ఆశిష్ నంది దళిత వ్యతిరేక వ్యాఖ్యలు, ఒక పరిశీలన


జైపుర్ లిట్ ఫెస్ట్ వేదికపై అశుతోష్ (ఎడమ చివర), ఆశిష్ నంది (కుడి చివర)

జైపుర్ లిట్ ఫెస్ట్ వేదికపై అశుతోష్ (ఎడమ చివర), ఆశిష్ నంది (కుడి చివర)

ఎస్.సి, ఎస్.టి, ఒ.బి.సి కులాలనుండి అత్యధికంగా అవినీతిపరులు వస్తున్నారని ఆశిష్ నంది చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. దేశ వ్యాపితంగా ఆయనకి వ్యతిరేకంగా ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు కావడంతో సదరు ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని కోరుతూ ఆశిష్ నంది సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. భావోద్వేగాలు మిన్ను ముట్టిన వాతావరణంలో తనపై దాడి జరగవచ్చని ఆయన కోర్టుకి విన్నవించాడు. ఆశిష్ నంది విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయన అరెస్టుపై స్టే విధించింది. జనవరి 26 తేదీన ఆశిష్ నంది చేసిన వ్యాఖ్యల విషయంలో దాఖలయిన ఎఫ్ఐఆర్ ల నిమిత్తం ఆయనను అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈలోపు “అలాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి లైసెన్స్ లేదని మీ క్లయింటుకి చెప్పండి” అని ఆశిష్ నంది లాయర్ ను కోర్టు హెచ్చరించింది. తనకు లేని ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడని ప్రశ్నించింది.

76 సంవత్సరాల ఆశిష్ నంది భారత దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందిన సామాజిక శాస్త్రవేత్త. రాజకీయ, సామాజిక పరిణామాలపై వ్యంగ్యం వ్యాఖ్యలు చేయడం ఆయనకి ఉన్న అలవాటు. నిందాస్తుతితో విషయాన్ని సమాజం దృష్టికి తేవడానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. జైపూర్ లో జరుగుతున్న సాహితీ పండుగ (జైపూర్ లిటరరీ ఫెస్టివల్ – జె.ఎల్.ఎఫ్) లో జనవరి 26 తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆ కోవలోనివే అని ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తున్నది.

పాక్షిక సత్యం

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం ఆశిష్ నంది వ్యాఖ్యల నేపధ్యం ఇది: ఆ రోజు మొదటి సెషన్ లో ‘రిపబ్లిక్ ఆఫ్ ఐడియాస్’ విషయంపై చర్చ నడుస్తోంది. తెహెల్కా పత్రిక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అవినీతిని వర్గ సమానత సాధించే సాధనం (class equalizer) గా అభివర్ణించాడు. “సమాజంలో అణచివేతకు గురయిన వర్గాలవైపు నుండి (from wrong side) నిబంధనలను అతిక్రమించి, చట్టాల లొసుగులను ఉపయోగించుకుంటూ ముందుకు పురోగమిస్తారు. మనం అటువంటి వర్గ అడ్డంకులను తయారుచేసి పెట్టుకున్నందున వారికి ఉన్న ఏకైక మార్గం అదే” అని తరుణ్ తేజ్ పాల్ వ్యాఖ్యానించాడు. కింది వర్గాలు అభివృద్ధి చెందడానికి తగిన మార్గాలను ప్రభుత్వాలు కల్పించని పరిస్ధితుల్లో చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకుంటూ అవినీతి మార్గాల ద్వారా వారు పురోగమిస్తున్నారని ఆయన సూచించాడు.

