జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఎవరినీ వదల లేదు. ప్రభుత్వము, పోలీసులతో పాటు న్యాయ వ్యవస్థను, సామాజిక ధోరణులను అది ఎండగట్టింది. నివేదికలోని అంశాలను ఎన్.డి.టి.వి ఒకింత వివరంగా అందించింది. అవి ఇలా ఉన్నాయి.
- సామూహిక అత్యాచారం దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష; అవసరం అనుకుంటే జీవిత కాలం (శేష జీవితం అంతా జైలులోనే) విధించవచ్చు.
- సామూహిక అత్యాచారం అనంతరం హత్య జరిగితే జీవిత కాలం శిక్ష విధించాలి.
- ఈవ్‌టీజింగ్, వెంట పడడం, అవాంఛనీయ పద్ధతిలో లైంగికంగా తాకడం కూడా లైంగిక నేరాలుగా పరిగణించాము.
- వోయరిజం (మహిళల ప్రైవేటు కార్యకలాపాలను చాటునుండి చూడడం) నేరానికి ఏడు సంవత్సరాల శిక్ష వేయాలి.
- వెంటపడడం లేదా ఒక వ్యక్తిని ఏ పద్ధతి ద్వారా అయినా సరే పదే పదే తాకడానికి ప్రయత్నిస్తే మూడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
- స్వలింగ సంపర్కులపై జరిగే దాడుల సమస్యను కూడా పరిగణించవలసిన అవసరం ఉన్నది.
- ఖాప్ పంచాయితీలపై కమిటీ విరుచుకుపడింది. రాజ్యాంగ విరుద్ధం అయిన ఖాప్ పంచాయితీలు ఒక వివాహం చెల్లదని ఎలా ప్రకటిస్తాయని కమిటీ ప్రశ్నించింది.
- చట్టబద్ధ పాలనను పరిరక్షించడానికి పోలీసు సంస్కరణలు అత్యవసరం.
- చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజకీయ యజమానుల చేతుల్లో సాధనాలుగా మారకూడదు.
- నేరాలను రాజకీయం చేయడం ఆగిపోవాలి. ప్రస్తుతం దోషిత్వం రుజువయితే రాజకీయ నాయకులను ఎన్నికలకు అనర్హులను చేసే అవకాశం ఉంది; అలా కాకుండా నేరాన్ని కోర్టు పరిగణలోకి తీసుకున్న వెంటనే వారిని అనర్హులుగా చేయాలి. విచారణ ముగిసే వరకూ ఎదురు చూడవలసిన అవసరం ఉండకూడదు.
- ఢిల్లీలో శాంతి భద్రతల బాధ్యత ఎవరిది అన్న విషయంలో సందేహాలు ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించింది. ఈ సందేహాలను వెంటనే నివృత్తి చేయాలి.
- ఇళ్ళలో జరుగుతున్న వైవాహిక అత్యాచారాలను, పిల్లలపై జరిగే అత్యాచారాలను నివారించవలసిన అవసరం ఉన్నది.
- యూనిఫారం ధరించిన వ్యక్తులు సాగిస్తున్న లైంగిక హింసలను సాధారణ చట్టం పరిధిలోకి తేవాలి.
- ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న లైంగిక హింసకు శిక్షలు లేకుండా చేసే ప్రక్రియను ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ (AFSPA) ద్వారా న్యాయబద్ధం చేస్తున్నారు. సంఘర్షణాత్మక ప్రాంతాల్లో (conflict areas) ఈ చట్టం కొనసాగింపును సాధ్యమైనంత తొందరలో సమీక్షించాలి.
- సంఘర్షణాత్మక ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిషనర్లను నియమించాలి.
- సబార్డినేట్ న్యాయ స్ధానాలను హైకోర్టులు మరింత కట్టుదిట్టంగా నియంత్రించాలి.
- అవసరమైన వైద్య సహాయం అందించడంలో ఏ మాత్రం ఆలస్యం జరగకూడదు: ప్రైవేటు వైద్యులకు కూడా తమ కర్తవ్యం నిర్వర్తించవలసిన బాధ్యత ఉంటుంది.
- సాధారణ పని గంటల్లో మహిళలను అదుపులోకి తీసుకోవడం విషయంలో ఉన్న సాధారణ చట్టాలను ఖచ్చితంగా పాటించాలి.
- సంఘర్షణాత్మక ప్రాంతాల్లో మహిళల భద్రతను, గౌరవాన్ని కాపాడడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాలి.
- మహిళల సమానత్వ ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘనే.
