీం కోర్టులలో చట్టాలలోని వివిధ అంశాలపై వాదించవచ్చు గానీ కొత్త సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి వీలు ఉండదు- అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఒంటరిగా ఖైదు చేయబడ్డ అఫ్జల్ గురు తరపున వాదించడానికి న్యాయవాది లేడు. కోర్టు నియమించిన జూనియర్ లాయర్ కనీసం ఒక్కసారి కూడా జైలులో ఉన్న తన క్లయింటును (అఫ్జల్ ని) సందర్శించలేదు. అఫ్జల్ తరపున సాక్ష్యం ఇవ్వడానికి ఏ ఒక్క సాక్షిని ఆయన ప్రవేశపెట్టలేదు. ప్రాసిక్యూషన్ తరపు సాక్షులను కూడా కనీసం క్రాస్-ఎగ్జామిన్ చేయలేదు. ఇటువంటి పరిస్ధితిపై తామేమీ చేయలేమని జడ్జి నిస్సహాయత వ్యక్తం చేశాడు.

అయినప్పటికీ వాడుకలోకి వచ్చిన మాటల ప్రకారం కేసులో బలం ఏమీ లేదు. అలాంటి అనేక ఉదాహరణల్లో కొన్ని:

పోలీసులు అఫ్జల్ వద్దకు ఎలా చేరారు? ఎస్.ఎ.ఆర్ జిలానీ తమని అతని వద్దకు చేర్చాడని పోలీసులు చెప్పారు. కానీ కోర్టు రికార్డుల ప్రకారం జిలానీని అరెస్టు చెయ్యడానికి ముందే అఫ్జల్ అరెస్టుకు ఆదేశాలు వెళ్ళాయి. హై కోర్టు దీనిని ‘సాక్ష్యాల వైరుధ్యం’ (material contradiction) గా పేర్కొంది గానీ దాన్ని అక్కడితో వదిలిపెట్టింది.

రెండు అత్యంత ముఖ్యమైన నేర నిరూపణ సాక్ష్యాలు ఏమిటంటే అఫ్జల్ అరెస్టు సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ మరియు ల్యాప్ టాప్. అరెస్టు మెమోలపై అఫ్జల్ సోదరుడు బిస్మిల్లా ఢిల్లీలో సంతకం చేశాడు. స్వాధీన మెమోల పైన జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు పోలీసులు సంతకం చేశారు. వారిలో ఒకరు అఫ్జల్ ని లొంగిపోయిన మిలిటెంటుగా గతంలో వేధింపులకు గురి చేసిన వ్యక్తి. కంప్యూటర్, సెల్ ఫోన్ సాక్ష్యాలకు సీలు వేయవలసి ఉండగా అలా జరగలేదు. అరెస్టు జరిగిన తర్వాత కంప్యూటర్ హార్డ్ డిస్కు లోకి (ఇతరులు) ప్రవేశించారని కోర్టు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. పార్లమెంటులోకి టెర్రరిస్టులు ప్రవేశించడానికి వినియోగించిన ఫేక్ హోమ్ మంత్రిత్వ శాఖ పాసులు, ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పార్లమెంటు హౌస్ కి సంబంధించిన జి టి.వి వీడియో క్లిప్ మాత్రమే కంప్యూటర్ లో ఉన్నాయి. కనుక, పోలీసుల ప్రకారం, అఫ్జల్ తన నేరాన్ని నిరూపించే అత్యంత కీలకమైన సాక్ష్యాలు మాత్రమే తన కంప్యూటర్ లో ఉంచుకుని మిగిలిన సమాచారాన్ని అంతా తుడిచేసి దానిని ‘చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్’గా పోలీసుల ఛార్జి షీటు చెప్పిన ఘాజి బాబా అనే వ్యక్తికి ఇవ్వడానికి వేగంగా వెళ్తున్నాడు.

ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యులలో కమల్ కిషోర్ ఒకరు. ఆయన తానే అఫ్జల్ కి కీలకమైన సిమ్ కార్డు అమ్మానని కోర్టులో డిసెంబర్ 4, 2001 తేదీన గుర్తించాడు. ఈ సిమ్ కార్డే నిందితులందరి మధ్య సంబంధాలున్నాయని గుర్తించిన కీలక సాక్ష్యం. కానీ ప్రాసిక్యూషన్ స్వయంగా ప్రవేశపెట్టిన కాల్ రికార్డుల ప్రకారం ఆ సిమ్ కార్డు నిజానికి నవంబర్ 6, 2001 తేది నుంచీ వాడుకలో ఉన్నది.

ఈ అబద్ధాలు, ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడిన ఈ సాక్ష్యాలు ఇలా ఒకదానిపై ఒకటి పేరుకుపోతూనే ఉంటాయి. కోర్టులు దానిని నోట్ చేసుకుంటాయి. కానీ పోలీసుల వేళ్ళ కణుపుల పైన సున్నితంగా తాకడం తప్ప వారికి కోర్టు నుండి ఎలాంటి బాధ ఎదురు కాలేదు. ఏమీ ఎదురు కాలేదు.

