వామ్మో ఫేస్ బుక్!


Abolish 66A“ఇక ఫేస్ బుక్ జోలికి పోకూడదు” అనిపించటాలుగా పరిస్ధితి వచ్చేసినట్లుంది చూడబోతే. లేకపోతే ఐ.టి చట్టం సెక్షన్ 66-ఎ పేరు చెప్పి ఈ వరుస అరెస్టులు ఏమిటి? బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై కార్టూన్ షేర్ చేశాడని ఒక ప్రొఫెసర్ ని అరెస్టు చేసి జైల్‌లోకి తోయించింది లగాయతు చిదంబరం కొడుకు కార్తీక్ దగ్గర్నుంచి యు.పి ప్రభుత్వం మీదుగా చండీఘర్ అమ్మాయి వరకూ ఫేస్ బుక్ వ్యాఖ్యలను క్రిమినలైజ్ చేయడం జాస్తి అయింది. తాడేపల్లి, కృష్ణమోహన్ బృందం అరెస్టు లాంటి ఒకటి రెండు ఘటనలు తప్ప మిగిలినవన్నీ ఐ.టి చట్టం ఎంతటి అప్రజాస్వామిక కోరలను పోలీసులకు, పాలకులకు సమకూర్చిపెట్టిందో స్పష్టం చేస్తున్నాయి.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న సివిల్ ఇంజనీరు సంజయ్ చౌదరి పైన ఐ.టి చట్టం ప్రయోగించారు. ప్రధాన మంత్రి, కపిల్ సిబాల్, ములాయం సింగ్ యాదవ్… ఈ ముగ్గురి పైనా గీసిన అభ్యంతరకర కార్టూన్ లను తన ఫేస్ బుక్ వాల్ పైన ఉంచాడని ఆయనపై అభియోగం మోపారు. నిన్నటి వరకు ప్రధాని, కపిల్ సిబాల్… ఈ ఇద్దరి పైన మాత్రమే కార్టూన్ లు ఉన్నాయట. వారిద్దరి పైన వచ్చిన కార్టూన్లు వల్ల సమస్య రాలేదు గానీ, ములాయం సింగ్ పైన కూడా కార్టూన్ ప్రత్యక్షం కావడంతో సంజయ్ చౌదరి ఫేస్ బుక్ వాల్ మీద ఉన్న కార్టూన్లు అభ్యంతరకరంగా మారాయని ఎన్.డి.టి.వి, ఫస్ట్ పోస్ట్ తెలిపాయి.

ఆగ్రాలో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్న సంజయ్ ఆ కార్టూన్ల గోల తనకు తెలియదని మొత్తుకుంటున్నాడు. తన ఫేస్ బుక్ ఖాతాని ఎవరో హేక్ చేసి కార్టూన్లు పోస్ట్ చేశారని, వాటితో తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నా పోలీసులు తమ పని ఆపలేదు. పాలక దొరల ఆజ్ఞ అయ్యాక పోలీసులకు వెనుకా ముందూ ఆలోచించే అవకాశం ఎలాగూ ఉండదు. సంజయ్ చౌదరిపైన ఐ.టి చట్టంతో పాటు కుల (మత) సామరస్యం చెడగొడుతున్నాడన్న ఐ.పి.సి సెక్షన్ కూడా బనాయించామని ఆగ్రా ఎస్.పి ఎస్.సి.దూబే చెప్పాడని ది హిందూ తెలిపింది.

గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బెంగాల్ ప్రొఫెసర్ ని ఇలా కార్టూన్ ల విషయం మీదనే ముఖ్యమంత్రి మమత కేసు మోపి అరెస్టు చేయించింది. ఈ అరెస్టులపైన దేశ వ్యాపితంగా విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల కమిషన్ సుమోటో గా కేసుని స్వీకరించింది. నేరంగా గుర్తించడానికి వీలులేని చర్యకు అర్ధరాత్రి పూట ప్రొఫెసర్ మహాపాత్రో, ఆయన పొరుగింటి నివాసి సుబ్రతో రాయ్ లను అనవసరంగా తప్పుడు కేసు మోపి అరెస్టు చేసినందుకు ఇద్దరికీ రు. 50,000 నష్టపరిహారం చెల్లించాలని కూడా మానవ హక్కుల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఇదిలా ఉండగానే తనను ఇబ్బంది పెట్టే ప్రశ్న వేసినందుకు ఒక కాలేజీ విద్యార్థినిని మావోయిస్టు గా మమత ఆరోపించి టి.వి లైవ్ ఇంటర్వ్యూని మధ్యలో వదిలి వెళ్లిపోయింది. మరో చోట వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగిన ఒక రైతు కూడా మావోయిస్టు అని ఆరోపించి కేసు బనాయించింది మమత. ఇలాంటి చర్యలు మమత బెనర్జీకే పరిమితం కాదని సంజయ్ చౌదరి ఫేస్ బుక్ కేసు తెలియజేస్తోంది.

గత సెప్టెంబర్ లో 22 సంవత్సరాల చండీఘర్ అమ్మాయి హీనా బక్షి పైన పోలీసులు ఐ.టి చట్టం మోపి కేసు పెట్టారు. తన వాహనం పోయిందని ఆమె ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో తన ఫేస్ బుక్ వాల్ మీద ట్రాఫిక్ పోలీసులను విమర్శిస్తూ వ్యాఖ్య రాసిందట ఆమె. పోలీసులకు అదే పెద్ద నేరం అయిపోయింది. పదేళ్ల క్రితం ఒక దొంగతనాన్ని అడ్డుకుని దొంగను పట్టిచ్చినందుకు హినా బక్షికి సాహస బాలిక అవార్డు ఇచ్చి ప్రభుత్వం సత్కరించడం విశేషం. ట్రాఫిక్ పోలీసులను తిడుతూ పోస్ట్ పెట్టిందని అప్పట్లో సాక్ష్యాత్తూ రాష్ట్ర హోమ్ కార్యదర్శే పత్రికలకు చెప్పాడు.

Aseem Trivediసెప్టెంబర్ నెలలోనే అసీం త్రివేది అనే కార్టూనిస్టు ఐ.టి చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. పార్లమెంటు ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తూ కార్టూన్ గీసి తన బ్లాగ్ లో ప్రచురించడం ఆయన చేసిన నేరం. జాతీయ పతాకంను చీరగా ధరించిన భారత మాతపైన రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు దాడి చేస్తున్నట్లు గీసిన కార్టూన్ కూడా పాలకులకు, వారి అనుచరగణమైన బ్యూరోక్రాట్లకు కోపం తెప్పించింది. నిజానికి పార్లమెంటు స్థాయిని దిగజార్చింది అసీం త్రివేది కాదు. పార్లమెంటు సభ్యులే ముష్టి యుద్ధాలు, తిట్ల పురాణాలు, అన్-పార్లమెంటరీ పద ప్రయోగాలు లాంటి తమ ప్రవర్తనల ద్వారా దిగజార్చారు. ఆ విషయాన్ని అసీం త్రివేది కార్టూన్ ద్వారా వ్యక్తీకరించాడు. కొంతమంది ఆయన వ్యక్తీకరణ మొరటుగా ఉందని చెప్పినా ఆయన అరెస్టును మాత్రం ఆమోదించలేదు. అనేకమంది దేశ ద్రోహులు దర్జాగా సంపదలతో తులతూగుతుండగా అసీం త్రివేది పైన దేశ ద్రోహం కేసు కూడా మోపారు.