- మహిళల హక్కుల కోసం ప్రత్యేక చట్టం చెయ్యాలి: మహిళ పూర్తి స్థాయి లైంగిక నిర్ణయాధికార హక్కు కలిగి ఉండడాన్ని ఈ చట్టం గుర్తించాలి. మహిళల సంబంధాలను గౌరవించేందుకు ఈ చట్టం అవకాశం కల్పించాలి.
- వివాహాలు అన్నింటినీ నమోదు చేయాలి. కట్నం కోసం డిమాండ్ చేయకుండా, తీసుకోకుండా చూడాలి.
- ‘నేర చట్టాల సవరణ బిల్లు 2012’ (criminal law amendment bill 2012) లో సవరణలు చెయ్యాలి.
- ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ప్రయాణం భద్రతగా ఉండాలి; ముఖ్యంగా మహిళలకు.
- అంగవైకల్యం ఉన్న వ్యక్తులపై అత్యాచారాలు జరగకుండా కాపాడడానికి ప్రత్యేకమైన ప్రక్రియలు ఉండాలి. అలాంటి వ్యక్తులు న్యాయం కోసం ఆశ్రయించడానికి సముచిత ప్రక్రియలు రూపొందించాలి.
- బాల నేరస్థుల చట్టం (Juvenile Justice Act) ఊహించిన విధంగా బాలనేరస్థుల గృహాలను నిర్వహించాలి; ఈ గృహాలను నిర్వహించడానికి ఒక పని పద్ధతి (మెకానిజం) రూపొందించాలి. అన్ని రకాల లైంగిక నేరాలకు పెంపొందించే కేంద్రాలుగా బాల నేరస్థుల గృహాలు ఉంటున్నాయి.
- తప్పిపోయిన పిల్లల పట్ల ప్రభుత్వాలు ఉన్న ఉదాసీన వైఖరి వదిలి పెట్టాలి.
- మైనర్ పిల్లలను రవాణా చెయ్యడం తీవ్ర నేరంగా పరిగణించాలి.
- 7 సంవత్సరాలకు తక్కువ కానీ తీవ్రమైన జైలు శిక్షను ట్రాఫికింగ్ నేరస్థులకు విధించాలి; దీనిని అవసరమైతే 10 సంవత్సరాలకు కూడా పొడిగించవచ్చు.
- ఒక పోలీసు అధికారి గానీ, ప్రజా సేవకుడు (public servant) గానీ పిల్లలను రవాణా చేస్తూ పట్టుబడితే వారిని తీవ్ర స్ధాయిలో శిక్షించాలి.
- రాజ్యాంగ పరిష్కారాల ద్వారా మౌలిక హక్కులను కాపాడవలసిన ప్రధాన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉన్నది. భారత ప్రధాన న్యాయమూర్తి సుమోటో గా నేరాన్ని గుర్తించవచ్చు. సామాజిక కార్యకర్తలు కోర్టులకు సహకరించాలి.
- మహిళలు, పిల్లలు పట్ల వివక్ష పాటించరాదన్న స్పృహ విద్యావిధానంలో కల్పించాలి. మానవాభివృద్ధికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనం.
జస్టిస్ వర్మ కమిటీ చేసిన పై సిఫారసులను అమలు చేయాలంటే అత్యంత దృఢమైన రాజకీయ నిబద్ధత ఉండాలి. మన నాయకులకు లేనిది అదే గనుక కమిటీ సిఫారసులు ఎంతవరకు అమలులోకి వస్తాయో అనుమానమే. అసలు ‘అనుమానమే’ అని అర్ధోక్తిలో ఆగవలసిన అవసరం కూడా లేదు. ఇవేవీ అమలులోకి రావని ఘంటాపథంగా చెప్పవచ్చు. ‘నెల రోజులు అంటే 30 రోజులని కాదు ఎక్కువైనా కావచ్చు’ అని చెప్పగల నాయకులు ప్రజల నెత్తిపైన కూర్చొని ఉన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలు అలుపనేది తెలియకుండా సాధ్యమైన అన్ని రూపాల్లో వ్యక్తం చేస్తున్న ఒక న్యాయమైన ప్రజాస్వామ్య కోరికను పిడికెడు మంది భూస్వాముల కోసం, పెట్టుబడిదారుల కోసం తిరస్కరించగల ఘనాపాటీలు మన పాలకులు. అలాంటివారిని అనుమానించవలసిన(!) అవసరమే లేదు.
meeru chesina pani ki abinandhanalu.
The great leaders Do they think month means 60 days or week means 15 days? Even more than that it seems