సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే


ది హిందూ నుండి

ది హిందూ నుండి

ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడిదారీ కంపెనీలు దోచుకుని జల్సా చేస్తాయన్న సంగతి చరిత్రలో అనేక కంపెనీలు అనేక సార్లు రుజువు చేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చిన వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, ఇన్వెస్టర్ల సొమ్ము కాజేసి తాము మేపే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల చేత కూడా గడ్డి పెట్టించుకున్న గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ప్రామాణిక ఫైనాన్స్ వడ్డీ రేటు అయిన లిబర్ (Libor – London Interbank Offered Rate) ని కూడా తమ లాభాలకు అనుకూలంగా ప్రభావితం చేసినందుకు బిలియన్ల కొద్దీ డాలర్ల పెనాల్టీ చెల్లించిన బార్ క్లేస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్ మొదలయిన టూ బిగ్ టు ఫెయిల్ బ్యాంకులు, కృష్ణా-గోదావరి బేసిన్ లోని చమురు, సహజవాయువులను స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటూ కాగ్ ఆడిట్ ని నిరోధించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న రిలయన్స్ కంపెనీ… ఇవన్నీ పెట్టుబడిదారీ కంపెనీల నిలువు దోపిడిని వెల్లడి చేసే కొన్ని ఉదాహరణలు. 17,400 కోట్ల రూపాయలకు పైగా భారత ప్రజలనుండి అక్రమ పద్ధతుల్లో సేకరించి సొంత వ్యాపారాలకు వాడుకుని సుప్రీం కోర్టు చేత పదే పదే మొట్టికాయలు తింటున్న సహారా కంపెనీ ఈ కోవలోని తాజా ఉదాహరణ.

సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ అనే రెండు కంపెనీల ద్వారా సహారా కంపెనీ భారతీయ మదుపుదారుల నుండి 17,400 కోట్ల రూపాయలకు పైగా సేకరించింది. ఈ సేకరణకు చట్టబద్ధత లేదని, అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వ అనుమతి లేని ఒ.ఎఫ్.సి.డి (Optionally Fully Convertible Debentures) ల ద్వారా సేకరించినందున ఆ మొత్తాన్ని మదుపరులకు తిరిగి చెల్లించాలని భారత ప్రభుత్వ షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి (Securities Exchange Board of India) జూన్ 2011 లో ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అవే కారణాలు చూపుతూ మదుపరుల వద్ద నుండి అక్రమంగా సేకరించిన సొమ్ముని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సహారా కంపెనీ ఈ ఆదేశాలను తిరస్కరించి కోర్టుకు ఎక్కింది.

కేసు విచారించిన సుప్రీం కోర్టు సహారా కంపెనీని తీవ్రంగా తూర్పారబట్టింది. ప్రజల వద్ద సేకరించిన సొమ్ము మొత్తాన్ని 15 శాతం వడ్డీతో సహా (వడ్డీతో కలిపి 24,000 కోట్లు) మదుపరులకు తిరిగి చెల్లించాలని ఆగస్టు 31, 2012 తేదీన తీర్పు చెప్పింది. చెల్లింపులకు మూడు నెలలు గడువు కూడా విధించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును సహారా కంపెనీ పూచిక పుల్ల లెక్కన పరిగణించిందని దాని ఆచరణ నిరూపించింది. ప్రజల డబ్బు వారిది వారికి ఇవ్వకుండా సుప్రీం కోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ని కూడా సుప్రీం తిరస్కరించింది. సమీక్ష కోసం సహారా కంపెనీ వేసిన పిటిషన్ చెల్లదని, కేసులోని సమస్త అంశాలను అన్ని కోణాలనుండి పరిశీలించే తాము తీర్పు ఇచ్చామని తెలిపింది. అయితే మరింత గడువు కోరిన కంపెనీ విన్నపాన్ని పరిగణించి ఈసారి కంపెనీకి కొంత ఊరట ఇస్తూ దశలవారీగా చెల్లించవచ్చని తీర్పు చెప్పింది. వెనువెంటనే 5,120 కోట్లు సెబి వద్ద డిపాజిట్ చెయ్యాలనీ, మిగిలిన మొత్తంలో సగం (10,000 కోట్లు) జనవరి 2013 లోనూ రెండో సగం మొత్తాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో చెల్లించాలనీ డిసెంబరు 5 తేదీన తీర్పు చెప్పింది.

