మాది వైట్ వాష్ కమిటి అనే ప్రభుత్వం అనుకుంది –జస్టిస్ వర్మ కమిటీ సభ్యుడు


( కుడి నుండి) మాజీ సొలిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం, జస్టిస్ జె.ఎస్.వర్మ, హిమాచలప్రదేశ్ మాజీ చీఫ్ జస్టిస్ లీలా సేధ్

( కుడి నుండి) మాజీ సొలిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం, జస్టిస్ జె.ఎస్.వర్మ, హిమాచలప్రదేశ్ మాజీ చీఫ్ జస్టిస్ లీలా సేధ్

[ఢిల్లీ బస్సులో సామూహిక అత్యాచారం దుర్ఘటనపై వెల్లువెత్తిన ప్రజల డిమాండ్స్ కు స్పందించి మహిళా చట్టాలలో మార్పులు తేవడానికి నియమించబడిన జస్టిస్ వర్మ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. 30 రోజుల గడువు కోరి 29 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసి ఇచ్చిన కమిటీ దానికి కారణం కూడా చెప్పింది. అనేక సామాజిక కోణాలతో ముడి పడి ఉన్న బాధ్యతను కేవలం ముగ్గురు సభ్యులు తీవ్రంగా శ్రమించి ముప్పై రోజుల్లోనే అధ్యయనం చేసి నివేదిక ఇచ్చినపుడు విస్తృతమైన మంది మార్బలం ఉన్న ప్రభుత్వం శ్రమిస్తే ఇంకా తక్కువ కాలంలోనే చట్టాలు తయారు చేస్తుందని తాము ఆశించామని జస్టిస్ వర్మ నివేదిక సమర్పిస్తూ పత్రికలకు చెప్పాడు. ఈ ఆశను వారు తమ నివేదికలో కూడా పొందుపరిచారు.

అయితే కమిటీ సభ్యుల్లో ఒకరు, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం ప్రకారం ప్రభుత్వం ఉద్దేశ్యాలు వేరే ఉన్నాయి. తమ కమిటీని కేవలం వైట్ వాష్ కమిటీ గానే ప్రభుత్వం భావించిందని ఆయన ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. రాజకీయాలా, రాజ్యాంగమా తమకు ఏది ముఖ్యమో ప్రభుత్వం తేల్చుకోవాలని ఆయన సూచించాడు. మిలిటరీకరణ సంస్కృతిలో భాగంగా ఒక ఎత్తుగడగా సాయుధ బలగాలు అత్యాచారాలు చేస్తున్నారని వారికి సాధారణ శిక్షల నుండి మినహాయింపు ఇవ్వరాదని ఖరాఖండీగా తేల్చి చెప్పాడు.

ఆందోళనకారులు అనేకమంది అత్యాచార నిందితులకు ఉరి శిక్ష విధించాలని ముక్తకంఠంతో నినదించినప్పటికీ మహిళా సంఘాలు అలా కోరలేదని, వారు అత్యంత సంయమన పూర్వక దృక్పథంతో సూచనలు చేశారని ఆయన కొనియాడాడు. బాధితురాలు సమాజంలో భాగం అయినట్లే నిందితులు కూడా సమాజంలో భాగం అని తద్వారా సమాజమే వారిని అలా తయారు చేస్తుందన్న సత్యాన్ని వారు నొక్కి చెప్పారని గోపాల్ సుబ్రమణ్యం తెలిపాడు. ఇపుడు ఉన్న 14 సంవత్సరాల గరిష్ట శిక్ష సరిపోతుందని వారు చెప్పినప్పటికీ తాము మాత్రం దానిని అంగీకరించలేక పోయామని, అరుదైన కేసులకు మరణ శిక్షకు కాస్త తక్కువగా జీవితాంతం జైలులో గడిపేలా గరిష్ట శిక్ష విధించాలని తాము భావించామని సూచించాడు.

ది హిందూ విలేఖరి సందీప్ జోషి చేసిన ఇంటర్వ్యూకి ఇది యధాతధ అనువాదం. –విశేఖర్]

***                    ***                    ***

కమిటీ ఏయే సవాళ్లను ఎదుర్కొన్నది?

