ఆ శిక్ష చాలదు –ఇండియా, చాలు -అమెరికా


Image: The Hindu

Image: The Hindu

ముంబై టెర్రరిస్టు దాడులకు నెలల ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన ‘డేవిడ్ కోలమన్ హేడ్లీ’కి అమెరికా కోర్టు 35 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని భారత ప్రభుత్వం ప్రకటించగా, విచారణలో సహకరించాడు గనక ఆ శిక్ష చాలు అని అమెరికా చెబుతోంది. అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్ల పైన జరిగిన టెర్రరిస్టు దాడిని 9/11 పేరుతో పిలుస్తున్న నేపధ్యంలో ముంబై దాడులను 26/11 పేరుతో భారత పత్రికలు, ప్రభుత్వం పిలుస్తున్న సంగతి తెలిసిందే. తెల్ల తోలు హోదా ద్వారా ఇండియాకి పలుసార్లు రాకపోకలు సాగించి టెర్రరిస్టు దాడులకు ఏర్పాట్లు చేసిన హేడ్లీ 170 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్న దారుణంలో ఒక ప్రత్యక్ష భాగస్వామి.

భారతదేశంలో మారణ హోమానికి తగిన స్ధలాలను ఎంపిక చేయడానికి, రెక్కీ నిర్వహించడానికీ నియమించబడిన దావూద్ జిలానీ ఇండియాకు రాకపోకలకు అనువుగా ఉండడం కోసం డేవిడ్ హేడ్లీగా పేరు మార్చుకున్నాడు. హేడ్లీ అమెరికా పౌరుడు అని చెప్పే పాస్ పోర్టులు, పాకిస్ధాన్ మిలట్రీ గూఢచార సంస్థ ఐ.ఎస్.ఐ, సీమాంతర ఉగ్రవాద సంస్థగా ఇండియా పరిగణించే లష్కర్-ఎ-తొయిబా, ఈ రెండూ తనకు కమెండో శిక్షణ ఇచ్చాయని హేడ్లీ చెప్పిన నేపధ్యంలో హేడ్లీ చర్యల వెనుక సి.ఐ.ఎ పాత్ర, తద్వారా అమెరికా పాత్రను కూడా అనేకమంది అనుమానించారు. పూర్వాశ్రమంలో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసే నేరస్థులను పట్టుకోవడానికి సి.ఐ.ఎ గూఢచారిగా హేడ్లీ పని చేసినట్లు వెల్లడి కావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

నీకు మరణ శిక్షే సరైంది

డేవిడ్ హేడ్లీకి 35 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి హేరీ లీనెన్వెబర్ గురువారం తీర్పు చెప్పాడు. “హేడ్లీ ఒక టెర్రరిస్టు” అని లీనెన్వెబర్ ప్రకటించాడు. జైలు శిక్ష అనంతరం మరో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ పర్యవేక్షణలో హేడ్లీ జీవితం గడపవలసి ఉంటుంది. తీర్పు ప్రకటిస్తూ జడ్జి చేసిన వ్యాఖ్యలు బహుళ ప్రచారం పొందాయి. “అతను నేరం చేస్తాడు, ఆ తర్వాత (పోలీసులకు) సహకరిస్తాడు, అలా సహకరించినందుకు తగిన బహుమతి పొందుతాడు. నేను ఏ శిక్ష వేసినా దాని వలన టెర్రరిస్టులు భయపడేది ఏమీ లేదు. దురదృష్టవశాత్తూ, టెర్రరిస్టులు దాని గురించి పట్టించుకోరు. తాను మారిన మనిషిని అని హేడ్లీ చెప్పినప్పటికీ నాకు అతని మాటలపై నమ్మకం లేదు” అని జడ్జి వ్యాఖ్యానించాడని పత్రికలు తెలిపాయి.

