పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ


ఎడమనుంచి: జస్టిస్ లీలా సేఠ్, జస్టిస్ జె.ఎస్.వర్మ, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియం

ఎడమనుంచి: జస్టిస్ లీలా సేఠ్, జస్టిస్ జె.ఎస్.వర్మ, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణియం

80,000కు పైగా సలహాలు, సూచనలు అందుకున్న జస్టిస్ వర్మ కమిటీ 29 రోజుల్లోనే వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారించడానికి వీలుగా చట్టాల మెరుగుదలకు తగిన సిఫారసులు చేయడానికి 30 రోజుల గడువు కోరిన జస్టిస్ వర్మ కమిటీ ఒక రోజు ముందుగానే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు లాంటి సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నల్ల చట్టాలు అడ్డు పెట్టుకుని అక్కడి మహిళలపై భద్రతా బలగాలు సాగిస్తున్న అమానుష అత్యాచారాలపై కమిటీ దృష్టి సారించి తగిన సిఫారసులు చేయడం చెప్పుకోదగ్గ విషయం. కాగా, ఢిల్లీ సామూహిక అత్యాచారంకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి వృద్ధ తరానికి కూడా పాఠాలు నేర్పారని మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఢిల్లీ యువతను ప్రశంసల్లో ముంచెత్తడం విశేషం. అత్యంత ముఖ్యమైన ప్రగతిశీల అంశం ఏమిటంటే సో కాల్డ్ పెద్దలు చెబుతున్నట్లుగా అత్యాచారాలకు మహిళలను కమిటీ ఈషణ్మాత్రం కూడా బాధ్యులను చేయకపోవడం.

ఢిల్లీ సామూహిక అత్యాచారంపై వెల్లువెత్తిన నిరసన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళలపై నేరాలను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టాల మెరుగుదలకు సిఫారసులు చేయాలని కోరుతూ ముగ్గురు సభ్యులతో జస్టిస్ వర్మ నేతృత్వంలో కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హిమాచల ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలా సేఠ్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణియం లు ఇతర సభ్యులుగా ఉన్న ఈ కమిటీని ప్రభుత్వం డిసెంబరు 23 తేదీన నియమించింది.

“ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే (failure of governance) మహిళలపై సాగుతున్న నేరాలకు మూల హేతువు (root cause)” అని జస్టిస్ వర్మ కమిటీ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది. ఈ ఒక్క మాటతోనే కేంద్ర సచివుల దగ్గర్నుంచి ఎం.పిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, డి.జి.పిలు, అధికారులు, స్వామీజీలు, హిందూత్వ నాయకులు, మహిళా చైర్ పర్సన్ లు, ఖాప్ పంచాయితీలు భారత దేశ మహిళలకు ఎంత భారంగా పరిణమించారో జస్టిస్ వర్మ కమిటీ తేల్చి చెప్పింది; ‘మహిళలపై నేరాలు అరికట్టడమే కేంద్ర ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం’ అన్న ప్రధాని పలుకులు వట్టి కబుర్లేనని నిర్ధారించింది; నేరస్థులను వదిలిపెట్టి బాధిత మహిళల్లోనే తప్పులు వెతికే సంస్కృతి సుపరిపాలనకు ఆమడ దూరమని హెచ్చరించింది; పౌరులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాల అసమర్థతపై ఉద్యమించిన జనంపై విరుచుకుపడడం ప్రజాస్వామ్య పాలన లక్షణం కాదని స్పష్టం చేసింది.

జస్టిస్ జె.ఎస్.వర్మ

జస్టిస్ జె.ఎస్.వర్మ

తమ విధులను తాము నిర్వర్తించ వలసిన బాధ్యతలో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయి ఉదాసీనతతో వ్యవహరించడం తమను నిశ్చేష్టుల్ని చేసిందని జస్టిస్ వర్మ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత పైన ఢిల్లీ పోలీసులు విరుచుకుపడినందుకు విచారం వ్యక్తం చెయ్యడం మాని సాక్ష్యాత్తూ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీసు కమిషనర్ ను బహిరంగంగా వెనకేసుకురావడం కూడా తనను నిశ్చేష్టుడిని చేసిందని జస్టిస్ వర్మ వ్యాఖ్యానించాడు. తమ నివేదికను తన పేరుతో పిలిచినప్పటికీ అది వాస్తవానికి దేశం లోపలి నుండి, బైటనుంచీ వచ్చిన అనేక సూచనల ఫలితమని ఆయన తెలిపాడు.