అయితే ఈ తీర్పు కూడా సహారా అమలు చేయలేదు. బుధవారం కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకి ఇచ్చిన సమాచారం ప్రకారం కోర్టు తీర్పు అమలు చేసే ఉద్దేశం తమకు లేదని కూడా సహారా కంపెనీలు ప్రభుత్వానికి చెప్పేశాయి. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయించడానికి ఘనత వహించిన ప్రధానమంత్రి గానీ, ఆర్థికమంత్రి చిదంబరం గానీ, సెబి, ఆర్.బి.ఐ లు గానీ పట్టించుకోలేదు. సెబి, ఆర్.బి.ఐల పనే ఇలాంటి కంపెనీల అక్రమ వ్యాపారాలను, అక్రమ నిధుల సేకరణలను అడ్డుకొని ప్రజల కష్టార్జితం సద్వినియోగం అయ్యేలా చూడడం. అయినా అవి తమ పని చెయ్యవు. స్వదేశీ, విదేశీ బహుళజాతి పెట్టుబడిదారీ కంపెనీలకు భారత దేశంలోని పెట్టుబడి వాతావరణం పైన నమ్మకం పోతుందని వీరి భయం కాబోలు. పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించడానికే రిటైల్ రంగంలో ఎఫ్.డి.ఐ లను అనుమతించామని, భీమా రంగంలో విదేశీ ప్రైవేటు పెట్టుబడులను 24 శాతం నుండి 51 శాతానికి పెంచడానికి ప్రతిపాదించామని ఆర్ధిక మంత్రి చిదంబరం బహిరంగంగానే ప్రకటించిన వాస్తవాన్ని ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు.

మదుపరుల డబ్బు సొంతానికి

కోర్టు చెప్పినట్లు చెల్లింపులు చేయడానికి తమ వద్ద లేదని గడువు పెంచుతూ పోయిన సహారా కంపెనీ విదేశాల్లో లగ్జరీ హోటల్లు కొనుగోలు చేయడం మాత్రం ఆపలేదు. లగ్జరీ కార్ల రేసు ఫార్ములా వన్ లో పెట్టుబడులు పెట్టడం కూడా మానలేదు. అవినీతి వ్యతిరేక కార్యకర్త, సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ప్రకారం భారతీయ మదుపరులనుండి అక్రమంగా సేకరించిన డబ్బు తప్ప సహారా కంపెనీకి అంత భారీ కొనుగోళ్లు చేయడానికి మరో ఆదాయ వనరు లేదు. అంటే కంపెనీ ఒకవైపు డబ్బు లేదని ప్రభుత్వ సంస్థలకు, అత్యున్నత న్యాయ స్ధానానికి చెబుతూనే, భారతీయుల డబ్బుని విదేశాలకు తరలించి లగ్జరీ వ్యాపారాలకు తగలేస్తోంది. ఈ విషయాన్ని కనిపెట్టింది ఏ పరిశోధనాత్మక జర్నలిస్టులో కాదు. భారత ప్రభుత్వ రెవిన్యూ విభాగానికి చెందిన ఆర్ధిక గూఢచార సంస్థ ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఎఫ్.ఐ.యు) స్వయంగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది.