తరుణ్ తేజ్ పాల్ వ్యాఖ్యలు పాక్షిక సత్యం మాత్రమే. అవినీతి చేస్తే తప్ప కోట్లాది రూపాయలు ఆర్జించలేని సమాజంలో భారత దేశంలోని అణగారిన వర్గాలు నివసిస్తున్నారన్నది నిజం. రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపుకి సరైన తిండి, చదువు, నీడ దక్కని కుటుంబాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఆ అవినీతి సైతం అందుబాటులో ఉన్నది పై వర్గాలకే కాగా, ఆ అవినీతికి బలవుతున్నది మళ్ళీ అణగారిన వర్గాలే. వారు దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మహిళలు, కార్మికులు, రైతులు కావచ్చు. వీరి బ్రతుకులు నానాటికి ఛిద్రం కావడమే తప్ప మెరుగుపడుతున్న దాఖలాలు లేవు. వీరి జీవితాలు చట్టాలలోని ఏ లొసుగుల ద్వారా మెరుగుపడుతున్నాయి? ఏ లొసుగులను వినియోగించి అంబానీ, టాటా, బిర్లాల స్థాయికి దళితులు చేరుతున్నారు? వేళ్లమీద లెక్కించ గలిగిన కొద్దిమందికి ఎమ్మెల్యే, ఎం.పి, ముఖ్యమంత్రి లాంటి పదవుల ద్వారా రాజకీయాధికారం దక్కినంత మాత్రాన ఆ పరిస్ధితిని ఈక్వలైజర్ అని చెప్పగలమా?

తరుణ్ తేజ్ పాల్ వ్యాఖ్యలు సారాంశంలో యధాతధ స్థితి కొనసాగడానికి మద్దతుగా వస్తున్నాయి. కలిగిన వర్గాలు ఉద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగా ఉండడానికి చట్టాల్లో ఏర్పాటు చేసుకున్న లొసుగులను ఆయన వ్యాఖ్యలు న్యాయబద్ధం చేస్తున్నాయి. గిరిజనులను అడవులనుండి తరిమివేసి స్వదేశీ, విదేశీ బహుళజాతి గుత్త కంపెనీలు తవ్వుకుని పోవడానికి, కార్మిక చట్టాలను పచ్చిగా ఉల్లంఘించి కార్మికుల శ్రమలను చౌకగా కొల్లగొట్టుకుపోవడానికీ, మహిళా సాధికారతా సమానతా చట్టాలను ఉల్లంఘించి మహిళలకు అత్యంత తక్కువ వేతనాలు చెల్లించి సొమ్ము చేసుకోవడానికీ, అభివృద్ధి పేరుతో కోట్లాది ఎకరాల భూములను అగ్రకుల భూస్వామ్య, పెట్టుబడిదారీ వర్గాలకు, రియల్ ఎస్టేట్ మాఫియాలకు కట్టబెట్టడానికీ చట్టాలలోని లొసుగులు ఉపయోగపడుతున్నాయే తప్ప ఈక్వలైజర్ ఫ్యాక్టర్ గా కాదు. రాను రాను సంపదలు ఇంకా కొద్ది మంది చేతులలోనే కేంద్రీకృతం అవుతున్నాయని ప్రభుత్వాల నివేదికలు, ఐక్యరాజ్యసమితి నివేదికలే చెబుతున్నాయి. ఇక ఈక్వలైజింగ్ ఎక్కడ?

బహుశా ఒకే ఒక పరిమిత కోణంలో తరుణ్ తేజ్ పాల్ వ్యాఖ్యలు నిజం కావచ్చు. బడుగు తరగతులకు చెందిన వారిలో, ఉదాహరణకి దళితుల్లో గానీ, గిరిజనులు, ఒ.బి.సిలలో గానీ కొందరు అవినీతికి పాల్పడి ధనవంతులు కావడం. దీనిని ఎలా చూడాలి? ఆధిపత్య వర్గాలకు, అణచివేతకు గురవుతున్న వర్గాలకూ మధ్య సమానత సాధించే క్లాస్ ఈక్వలైజర్ గా చూడవచ్చా?

క్లాస్ ఈక్వలైజింగ్ కాదు, క్లాస్ కన్సాలిడేషన్

బడుగు వర్గాల కోసం రాజ్యాంగంలో పొందుపరచబడిన కొన్ని ఉపశమన సదుపాయాల ద్వారా దళితులు, గిరిజనులు, ఒ.బి.సిలలో కొందరు ధనికులుగా మారిన మాట వాస్తవమే. వారి సంఖ్య వేళ్లపైన మాత్రమే లెక్కించగలం. రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు అలాంటి వారికి ఉపయోగపడిన సదుపాయాల్లో ముఖ్యమైనది. కానీ ఈ ప్రక్రియ క్లాస్ ఈక్వలైజింగ్ కోసం జరిగింది కాదు; క్లాస్ కన్సాలిడేషన్ (class consolidation – వర్గ దోపిడి స్థిరీకరణ) కోసం మాత్రమే జరిగింది. ఇది అర్ధం కావడానికి చరిత్రను కొద్ది మాటల్లో చూడడం అవసరం.