ది హిందూ పత్రిక ప్రకారం జస్టిస్ వర్మ కమిటీ నివేదికలోని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

  • సంఘర్షణాత్మక ప్రాంతాల్లో ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ (AFSPA –Armed Forces Special Powers Act) చట్టాన్ని అత్యవసరంగా సమీక్షించాలి.
  • సంఘర్షణాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలు మరియు యూనిఫారం ధరించిన వారు సాగిస్తున్న లైంగిక నేరాలను సాధారణ నేర చట్టాల పరిధిలోకి తీసుకొని రావాలి.
  • సంఘర్షణాత్మక ప్రాంతాల్లో మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న ఫిర్యాదులను పరిష్కరించడానికి తగిన అధికారాలతో కూడిన స్పెషల్ కమిషనర్లను నియమించాలి.
  • ఢిల్లీ పోలీసులపై నియంత్రణ ఎవరిది అన్న విషయంలో సందేహాన్ని తొలగించాలి.
  • ట్రాఫిక్ నియంత్రణలు, శాంతి భద్రతల నిర్వహణ, లైంగిక దాడుల కేసుల పరిష్కారం… ఇవన్నీ విఫలం అయ్యాయని ఢిల్లీ సామూహిక అత్యాచారం రుజువు చేస్తున్నది.
  • ప్రతి జిల్లా మేజిస్ట్రేటు తప్పిపోయిన పిల్లల రికార్డులను నిర్వహించాలి.
  • శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఢిల్లీ ఆందోళనకారులపై పోలీసు చర్య భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చింది.
  • ప్రతి ఒక్క సూచనను పరిగణలోకి తీసుకున్నాము.

నివేదిక తయారు చేయడానికి గడువును ఎలా నిర్ణయించారని విలేఖరులు ప్రశ్నించినపుడు ‘సీనియర్ కేబినెట్ మంత్రి ఒకరు ప్రధాన మంత్రి తరపున నివేదిక తయారు చేయాలని కోరినపుడు తాను తదుపరి పార్లమెంటు సమావేశాలు ఎప్పుడని అడిగానని’ జస్టిస్ వర్మ తెలిపాడు “ఫిబ్రవరి 21 నుండి (బడ్జెట్) సమావేశాలు ప్రారంభం అవుతాయని మంత్రి నాకు చెప్పాడు. అంటే అప్పటికి రెండు నెలలు. దానితో 30 రోజుల్లో పని పూర్తి చేయాలని నేను భావించాను. అందుబాటులో ఉన్న సమయంలో సగం సమయంలో మన పని పూర్తి చేయగలిగితే, ప్రభుత్వం కూడా తన శక్తిని, వనరులను వినియోగించి వేగంగా కదిలి తీరాలి” అని జస్టిస్ వర్మ తెలిపాడు.

అమానుషమైన సామూహిక అత్యాచారానికి నిరసనగా ఢిల్లీ వీధులను హోరెత్తించిన యువతను జస్టిస్ వర్మ ప్రత్యేకంగా ప్రశంసించాడు. “పాత తరానికి తెలియని విషయాన్ని యువత మాకు నేర్పింది. నిరసనలు శాంతియుతంగా కొనసాగిన తీరు నన్ను అప్రతిభుడిని చేసింది… యువత తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది” అని ఆయన వ్యాఖ్యానించాడు. హోమ్ కార్యదర్శి ఆర్.కె.సింగ్ ను జస్టిస్ వర్మ కడిగి పారేశాడు. ఆందోళనకారులపై దారుణంగా పోలీసులు విరుచుకుపడిన తీరు ఆయనకు నచ్చలేదు. దానికి బాధ్యుడైన ఢిల్లీ కమిషనర్ నీరజ్ కుమార్ ని హోమ్ సెక్రటరీ ఆర్.కె.సింగ్ సమర్ధించుకొన్నాడు. “హోమ్ సెక్రటరీ లాంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి పోలీసు కమిషనర్ భుజం తట్టి శెభాష్ అంటున్నాడు. దానిని చూసి నేను షాక్ తిన్నాను” అని జస్టిస్ వర్మ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆరుగురు నిందితులను రికార్డు సమయంలో అరెస్టు చేసిన పోలీసు అధికారులను కూడా జస్టిస్ వర్మ పొగిడాడు.