ఎఫ్.ఐ.యు ప్రకారం మరో దేశానికి చెందిన ఎఫ్.ఐ.యు సహారా కంపెనీ యజమాని సుబ్రతా రాయ్ కొనుగోళ్ల వివరాలను అందజేసింది. “బ్రిటన్ లోని ఒక ద్రవ్య సంస్థ (ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్) లో ఏంబి వ్యాలీ (మారిషస్) లిమిటెడ్ పేరుతో 539469 నెంబరుతో సుబ్రతా రాయ్ కి ఒక ఖాతా ఉందని గూఢచార సమాచారం ద్వారా తెలుస్తోంది. ఖాతాదారు ఈ ఖాతాలోని సొమ్ములో 8 మిలియన్ పౌండ్లు (రు. 66.83 కోట్లు) ఎస్.జి హేంబ్రోస్ బ్యాంక్ (చానెల్ ఐలాండ్స్ – ఏంబి వ్యాలీ లిమిటెడ్ పేరుతో ఉన్న ఖాతా నెంబర్. 0464163) కూ, మరో 190 మిలియన్ పౌండ్లు (రు. 1584.80 కోట్లు) బ్యాంక్ ఆఫ్ చైనా లండన్ బ్రాంచి (ఏంబి వ్యాలీ లిమిటెడ్ ఖాతా నెంబర్ 781505-0220-000) కూ తరలించింది” అని మార్చి 30, 2012 తేదీన ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని రెవిన్యూ విభాగానికి సమర్పించిన నివేదికలో ఎఫ్.ఐ.యు తెలిపింది. “మరో 5 మిలియన్ పౌండ్లు (రు. 41.70 కోట్లు) తన ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ టీం లిమిటెడ్ కు స్పాన్సర్ షిప్ మొత్తంగా సహారా ఫోర్స్ ఇండియా టీం కు చెల్లించింది. ఏంబి వ్యాలీ (మారిషస్) లిమిటెడ్ కంపెనీ, సహారా గ్రాస్వెనర్ హౌస్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కి బ్యాంక్ ఆఫ్ చైనాలో ఉన్న ఖాతా నుండి 21/10/2011, 28/1182011 తేదీల్లో పెద్ద మొత్తంలో నిధులు అందుకుంది” అని కూడా సదరు నివేదిక తెలియజేసింది. లండన్ లోని పార్క్ లేన్ లో ఉన్న గ్రాస్వెనర్ హౌస్ హోటల్ ను సుబ్రతా రాయ్ ఇటీవలే కొనుగోలు చేశాడని నివేదిక స్పష్టం చేసింది. ఈ విధంగా లగ్జరీ హోటల్లకు, లగ్జరీ ఫార్ములా వన్ కార్ రేసులకు ఒకవైపు డబ్బు తగలేస్తూనే సహారా అధినేత సుబ్రతా రాయ్ మరో వైపు తన వద్ద డబ్బు లేదని బొంకుతూ మరింత గడువు కావాలని సుప్రీం కోర్టుని పదే పదే కోరాడు.

“అనుమానాస్పద రీతిలో డబ్బు తరలిస్తున్నారని ఎఫ్.ఐ.యు ఒక పక్క నివేదికలు ఇచ్చింది. ఇంకో పక్క సహారా కంపెనీకి వ్యతిరేకంగా సెబి ఆదేశాలివ్వగా సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం వైపునుండి ఎటువంటి హెచ్చరిక గంటలు మోగలేదు. కనీసం వారి ఖాతాలను స్తంభింపజేయలేదు. చిన్న మదుపరులనుండి అక్రమంగా సేకరించిన సొమ్ము తప్ప మరో ఆదాయ వనరులేవీ సహారాకు లేని నేపధ్యంలో ఈ ధోరణి అత్యంత ఆశ్చర్యం కొలుపుతోంది” అని సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించాడని ది హిందూ తెలిపింది. 2జి మొబైల్ ఫోన్ కేసులో కూడా సుబ్రతా రాయ్ కి చెందిన కంపెనీలపై భారత అధికారులు విచారణ జరుపుతుండడం గమనార్హం అని ఎఫ్.ఐ.యు తన నివేదికలో పొందుపరచడం గమనించవలసిన విషయం. సుబ్రతా రాయ్ సహారా కంపెనీలకీ, సమాజ్ వాదీ పార్టీ చైర్మన్ ములాయం సింగ్ యాదవ్ కి సంబంధం ఉందని కూడా నివేదిక చెప్పడం విశేషం. చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ అనుమతిస్తూ కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లు ఓడిపోకుండా, బిల్లుతో పాటు ప్రభుత్వాన్నీ కాపాడిన ములాయం అలా ఎందుకు చేశాడో ఎఫ్.ఐ.యు నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది.