కార్తీ చిదంబరం కేసు మరీ విడ్డూరం. రాబర్ట్ వాద్రా కంటే ఎక్కువగా కార్తీ చిదంబరం (కేంద్రమంత్రి పి చిదంబరం పుత్రుడు) అక్రమ ఆస్తులు పోగేసుకున్నాడని పుదుచ్చేరికి చెందిన ఒక చిన్న తరహా పారిశ్రామికవేత్త (రవి) ట్విట్టర్ లో సందేశం పోస్ట్ చేశాడు. ఐ.టి చట్టం సెక్షన్ 66-ఎ కింద అది నేరమని కార్తీ ఫిర్యాదు చేయడంతోనే సి.ఐ.డి పోలీసులు రవిని అరెస్టు చేసి కోర్టుకి పంపారు. ఈ లెక్కన పాలకుల అవినీతి గురించి రాస్తున్న పత్రికల యజమానులు, ఎడిటర్లు, విలేఖరులు తదితరులంతా నేరస్థులే కావాలి. వాళ్లందరి పైనా కేసులు నమోదు కావాలి. నిజానికి పత్రికల్లో వచ్చిన విషయమే తాను ట్విట్టర్ లో పోస్ట్ చేశానని రవి చెప్పాడు కూడా. గత అక్టోబర్ నెలలో నమోదైన ఈ కేసు ఇంకా నడుస్తోంది.

facebook arrestపాల్ఘార్ అమ్మాయిల సంగతి అందరికి తెలిసిందే. శివసేన నేత బాల్ ధాకరే మరణానంతరం అంతిమ యాత్ర సందర్భంగా ముంబై బంద్ పాటించడం విషయమై ఒక విద్యార్ధిని ముంబై ప్రజలు భయంతో బంద్ పాటిస్తున్నారు గానీ గౌరవంతో కాదు” అని వ్యాఖ్యానం చేస్తూ తన ఫేస్ బుక్ వాల్ మీద రాసుకుంది. దానిని మరో అమ్మాయి లైక్ చేసింది. శివ సైనికులకు ఇది నచ్చలేదు. వారు ఫిర్యాదు చేసిందే తడవుగా పోలీసులు అమ్మాయిలిద్దరిపైనా కేసు పెట్టగా శివసేన పార్టీ కార్యకర్తలు అమ్మాయి యొక్క డాక్టర్ బంధువు క్లినిక్ పైన దాడి చేసి వీరంగం వేశారు. ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అమ్మాయిలపై కేసు పెట్టిన పోలీసుల పైనే ఎదురు కేసు పెట్టాలని డిమాండ్ చెయ్యడంతో అమ్మాయిలు బతికిపోయారు. తన వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని ఆ అమ్మాయి ఒక పబ్లిక్ ఫోరంలో మాట్లాడుతూ చెప్పినట్లు కొద్ది రోజుల క్రితం పత్రికలు నివేదించాయి. కట్జు పుణ్యమాని పోలీసులు వారిపైన కేసు ఉపసంహరించుకుని పోలీసుల పైన శాఖాపరమైన విచారణ చేస్తున్నారు. మరి కట్జు స్పందించని కేసుల సంగతి?

కాశ్మీర్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు ఒక రాక్ బేండ్ గా ఏర్పడి మొట్టమొదటి ప్రదర్శన ఇవ్వడానికి పూనుకున్నారు. కాశ్మీర్ లోని ముస్లిం మతోన్మాదులకు ఇది ససేమిరా నచ్చలేదు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా అమ్మాయిల ప్రదర్శనకి మద్దతు ఇస్తూ ట్విట్టర్ లో సందేశాలు పోస్ట్ చేసినా టీనేజి అమ్మాయిలు తమ కళా స్వేచ్ఛను చంపుకుని ప్రదర్శన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ముస్లిం మతం పేరుతో అనేకమంది వారి ఫేస్ బుక్ వాల్ పైన బెదిరింపులు, తిట్లు, హెచ్చరికలు పోస్ట్ చెయ్యడంతో వారు భయభ్రాంతులయ్యారు.

