(దిన, వార పత్రికలు చదివే వారికి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ పేరు చిరపరిచతమే. ఆయన రాసిన ఈ కవిత వెబ్ మహిళా సాహిత్య పత్రిక ‘విహంగ‘ లో ఫిబ్రవరి 1 తేదీన ప్రచురించబడింది. పత్రిక సంపాదకుల అనుమతితో ఇక్కడ పునర్ముద్రిస్తున్నాను. -విశేఖర్)
ఆ రాత్రి ఆకాశం నెత్తుటి వెన్నెల కురిసింది
ఆ రాత్రి మట్టి మాంసం ముద్దగా మారింది
ఆ రాత్రి నిలువెత్తు నీలి విగ్రహం నీరై పోయింది
ఆ రాత్రి ఆత్మ గౌరవం ఆయుధంకాలేక విలపించింది
అంత దారుణం ఎంతలా జరిగిపోయింది
ఒక ఆదిమకాలపు
భయావహ జంతు జాలపు ఊచ కోతల రక్త జ్వాల
కళ్ళ ముందు కడులుతున్నట్టే వుంది
మేక పిల్లను కోసినట్టు
కోడి పెట్టాను గావు పట్టినట్లు
వేట కొడవళ్ళతో గాయపరచినట్లు
దయలేని దేశంలో
నిర్దయగా దళితుల్ని చంపడం ఎంత తేలికైపోయింది
గోడ్ల కోసే చేతికి కూడా
గుండె ఉంటుంది కదా
మాంసం కొట్టే కత్తికి సైతం
మనసు వుంటుంది కదా
పూలు కోసే చేతులు
పూజలు చేసే చేతులు
పుణ్యం చేసే చేతులు
ఎంత పని చేశాయి?
‘హే రామ్!’ వేద భూమి కూడా
ఎంత క్రూరభూమిగా రూపమెత్తింది
కోమలత్వం కూడా
రాక్షసత్వంగా మారి పోతోంది
చంపండి నరకండి
చావగోట్టండని
‘మగ మద మృగాల్ని ‘
ఎలా ఉసి గొల్పారమ్మా?
“పైట జారితేనే ఉలిక్కిపడి
పాతివ్రత్యానికి భంగం కలిగిందనుకొనే
కులాంగనలు కదా!
సాటి స్త్రీ స్తనాలను
గొడ్డళ్ళతో అడ్డంగా నరుకుతుంటే
అడ్డుపడాల్సింది పోయి
తల్లీ కూతుళ్ళని
కళ్ళెదుటే మానభంగం చెయ్యమని
మంత్రాలు పలికిన నోళ్ళతో
మద్దతునెలా పలికారమ్మా
కత్తులతో బరిసెలతో కర్రలతో
వూరు ఊరంతా పూనకంతో
శరీరాంగాల్ని మర్మాంగాల్నీ
పవసపోట్టులా తరుగుతుంటే
ఇంత దారుణాన్ని
ఆ రాత్రి రాతి గుండెలతో
ఎంత నిబ్బరంగా చూడగలిగారు తల్లీ?
రాక్షస స్త్రీలు కూడా మీముందు బలాదూరే
అయ్యో! ఆపలేకపోయారా తల్లీ!
అపర దేవతల్లా మిమ్మల్ని పూజించే వాళ్ళం
ఏ ఆర్త నాదాలూ తల్లి పేగుల్ని కదలించలేదా తల్లీ!
మీరు నడిచిన నెత్తుటి నేలమీద కాలు నిలపలేక
బహుశా దేవతలు కూడా
ఆ రాత్రి శాశ్వతంగా
ఆర్య భూమి విడిచి పారిపోయుంటారు
మాకు మాతృత్వాల మీద
మానవీయ మమకారాల మీద
మానవత్వాల మీద
నమ్మకం పోయింది తల్లీ
ఆడత్వాల వెనక కూడా హిందుత్వాల
వర్ణ తత్వాల శత్రుత్వాలుంటాయని
ఇంత కిరాతకత్వం దాగుంటుందని
ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాం తల్లీ
అమ్మా! మీరు మావూరి స్త్రీలకు ఆదర్శం కావద్దు
అగ్నికి ఆజ్యం పోసినట్టే వుంటుంది
పల్లెల్లో పేటల్లో అంటరాని వీధుల్లో
మా శరీరాలు ప్రాణాలతో తిరగవు
మీ గాలిసోకితే
మా ఆడ బిడ్డలకు ఎండిన స్తనాలు కూడా మిగలవు
నరికిన నెత్తుటి ముద్దల్లాంటి
ఆసుపత్రి ప్రాంగణాల్లో
మా బాలింతల రక్తాశ్రువులు
కళ్ళల్లోంచి కాదు
పాలగుండె ల్లోంచి వర్షి స్తున్నాయి
భరతమాతా ! దుః ఖంగా వుంది
బాపు! బాధగా వుంది
బాబా! భగభగ మండుతోంది
ఏదైనా ఒక కొత్త దేశాన్ని సృష్టించుకోవాలనుంది
ఆత్మ గౌరవంగా బతకాలనుంది
కనీసం అక్కడైనా
మా మర్మాంగాలూ దేహాంగాలూ భద్రంగా వుంటాయి.
– – డా.ఎండ్లూరి సుధాకర్
(మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామంలో ఆధిపత్య వర్గపు స్త్రీలు రెచ్చ గొట్టి ఒక దళిత కుటుంబాన్ని సామూహికంగా చంపించిన నేపథ్యంలో…)
శోకంతో, దు:ఖోద్వేగంతో తడిసి రాలిన కన్నీటి అక్షరాలివి..
అవును కదా. ఎంత రాసినా దుఃఖం తీరని వేదన ఇది. ఇంకెన్ని తరాలు ఏడ్వాలో, ఇంకెన్ని రుధిర ప్రవాహాలు పారాలో భారత దేశంలో కులం తన వాస్తవ రూపంలో మర్యాదల ముసుగులు కప్పుకుని మిగిలే ఉందని చెప్పడానికి.