దేశంలోని భూములు, పరిశ్రమలు, సహజ వనరులు కొన్ని అగ్రకులాల భూస్వాములకే పరిమితమైన హక్కుగా ఉన్న పరిస్ధితుల్లో తమ జీవితాల మెరుగుదల కోసం అశేష శ్రామిక ప్రజలు దేశ వ్యాపితంగా తిరుగుబాట్లు లేవదీశారు. ఇవి అనేక రూపాల్లో వ్యక్తం అయ్యాయి. అలాంటి రూపాల్లో ప్రధానమైనది జాతీయ స్వాతంత్ర్య పోరాటం. వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిష్ వాడు దేశాన్ని తమ సరుకులకు మార్కెట్ గా మార్చుకోవడానికీ, దేశ వనరులను ముడి సరుకులుగా తరలించుకుపోవడానికి దేశాన్ని ఆక్రమించాడు. దేశంలోని రాజులు, భూస్వాములు వాడికి లొంగిపోయి, సహకరించి, దేశ ప్రజల దోపిడిలో బ్రిటిష్ వాడికి జూనియర్ భాగస్వాములుగా చేరారు. అంటే అప్పటికి దేశంలో ధనికులుగా ఉన్న భూస్వాములు బ్రిటిష్ వాడికి ప్రతిఘటన ఇవ్వడం మాని సహకరించారు.

తాము కొల్లగొట్టిన దానిలో కొంత భాగాన్ని బ్రిటిష్ వాడు స్థానిక ధనికులకు భాగం ఇచ్చాడు గనక దీని వలన భారత దేశ ధనికులకు (భూస్వాములకు, బ్రిటిష్ ప్రాపకంతో ఎదిగిన దళారీ పెట్టుబడిదారులకు) పోయిందేమీ లేదు. కానీ ఈ దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రైతులు, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులకు మార్కెట్ లేక తల్లడిల్లిపోయారు. శతాబ్దాల తరబడి వలస, అర్ధ భూస్వామ్య పాలనలో మగ్గి పోయారు. దానితో ప్రజల్లో తిరుగుబాట్లు బయలుదేరాయి. సిపాయిల తిరుగుబాటు, తెభాగ, తెలంగాణ మొదలుకొని అల్లూరి, భగత్ సింగ్, ఆజాద్, గదర్ వీరుల వరకు బ్రిటిష్ వలస పాలనను వణికించారు. ఈ తిరుగుబాట్లు ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ అణచివేత, పీడనల నుండి ఉద్భవించినవి. అందువలన వీటిని చూసి వణికిపోయింది ఒక్క బ్రిటిష్ వలస పాలకులే కాదు. దేశంలో జాతీయోద్యమ ముసుగులో ఉన్న భూస్వామ్య, దళారీ పెట్టుబడిదారులు కూడా వణికిపోయారు.