ఇక మళ్ళీ ఆ పాత కధే పునరావృతం. కాశ్మీరులో అనేకమంది లొంగిపోయిన మిలిటెంట్లకు మల్లే అఫ్జల్, చాలా తేలికగా అందుబాటులో ఉండే బలి పశువు – చిత్రహింసలు, బ్లాక్ మెయిల్, బలవంతపు వసూళ్లకు అతను బాధితుడు. ఇంకా భారీ వ్యూహాల నేపధ్యం నుండి చూస్తే అతను ఒక అనామకుడు. పార్లమెంటుపైన జరిగిన దాడి కేసులో మిస్టరీని ఛేదించాలని ఎవరికైనా నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే అందుబాటులోనే ఉన్న చిక్కని సాక్ష్యాల వరుస వెంట వెళ్ళి ఉంటారు. కానీ ఎవరూ ఆ పనికి పూనుకోలేదు. ఆ విధంగా జరిగిన కుట్రకు నిజమైన రచయితలు ఎవరో ఎప్పటికీ గుర్తించబడకుండా, పరిశోధించబడకుండా మిగిలిపోయేలా జాగ్రత్త తీసుకోబడింది.

కానీ, ఇప్పుడు, అఫ్జల్ ని ఉరి తీసేశారు గనుక, మనందరి ఉమ్మడి ఆత్మకి సంతృప్తి కలిగిందని నేను భావిస్తున్నాను. లేక మన చేతిలోని ‘రక్తం నిండిన కప్పు’ ఇంకా సగమే నిండి ఉన్నదా?

(ఫిబ్రవరి 10 తేదీన ‘ది హిందూ’ లో ప్రచురితమైన అరుంధతీ రాయ్ రచనకు ఇది యధాతధ అనువాదం. –విశేఖర్)

2 thoughts on “ప్రజాస్వామ్యానికి నిఖార్సయిన రోజు (అరుంధతీ రాయ్ రచన)

 1. తానే సింధీ అయినందున పాకిస్థానీలు ఎలా ఉంటారో ఆయనకి బాగానే తెలిసి ఉండాలి, అవునా?
  Sir, why did you write this line. These kind of lines gives an impression that your views and analysis are biased.

  నిజాలు ఏమిటి? This section is really interesting. I am bowled by knowing some.

 2. సకాలంలో చాలా మంచి వ్యాసం తెలుగు చేశారు. దీనికి తీహార్ జైల్లో అధికారుల అంతర్మథనం కూడా చేరిస్తే చాలా బాగుంటుంది. అలాగే కింది హిందూ కథనంలో డిబేట్ కూడా అటూ ఇటూ లోతుగానే జరిగింది. చూడండి

  In Tihar, officials feel ‘tinge of sorrow’
  http://www.thehindu.com/news/national/in-tihar-officials-feel-tinge-of-sorrow/article4400897.ece

  ఒక్క అఫ్జల్ విషయంలోనే కాదు గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ రాజ్య వ్యవస్థ తిమింగలాలను ఏమీ చేయలేక పీతలను,ఎండ్రకాయలను మాత్రమే పట్టుకోవడంలో గొప్ప నైపుణ్యం సాధిస్తున్నట్లే కనిపిస్తోంది. ఘోరమైన తప్పిదం చేశాడని ససాక్ష్యంగా నిరూపించబడిన శిక్షార్హుడిని కూడా పదేళ్లు ఏకాంత కారాగారవాసంలో ఉంచితే అలాంటివాళ్లను బతికుండగానే చంపినట్లు లెక్క. ఇప్పుడు ఉరితీయడం ద్వారా రాజ్యం ఒక జీవచ్చవాన్ని రెండోసారి చంపేసింది.

  దేశాన్ని అంతర్జాతీయ విపణిలో అమ్మేస్తున్నవాళ్లు, కమిషన్ రుచి చూడనిదే అన్నం సహించని వాళ్లు, జనం మూలుగులు పీల్చడం ద్వారా మాత్రమే పందికొక్కుల్లా బలుస్తున్నవాళ్లు… పార్లమెంటుపై దాడిలో భారత సార్వభౌమత్వాన్ని చూస్తూ గావుకేకలు పెడుతున్నారు. శాంకొవాజెట్టీని చంపడం ద్వారా అమెరికా న్యాయవ్యవస్త 90 ఏళ్లుగా అన్యాయపు కళంకాన్ని మోస్తోంది. అఫ్జల్ ఉరి ఘటన తరతరాల కాశ్మీరీయులను పరాయితనంలోకి నెట్టడమే కాదు.. భారతీయ పాపభారాన్ని కూడా అది ఇంకా ఇంకా పెంచుతుందేమో మరి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s