“హేడ్లీ నుండి ప్రజలను కాపాడడం, మరిన్ని టెర్రరిస్టు కార్యకలాపాలకు అతను పాల్పడకుండా చూడడం నా విధి అని నేను నమ్ముతున్నాను. 35 సంవత్సరాల జైలు శిక్షకు సిఫార్సు చేయడం నిజానికి తగిన శిక్ష కాదు… ప్రభుత్వం ప్రతిపాదించిన 35 సంవత్సరాల జైలు శిక్షకు నేను అంగీకరిస్తూ 35 సంవత్సరాల శిక్ష వేస్తున్నాను… నేను వేస్తున్న శిక్ష ద్వారా హేడ్లీ తన సహజ జీవితం అంతా బందిఖానాలో గడుపుతాడని నేను ఆశిస్తున్నాను… ఇతనికి మరణ శిక్ష విధించడం చాలా తేలిక. నీకు అదే సరైన శిక్ష.” అని జడ్జి వ్యాఖ్యానించాడు. అయితే ఆ సరైన శిక్షనే జడ్జి ఎందుకు వేయలేదు? దానికి కారణం అమెరికా ప్రభుత్వంతో హేడ్లీ కుదుర్చుకున్న ఒప్పందం.

2009లో చికాగో విమానాశ్రయంలో అరెస్టయిన డేవిడ్ హేడ్లీ తమకు పూర్తిగా సహకరించాడని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. మహమ్మద్ ప్రవక్త పై కార్టూన్ ప్రచురించిన ఒక డానిష్ పత్రికపై టెర్రరిస్టు దాడికి పధకం వేశాడని చెబుతున్న మరో టెర్రరిస్టు తహవ్వూర్ రాణా పై నేరం నిరూపించడానికి తగిన సాక్ష్యం ఇచ్చాడని, ఇలియాజ్ కాశ్మీర్ తో సహా ఇంకొందరు పాకిస్ధాన్ ఆధారిత టెర్రరిస్టుల గురించిన విలువైన సమాచారం ఇచ్చాడని అమెరికా చెబుతోంది. హేడ్లీ సాక్ష్యం ఆధారంగా డానిష్ పత్రికపై అసలు జరగని టెర్రరిస్టు దాడికి గాను రాణాకు ఇదే కోర్టు (ఇదే జడ్జి) 14 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. హేడ్లీ లాంటి ఒక మోసగాడిని మిత్రుడుగా కలిగిన తాను కేవలం వ్యాపారిని మాత్రమేనని, హేడ్లీ చెప్పిన దాడి పధకం సంగతే నాకు తెలియదని రాణా విన్నవించుకున్నప్పటికీ కోర్టు అతని విన్నపాన్ని పరిగణించలేదు.

హేడ్లీ సహకారానికి బదులుగా ఆయనకు మరణశిక్ష విధించకుండా ఉండడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. భవిష్యత్తులో కూడా హేడ్లీ తమకు సహకరిస్తూనే ఉంటాడని అమెరికా అటార్నీ జనరల్ వ్యాఖ్యానించడం విశేషం. బహుశా మరింత మంది రాణాలు అమెరికా ప్రభుత్వం దృష్టిలో ఉండి ఉండవచ్చు. అమెరికా రాయబారుల ఉత్తరాలను (diplomatic cables) వికీ లీక్స్ చీఫ్ ఎడిటర్ జులియన్ ఆసాంజేకు లీక్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాడ్లీ మేనింగ్ కి వ్యతిరేకంగా కూడా హేడ్లీ సాక్ష్యం ఇవ్వవచ్చు. వీలయితే (ఎవరూ దొరక్కపోతే) జులియన్ ఆసాంజేకు వ్యతిరేకంగా కూడా హేడ్లీ సాక్ష్యం ఇవ్వొచ్చు. ఆ శక్తి యుక్తులు తమకు ఉన్నాయని సి.ఐ.ఎ, అమెరికా రాజ్యాలు అనేక సార్లు రుజువు చేసుకున్నాయి కూడా.