All girl rock bandఅజ్ఞాత వ్యక్తులు బెదిరింపులు, హెచ్చరికలు ఒక ఎత్తయితే కాశ్మీరు గ్రాండ్ ముఫ్తి అమ్మాయిల ప్రదర్శనకి వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడం మరొక ఎత్తు. ముఫ్తి ప్రకటనతో కాశ్మీర్ అమ్మాయిలు తమ ప్రదర్శనని రద్దు చేసుకోవడమే కాకుండా అసలు పాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అసలు పాడడమే ఇస్లాంకు వ్యతిరేకం అని గ్రాండ్ ముఫ్తి ప్రకటించడమే అత్యంత దారుణం. పాట అనేది మానవ సమాజ సంస్కృతిలో విడదీయలేని భాగం. సమాజం బతికి బట్ట కట్టడానికీ, నేటి స్థాయికి అభివృద్ధి చెందడానికీ శ్రమ ముఖ్యమైన సాధనం అయితే దానితో పాటు పుట్టిందే పాట. అందుకే పనీ, పాట అంటారు. పని, పాట రెండూ జంట పదాలు అయిన కారణమే అవి రెండూ అవిభాజ్యాలని చెప్పడానికి. అలాంటిది పాడడమే ఒక మత సూత్రాలకి విరుద్ధం అయితే ముస్లిం మతంలో ఎన్ని పాటలు లేవని? ఎన్ని బూతు, అసభ్య పాటలు ముస్లిం పాటగాళ్లు సృష్టించి సొమ్ము చేసుకోవడం లేదు? ఎన్ని ముస్లిం సంగీత రీతులు ఇస్లాంలో లేవని? వీరి పాటలకు లేని అభ్యంతరం అమ్మాయిల పాటలకు తలెత్తడంలో అంతరార్ధం స్పష్టమే. అమ్మాయిలు కళా స్వేచ్ఛకి అర్హులు కాదన్న పితృస్వామ్య నీతి దానికి కారణం.

ప్రఖ్యాత నటుడు గిరీష్ కర్నాడ్ ఆ మధ్య ముంబైలో నైపాల్ కి జీవిత సాఫల్య అవార్డు ఇచ్చి సత్కరించినందుకు తీవ్రంగా విమర్శ చేస్తూ భారతదేశ సంస్కృతిలో ఇస్లాం ఎంతగా సమ్మిళితం అయిందో వివరించింది సంగీతం ఆధారంగానే. భారత దేశ చరిత్రను సరిగ్గా గ్రహించినట్లయితే ఇస్లాం మన దేశానికి అందించిన సంగీత వారసత్వ సంపద విలువ కట్టలేనిదని గ్రహిస్తారని ఆయన సోదాహరణంగా వివరించి చెప్పాడు. అలాంటి ఇస్లాం మతంలో పాటకు స్ధానం లేదని చెప్పిన కాశ్మీర్ గ్రాండ్ ముఫ్తి సమాజానికీ, దేశానికీ, చరిత్రకీ ఏ సందేశం ఇస్తున్నట్లు? పాట నుండి వేరు పడితే మతమే కాదు సమాజంలో, సంస్కృతిలో ఏ విభాగం అయినా ప్రజల్లో మన గలదా? మత పెద్దలు ఈ విధంగా సహజ సామాజిక సంస్కృతుల గమనానికి ఆనకట్టలు నిర్మించాలని భావిస్తే, సంస్కృతుల సంగమాన్ని అడ్డుకుని ఆయా సంస్కృతుల సహజ అభివృద్ధి పరిణామాన్ని అడ్డుకోవాలని భావిస్తే వారే ప్రజలకు దూరమయ్యే రోజు త్వరలోనే వస్తుంది.

గ్రాండ్ ముఫ్తి స్వయంగా ఇస్లాంలో పాటకు స్ధానం లేదని ఫత్వా ఇవ్వడంతో ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్ వ్యాఖ్యలను తొలగించాడు. అయితే ఆయన చేసిన ఒక మంచి పని రాక్ బ్యాండ్ సభ్యుల ఫేస్ బుక్ పేజీలపై బెదిరింపులు, తిట్లు పోస్ట్ చేసిన వ్యక్తుల పైన ఐ.టి చట్టం ప్రయోగించి కేసు పెట్టడం. ఇదంతా చెప్పడం ఎందుకంటే ఐ.టి చట్టం ఇలాంటి ఒక మంచి పనికి ఉపయోగపడిందని చెప్పడానికే. కానీ ఈ మంచి పనికి ఐ.టి చట్టం సెక్షన్ 66-ఏ తరహా చట్టంతో అవసరం లేదు. సాధారణ అభిప్రాయాల వ్యక్తీకరణను, అసంతృప్తుల వెల్లడిని కూడా నేరంగా మార్చే ఐ.టి చట్టం అత్యంత అప్రజాస్వామికం. తాడేపల్లి, కాశ్మీర్ రాక్ బ్యాండ్ అమ్మాయిలను బెదిరించిన వ్యక్తులు… మొదలైన వారిని దారికి తేవడానికి ఇలాంటి రాకాసి కోరల చట్టంతో పని లేదు. ఒకటి రెండు మంచి పనులు జరిగాయని ఐ.టి చట్టానికి సమర్థనలు ఇవ్వలేము.