సామూహిక అత్యాచారం నేరానికి పాల్పడిన వారికి జీవితాంతం జైలులో గడిపే శిక్ష విధించాలని కమిటీ సిఫారసు చేసింది. అయితే ఆందోళనకారులు కోరినట్లు రేపిస్టులకు ఉరి శిక్ష సిఫారసు చేయడానికి కమిటీ నిరాకరించింది. సూచనలు ఇచ్చినవారిలో అనేకమంది ఉరిశిక్ష విధించరాదని కోరారని దానికి కారణంగా ఆయన తెలిపాడు. “మరణ శిక్షను మేము సిఫారసు చేయలేదు. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా భారీగా సూచనలు వచ్చాయి” అని జస్టిస్ వర్మ తెలిపాడని ఎన్.డి.టి.వి వార్తా సంస్థ తెలిపింది. బాల నేరస్థుల వయసు పరిమితిని 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించడానికి కూడా కమిటీ నిరాకరించింది. దానివల్ల నేరాలు తగ్గవని ఆయన వ్యాఖ్యానించాడు.

శిక్షలను నిర్ధారించడం కంటే వాటిని నివారించడంపైనే దృష్టి కేంద్రీకరించామని జస్టిస్ వర్మ తెలిపాడు. ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు అందరూ బాధితురాళ్ల విషయంలో బాధాకరమైన ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారని కమిటీ ఎత్తి చూపింది. మహిళలపై నేరాల నివారణకు పోలీసులనుండి ఒక్క సూచన కూడా రాకపోవడం “విభ్రాంతికరం” అని ఆయన వ్యాఖ్యానించాడు. అమ్మాయిల వెంటపడడం, శరీరాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ లైంగిక నేరాల కింద పరిగణించాలని కమిటీ సిఫారసు చేసింది. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల నేరాలకు నిర్దిష్ట కాలపరిమితి లోపు శిక్షలు వేసే విధంగా చట్టాలు చేయాలని కోరింది.

8 thoughts on “పాలనా వైఫల్యమే మహిళలపై నేరాలకు మూల హేతువు –జస్టిస్ వర్మ కమిటీ

  1. “ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమే (failure of governance) మహిళలపై సాగుతున్న నేరాలకు మూల హేతువు (root cause)” కి “స్వామీజీలు, హిందూత్వ నాయకులు” సంభందం ఏమిటి?

    స్వమిజీ లు ఎక్కడ పరిపాలనలో లేరు.

  2. మహిళల హక్కులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినవారిలో వారూ ఉన్నారు. జనాభాలో సగ భాగం ఉన్న మహిళల హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అదేమని అడగకపోవడం, నివారించకపోవడం, అవి తప్పు అని చెప్పకపోవడం ప్రభుత్వ పాలనా వైఫల్యం.

  3. అభిప్రాయం అనేది మానవ హక్కు. అధికారం అనేది మానవ హక్కు కాదు. మీ లెక్కలో స్వమిజిలకు హిందుత్వ నాయకులకు మానవ హక్కులు లేవా?

    ఎంతో మంది మహిళలే అలంటి అభిప్రాయం కలిగి ఉంటారు వల్ల సంగతి ఏమిటి?
    ఎంతో మంది ఇతర మతస్తులు కూడా ఉంటారు. ముస్లిం మాట పెద్దలు చాల చోట్ల ఫత్వ జారి చేసారు, వాళ్ళు లేరే మీ లిస్టులో?

  4. ఖాప్ పంచాయితీల్లో వాళ్లూ ఉన్నారు. సెల్ ఫోన్లు వద్దనీ, మగతోడు లేకుండా బైటికి రావద్దనీ చెప్పింది ముస్లిం ఖాప్ పంచాయితీయే.

    అతల్ గారు, విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం. మహిళలపై అణచివేత సాగించడం అనేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు చేస్తున్నాయి. ఆ విషయం నేను చాలా సార్లు చెప్పాను. అయినా ఒక మత వ్యతిరేకతనూ లేదా, ఒక మత అనుకూలతనూ నాకు ఉందని పొరబడుతున్నారు. అది సరి కాదు.

  5. హిందుత్వ వాదులు, స్వమిజిలు అలంటి అభిప్రాయలు కలిగి ఉండవచ్చు, కాని వాళ్ళు అధికారాన్ని చూపలేదు. అభిప్రాయం కలిగి ఉండటం ఏమాత్రం తప్పు కాదు.
    ఖప్ లకు హిందుత్వ కు ఎటువంటి సంబంధం లేదు.

  6. ఒక మత పెద్దలు ఇలా చేస్తున్నారు అన్నప్పడు మిగతా మత పెద్దలు చేయటంలేదా అనటం హాస్యాస్పదం.