శిక్ష చాలదు

హేడ్లీకి విధించిన శిక్ష తమను కొద్దిగా అసంతృప్తికి గురి చేసిందని (slightly disappointed) భారత ప్రభుత్వం ప్రకటించింది. 52 సంవత్సరాల హేడ్లీకి మరింత కఠినమైన శిక్ష విధించి ఉండాల్సింది అని భారత విదేశీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ శుక్రవారం వ్యాఖ్యానించాడని పత్రికలు తెలిపాయి. అయితే ఇది “ప్రారంభం” అని ఆయన అన్నాడు. “35 సంవత్సరాల జైలు శిక్ష, జడ్జి మాట్లాడిన మాటలు… ఇవి ప్రారంభం మాత్రమే. అమెరికాలో కొన్ని న్యాయ ప్రక్రియలు ఉన్న విషయాన్ని మేము అర్ధం చేసుకుంటున్నాము. అయితే అతనిని ఇండియాకి అప్పగించాలన్న మా విన్నపం ఇక ముందు కూడా అమలులో ఉంటుంది” అని సల్మాన్ ఖుర్షీద్ విలేఖరులకు చెప్పాడని ది హిందూ తెలిపింది.

హేడ్లీ శిక్ష నేపధ్యంలో కూడా భారత దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల వేట సాగించాయి. ఇండియాలో విచారణ జరిగి ఉన్నట్లయితే మరింత కఠిన శిక్ష విధించేవారిమని సల్మాన్ ఖుర్షీద్ ప్రకటించాడు. అజ్మల్ కసబ్ కి ఉరిశిక్ష విధించి అమలు చేసిన సంగతిని భారత విదేశీ మంత్రి పరోక్షంగా గుర్తు చేశాడు. హేడ్లీ అప్పగింత కోసం ప్రభుత్వం ఒత్తిడి చేయడం కొనసాగుతుందని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ పత్రికలకు చెప్పాడు. హేడ్లీ శిక్ష పట్ల అసంతృప్తి ప్రకటించినవారి జాబితాలో కాంగ్రెస్ పార్టీ కూడా తన పేరును నమోదు చేసుకుంది. హేడ్లీ శిక్షపై అసంతృప్తి ప్రకటిస్తూ, అతన్ని వెంటనే ఇండియాకి అప్పగించాలని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ డిమాండ్ చేశాడు. బిజెపి ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడి కూడా ఖండన మండనల పర్వంలో జత కలిశాడు. హేడ్లీని ఇండియాకి అప్పగిస్తే భారత చట్టాల ప్రకారం విచారించి శిక్షించుకుంటామని, అతనికి మరణ శిక్ష విధిస్తామని రూడి విలేఖరులకు తెలిపాడు.

ఆ శిక్ష చాలు

భారత దేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు అమెరికా శుక్రవారం సమాధానం చెప్పింది. పెరోలు లేకుండా హేడ్లీకి శిక్ష వేశామని అమెరికా సమర్థించుకుంది. పాకిస్థానీ-అమెరికన్ అయిన హేడ్లీకి వేసిన శిక్ష ముంబై టెర్రరిస్టు దాడులకు బాధ్యులను శిక్షించడంలో ముఖ్యమైన మరొక ముందడుగు అని న్యూ ఢిల్లీ లోని అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. చట్టాన్ని అమలు చేసే అధికారులతో సహకరించడానికీ, తద్వారా భవిష్యత్తులో టెర్రరిస్టు దాడులు జరగకుండా నివారించడానికీ హేడ్లీ అంగీకరించాడు కనుక అతనికి మరణ శిక్ష విధించక పోవడం సరైనదే అని సదరు ప్రకటన సమర్థించింది.