ఎందుకని? ఎందుకంటే దేశీయ భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు వలస పాలకులకు సహకరించి తమ వాటా తాము పొందారు గనక. తిరుగుబాట్లు, జాతీయోద్యమం పూర్తిగా ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతే వారింక తమ వాటాలకు కూడా నీళ్ళు వదులుకోవాల్సిందే. ఈ కారణం వల్ల బ్రిటిష్ వలస పాలకులు, దేశీయ భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ఫలితమే 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి జరిగిన అధికార మార్పిడి. ఈ విధంగా కింది వర్గాల (దళితులు, రైతులు, కూలీలు, కార్మికులు, ముస్లింలు, అగ్రకుల పేదలు) శ్రమలను దోచుకుంటూ సదరు దోపిడీకి వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాట్లనుండి తమను తాము కాపాడుకోవడానికి భారత దేశ ధనికులు విదేశీ సామ్రాజ్యవాద పెట్టుబడిదారులతో అవగాహనకి వచ్చి తమ జూనియర్ భాగస్వామ్య వాటాకు ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ సో కాల్డ్ స్వాతంత్ర్యం దరిమిలా దేశీయ పాలకులకు సాపేక్షకంగా కొంత స్వతంత్రత వచ్చింది. దానిని వినియోగించుకుని వారు తమ సామ్రాజ్యవాద యజమానులను మార్చుకోగలిగారు. అంటే ఒక్క బ్రిటన్ మాత్రమే కాక, అమెరికా మొదలు హాలండ్ వరకూ దేశంలో పెట్టుబడులు పెట్టి ప్రజలకు చెందవలసిన సంపదలను తరలించుకు వెళ్ళేందుకు అనుమతించారు. మరొక పక్క శ్రామిక వర్గాలలోని అనేక కులాల, ప్రాంతాల, జాతుల ప్రజలు తమ జీవితాల మెరుగుదల కోసం ఆందోళనలు కొనసాగించిన నేపధ్యంలో వారినుండి కూడా కొంత మంది ప్రతినిధులను తయారు చేసుకోవాల్సిన అవసరం భారతదేశ ఆధిపత్య వర్గాలయిన భూస్వాములకు, దళారీ పెట్టుబడిదారులకు వచ్చి పడింది. పార్లమెంటరీ ప్రాతినిధ్య ఎన్నికల వ్యవస్ధలో ప్రతి ఒక్కరి ఓటు లెక్కకు వచ్చిన నేపధ్యంలో కూడా ఈ అవసరం ఆధిపత్య వర్గాలకు వచ్చింది.

ఆ విధంగా ఆధిపత్య వర్గాలు తమ దోపిడి, అణచివేతలను యథావిధిగా కొనసాగించుకోడానికి వీలుగా శ్రామిక వర్గాలనుండి అభివృద్ధి చేసుకున్న ప్రతినిధులే తరుణ్ తేజ్ పాల్ చెబుతున్న ఈక్వలైజింగ్ ఫ్యాక్టర్ సిద్ధాంతానికి ఆధారం. కనుక ఇది క్లాస్ కన్సాలిడేషన్ (ఆధిపత్య వర్గాలు తమ దోపిడీని స్థిరపరచుకునే ప్రక్రియ) మాత్రమే తప్ప క్లాస్ ఈక్వలైజింగ్ కాదు. శ్రామిక వర్గాలను వివిధ కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలుగా విడగొట్టి, విడగొట్టిన విభాగాలనుండి ప్రతినిధులను తయారు చేసుకుని, తమ వర్గంలో కలుపుకుని తమ ఆధిపత్యాన్ని, దోపిడిని మరింత స్థిరపరచుకుంటే అది క్లాస్ కన్సాలిడేషన్ అవుతుంది తప్ప క్లాస్ ఈక్వలైజింగ్ కాదు.

ఆశిష్ నంది రంగ ప్రవేశం

తరుణ్ తేజ్ పాల్ చెప్పిన ‘వర్గ సమానీకరణ’ సిద్ధాంతంలో వర్గం అంటే ఆర్ధిక వర్గం కాకుండా దళితులు, గిరిజనులు, ఒ.బి.సి లు అయినట్లయితే ఆ సిద్ధాంతానికి ఒక ఆమోదయోగ్యత లభించవచ్చు. బాబూ జగ్జీవన్ రామ్, మాయావతి, మధు కోడా, శిబూలాల్ సొరేన్, మరాండి తదితర దళిత, గిరిజన, ఒ.బి.సి ధనిక, రాజకీయ ప్రముఖులను దృష్టిలో పెట్టుకుని తరుణ్ తేజ్ పాల్ తన సిద్ధాంతాన్ని (సిద్ధాంతం అన్న దృష్టి తరుణ్ కి లేకపోవచ్చు) ప్రతిపాదించాడన్నది స్పష్టమే. ‘ఇన్నాళ్లూ అగ్ర కులస్తులే సంపదలను అనుభవించారు; కానీ అవినీతి ద్వారా దళితులు, గిరిజనులు, ఒ.బి.సి లు కూడా సంపదలు పోగేసుకొని అగ్ర కులాలు వర్సెస్ కింది కులాల మధ్య ఒక సమానత సాధించారు’ అన్నది తరుణ్ తేజ్ పాల్ ఉద్దేశం. ఆ విధంగా అవినీతి క్లాస్ ఈక్వలైజర్ గా పని చేస్తోంది అని తరుణ్ చెప్పదలిచాడు. ఈ అర్ధంలో తరుణ్ ఉపయోగించిన క్లాస్ అనే పదం దాని వాస్తవ అర్ధంలో ఉపయోగించబడలేదు. లేదా దళితులు, గిరిజనులు, ఒ.బి.సి లు అందరినీ వారి ఆర్ధిక స్ధాయిలతో సంబంధం లేకుండా ఒకే క్లాస్ గా ఆయన పరిగణించాడు. ఈ విధంగా చూసినపుడు మొదటి పరిశీలనలోనే తరుణ్ ప్రతిపాదన ఆయా పదాలకు ఉన్న సామాజికార్ధిక అర్ధం రీత్యా తేలిపోతుంది.

