దళిత బాలికను చదివిస్తామని పిలిచి, అత్యాచారం చేసి…


Minor girlఅభం శుభం తెలియని 13 సంవత్సరాల దళిత బాలికను పని చేయించుకుంటూ చదివిస్తామని పిలిపించుకుని అత్యాచారం చేసిన దుర్మార్గం ముంబైలో వెలుగులోకి వచ్చింది. 72 సంవత్సరాల ఇంటి యజమాని, తన ఇంటిలో పని చేసే 18 యేళ్ళ కుర్రాడితో కలిసి 13 సంవత్సరాల పాప పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం విషయం ఫిర్యాదు చేసినప్పటికీ సదరు యజమాని కోడలు అమ్మాయినే చితకబాది బెదిరించడంతో ఆ అమ్మాయి మళ్ళీ అత్యాచారానికి గురయింది. ఎలాగో వీలు చూసుకుని తన తల్లికి ఫోన్ చేయడం, ఒక స్వచ్ఛంద సంస్థ వారికి అండగా నిలబడడంతో విషయం పోలీసుల వరకు వచ్చింది. నిందితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారని ది హిందూ పత్రిక తెలిపింది.

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో సత్నా జిల్లాలోని ఒక కుగ్రామానికి చెందిన 35 యేళ్ళ దమయంతి కోడా (అసలు పేరు కాదు) కడు పేదరాలు. కిడ్నీలో రాళ్లు తొలగించే ఆపరేషన్ వికటించి ఆమె భర్త 3 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమెకు కూడా బ్లాడర్ లో రాళ్లు తొలగించడానికి ఆపరేషన్ చేశారు. దాని వలన ఆమె బలహీనపడి ఏ పనీ చేయలేని పరిస్ధితిలో ఉంది. పెద్దమ్మాయి పదో తరగతి పూర్తి చేసి అదే గ్రామంలో పాచి పని చేస్తోంది. నలుగురు పిల్లలను పోషించలేక ఏడో తరగతి చదువుతున్న రెండో అమ్మాయి సరస్వతి (అసలు పేరు కాదు) ని ఇంటి పనికి సహాయకురాలిగా పంపడానికి ఒప్పుకుంది. ఇంటి యజమాని కోడలు గర్భం ధరించడంతో ఆమెకు సహాయంగా ఉండాలని, చదివిస్తూ పని చేయించుకుంటామని, నెలకి రు. 2000/- ఇస్తామని చెప్పడంతో వారి స్నేహితుల ద్వారా తన రెండో కూతురిని గత సంవత్సరం జులైలో అప్పగించింది.

“ఇక్కడికి వచ్చి వారి కుటుంబానికి పనిలో సాయం చేస్తే మంచి స్కూల్ లో చదివిస్తామని నాకు హామీ ఇచ్చారు. అమ్మాయికి రెండు కొత్త డ్రస్ లు కూడా కుట్టించారు. మా దరిద్రం నుండి ఈ అమ్మాయి అయినా బయటపడుతుందని నేను సంతోషించాను. ఇంట్లో ఇంకో ముగ్గురు పిల్లల కడుపులు కూడా నిండతాయని ఆశపడ్డాను. కానీ మా అమ్మాయికి వాళ్లేమి చేశారో చూడండి. అమ్మాయిని ఇక ఎక్కడికీ పంపను” అని దమయంతి కన్నీళ్లతో చెప్పిందని ది హిందూ తెలిపింది. పత్రిక ప్రకారం పాప రెండు సార్లు సామూహిక అత్యాచారానికి గురయింది.