మేము మా పని మొదలుపెట్టినపుడు నేర పూరిత చర్యలకు సంబంధించిన చట్టాలను మాత్రమే సమీక్షించవలసి ఉంటుందని ఊహించాము… కానీ నెమ్మదిగా అర్ధం అయిన విషయం ఏమిటంటే నిందితులను విచారించడం (prosecution), పరిశోధించడం (investigation), వారిని దోషులుగా నిరూపించడం… వీటిని విజయవంతంగా పూర్తి చేయడం కూడా సమస్యగానే ఉన్నదని.

కనుక అది మమ్మల్ని రెండో చాప్టర్ కి తీసుకెళ్లింది: మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ఒక నిర్దిష్ట విధమైన ఉదాసీనత ఎందుకు ఉన్నది? అది మమ్మల్ని మరో ప్రశ్నకు దారి తీసింది. మహిళల కోణం నుండి ఈ నేరాన్ని మనం ఎలా చూడాలి; అది కేవలం నేర పూరితమైన ఒక సాధారణ చర్య మాత్రమేనా?

అది (అత్యాచారం) ఒక లైంగిక లక్ష్యం కలిగిన నేరం అని మేము కనుగొన్నాము – అది అత్యంత ముఖ్యమైన విషయం. ఆ వ్యక్తి మహిళ అయినట్లయితే ఇక అక్కడ రాజ్యాంగబద్ధమైన ఒక నిర్దిష్ట స్థాయి రక్షణ ఉంటుంది; అది కూడా ఉల్లంఘించబడుతోంది. అందువలన మేము దీనిని రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి పరిశీలించాలని నిర్ణయించాము. ‘సమానత్వం’ అనే రాజ్యాంగ సిద్ధాంతం నుండి మేము ఆ విధంగా మొదలు పెట్టాము.

ఆ తర్వాత మనం దీనిని మనది పితృస్వామిక సమాజం అనే వెలుగులో పరిశీలించాలి. మన సమాజంలో ఉనికిలో ఉన్న ధోరణులను మనం చూడాలి – సమాజంలో లింగ నిష్పత్తి వక్రగతిలో ఉంది. ఆడ పిండాల హత్యలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. యువతులు తమ ప్రారంభ వయసులో, ఒక్కోసారి మన గ్రామాల్లో, ఎదుర్కొన్న సందేశాలను మనం పరిగణించాలి: ‘అయ్యో దేవుడా, నువ్వు పుట్టావా!’ లాంటివి. అమ్మాయి కంటే అబ్బాయి చాలా ఎక్కువని ఎలా భావిస్తున్నారో దాన్ని పరిగణించాలి. తర్వాత, పాఠశాలల్లో సామాజికీకరణ (socialization of schools) అనేది అమ్మాయిలకి చాలా కష్టంగా ఉంటోంది. వారు తమ జీవితంలో ప్రగతి సాధించడానికి ఎన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయో చెప్పలేము. ఇవన్నీ కలిసి ఒక సాంస్కృతిక అసమతౌల్యానికి దారి తీస్తున్నాయి… దీనిని సవరించవలసిన అవసరం ఉంది.

ఒక నిరోధక సంస్కృతిలో భాగంగా ఇది చాలా ముఖ్యమైన అంశం; తద్వారా సమాజంలో అత్యాచారాలు ఇక జరగకూడదు. అటువంటి పరిస్ధితులకు దారి తీసే సూచనలు ఇవ్వడం కూడా మాకు అప్పగించబడిన పనియొక్క విధి విధానాల్లో (terms of reference) భాగం. కనుక ఈ పనిని మేము బహుళ పక్ష దృక్పథాల నుండి పరిశీలించాము. పిల్లలకు బోధించవలసిన దృక్పథం నుండి, పురుషులు సైతం దయాళువుగా, శ్రద్ధగా భావించేందుకు దారి తీసే విధంగా మనసులనుండి పురుషత్వం లాంటి స్టీరియోటైప్ లను తొలగించే దృక్పథం నుండి పరిశీలించాము.

విముక్తి పొందవలసిన అవసరం ఉన్న కొత్త ఇండియా వైపుకి, భద్రత అవసరమైన పారదర్శకత వైపుకి మనం పయనిస్తున్నాము.