సామాజికార్ధిక పరిభాషను పక్కన పెట్టి చర్చకోసం తరుణ్ ఉద్దేశాన్ని మాత్రమే పరిగణిద్దాము. ఇక్కడే ఆశిష్ నంది రంగ ప్రవేశం చేశాడు. తరుణ్ తేజ్ పాల్ కి ఆయన మద్దతు ఇస్తూ దానిని మరింత విపులీకరించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం తిన్నగా చెయ్యకుండా యథావిధిగా తన ధోరణిలో నిందాస్తుతి (irony) మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, “అవినీతికి పాల్పడుతున్నవారిలో అత్యధికులు ఒ.బి.సి, ఎస్.సి, ఎస్.టి కులాలనుండి వస్తున్నారు” అని. ఈ ఒక్క వాక్యమే పత్రికల్లో బహుళ ప్రచారం పొందింది. ఆ తర్వాత ఆయన మరొక వాక్యం కూడా జత కలిపాడు; “ఈ పరిస్ధితి ఇలా కొనసాగినంతవరకూ ఇండియన్ రిపబ్లిక్ బతికి బట్టకడుతుంది” అని. రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ రిపబ్లిక్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న టాపిక్ కి ప్రతిస్పందనగా ఈ చర్చ జరగడం గమనించవలసిన విషయం.

ఆశిష్ నంది వ్యాఖ్యలను వేదికపై ఉన్న అశుతోష్ (ఐ.బి.ఎన్ లైవ్ ఎడిటర్) వెంటనే ఖండించాడు. “నేను విన్న వాటిలో ఇది అత్యంత వికారమైన స్టేట్ మెంట్. బ్రాహ్మణులు, అగ్రకులాలు అవినీతికి పాల్పడినా తేలికగా తప్పించుకోగలరు. కానీ కింది కులాల వారు అదే పని చేస్తే అదో పెద్ద తప్పై పోతుంది. అలాంటి స్టేట్ మెంట్ సరైంది కాదు” అని ఆశిష్ నంది వ్యాఖ్యకు అశుతోష్ స్పందించాడు.

అయితే ఆశిష్ నంది ఉద్దేశం కూడా సరిగ్గా ఇదే. అశుతోష్ ఖండన తర్వాత ఆయన ఇచ్చిన వివరణలోనే ఆ సంగతి స్పష్టం అయింది. అవినీతి ఆరోపణలతో పట్టుబడుతున్నది ఎక్కువగా ఒ.బి.సి, ఎస్.సి, ఎస్.టి కులాలకు చెందినవారేనని, అగ్రకులాలకు మల్లె తమను తాము రక్షించుకోవడానికి తగిన సాధనాలు వారికి అందుబాటులో లేకపోవడం వలన ఇలా జరుగుతోందని ఆయన వివరణ ఇచ్చాడు. “20 రూపాయల సంపాదన కోసం బ్లాక్ లో టికెట్ అమ్ముతున్న పేద వ్యక్తిని పట్టుకుని అది అవినీతి అని మీరు చెప్పగలరు. కానీ మిలియన్ల కొద్దీ అవినీతికి పాల్పడినా ధనికులు తేలికగా తప్పించుకోగలరు” అని ఆశిష్ నంది వివరణ ఇచ్చాడు.