ఐ.టి చట్టం ప్రధానంగా ప్రజల ప్రజాస్వామిక వ్యక్తీకరణలకు సంకెళ్లు వెయ్యడానికి ఉద్దేశించినది. ట్యునీషియా, ఈజిప్టు, బహ్రయిన్ తదితర దేశాల్లో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన లేదా ప్రేరేపించబడిన తిరుగుబాట్లు ఇంటర్నెట్ ని ఒక సాధనంగా చేసుకోవడం ఈ చట్టానికి నేపధ్యంగా పని చేసినట్లు కనిపిస్తోంది. రాజకీయ కార్టూన్ లను, పోలీసులపై విమర్శలను, రాజకీయ నేతలపై విమర్శలను సహించబోము అని చెప్పడానికి ఐ.టి చట్టాన్ని పాలకులు వినియోగిస్తున్నారు. తద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలోని అత్యంత ప్రాధమిక ప్రక్రియకు అడ్డు తగులుతున్నారు. అందుకే ఈ చట్టం రద్దు కోసం ప్రజలు, ప్రజాస్వామ్య ప్రియులు ప్రభుత్వాలను డిమాండ్ చేయాలి. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చిన భావవ్యక్తీకరణ సాధనాలైన ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్లను నేర చట్టాలకు దూరంగా ఉంచాలని డిమాండ్ చెయ్యాలి.

13 thoughts on “వామ్మో ఫేస్ బుక్!

 1. ఫలానా మహిళా రాజకీయ నాయకురాలికి అక్రమ సంబంధాలు ఉన్నాయని బయట మాట్లాడుకునేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి శిక్షలు పడవు కానీ అవే విషయాలు ఫేస్‌బుక్‌లో వ్రాస్తే శిక్షలు ఎందుకు పడతాయి? Wrong propaganda అనేది ఎక్కడ చేసినా అది తప్పే కదా.

 2. రావు గారూ, నా ఉద్దేశంలో అది ఇల్లు తగలబెట్టుకోవడంతో సమానం. అభివృద్ధి సాంకేతిక పరిగ్నానాన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి తప్ప దూరం కాకూడదు. ఫేస్ బుక్ ఆధారంగా ఇప్పుడు అనేక పనులు నడుస్తున్నాయి. ఎక్కడ ఉన్నామన్నదీ సంబంధం లేకుండా ఒకరినొకరు ఉచితంగా సంభాషించుకోవడానికి, స్నేహ సంబంధాలు పెంచుకోవడానికీ, సామాజిక సంబంధాలు సరికొత్త రీతిలో అభివృద్ధి కావడానికి ఫేస్ బుక్ లాంటి సైట్లు దోహదపడుతున్నాయి. మానవ నాగరికత అభివృద్ధిలో శాస్త్రాభివృద్ధి క్రమంలో ఫేస్ బుక్ ని ఒక అనివార్య పరిణామంగా పరిగణించి దానిని సానుకూలంగా ఉపయోగపెట్టుకోవడం మనిషి కర్తవ్యం.