ఇంటి యజమాని ఇల్లు, వారి సంపద చూసి సంతోషపడిన దమయంతి సంపదల వెనుక దాగిన క్రూర మనస్తత్వాలను పసిగట్ట లేకపోయింది. “వారిది చాలా పెద్ద ఇల్లు. రెండు అంతస్థులు ఉన్నాయి. ఆ ఏరియాలో వాళ్ళకు భూములు కూడా ఉన్నాయి. నెలకు రు. 2000 ఇచ్చి మంచి స్కూల్ లో చేర్పిస్తామని వారి స్నేహితుడు చెప్పిన తర్వాత ఇక్కడ అమ్మాయిని దరిద్రంలో ఉంచుతూ నేను మాత్రం చేసేదేముందని నేనన్నాను. నేనే పని చేయలేని పరిస్ధితిలో నలుగురు పిల్లలను ఎలా పోషించగలను?” అని దమయంతి వ్యాఖ్యానించింది. చివరి ఇద్దరు మగపిల్లల భవిష్యత్తు ఏదో దారికి వస్తుందని ఆలోచించి కొండంత నమ్మకంతో, ఆశతో సరస్వతిని సాగనంపిన దమయంతి ఆ పసి పిల్లను తోడేళ్లకు అప్పగిస్తున్నానని ఊహించలేకపోయింది.

చదివిస్తామని చెప్పినప్పటికీ సరస్వతి యజమానులు అదేమీ చేయలేదు. ఉదయం నుండి సాయంత్రం వరకూ తెంపు లేకుండా పని చేయించుకున్నా తన తల్లి పరిస్ధితి గుర్తుకు తెచ్చుకున్న సరస్వతి ఏమీ అనలేకపోయింది. “నేను ఇక్కడికి వచ్చినపుడు వీరి కుటుంబం పట్ల భయ విభ్రమాలకు లోనయ్యాను. వారు చాలా ధనవంతులు. నన్ను బాగానే చూశారు. నన్ను స్కూల్ కి పంపుతానని భాభీజీ చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చి రెండు నెలలు గడిచినంక నన్ను స్కూల్ కి పంపే ఉద్దేశాలు వారికి లేవని అర్ధం అయింది. రోజంతా పని చేయించేవారు. ఉదయం 6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకూ” అని సరస్వతి తెలిపింది.

సరస్వతి ఇచ్చిన వివరాల ప్రకారం కల్యాణ్ కి వచ్చిన రెండు నెలల లోపే యజమాని ఆకలి చూపులని ఆమె ఎదుర్కొంది. అమ్మాయి పడుకునే చోటికి ఆయన తరచుగా వచ్చేవాడు. నిద్ర పోతున్నపుడు వొళ్ళంతా తడిమేవాడు. ఏదన్నా గదిలో ఒంటరిగా పని చేసుకుంటున్నపుడు వచ్చి వాటేసుకొనేవాడు. ముసలోడి చేష్టలను కొన్ని రోజుల పాటు చూసిన సరస్వతి భరించలేక ఆయన కోడలికి ఫిర్యాదు చేసింది. ఆ కోడలు గారు తమ మామ గారిని చివాట్లు పెట్టడం మాని సరస్వతినే చితకబాదింది. నోరు మూసుకుని భరించమని గద్దించింది. దానితో యజమానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తమ వద్ద పని చేసే 18 సంవత్సరాల పనివాడితో కలిసి ఆయన గత డిసెంబర్ లో రెండు సార్లు సరస్వతిపై అత్యాచారం జరిపాడు.

సరస్వతి సహాయం చేయమంటూ పెద్దగా ఏడ్చినపుడు నోరు తెరుస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించారు. దానితో ఆమె భయపడి నోరు మూసుకుంది. ఆ తర్వాత పారిపోవడానికి సమయం కోసం ఎదురు చూసింది. “ఇంటికి ఫోన్ చేయడానికి కూడా నన్ను అనుమతించలేదు… నన్ను బాగా కొట్టారు. తీవ్రంగా బెదిరించారు. ఒక రోజు నన్ను కారులో ఎక్కడికో తీసుకెళ్లారు. నాకు 18 సంవత్సరాలు వచ్చాక నా పైన అత్యాచారం చేసిన మగ పని మనిషితో పెళ్లి చేస్తామని చెప్పారు. నేను అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు నన్ను మళ్ళీ కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. దానితో భయపడి ఒప్పుకున్నాను” అని సరస్వతి చెప్పింది.