వాళ్ళు (యువత) ఏం కావాలని కోరుతున్నారు? మహిళలు ఏం కావాలని కోరుతున్నారు? వారికి గ్యారంటీ చేయబడిన వారి రాజ్యాంగబద్ధ హక్కులు వాస్తవ జీవితంలోకి తర్జుమా కావాలన్న ఒక సాధారణ కోరికని వారు కోరుతున్నారు – ఒక వ్యక్తిగా ఒక స్థలంలో భద్రత ఉండి తీరాలన్న చిన్న కోరిక అది. నా ఉద్దేశ్యంలో అది రాజ్యంపైన ఉన్న ఒక రాజ్యాంగబద్ధ బాధ్యత. కనుక, దానిని అమలు చేసేలా చూడడానికి ఒక పద్ధతిని రూపొందించాలని మేము నిర్ణయించాము.

ప్రజల భావోద్వేగం అత్యాచారానికి మరణ శిక్ష వేయడానికి అనుకూలంగా ఉంది. అరుదైన వాటిల్లో అరుదైన కేసుకి మరణ శిక్ష వేసే విషయం పరిశీలిస్తామని ప్రభుత్వం కూడా సూచించింది. కానీ కమిటీ దానిని సిఫార్సు చేయలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే అత్యాచారం జరిగాక హత్య జరిగితే ఐ.పి.సి సెక్షన్ 302 కింద మరణ శిక్ష అందుబాటులో ఉంది. కానీ సెక్షన్ 376 కింద దోషిగా రుజువయిన వ్యక్తికి మరణ శిక్ష విధించడం పూర్తిగా వేరే విషయం. ఈ విషయంపై మేము లోతుగా చర్చించిన తర్వాత, వాస్తవానికి మనం శిక్షలను మార్చే ప్రక్రియలో ఉన్నపుడు… పగ తీర్చుకునే రాజకీయాలు ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చాము.

ఉపశమనాలతో కూడిన జీవిత కాల శిక్షకి, అంటే 14 సంవత్సరాల జైలు శిక్షకి, మహిళా సంఘాలు సంతృప్తికరంగానే ఉన్నాయి. శిక్షను పెంచాలని వారు కోరలేదు. వాస్తవానికి ఆ మాట అన్నది మేమే: కాదు, మరింత నిరోధకంగా ఉండేట్లు మరింత ముందుకు మనం వెళ్ళాలి, అని… కానీ మేము మరణ శిక్షకు కాస్త ఇవతల వరకు వెళ్ళి ఆగాము.

బాధితురాలు సమాజంలో భాగం అయినట్లే, నిందితులు కూడా సమాజంలో భాగమే అన్న సత్యాన్ని నిరాకరించలేమని మహిళలు చెప్పారు. ఈ దృక్పథాన్ని మాకు సిఫార్సు చెయ్యడంలో వారు అత్యంత దూరదృష్టిని, పరిణతిని వారు ప్రదర్శించారు.

మరో అంశం ఏమిటంటే మరణ శిక్ష అందుబాటులో ఉన్నపుడు అది నిర్హేతుకంగా ఉపయోగపడవచ్చు. అందుకని మేము అత్యంత తీవ్రత కల శిక్షల్లో రెండోదానిని (సహజ జీవిత కాలం పాటు జైలులో గడపడం) ఎంచుకున్నాము.

‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం’ ని సమీక్షించాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందని మీరు భావిస్తున్నారా?

అది అసలు సున్నితమైన సమస్యే కాదు. సాయుధ బలగాలకు అత్యంత ఉన్నతమైన గౌరవం ఉంది. కానీ మేము సాయుధ బలగాలను సాధారణ దృష్టితో చూస్తూ మాట్లాడడం లేదు. అత్యాచారం అనే నేరానికి పాల్పడే కొంతమంది వ్యక్తుల గురించే మేము మాట్లాడుతున్నాము. ఎందుకని వారిని బాధ్యులను చేయకూడదు? సాయుధ బలగాలను ఇది ప్రభావితం చేస్తుందని నేను అనుకోవడం లేదు.

అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే, అది మిలిటరీకరణ చేసే సంస్కృతి గురించిన విషయం. (It is about the culture of militarization.) సాయుధ బలగాలు అత్యాచారానికి పాల్పడితే అది మిలిటరీకరణ సంస్కృతి. అత్యాచారం అనేది మిలిటరీకరణ ఎత్తుగడల్లో (techniques) ఒకటి. ఏమంటే, మీ సొంత ప్రజలపై మిలిటరీ ఎత్తుగడలను అమలు చేయకూడదు, అది చాలా భయంకరం.