  వ్యాపార ప్రయోజనాల కోసం ఇందులోకి రాజకీయాలు, వాటి వెంట ప్రభుత్వాలు జొరబడడం వలన విపరిణామాలు కలుగుతున్నాయి. ఆ సమస్యను పరిష్కరించుకోవాలే గానీ, మొత్తం ఫేస్ బుక్ నే నిషేధించడం సరికాదని నా అభిప్రాయం. అలాంటి నిషేధాలు పని చెయ్యవని చైనా లాంటి ఉదాహరణలు చెబుతున్నాయి. అక్కడ స్వేచ్ఛగ బ్లాగింగ్ చేసుకోవడం నిషేధం. అయినప్పటికీ బ్లాగులు వెలుస్తూనే ఉన్నాయి. ఫిల్టరింగ్ ని తప్పించుకుని ప్రజలని చేరుతూనే ఉన్నాయి.

 3. you have to understand the fundamentals Islam, actually music is banned in Islam from its birth,but it is not possible to total prohibition of music in Muslim peoples,so lot of people not know about these.Islam gives important to resentfulness of life of man in life and after life by discipline and worship towards one God ALLAH, not by enjoyment by music,alcohol,dance etc.please say after understanding of fundamentals and principles of Islam,do not write these like articles against Islam

 4. నూర్ అహ్మద్ గారు ముందుగా మీరు గుర్తించవలసిన విషయం: ఈ ఆర్టికల్ భావ ప్రకటనా స్వేచ్ఛకి అనుకూలంగా రాసింది తప్ప ఇస్లాంకి వ్యతిరేకంగా కాదని.

  పనితో పాటే పాట పుట్టిందని నేను ఆర్టికల్ లో రాసాను. కష్టం చేసే మనిషి తనను తాను ఉల్లాసపరుచుకునే క్రమంలో పాట పుట్టిందని దాని అర్ధం. ఇందులో ఏ మతానికి వచ్చిన చిక్కేమీ లేదు. మీ వ్యాఖ్యలో ఆ సంగతి పరోక్షంగా వ్యక్తం అయిందనిపిస్తోంది.

  “actually music is banned in Islam from its birth” అని అంటూనే

  “but it is not possible to total prohibition of music in Muslim peoples” అని కూడా మీరు అంగీకరించవలసి వచ్చింది. ఈ రెండింటిలో ఏదో ఒకటె నిజం కావాలని మీకు తోచడం లేదా?

  సంగీతం పైన నిషేధమే ఉంటే అనేక ముస్లిం సంగీత సాంప్రదాయ రీతులు ఎలా అభివృద్ధి చెందుతాయి? మచ్య, పశ్చిమ, దక్షిణ ఆసియాలతో పాటు ఉత్తర ఆఫ్రికాలలో కూడా వైవిధ్యమైన ముస్లిం సంగీత రీతులు మొదటి నుండి అభివృద్ధి చెందాయని నేను చదివాను. ఆర్టికల్ లో చెప్పినట్లు భారత దేశ సంస్కృతి వికాసంలో ముస్లిం సంగీత రీతులు అవిభాజ్యమని గిరీష్ కర్నాడ్ లాంటి నాటక ప్రయోక్తలు చెప్పిన విషయాన్ని విస్మరించలేము.

  మతం ఏదైనా సంగీతం అనేది మానవ సంస్కృతిలో అవిభాజ్యం అని నా అభిప్రాయం. దానితో మీరు విభేదిస్తే అది మీ ఇష్టం. నా అబిప్రాయాలకు నా బ్లాగ్ ఒక వేదిక. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని గమనించగలరు.

 5. meeru grand mufti statement dharunam ani rasaaru,adi elaa avutundi,vaaru islam lo lenidi cheppaledu,fatwa jari cheyyadam, danini patinchadam muslims ki sambandhichina vishayam ,meeru,dani gurinchi comment cheyyalsina avasaram emundi.
  music prohibit cheyyadamu ,chesukolekapovadam kuda,muslims ki matrame chendina vishayalu. Muslims music vinadamu chestunnaru, padutunnaru kuda, kani adi tappu ani,danni patinche varu takkuve kavachu anduvalla meeru muslims ki chendina personal vishayallo muslims viruddha abiprayalu chebite adi me swechha ku chendina vishayama, mee guruchi me religios ki chendina vishayala meeda nenu comment cheste meeru adi naa freedom ani accept cheyyagalara

 6. Any religion is not a book or set of strict rules, religion is always will be in transformation stage it will change always but that transformation will go in positive. Any religion people should not be rigid in rules. We should think always “why?”