ఆశిష్ నంది వ్యాఖ్యలోని రెండో అంశం ముఖ్యమైనది. పత్రికలు, రాజకీయ నాయకులు, సో కాల్డ్ దళిత నాయకులు ఈ అంశంపై దృష్టి సారించకపోవడం కాకతాళీయం ఏమీ కాదు. ఈ పరిస్ధితి ఇలా కొనసాగినంత వరకు ఇండియన్ రిపబ్లిక్ కి ఢోకా లేదని ఆయన చేసిన వ్యాఖ్యకు లోతైన అర్ధం ఉన్నది. పైన చెప్పినట్లు భారత దేశ ప్రజలపై విదేశీ సామ్రాజ్యవాదులు, దేశీయ భూస్వాములు, దళారీ పెట్టుబడిదారులు ఉమ్మడిగా సాగిస్తున్న దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా తిరుగుబాటు చేయగలిగింది భూములు లేని నిరుపేదలు, కార్మికులే. కానీ వీరు అత్యధికంగా దళితులు, గిరిజనులు, ఒ.బి.సి కులాల లోనే కేంద్రీకృతమై ఉన్నారు. ఈ కులాల పేదలను కులాలుగా, ప్రాంతాలుగా, జాతులుగా విడగొట్టడంలో, విడగొట్టి బలహీన పరచడంలో ఆధిపత్య వర్గాలు సఫలం అవుతున్నారు.

వారు అలా సఫలం కావడానికి ఆయా పేద కులాలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాల నుండి ఆధిపత్య వర్గాలు అభివృద్ధి చేసిన ప్రతినిధులు సేఫ్టీ వాల్వ్‌ గా ఉపయోగపడుతున్నారు. పేద కులాల వారు కూడా ఎమ్మెల్యేలు, ఎం.పిలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అవుతున్నారన్న సంతృప్తి దోపిడి వర్గంలోని బడుగు కులాల ప్రతినిధులు సమార్చుతున్నారు. తద్వారా అశేష శ్రామిక ప్రజల్లోని అసంతృప్తిని, తిరుగుబాటు ధోరణిని ఏదో మేరకు చల్లార్చుతున్నారు. ఈ పరిస్ధితి కొనసాగినంతవరకు ఆశిష్ నంది చెప్పినట్లు భారత రిపబ్లిక్ కు ఢోకా లేదు. అనగా భారత రిపబ్లిక్ ను నడుపుతున్న ఆధిపత్య వర్గాలు, వారిని నియంత్రిస్తున్న సామ్రాజ్యవాదులు గుండెలపై చేతులు పెట్టుకుని హాయిగా నిద్రపోవచ్చు. ఈ అర్ధంలో చూసినపుడు ఆశిష్ నంది వ్యాఖ్యలు అక్షర సత్యాలు అనడంలో సందేహం లేదు.

కానీ ఆశిష్ నంది తన భావ వ్యక్తీకరణకు ఎంచుకున్న పద్ధతి ఆయనకి ప్రమాదం తెచ్చి పెట్టింది. నిజానికైతే అది కూడా ప్రమాదకరం కాకూడదు. కానీ ఇలాంటి వ్యాఖ్యలను కూడా తమ ప్రయోజనాలకు అనుకూలంగా వినియోగించుకునే రాజకీయ నాయకులు, దళిత నాయకులు ఉన్నంతవరకూ, వారు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి అనుసరించే జనం ఉన్నంతవరకూ ఆశిష్ నంది లాంటి వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడడమే ఉత్తమం.

4 thoughts on “ఆశిష్ నంది దళిత వ్యతిరేక వ్యాఖ్యలు, ఒక పరిశీలన

  1. ఏ మాటల వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం శ్రామికవర్గం మోసపోతూనే ఉంటుంది. పెట్టుబడిదారీ వర్గం ఎంత వీలైతే అంతకాలం మనగలగడానికి తన భావజాలాన్ని కూడా కొత్త కొత్త రూపాలలో వదులుతూ ప్రజలను నిరంతరం భ్రమలలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఆ భ్రమలలో మేధావులు సైతం వక్రభాష్యాలు చెపుతుంటారు తెలిసి కొంత, తెలియక కొంత, భ్రమలతో కొంత.

  2. నిజమే కులమతాలు, వర్గ దృక్పథాలతో కాక మానవుని స్వవివేచనతొ ఆలోచనచేస్తే అసరు రంగు తెలుస్తుంది. మరొకరి కళ్ళజోడు నుంచి చూసే జనానికీ, నాయకులకీ, మీడియాకీ తమ అవసరాలకు అనుగుణమైన దోషాలు మాత్రమే కనిపిస్తాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s