చెప్పులు కుట్టే మీకు యూనివర్సిటీ చదువులు కావాలా?


Ambedkar hostel, Patna University 01

“మీరు హరిజనులు. చదవడానికి, రాయడానికి మీకు హక్కు లేదు. బూట్లు, చెప్పులు కుట్టడమే మీ పని. మా ఇళ్ళలో మిమ్మల్ని దాసులుగా ఉంచుకుంటాం. మీ తాత ముత్తాతలు చేసిన పని అదే. మీరు హాస్టల్ ని వదిలిపెట్టి వెళ్లిపోండి. లేదా, ఇక్కడ రక్తపాతం తప్పదు.”

ఏ మారు మూల పల్లెలోనో అహం మూర్తీభవించిన అగ్రకుల భూస్వాములు పలికిన మాటలు కావు యివి. పాట్నా యూనివర్సిటీ విద్యార్ధుల ప్రేలాపనలు ఇవి. పాట్నా యూనివర్సిటీలో షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులు నివసించే భీం రావ్ అంబేద్కర్ వెల్ఫేర్ హాస్టల్ పైకి మూకుమ్మడి దాడికి వచ్చిన బీహార్ భూమిహార్ భూస్వామ్య కుల విద్యార్ధులు కులోన్మత్తతతో కూసిన కారు కూతలు. దాడి అనంతరం భూమిహార్ కులానికి చెందిన విద్యార్థులపై ఫిర్యాదు చేస్తూ బాధిత విద్యార్ధులు తమ ఫిర్యాదులో ఈ వివరాలు పేర్కొన్నారు. హాకీ కర్రలు, ఇటుకలు, రాళ్లు, తుపాకులు, నాటు బాంబులతో జరిగిన దాడిలో దళిత విద్యార్ధులు గాయపడ్డారని పత్రికలు తెలిపాయి.

పోయిన వారం పాట్నా యూనివర్సిటీలో జరిగిన ఈ కుల దురహంకార దాడిలో ముగ్గురు దళిత విద్యార్ధులు గాయపడ్డారని తెలుస్తోంది. ది హిందూ రిపోర్టు ప్రకారం ఈ యూనివర్సిటీలో దళిత విద్యార్థులపై కులాహంకార దాడులు ఇదే కొత్త కాదు. ముఖ్యంగా ‘రణవీర్ సేన’ పేరుతో బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా అనే భూస్వామి నాయకత్వంలో అగ్రకుల భూస్వాములు నిర్మించిన సాయుధ ముఠాలు బీహార్ దళిత, గిరిజన పల్లెలపై పడి నరమేధం సాగించిన రోజుల నుండి పాట్నా యూనివర్సిటీలోని దళిత విద్యార్ధులకు చదువు అంటే నిత్య పోరాటంగా మారింది.

“దాదాపు 30 మంది వరకూ ‘బ్రహ్మేశ్వర్ ముఖియా జిందాబాద్, ముఖియా అమర్ రహే, అంబేద్కర్ ని నాశనం చెయ్యండి’ అని నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చారు. వారు మా హాస్టల్ బైట నిలబడి రాళ్లు విసరడం మొదలు పెట్టారు. విద్యార్ధులను బైటికి లాక్కెళ్లి చితకబాదారు. గాలిలో తుపాకులు పేల్చుతూ, బాంబులు పేలుస్తూ ఉంటే మా హాస్టల్ ఆ మోతలతో దద్దరిల్లిపోయింది. మేము హాస్టల్ లోపలికి పారిపోయి దాక్కున్నాము. మా రూముల్లో మంచాలు నిలబడడానికి సపోర్టుగా ఉంచుకున్న ఇటుకలు తప్ప మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మా వద్ద ఏమీ లేవు” అని అంబేద్కర్ హాస్టల్ విద్యార్థి సత్య ప్రకాష్ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది.