తన నివేదికలో చెప్పిన ఏంబి వ్యాలీ (మారిషస్) లిమిటెడ్ ఖాతాకు సహారా ఇండియా పరివార్ కంపెనీ ఎం.డి మరియు ఛైర్మన్ అయిన సుబ్రతా రాయ్ 100 శాతం యజమాని అని ఎఫ్.ఐ.యు తెలియజేసింది. దానితో పాటు లండన్ లో రిజిస్టర్ చేసిన ఏంబి హాస్పిటాలిటీ సర్వీసెస్ లిమిటెడ్‘,
సహారా గ్రాస్వెనర్ హౌస్ హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీలకు కూడా ఆయన యజమాని అని తెలిపింది.

సుప్రీం కోర్టు నిలదీత

ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టు బుధవారం ప్రభుత్వాన్ని, సెబిని నిలదీసింది. సహారా కంపెనీకి వ్యతిరేకంగా సెబి దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారిస్తూ ఇంతవరకూ కంపెనీకి వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఆగస్టు 31, 2012 నాటి తన తీర్పు అమలు చేయించడానికి సెబి ఎటువంటి ఆసక్తి చూపలేదని ఎత్తి చూపింది. “మా మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. జరగబోయే పరిణామాలు ఏమిటో మా తీర్పు స్పష్టంగా పేర్కొంది. మీరు ఏమి చర్యలు తీసుకున్నారు? మీరసలు ఏ చర్యా తీసుకోలేదు. మీరేం చెయ్యాలో తీర్పులో చెప్పినప్పటికీ దానిని మీరు చేయలేదు” అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వ అటార్నీ జనరల్ ను నిలదీసింది.

ఖాతాలు స్తంభింపజేయడానికి తాము నోటీసులు జారీ చేశామని సెబి తరపున అటార్నీ జనరల్ కోర్టుకి నివేదించాడు. ముంబైలో సివిల్ కోర్టుకి కూడా వెళ్లామని తెలిపాడు. అయితే దానిని జస్టిస్ రాధాకృష్ణన్ కొట్టి పారేశాడు. “నోటీసులు జారీ చేస్తే సరిపోదు. నోటీసులు ఇచ్చి కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు? మా ఆదేశాన్ని మీరు అమలు చేయాలి కదా అని ఆయన ప్రశ్నించాడు. సహారా కంపెనీకి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార వ్యాజ్యం పెండింగ్ లో ఉన్నంత మాత్రాన కంపెనీపై సెబి చర్యలు తీసుకోకూడదని ఎక్కడా లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేశాడు. డబ్బు తిరిగి చెల్లించే ఉద్దేశ్యం తమకు లేదని సహారా అధినేత కంపెనీలు చెప్పాయని ఆయన తెలిపాడు. సహారా తరపున ఎప్పటిలాగే రామ్ జెఠ్మలాని వాదించాడు. ప్రజల సొమ్ము కాజేసిన కంపెనీలు, వ్యక్తుల తరపున వాదించి సొమ్ము చేసుకుంటూ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్న ఆదర్శం వెనుక దాక్కోవడం పేరు మోసిన న్యాయవాదులకు చాలా తేలిక.

