చచ్చిపోయిన రిపోర్టర్ –‘ది హిందూ’ సంచలనాత్మక కధనం


ది హిందూ నుండి

ది హిందూ నుండి

(ఇది సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం. బడా కార్పొరెట్ కంపెనీలు మీడియాను కొనెయ్యడం వలన వార్తల సేకరణలో విలేఖరి పాత్ర నామమాత్రం అవుతోందని, సంపాదకుడే యజమానికి నేరుగా ఫ్రంట్ గా వ్యవహరించవలసిన దుర్దినాలు దాపురించాయని ప్రతిభావంతంగా ఇందులో ఆయన వివరించాడు. టి.వి వార్తల సమయాన్ని రియాలిటీ షోలు కబళిస్తున్న వైనం కార్పొరేటీకరణ పుణ్యమేనని అనుభవంతో చెబుతున్న సందీప్ భూషణ్ వివరణ మనకు తెలియని కోణాలనుండి టి.వి కవరేజిని చూసే అవకాశం ఇస్తుంది. ఆంగ్ల వ్యాసానికి ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)

నవీన్ జిందాల్ ఉక్కు కంపెనీ జె.ఎస్.పి.ఎల్ (జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్) కు జరిగిన బొగ్గు గనుల కేటాయింపుల్లో కంపెనీ అధినేత నవీన్ జిందాల్ పాల్పడిన అక్రమ లావాదేవీల విషయమై తాము ప్రసారం చేస్తున్న వార్తా కధనాన్ని ఆపడానికి జీ న్యూస్ నెట్ వర్క్ 100 కోట్లు డిమాండ్ చేసిందన్న కధనం వెనుక చాలా లోతైన కధే ఉంది. ప్రధాన స్రవంతి మీడియా అందజేసినదాని కంటే మరింత సమీప పరిశీలనకు ఈ కధ అర్హమైనది.

డబ్బు డిమాండ్ చేస్తుండగా కెమెరాకు పట్టుబడ్డారని చెబుతున్నా ఇద్దరు ఎడిటర్లు సుధీర్ చౌదరి, సమీర్ అహ్లూవాలియాలు తమ యజమాని ఆదేశాల ప్రకారమే అలా చేశారా? ఢిల్లీ పోలీసులు చెబుతున్నట్లుగా జె.ఎస్.పి.ఎల్ అధికారులను కలిసిన వెంటనే వారు జీ యజమానులతో 5 నిమిషాలపాటు ఎందుకు మాట్లాడినట్లు? ఆఫ్ కోర్స్, విషయం కోర్టులో ఉంది గనుక అప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదనుకోండి!

కానీ ఈ కుంభకోణం మరింత పెద్ద కధ వైపు వేలెత్తిచూపుతోంది -టి.వి ప్రసారాల న్యూస్ నెట్ వర్క్స్ లో ఏ వార్తలను ప్రసారం చేయాలన్నది నిర్ధారించడంలో యజమానులు/ప్రమోటర్ల జోక్యం అంతకంతకూ ఎక్కువ అవుతూందన్నదే ఆ కధ! మీడియాలో ఇంకా కుదుట పడని ద్రవ్య సంక్షోభం, ‘వ్యాపార స్థిరీకరణ’ అనే పెద్ద సందర్భం నేపధ్యంలో ఈ రోజు జర్నలిస్టులు ఎక్కడ నిలబడి ఉన్నారు, టి.వి బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ లు ఎలా నడుస్తాయి… తదితర అంశాలను ఈ ‘డబ్బు గుంజుడు’ (money extortion) కధ ప్రకాశవంతమైన కాంతిలో చూపుతోంది. ఈ కధ భారత మీడియా చరిత్రలో ముఖ్యంగా టి.వి బ్రాడ్ కాస్ట్ జర్నలిజంలో అనేక విధాలుగా ఒక మైలురాయి ‍‍వంటిది.

ఈ ఆర్టికల్ రచయిత లాగానే న్యూస్ నెట్ వర్క్స్ లో రాజకీయ వార్తలను రిపోర్ట్ చేస్తూ అనేక సంవత్సరాలు గడిపిన అనేక మందికి వార్తా సేకరణ ప్రక్రియల్లో ప్రమోటర్ల సూక్ష్మ నిర్వహణ (micromanagement) ఎలా పెరుగుతూ వస్తున్నదో, బాధాకరంగానే అయినా, బాగా తెలుసు. గట్టిగా చెప్పాలంటే ఈ ధోరణి కొత్తదేమీ కాదు. “ప్రజలను ప్రభావితం చేయడంలో గుత్త స్వామ్యం కలిగి ఉన్నవారు (వార్తా సంస్థలపై గుత్త స్వామ్యం ఉన్నవారు –అను) తమకు ఇష్టం వచ్చిన విధంగా ప్రభావితం చేయగలరు” అని మొదటి మరియు రెండవ ప్రెస్ కమిషన్లు (1954, 1982) నొక్కి చెబుతూ తగు విధంగా నియంత్రణలు ఉండాలని పిలుపునిచ్చాయి. ఎన్.టి.రామారావుకు మద్దతు ఇవ్వవలసిందిగా ఈనాడు గ్రూపు యాజమాన్యం నుండి ఆదేశాలు పొందిన జర్నలిస్టులు తాము ఆ పనిని “తమ వేతనాలను కాపాడుకోవడానికే” చేస్తున్నామని భారతదేశ ముద్రణ పెట్టుబడిదారీ విధానం గురించి ప్రసిద్ధ రీతిలో గ్రంధస్థం చేసిన రాబిన్ జెఫ్రేకి తెలిపారు.