Ambedkar hostel, Patna University 02పాట్నాలోని ‘కోచింగ్ డిస్ట్రిక్ట్’ లో ‘పాట్నా యూనివర్సిటీ’ లోని సైద్పూర్ హాస్టల్ కేంపస్ లో అంబేద్కర్ హాస్టల్ ఒక భాగం. అంబేద్కర్ హాస్టల్ కి ఎదురుగా జనరల్ కేటగిరీ విద్యార్ధుల కోసం ఉన్న ఐదు హాస్టళ్ల సమూహాన్ని సైద్పూర్ హాస్టల్ అని పిలుస్తారు. ఈ సైద్పూర్ హాస్టల్ గూండాలకు, సంఘ వ్యతిరేక శక్తులకు అనేక సంవత్సరాలుగా పేరెన్నిక గన్నది. ఇందులో విద్యార్ధుల సంఖ్య కంటే వారి పేరుతో నివసించే భూస్వామ్య గూండాల సంఖ్యే ఎక్కువని పత్రికల ద్వారా తెలుస్తోంది. ఒక యూనివర్సిటీ అధికారి ప్రకారం సైద్పూర్ హాస్టల్ లో నివసిస్తున్న వారిలో 80 శాతం విద్యార్ధులు కాని వారే. ముఖ్యంగా జెహనాబాద్ జిల్లాలోని భూములు కలిగిన భూమిహార్ కులస్తులు ఈ హాస్టళ్లలో ఉంటూ సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడడం వలన కావల్సినంత చెడ్డ పేరు హాస్టల్ కి వచ్చింది.

“సైద్పూర్ హాస్టల్ లో ఇతర కులాల విద్యార్ధులు కూడా ఉన్నప్పటికీ మొదటి నుండి భూస్వామ్య కులాల విద్యార్ధులదే ఆధిపత్యంగా ఉంటూ వచ్చింది. వీరు అధికంగా భూమిహార్లు. జెహనాబాద్, నలంద, గయ జిల్లాలనుండి వీరు ఎక్కువగా వస్తుంటారు. (సైద్పూర్) హాస్టల్ ఎస్.సి, ఎస్.టి లతో సహా అందరు విద్యార్ధులకూ ఉద్దేశించినదే అయినప్పటికీ విద్యార్ధులు చేరడం పూర్తయ్యాక చూస్తే వారు సైద్పూర్ హాస్టల్ కో, అంబేడ్కర్ హాస్టల్ కో చెందిన వారుగా పిలవబడతారు” అని ఒక అధికారి చెప్పాడు.

దీనివల్ల కులాలపై ఆధారపడిన ప్రాంతాల వారీ విభజన ఈ హాస్టల్స్ లో స్పష్టంగా కనిపిస్తుందని సదరు అధికారి సూచించాడు. జెహనాబాద్ భూమిహార్ కుల విద్యార్ధులైతేనే ఇక్కడ ఎటువంటి వేధింపులు లేకుండా ఉండగలడని ఆయన తెలిపాడు. “ఉదాహరణకి యాదవ విద్యార్థి చేరాడనుకోండి. అతని చితకబాదుతారు. పారిపోక తప్పని పరిస్ధితి కల్పిస్తారు. ఆ తర్వాత వారు తమ సొంత బంధువులను హాస్టల్ లో నింపుతారు. వారిలో చాలామందికి పాట్నా యూనివర్సిటీ ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. అతి భయంకరమైన పరిస్ధితి ఇక్కడ నెలకొని ఉంది” అని సైద్పూర్ హాస్టల్ విద్యార్థి ఒకరు చెప్పాడని ది హిందూ తెలిపింది. కొద్ది సంవత్సరాల క్రితం ఢిల్లీలో కాల్చి చంపబడిన గ్యాంగ్స్టర్ గుడ్డు శర్మ సైద్పూర్ హాస్టల్ నుండి ఉత్పత్తి అయిన వాడే. ఈ హాస్టల్ కారణంగానే అక్కడ ఉన్న పోలీసు చెక్ పోస్టు ను పూర్తిస్థాయి పోలీసు స్టేషన్ గా మార్చారని తెలుస్తోంది.