ఖాప్ పంచాయితీలు మరియు మత గురువుల ఆజ్ఞల గురించీ, వారి మహిళా వ్యతిరేక బోధనల గురించీ కమిటీ మాట్లాడింది. రాజకీయ కారణాలతో వారిని ప్రభుత్వం తాకడం లేదని కూడా చెప్పింది. సమాజాన్ని ఇది ఏ విధంగా ప్రభావితం చేస్తోంది?

రాజకీయాలా, రాజ్యాంగమా ఏది కావాలో ప్రభుత్వం తేల్చుకోవాలి. రాజ్యాంగం అంటే భారత దేశ ప్రజలు. కమిటీ ఇవ్వాలనుకుంటున్న సందేశం ఇదే.

మీరు రాజకీయాలతో ఆడుకోవాలనుకుంటున్నారా, అయితే ఒక విషయం గుర్తు పెట్టుకోండి, రాజకీయాలంటే రాజ్యాంగాన్ని ఓడించడమూ మరియు మాయపుచ్చడమూ కాదు. రాజ్యాంగానికి కట్టుబడి ఉండడానికీ, ప్రజలపట్ల శ్రద్ధ వహించడానికీ రాజకీయాలు ఉద్దేశించబడ్డాయి. మీ ప్రజల పట్ల మీరు శ్రద్ధ వహించకపోతే ఇక మీరు చూపిస్తున్న శ్రద్ధ ఏ తరహాది? ఒక యువతి ఒక యువకుడు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ సంస్థలు వారిని అత్యంత క్రూరంగా బాధిస్తున్నాయి.

అమ్మాయిలను ఏడిపించడం (ఈవ్‌టీజింగ్), వెంటపడడం లాంటి సమస్యల గురించి కమిటీ గట్టిగా మాట్లాడింది. వీటిని శిక్షార్హమైన నేరాలుగా పరిగణించాలని కూడా సూచించింది.

ఈ వెంటపడడం లాంటి వాటివలన గ్రామీణ ప్రాంతాల్లో మన స్త్రీలు ఏ విధంగా పాఠశాలలకు, కాలేజీలకు రావడం మానేస్తున్నారో… ఎలాంటి వేధింపులను వారు ఎదుర్కొంటున్నారో మా దృష్టికి వచ్చింది. ఫిర్యాదుకు నోచుకోని అనేక వ్యవహారాలు మన సమాజంలో జరుగుతున్నాయి. వెంటపడి వేధించడం వలన అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే మనం ఒక చట్టం చేయాలి.

మనకి సరిపోయినన్ని నిబంధనలు, చట్టాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడంలోనే సమస్య ఉంటోంది. ఈ సమస్యను మనం ఎలా పరిష్కరిస్తాము?

రాజకీయ సంస్థల నుండి, పోలీసుల నుండి, పౌర సమాజం నుండి మేము మానసిక పరివర్తనను ఆశిస్తున్నాము. ఈ మానసిక పరివర్తన సాధ్యమే. ఆదర్శవంతమైన పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నారు… తన పై అధికారి నిజాయితీ కలిగి ఉండడం చూసిన ఒక్క కారణంతోనే తానూ నిజాయితీ కలిగి ఉన్న కానిస్టేబుల్ ఉన్నాడు. (భద్రత) సేవల రంగంలో మనకి హీరోల అవసరం ఉంది.

నిజాయితీని గుర్తించి గౌరవించే ఒక సంస్కృతిని మనం సృష్టించాలి. రాజ్యాంగం ప్రకారం పరిపాలనకు సంబంధించిన అత్యంత మౌలిక విలువ ఏమిటంటే నిజాయితీని గుర్తించే ప్రభుత్వాలు ఉండడం. ఈ నిజాన్ని మనం అంగీకరించి తీరాలి. నిజాయితీ నాగరికతకు గట్టి పునాది వంటిది.

మీ సిఫారసుల్లో వెంటనే అమలు చేయవలసింది ఏమిటి?

నేర చట్ట సవరణ బిల్లు, దానికి మేము సూచించిన సవరణలు… దీనిని వెంటనే అమలు చేయాలి. అత్యాచారం విషయంలో పోలీసు అధికారులకు గానీ, ఆర్మీ అధికారులకు గానీ ఎటువంటి మినహాయింపు ఉండకూడదు. (మహిళల) రవాణాకు సంబంధించిన నేరాల విషయంలో అసలు సహిష్ణుత అనేది ఉండకూడదు.