 7. నూర్ అహ్మద్ గారూ నా అభిప్రాయాలను మీరు ఎట్టి అభ్యంతరం లేకుండా విమర్శించవచ్చు. నాకు మతం లాంటిది ఎమీ లేదు. కనుక నా మతాన్ని విమర్శించే అవకాశం మీకు లేదు. అందుకనే నా అభిప్రాయాలను మీరు విమర్శించవచ్చని అంటున్నాను. అలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఈ బ్లాగ్ లో చాలా మంది చేసారు కూడా.

 8. నూర్ అహ్మద్ గారూ!
  ముస్లిములుకూడా మనుషులే. మనుషుల హక్కులకోసం గళం విప్పాల్సిన అవసరమూ, హక్కూ మనుషులందరికీ ఉంది. వాళ్ళు ముస్లిములైనంత మాత్రాన వారి జీవితాల్ని శాసించే హక్కు మాకుంది, వారికి బాసటగా నిల్చేహక్కు మీకులేదు అని ఎలా చెప్పగలరు చెప్పండి? వారు ముస్లిములైనంత మాత్రాన వారెంత exploitationకు గురౌతున్నా వారికి బాసటగా నిలిచే హక్కులేదనడం ఏం వాదన చెప్పండి? ఒక ఇంట్లో ఒకరు ఇంకొకర్ని చంపేసి, “అది మా personal వ్యవహారం” అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఇదీ అలాగే. ముందు మనం మనుషులం తరువాతే ఏదైనా. మనుషులకుండే హక్కులు ముస్లిములకూ ఉంటాయి. ఉండాలికూడా.

 9. To understand some things it need to months or years may be lifetime also,but ultimately all are have to go through a standard pattern only about life,i am telling what is human beings are vibrating between science and bereaves,we all are not perfect at understanding about those two hings,so don’t go to commit either any theist or atheist,be try to understand those,and behave like a smart. meeru atheist ani naaku anipinchindi.

 10. నూర్ అహ్మద్ గారు!

  మీరేం చెప్పాలనుకున్నారో నాకు అర్ధంకాలేదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది మనుషుల గురించి, వారి హక్కుల గురించి కాబట్టి సైన్సుని బయటకి గిరవాటెయ్యవచ్చు (for science doesn’t deal with this sort of stuff). ఇక మిగిలింది మతం. మనుషులందరి ఆశలు, ఆకాంక్షలు ఒకేలా ఉంటాయన్న విషయం అర్ధంకావాలంటే ఇక్కడనుంచి మతాన్నికూడా గిరవాటేసి (for it obstructs the tendency to stay un-biased), కేవలం కొందరు వ్యక్తులకు తమ ఆశయాల సాధనలో, చిన్ని చిన్ని ఆశలు నెరవేర్చుకొనే క్రమంలో వారికి అడ్డుపడుతున్న మూర్ఖపు ధోరణులను గురించి మాట్లాడుకోవాలి.

  ఇందులోకి నా/మీ ఇజాల గూర్చిన (theism/atheism) ప్రస్తావనలుగానీ, guessesగానీ లేకుండా ఉంటేనే మనం నిష్పక్షపాతంగా చర్చించగలమని నేను అనుకుంటున్నాను. మీరన్నట్లు దేనికీ commitకాకుండా మతాలజోలికి, ఇజాలజోలికీ పోకుండా “ఎందుకు?” అన్న ప్రశ్నవేసుకోవాలన్నదే నా అభిప్రాయం. ఇప్పుడు నాప్రశ్న : సంగీతంవల్ల, ఒక వ్యక్తి పాటపాడటంవల్ల నష్టం ఎమిటి? ఎందుకు దాన్ని అడ్డుకోవాలని ప్రయత్స్నిస్తున్నారు? ఎందుకు ఎవరైనా అలా ప్రయత్నించాలి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s