దళిత విద్యార్థులపై తరచుగా దాడులకు పురి గొలిపేది ఈ ప్రాంతం మొత్తానికి విద్యుత్ సరఫరా చేసే ఒక పవర్ గ్రిడ్. కులాధిపత్యాన్ని రుజువు చేసుకోవడానికి అంబేద్కర్ హాస్టల్ కి విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఒక సాధనంగా అమలు చేస్తారు సైద్పూర్ హాస్టల్ విద్యార్ధులు. ఈసారి కూడా అదే జరిగింది. “ఆ రోజు సాయంత్రం అంబేద్కర్ హాస్టల్ లో విద్యుత్ కోట ఉంది గానీ సైద్పూర్ జనరల్ హాస్టల్ లో లేదు. అంబేద్కర్ హాస్టల్ విద్యార్ధులు విషయం ఏమిటో కనుక్కుందామని అదే క్యాంపస్‌ లో ఉన్న విద్యుత్ కార్యాలయానికి వెళ్లారు. వీరిని చూసిన సైద్పూర్ హాస్టల్ విద్యార్ధులు దూకుడుగా వారి మీదికి వచ్చి కులం పేరుతో తిట్టడం మొదలు పెట్టారు. ‘హరిజన్’ ‘దుసాధ్’, ‘చమార్’ (నిమ్న కులాల పేర్లు) అని తిట్టడం ప్రారంభించారని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. “విద్యుత్ సరఫరా చేయమని మేము అడిగినపుడు ‘అసలు మీ జీవితంలో ఎప్పుడైనా లైట్ ని చూశార్రా?” అని దులపరంగా ప్రశ్నించారని సత్య ప్రకాష్ తెలిపాడు.

విద్యుత్ అధికారుల ప్రకారం అంబేద్కర్ హాస్టల్ కి విద్యుత్ సరఫరా ఉండి సైద్పూర్ హాస్టల్ కి కోత ఉన్నపుడు వారిపైన విపరీతమైన ఒత్తిడి వస్తుంది, అంబేడ్కర్ హాస్టల్ కి కూడా విద్యుత్ సరఫరా ఆపేయాలని. “విద్యుత్ సౌకర్యాన్ని సమానంగా పంచితే దాన్ని సైద్పూర్ హాస్టలర్స్ అసూయతో భరించలేరు. విద్యుత్ సరఫరా విషయంలో ఉన్న తగాదా చివరికి కుల ఘర్షణల రూపం తీసుకుంటాయి” అని ఒక విద్యుత్ అధికారి తెలిపాడు. అయితే ఈ అధికారి గుర్తించని విషయం ఏమిటంటే కులాధిపత్య దాడులే ఇలా విద్యుత్ ఘర్షణ రూపం తీసుకోవడం. విద్యుత్ కోసమే తగాదా అయితే అది ఎక్కడో ఒక చోట తేలికగా పరిష్కారం అవుతుంది.

ఒక జనరల్ విద్యార్థి ప్రకారం ఆ ప్రాంతం అంతా చీకటిలో మగ్గుతుండగా ఒక్క సైద్పూర్ హాస్టల్ కి మాత్రమే విద్యుత్ నిరాఘాటంగా సరఫరా కావడం అనేక సార్లు జరిగింది. అంబేడ్కర్ హాస్టల్ కి నీటి సరఫరా కట్ చెయ్యడం కూడా కులాధిపత్యాన్ని రుజువు చేసుకోడానికి అమలు చేసే చర్యల్లో ఒకటి. ఉదయం 9 గంటలకే అంబేద్కర్ హాస్టల్ కి నీటి సరఫరా ఆగిపోతుంది. మురికి నీరు సరఫరా కావడం అనేక సార్లు జరుగుతుంది. ఫలితంగా ఎప్పుడు చూసినా కొద్ది మంది ఎస్.సి విద్యార్ధులు పచ్చ కామెర్లుతో బాధపడుతూ ఉంటారు. కులాధిపత్యాన్ని రుజువు చేసుకోవడానికి నిరంతరం చేసే ప్రయత్నాలే ఇక్కడి ఘర్షణలకు మూల కారణం.