అక్కడినుంచి వెళ్లిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్న సరస్వతి అవకాశం చూసుకుని ఇంటికి ఫోన్ చేసింది. వెంటనే తనను అక్కడినుంచి తీసుకెళ్లాలని అమ్మకి చెప్పింది. “అమ్మాయి నుండి ఫోన్ వచ్చాక రెండు రోజుల్లో నాసిక్ నుండి నా మేనల్లుడిని అక్కడికి పంపాను” అని దమయంతి తెలిపింది. జనవరి 2 న సరస్వతిని చూసిన ఆమె బావ జనవరి చివరికి గాని ముంబై నగరానికి చేర్చలేక పోయాడు. అది కూడా ‘హిందూ రాష్ట్ర సేన’ అనే సంస్థ సహాయంతో. ఈ సంస్థ సహాయంతో దమయంతి కళ్యాణ్ పోలీసులకు జనవరి 28 తేదీన ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన ఇంటి యజమాని, అతని వద్ద పని చేసే యువకుడు, అతని కోడలు, సరస్వతిని మధ్య ప్రదేశ్ నుంచి కళ్యాణ్ కి తెచ్చిన మరో మహిళ… ఈ నలుగురు పైన పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లలపై లైంగిక అత్యాచారం జరిపిన కేసు, పిల్లల అక్రమ రవాణా, జువెనైల్ జస్టిస్ చట్టం, ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం మొదలైన చట్టాల కింద నిందితులపై అభియోగాలు మోపారు. ఇద్దరు మగవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలను ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. సరస్వతికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆమె అత్యాచారానికి గురయినట్లు పరీక్షల్లో తేలిందని పోలీసులు చెప్పారు.

ఇంటి యజమాని చేసిన నిర్వాకానికి ఇపుడిపుడే లోకాన్ని ఆస్వాదిస్తూ తుళ్లి పడే పసిడి వయసులోకి అడుగు పెడుతున్న సరస్వతి తన కళ్ళల్లోని కళను, వెలుగును కోల్పోయింది. 13 సంవత్సరాలకే భవిష్యత్తు నిండా ప్రభావితం చూపే మానసిక గాయాన్ని చవిచూసింది. పెద్దగా లోకాన్ని చూడకుండానే ఇది ‘అందమైన లోకమనీ, రంగు రంగులుంటాయనీ’ అందరూ చెప్పేది నిజం కాదని తెలుసుకోవాల్సి వచ్చింది. అయితే ది హిందూ పత్రిక ప్రకారం అమ్మాయి ఇంకా పూర్తిగా నమ్మకాన్ని కోల్పోలేదు. జరిగింది వెనక్కి నెట్టేసి భవిష్యత్తు వైపు ఆశగా చూస్తూనే ఉంది. “నేను మా గ్రామానికి వెళ్ళి చదువుకుంటాను. ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తాను” అని ఆమె అంటోంది.

కానీ దమయంతి మాత్రం విచారంగా ఉంది. ఆమె విచారం ప్రభావం తప్పనిసరిగా సరస్వతి చదువు పైన ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. ఆమె దృష్టిలో వాళ్ళ కుటుంబ గౌరవం మంట కలిసిపోయింది. కుటుంబ ఆస్తులను తర తరాల పాటు కుటుంబంలోనే కొనసాగడానికి ఉనికిలోకి వచ్చిన పితృస్వామిక భావజాలపు శీల రాహిత్య కళంకం ఇప్పుడు ఆమెను పట్టి పీడిస్తోంది. కళ్యాణ్ లోనే ఉండి కేసు విషయం చూడడానికి ఆమెకు సహజంగానే ఆసక్తి లేదు. “నలుగురు పిల్లల్ని నేను సాకాలి. నేను ఇక్కడే ఎలా ఉండగలను? ఆ విషయం మర్చిపోవాలని అనుకుంటున్నాను. మా కుటుంబ గౌరవం మంట కలిసింది… ఇంకెవరికీ ఈ విషయం తెలియకూడదు” అని దమయంతి అన్నది. వచ్చే మూడు సంవత్సరాల్లో ఏదో విధంగా సరస్వతికి పెళ్లి చేసి పంపడమే ఆమెకి ఇప్పుడు ప్రధమ కర్తవ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s