ఏ దేశంలో చూసినా పెట్టుబడిదారీ కంపెనీల చరిత్ర ఇలాగే ఉంటుంది. అమెరికా, యూరప్ లాంటి పెట్టుబడిదారీ దేశాల్లోనైతే కంపెనీల ఆగడాలకు అంతూపొంతూ ఉండదు. ఆర్ధిక, ద్రవ్య నేరాలు అక్కడ సర్వసామాన్యం. కోర్టు విచారణలనుండి ఆర్ధిక నేరస్థులు బయటపడడం కూడా అక్కడ సర్వసామాన్యమే. కాకపోతే కోర్టులు పని చేస్తున్నాయి అని చెప్పుకోవడానికి ఇండియాలో దళిత అవినీతిపరులకు శిక్ష వేసి కాలర్ ఎగరేసినట్లు అక్కడ ఆసియా, ఆఫ్రికా లకు చెందిన ఆర్ధిక నేరగాళ్లకు శిక్షలు వేస్తుంటారు. ఇటీవల అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ నేరానికి శిక్షలు పడిన శ్రీలంక తమిళ వ్యాపారి రాజ్ రాజారత్నం, భారతీయ అమెరికన్ వ్యాపారి రజత్ గుప్తా (హైదరాబాద్ లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ సహ వ్యవస్థాపకుడు) ల ఉదంతాలు అందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. వీరికి శిక్షలు వేసిన అమెరికా కోర్టులు ప్రపంచ వ్యాపితంగా యూజర్ల వ్యక్తిగత వివరాలు అనుమతి లేకుండా దొంగిలించిన గూగుల్ కి కొన్ని వందల డాలర్లు పెనాల్టీ వేసి వదిలేశాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ కంటే భారీ నేరాలకు పాల్పడిన గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల అధిపతులకు కూడా నామమాత్ర అపరాధ రుసుము విధించి వదిలేశాయి. ఆ తర్వాత కూడా అవి తమ అక్రమాలు కొనసాగించాయని లిబర్ కుంభకోణం ద్వారా లోకానికి వెల్లడయింది.

వర్గ సమాజంలో ప్రభుత్వాలలో ఉండే పాలకులు తమ వర్గ ప్రయోజనాల కోసమే పని చేస్తారని చెప్పేది అందుకే. కార్మిక వర్గ ప్రజలు చేసే చిన్న చిన్న నేరాల విషయంలో పులులకు మల్లే విరుచుకుపడే కోర్టులు ధనికుల భారీ నేరాల విషయంలో పిల్లి పాటి నిబద్ధతను కూడా చూపావు. ఇండియా కూడా అందుకు మినహాయింపు కాదు.

4 thoughts on “సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే

 1. 190 బిలియన్ పౌండ్లు (రు. 1584.80 కోట్లు)
  మరో 5 బిలియన్ పౌండ్లు (రు. 41.70 కోట్లు)
  ఇవి మిలియన్ పౌండ్లు అనుకుంటా .

 2. చంద్రగారు, మీరు గమనించింది నిజమే. అవి మిలియన్లే. ఒక అంకెకు పోస్ట్ చేసే సమయంలొ చూసుకుని సవరించాను. మిగిలిన రెండు అంకెలను చూసుకోలేదు. సవరణకు ధన్యవాదాలు.

 3. “కార్మిక వర్గ ప్రజలు చేసే చిన్న చిన్న నేరాల విషయంలో పులులకు మల్లే విరుచుకుపడే కోర్టులు ధనికుల భారీ నేరాల విషయంలో పిల్లి పాటి నిబద్ధతను కూడా చూపావు. ఇండియా కూడా అందుకు మినహాయింపు కాదు. ”

  సత్యవాక్యం.. మనకాలపు అన్యాయ వ్యవస్థను పట్టిస్తున్న గొప్ప వాక్యం..

  మన తెలుగు మహారాజులు, పత్రికాధిపతుల ముసుగులో ఉన్న పెట్టుబడిదారులు కూడా తక్కువ తినలేదనుకుంటాను. లీజు ఇచ్చిన పాపానికి గుడిని గుడిలోని లింగాన్ని కూడా మింగేసిన అన్యాయాధిపతులు మన కళ్లముందే నిస్సిగ్గుగా తిరిగేస్తున్నారు కదా. పైగా రోజూ నీతులే. నీతిపాఠాలే..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s