మొన్నటి దాడి గురించి పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మొదట 10 మంది నిందితులని పేర్కొన్న పోలీసులు ఆ తర్వాత 5 గురు పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ లో మిగిల్చారు. పెద్దల జోక్యంతో అసలు నిందితులైన బయటి వ్యక్తులు తప్పించుకోగా మందీ మార్బలం లేని వాస్తవ విద్యార్ధులు నేర భారాన్ని మోయడం మామూలే ఇక్కడ. బయటి వ్యక్తుల బలం ఇక్కడ ఎంతగా ఉంటుందంటే కొన్నిసార్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వారి చేతుల్లో తన్నులు తిన్న ఉదంతాలకు కొదవ లేదని యూనివర్సిటీ అధికారులు చెప్పే వాస్తవాలు. దానితో యూనివర్సిటీ అధికారులు కూడా భయపడి ఈ హాస్టల్ జోలికి రారు. ఎవరన్నా అడిగితే ‘పోలీసులకి రాస్తున్నాం, చూస్తున్నాం’ అని చెప్పడం వారికి రివాజు. పోలీసుల్ని అడిగితే నెపాన్ని యూనివర్సిటీ అధికారులపై మోపుతున్నారు.

పత్రికలు కూడా అంబేద్కర్ హాస్టల్ విద్యార్థులపై వివక్షను పాటిస్తాయి. తాజా ఘర్షణలో దాడి చేసింది సైద్పూర్ విద్యార్ధులు కాగా ఎస్.సి విద్యార్ధులే దాడి చేశారని స్థానిక హిందీ పత్రికలు రాసాయని ‘ది హిందూ’ తెలిపింది. వాళ్ళు అంత మంది ఉండగా తామెలా దాడి చేయగలమని అంబేద్కర్ హాస్టల్ విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాధికారులు కూడా హిందీ పత్రికల కధనాలు అవాస్తవమని తేల్చి చెప్పడం విశేషం. అరెస్టులు జరిగినప్పటికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు ఉండవని గ్యారంటీ లేదు. అరెస్టుల నేపధ్యంలో మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవడానికి సైద్పూర్ హాస్టల్ నివాసులు ప్రయత్నిస్తున్నట్లు పత్రికలు చెబుతున్నాయి. సరస్వతి పూజ పేరుతో అందుకోసం విరాళాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది.

సైద్పూర్ హాస్టల్ మీదుగా వెళితే యూనివర్సిటీ దగ్గర. కానీ అంబేద్కర్ హాస్టల్ విద్యార్ధులకు ఆ దారి దుర్లభం. పాట్నా యూనివర్సిటీ అంబేద్కర్ హాస్టల్ విద్యార్ధులకే కాదు, ఈ దేశంలో అధికారం కోసం, పదవుల కోసం, సంపదల కోసం వేయబడిన దారులు అన్నింటిలోనూ దళితులకు ప్రవేశం లేదు. ఇక అడ్డదారుల సంగతి చెప్పనే అవసరం లేదు. దళితులు అడ్డదారులు తొక్కితే చట్టం తానున్నానని అష్ట దిక్కులూ పిక్కటిల్లేలా హుంకరిస్తుంది మరి!

One thought on “చెప్పులు కుట్టే మీకు యూనివర్సిటీ చదువులు కావాలా?

  1. శతాబ్దాల క్రితమే , ప్రపంచం నలుమూలల నుంచీ విద్యార్ధులు వచ్చి చదువుకున్న నలందా విశ్వ విద్యాలయం ఆవిర్భవించిన , సర్వ మానవ శాంతికీ , ముక్తి మార్గాన్ని బోధించిన గౌతమ బుద్ధుడు జన్మించిన , బీహారు రాష్ట్రం లో, ఈ విధం గా దళిత విద్యార్ధుల మీద జరిగిన దాడి ఘోరమూ , అమానుషమూ కూడా !
    ఇట్లా చేసిన వారు భారత దేశ ప్రజలంతా, ఆ మాటకొస్తే , మానవత్వం ఉన్న వారంతా , అవమాన పడే పరిస్థితి కల్పించారు ! వారికి నిరంతరాయం గా విద్యుత్ సరఫరా ఉన్నా కూడా , అజ్ఞానం చీకటి లో , అంధులు గానే ఉన్నారు !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s