Headley passport issued by the U.S.A -The Hindu

Headley passport issued by the U.S.A -The Hindu

“దారుణమైన 26/11 దాడులలో పాత్ర పోషించినందుకు హేడ్లీకి విధించిన 35 సంవత్సరాల జైలు శిక్ష తీవ్రమైనదే. మరణ శిక్షను కోరకూడదన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ శిక్ష ప్రతిబింబించింది” అని అమెరికా రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. అమెరికా, ఇండియా అధికారులతో సహకరించడానికి అతను అంగీకరించినందున అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని, అంతర్జాతీయ టెర్రరిజం నుండి అనేకమంది జీవితాలను కాపాడడానికి విలువైన సమాచారం అతను ఇచ్చాడని ప్రకటన తెలిపింది. ఇలియాజ్ కాశ్మీర్, అతని నెట్ వర్క్ పై హేడ్లీ విస్తృతమైన సమాచారం ఇచ్చాడని, లష్కర్-ఎ-తొయిబా సంస్థ నిర్మాణం, సభ్యులు, శిక్షణ, సామర్ధ్యం మున్నగు అంశాలపై కూడా వివరాలు ఇచ్చాడని సదరు ప్రకటన తెలియజేసింది.

“అమెరికా, ఇండియాల టెర్రరిస్టు వ్యతిరేక సహకారం మున్నెన్నడు లేనంతగా బలీయంగా ఉంది. అజ్మల్ కసబ్ విచారణలో ఎఫ్.బి.ఐ తన నైపుణ్యాన్ని అందజేసింది. సాక్ష్యం కూడా ఇచ్చింది” అని అమెరికా ప్రకటన గుర్తు చేసింది. అయితే అమెరికా తనకు తెలియనట్లు నటిస్తున్న విషయాలు కూడా ఉన్నాయి. టెర్రరిస్టులతో హేడ్లీకి ఉన్న సంబంధాల గురించి అతని కుటుంబ సభ్యులు, సహచరులు హెచ్చరించినప్పటికీ ఆయన ఇండియాకి పలుసార్లు రావడానికి తాను పాస్ పోర్టు ఎందుకు ఇచ్చిందో అమెరికా ఇంతవరకూ చెప్పలేదు. నేరం జరిగింది ఇండియాలో, బాధితులు అనేకమంది భారతీయులు కనుక ‘నేరస్ధుల అప్పగింత’ ఒప్పందం ప్రకారం హేడ్లీని ఇండియాకు అప్పగించడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోలేదు. ఒక వారం రోజులు ప్రశ్నించడానికి మాత్రమే అంగీకరించింది. హేడ్లీ అప్పగింత ను ఇండియా కోరకుండా ఉండడానికి అమెరికా బేరసారాలు చేసినట్లు కూడా వికీలీక్స్ ద్వారా వెల్లడి అయింది. ఇవన్నీ అమెరికా ఉద్దేశాలపై అనుమానాలు పెంచేవే.

జగన్నాటకం

“కపట నాటక సూత్రధారి” అన్న బిరుదు శ్రీ కృష్ణుడికి వర్తిస్తుందో లేదో తెలియదు గాని అమెరికాకి మాత్రం సరిగ్గా వర్తిస్తుంది. భారతీయుల దేవుళ్లు జగన్నాటకం నడిపించడంలో సుప్రసిద్ధులు. బహుశా ఆ నాటకంలో విశ్వ వ్యాపితంగా ఎందరు పాత్రధారులు ఉన్నారో భూ గ్రహ జీవులు ఇంకా కనిపెట్టలేదు. అమెరికా మాత్రం ప్రపంచ దేశాలన్నింటా పాత్రధారులను నియమించుకుందని వారి ద్వారా అనేక టెర్రరిస్టు దాడుల నాటకాలను అమెరికా ఆడిస్తున్నదని ‘గ్లోబల్ రీసెర్చ్” లాంటి సంస్థలు సాక్ష్యాలతో వివరిస్తున్నాయి. అయితే ఈ నాటకాల పాత్రధారులు, వాటికి బలయ్యే అమాయకులు రియల్ గా బలి కావడమే ఇక్కడి విషాదం.

ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదిగి అమెరికా తర్వాత అత్యధిక జి.డి.పి నమోదు చేస్తున్న చైనా దేశాన్ని దృష్టిలో పెట్టుకుని బారక్ ఒబామా ఆసియా ఖండాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా ప్రకటించాడు. చైనాను సైనికంగా అనేక స్థావరాలతో చుట్టుముట్టిన అమెరికా రాజకీయంగా కూడా ఆ దేశాన్ని ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తోంది. ఆసియాలో చైనా వ్యతిరేక ప్రచారాన్ని అది ముమ్మరం చేసింది. ఇండియాలో చైనా వ్యతిరేక సెంటిమెంట్లు రెచ్చగొట్టడం కూడా అమెరికా వ్యూహంలో భాగమేనని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పాకిస్ధాన్, చైనా దేశాల మధ్య ఎప్పటినుంచో ఉన్న మిత్రత్వాన్ని కొత్తగా గుర్తించినట్లు పశ్చిమ రాజ్యాల పత్రికలు కధలు, కధనాలు అల్లుతున్నాయి. ఇదంతా చైనాపై అమెరికా సాగిస్తున్న ‘ప్రచ్ఛన్న యుద్ధం’లో భాగమేనని ప్రధాన స్రవంతి పత్రికలు సైతం అభివర్ణిస్తున్నాయి.

చైనాకి వ్యతిరేకంగా భారతదేశంలో కూడా సెంటిమెంట్లు రెచ్చగొడుతున్న పరిస్ధితి ఉంది. ఇండియాను అణగదొక్కాలని చైనా ప్రయత్నిస్తోందని కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ వ్యాఖ్యానించినట్లు పత్రికలు, చానెల్లు చెప్పిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. చైనా, పాకిస్ధాన్ లకు వ్యతిరేకంగా రెచ్చగొట్టబడుతున్న ఈ సెంటిమెంట్లు ఒక కోణంలో అమెరికాకు అనుకూల సెంటిమెంట్లుగా పరిణమిస్తున్నాయని, అమెరికాకి కావలసిఉంది అదేనని కొందరు అంతర్జాతీయ పరిశీలకుల అభిభాషణ. తద్వారా భవిష్యత్తులో చైనాకి వ్యతిరేకంగా అమెరికా తీసుకునే దూకుడు చర్యలకు పొరుగునే ఉన్న భారత దేశంలో అనుకూల పరిస్ధితిని ఏర్పరచుకోవటానికి వ్యూహాత్మక అడుగులు ఇప్పుడే పడుతున్నాయని వారు సూచిస్తున్నారు.

ముంబై టెర్రరిస్టు దాడులలో ఐ.ఎస్.ఐ పాత్ర, ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎల మధ్య దశాబ్దాల పాటు కొనసాగిన సహకారం, హేడ్లీ, సి.ఐ.ఎ ల సంబంధాలు, 9/11 దాడులలో అమెరికా పాలకవర్గాలలోని ఒక సెక్షన్ పాత్ర ఉందని వస్తున్న సూచనలు, ఆల్-ఖైదా, దాని అనుకూల సంస్థలతో కూడిన లిబియా ప్రభుత్వానికి అమెరికా ఇస్తున్న మద్దతు, ఆల్-ఖైదాతో కలిసి సిరియా ప్రభుత్వాన్ని కూల్చడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు… ఇవన్నీ కలిసి ముంబై దాడుల నేపధ్యంపై ఒక అవగాహనని కల్పిస్తున్నాయి. భారతదేశంలో తమ గూఢచారులు పని చేస్తున్నారని అమెరికా సెనేట్ కమిటీ ముందు నివేదిక ఇచ్చిన వాస్తవం కూడా ఈ సందర్భంగా పరిగణించాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s