    అయ్యా! మహిళలను అణచి వేయటంలో ఎవరు తక్కువ కాదు. అయితే భారతదేశంలో హిందు మతం మెజారిటీ అంటున్నప్పుడు, మెజారిటీ మత ఉన్మాదం గురించే ఎక్కువగా మాట్లాడాలి మరి. ఎందుకంటే అవే మెజారిటి భారతీయ మహిళ అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి.

    వీరివి ఎక్కడో వ్యక్తిగత అభిప్రాయాలు కాదు.

    1.విశాఖలో తన ఆశ్రమంలో ఉంటున్న గిరిజన బాలికలపై అత్యాచారం చేసి అరెస్ట్ అయిన స్వామీజిని వెనుకేసుకొస్తూ బిజెపి పార్టీ వాళ్లు మహిళాసంఘాలకి వ్యతిరేకంగా ధర్నా చేసారు.
    2.మంగుళూర్ లో ఆడపిల్లలపై దాడులు స్వయంగా ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంఘాలు ప్రకటించి చేసాయి.
    3.బాబ్రి మసీద్, గోద్ర ల తరువాత స్రీలపై జరిగిన అమానుష దాడులకు ఎవరు బాధ్యులు?

    ఇవన్ని చెదురు మదురు సంఘటనలు కావు కదా.

    హిందూ మతానికి పునాదులైన పిత్రుస్వామిక, మతమౌడ్య, భూస్వామ్య స్వభావాలు స్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసలకు మూలాలు.

  7. అయితే భారతదేశంలో హిందు మతం మెజారిటీ అంటున్నప్పుడు, మెజారిటీ మత ఉన్మాదం గురించే ఎక్కువగా మాట్లాడాలి మరి.
    ఎక్కువ మాట్లాడడములో తప్పు లేదండి. కానీ, మైనారిటీయే అయినప్పటికీ, మతోన్మాదములో నాలుగాకులు ఎక్కువే చదివిన వారి గురించి ఏదో మొహమాటానికి మాట్లాడినట్టు అలా అలా పైపైన మాట్లాడడములోనే ఉంది అసలు కిటుకంతా. . ఎప్పుడో ఒక సారి మాట వరసకు ఖండిస్తూ, తమ రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం మెజారిటీలను మాత్రమే నిందిస్తూ, మైనారిటీల విషయములో చూసీ చూడనట్టు వ్యవహరించి, అదేమిటి అని ప్రశ్నించగానే, మేము అందరినీ ఖండిస్తాము మాకు బేధ భావం లేదు అంటూ మొక్కుబడి సమాధానాలు ఇవ్వడం వలన లాభం లేదని మెజారిటీల భావం.

    రెండు అన్యాయాలు జరుగుతున్నప్పుడు, ఒకదానిపై విరుచుకు పడి మరో దానివైపు పెద్దగా పట్టించుకోకుండా మెజారిటీ, మైనారిటీ అంటూ ప్రవచనాలు వల్లించే సిద్దాంతానికి ఏపేరు పెడదాం? కమ్యూనిజం అనా? అయితే సరే. .

  8. అవును. కమ్యూనిజం సమాజంలోని ప్రతి వైరుధ్యాన్ని పట్టించుకుని తర్కిస్తుంది. వ్యవస్ధను సాధారణ దృక్పధంతో పరిశీలిస్తుంది. ఆ పరిశీలనలో సాధారణ వైరుధ్యాలను గుర్తించి పరిష్కారం వెతుకుంది. అదే సమయంలో సాధారణ వైరుధ్యాంశాల ప్రత్యేకతను కూడా కమ్యూనిస్టు తత్వ శాస్త్రం గుర్తిస్తుంది. సాధారణ వైరుధ్యంలో ఉండే అంతర్గత, బాహ్య వైరుధ్యాలను కూడా పరిశీలిస్తుంది. ఇలా ప్రత్యేక వైరుధ్యాలను, అంతర్గత, బాహ్య వైరుధ్యాలను గుర్తించి అవి సాధారణ వైరుధ్యం రిఫరెన్స్ గా ఏ స్ధానంలో ఉన్నదో గుర్తించి తదనుగుణమైన పరిష్కారం వెతుకుంది.

    ఈ పరిశీలన పద్ధతిని “Generality of contradiction and Particularity of contradiction” నియమంగా పిలుస్తారు. తెలుగులో “సాధారణ మరియు ప్రత్యేక వైరుధ్యాల నియమము” అని అర్ధం.