తనకు ప్రభుత్వం నుండి, పోలీసుల నుండి వచ్చిన స్పందన పట్ల కమిటీ పెద్దగా సంతృప్తి పడినట్లు లేదు…

డి.జి.పిలు ఇంకా ఇతరులు మాకు తగిన సమాచారం అందుబాటులో ఉంచలేదు. ఎందుకంటే ఈ కమిటీ తగిన పరిష్కారం కనుగొనడానికి ఇంత లోతుగా తవ్వుతుందని వాళ్లెవ్వరూ ఊహించలేదు. అందుకే, ఇటువంటి కమిటీ నుండి కూడా ప్రభుత్వం ఊహించుకున్న అంచనా ఏమిటంటే… ఏదో అలా ఒక వైట్ వాష్ కమిటీ లాగా పని చేసి ఊరుకోవాలని. ఈ కమిటీ కేవలం వైట్ వాష్ కమిటీ లాగా పని చేయాలని లేదా లోతుల్లోకి వెళ్లకూడదని వారు భావించి ఉండకూడదు…

పోలీసు సంస్కరణలు, పౌరుల రక్షణ, భద్రతలు, న్యాయ మరియు ఎన్నికల సంస్కరణలు తదితర అంశాలపైన కమిటీలనుండి, కమిషన్ల నుండి వచ్చిన వివిధ నివేదికలు, సిఫారసులు అనేకం ఉన్నాయి. మీ సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారా?

భారత దేశపు క్రోధం గురించి ఈ నివేదిక మాట్లాడుతోంది… ప్రజల అభిప్రాయాలను మేము నిర్దిష్ట మొత్తంలో పరిగణనలోకి తీసుకున్నాం. మా సిఫారసులను విస్మరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే… అది వారికే ప్రమాదం అని మేము హెచ్చరించాము.

నా వైపు నుండి చెప్పదలిస్తే, ప్రభుత్వం ఈ నివేదికను గౌరవిస్తుంది. మేము నివేదికను ప్రజల మధ్యకు తీసుకెళ్లాము. విమర్శలను ఆహ్వానిస్తాము. మేము ఒక కొత్త నేలను తాకాము; (ఇప్పుడు ఉన్న సగటు నాగరికత స్థాయి కంటే నూతన ఎత్తులకి వెళ్లాము –అను) సుదూర లక్ష్యాలను ఛేదించే మార్పులను ప్రతిపాదించాము. ప్రజాస్వామ్యంలో విమర్శ చేయడం అత్యంత సంపూర్ణమైనది, కానీ మేము సాధ్యమైనంత మెరుగుగా కృషి చేశాము.

***                   ***                    ***

మాజీ సొలిసిటర్ జనరల్ మాటల్లో ఉన్న ఉన్నత స్ధాయి నిజాయితీ ప్రభుత్వ ఆచరణలో ప్రతిఫలిస్తుందా? తమ నివేదికను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన నమ్ముతున్నప్పటికీ ఆ విధమైన హామీ ప్రభుత్వం నుండి సూచనా మాత్రంగా కూడా ఇంతవరకు రాలేదు. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో భద్రతా బలగాలు ఒక ఎత్తుగడగా, మిలట్రీకరణ సంస్కృతిలో భాగంగా అత్యాచారాలు జరుపుతున్నారని మాజి సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయంలో లోతైన, వ్యవస్ధాగతమైన అర్ధం ఉన్నది. ఆయా జాతుల ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేయడానికి భారత పాలకులే స్వయంగా భద్రతా బలగాల అత్యాచారాలకు మినహాయింపు ఇస్తున్నారని ఆయన చెప్పకనే చెప్పిన చేదు వాస్తవం. ఆత్మ స్ధైర్యం దెబ్బతింటుంది అన్న సాకు చూపి రేపిస్టు సైనికుడిపై విచారణ జరపకపోవడం అంటే అది ప్రభుత్వాల అవసరం రీత్యానే జరుగుతోంది.  సరిగ్గా అదే కారణం వల్లనే జస్టిస్ వర్మ కమిటీ నివేదిక కూడా ది హిందూ విలేఖరి పరోక్షంగా సూచించినట్లుగా ప్రభుత్వాలు విస్మరించిన అనేక కమిటీల అనేకానేక సిఫారసుల్లో ఒకటిగా కాల గర్భంలో కలిసిపోవడం ఖాయమన్నది నిష్టుర సత్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s