    మతం అనేది సమాజంలో ఒక ప్రగతి నిరోధక అంశంగా మార్క్సిజం చెబుతుంది. ప్రారంభంలో మతం ఒకానొక అర్ధంలో ప్రగతిశీల పాత్రను పోషించింది. ప్రకృతిని అర్ధం చేసుకోలేని దశలో మతం మనిషికి స్వాంతన ఇచ్చింది. ఒక దిశను కల్పించింది.

    క్రమంగా దోపిడి వర్గాలకు సాధనంగా మతం అవతరించింది. దోపిడీ వ్యవస్ధల్లో కూడా శ్రమ జీవికి ఒక స్వాంతన ఇచ్చే సాధనంగా అది కొనసాగుతోంది. అయితే ఆ స్వాంతన పరిధి అత్యంత సంకుచితం.

    ఇప్పుడు మనిషి మతాన్ని మించిన వ్యవస్ధలను అభివృద్ధి చేసుకున్నాడు. ప్రకృతిని జయించడానికి తగిన సాధనాలను అభివృద్ధి చేసుకున్నాడు. అయినా మతం అలానే ఎందుకుందంటే అది దోపిడిని కప్పిపుచ్చే సాధనంగా ఉపయొగపడుతోంది గనుక. ఒకప్పుడు మానవాభివృద్ధి దశలో స్వాంతన ఇచ్చిన సాధనంగా పని చేసిన మతం ఇప్పుడు దోపిడి శక్తుల నుండి శ్రమ జీవుల విముక్తికి ఆటంకంగా పరిణమించింది. ఆ అర్ధంలో అది ప్రగతి నిరోధకం.

    ఒక దేశంలో (ఏ దేశమైనా సరే) ఒక మతం మెజారిటీ స్ధానంలో ఉండి, మిగిలినవి మైనారిటీ స్ధానంలో ఉంటే అవి ఉన్న స్ధానాలను యధాతధంగా గుర్తిస్తేనే తద్వారా తలెత్తే సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది.

    ‘స్ధాన బలం’ అని ఒక పద బంధం ఉన్నది. అది ఏం చెబుతుంది? పుట్టి పెరిగిన ప్రాంతంలో తెలిసినవారు, బంధువులు ఎక్కువగా ఉంటారు గనుక వేరే ప్రాంతం నుండి వచ్చిన వారి కంటే స్ధానికుడికి ఎక్కువ బలం ఉంటుందని చెబుతుంది. మెజారిటీ, మైనారిటీ తేడాలను ఈ అర్ధంలో పరిశీలించాలి.

    పాకిస్ధాన్ లో హిందువులు మైనారిటీ మత హక్కుల కోసం పొరాడవలసిన ఉంది. దానికి కారణం అక్కడ వారికి బలం లేకపోవడమే. అక్కడ ముస్లిం మతోన్మాదమే ప్రధాన ప్రమాదంగా ఉంటుంది. అందువలన పాకిస్ధాన్ సందర్భం వచ్చినపుడు ముస్లిం మతోన్మాదం పైనే ఎక్కువ విమర్శలు ఎక్కుపెట్టబడతాయి. దీనర్ధం మైనారిటీ మతోన్మాదాన్ని సహించవచ్చని కాదు. ఒకసారి ఉన్మాదంలోకి దిగాక ఇక మెజారిటీ, మైనారిటీ అనే తేడాలు ఉండవు. ఆ ఉన్మాదాన్ని ఎదుర్కోవడమే తక్షణ సమస్య అవుతుంది.

    ఏ ఉన్మాదాలు లేని పరిస్ధితుల్లో మతోన్మాదం గురించి సాధారణ చర్చ జరుగుతున్నపుడు సాధారణ పరిశీలన కోసం మెజారిటీ, మైనారిటీ తేడాలు చూడడం అంటే మైనారిటీ మతోన్మాదాన్ని సహించవచ్చని అర్ధం కాదు. ఒక నిర్దిష్ట పరిస్ధితిలో నిర్దిష్ట వైరుధ్యాన్ని పరిశీలించడం అది.

    ———

    మతం గురించి మార్క్స్ ఏమి చెప్పాడో గతంలో నేను రాసాను. అది ఈ కింది లింక్ లో చూడవచ్చు.

    http://wp.me/p1kSha-1Bp

    పోతే, చర్చను చర్చగానే కొనసాగనివ్వండి. వ్యంగ్యంలోకి దిగితే చర్చ పక్కకు వెళ్లిపోతుంది. వ్యంగ్యం అది చేసేవారికి తప్ప ఎవరికీ సంతృప్తినివ్వదు. అందువలన దానికి జోలికి పోకపోవడమే మంచిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s