రాడియా టేపులు

2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి టెలివిజన్ పరిశ్రమలో సంక్షోభం బాగా తీవ్రం అయింది. రాడియా టేపుల రూపంలో దానికి మొదటి సాక్ష్యం వ్యక్తం అయింది. తగిన ప్రాముఖ్యత కలిగి ఉండి కూడా సముచిత రీతిలో వెలుగు చూడని కధ ఏమిటంటే: వివిధ వ్యాపార ప్రయోజనాలకు ప్రతినిధిగా వ్యవహరించిన రాడియా సంచలన రీతిలో ఒక నిర్దిష్ట బ్రాడ్ కాస్ట్ సంస్థలో పని చేసే ఉద్యోగుల వేతనాల కోసం దగ్గరి మార్గంగా పనిచేయడం.

2008 తర్వాత భారీ కార్పొరేట్ కంపెనీలు టి.వి మీడియాలోకి చొరబడడంతో ముట్టివేతకు గురయిన ప్రమోటర్లు అక్కడినుంచి నిష్క్రమించారు. దక్షిణ భారతంలో భారీ మీడియా సంస్థ అయిన ఈనాడు గ్రూపును కూడా (నేరుగా?) నియంత్రించ గలిగే విధంగా సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ లో పెరిగిన రిలయన్స్ పెట్టుబడులు అందుకు మంచి ఉదాహరణ. భారత దేశంలో అత్యంత ప్రభావ శీలత కలిగిన టి.వి టుడే గ్రూపులో ఇప్పటికే 27.5 శాతం ఈక్విటీ వాటా కలిగిన ఆదిత్య బిర్లా గ్రూపు దానిని 51 శాతానికి పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోందని నిర్ధారించబడని ఇటీవలి వార్తల ద్వారా తెలుస్తోంది.

సంపాదకుడే ముసుగు

దీనివల్ల వార్తా సేకరణ ప్రక్రియలకు ఏం జరుగబోతోంది?

ఆ ప్రభావాలు మౌలికమైనవే కాక అనేకమైనవి కూడా. కొన్ని ప్రాధమిక అంశాల వరకే నేను పరిమితం అవుతాను.

అత్యంత ముఖ్యమైన ప్రభావం ఏమిటంటే సంపాదకుడి (editor) పాత్ర పునర్నిర్వచించబడుతుంది. టి.ఆర్.పి పరుగు పందెంలో గెలవడానికి నియమించబడిన సమూహానికి నాయకత్వం వహించగల లక్షణాలతో మాత్రమే అతని/ఆమె ప్రొఫైల్ రూపు దిద్దుకోదు. అంతకంతకూ ఎక్కువగా, పరిశ్రమలో ప్రమోటర్ యొక్క విశ్వసనీయత, ఆమోదనీయతలు రెండింటిని అందజేయగల ఒక కీలకమైన ఫ్రంట్ గా రూపొందేలాగున సంపాదకుడు పని చేయవలసి ఉంటుంది. ప్రమోటర్ మార్గమే –అతని తలంపులు, కల్పనలు; అతని చాదస్తాలు, బహుశా అత్యంత నష్టకరమైన అతని రాజకీయ ప్రాధాన్యాలు కూడా- ఎడిటర్ మార్గం అవుతుంది. టి.వి బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుందని నా ఉద్దేశ్యం కాదు. కానీ ప్రధానంగా పరిస్ధితి ఇదేనని ఏ ‘ఇన్సైడర్’ అని అడిగినా చెబుతారు.

వార్తా సేకరణ ప్రక్రియలు అంతకంతకూ కేంద్రీకరించబడడానికి ఇది దారి తీసింది. రాజకీయ వార్తల రిపోర్టింగ్ కు ఎడిటోరియల్ పర్యవేక్షణ అత్యంత సమీపంలో సంచరిస్తుంది. ఎందుకంటే అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గట్టిగా ఢీ కొట్టే అవకాశం నిజంగా ఇక్కడే ఉంటుంది. రాజకీయ వార్తలను రిపోర్ట్ చేయడంలో నాకున్న అనుభవాన్ని బట్టి చెప్పగల విషయం ఏమిటంటే క్షేత్ర స్థాయిలో నిలబడి ఒక స్టోరిని సృష్టించిన తర్వాత, ఎడిటర్ పంథాకి అనుగుణంగా ఉంటే తప్ప అది ప్రసారానికి నోచుకుంటుందని ఆశించలేము. “రాజకీయ” స్టోరీలు అనివార్యంగా “పై” స్థాయి లోనే ఉద్భవిస్తాయి. ఒక స్టోరీకి సంబంధించి విలేఖరికి మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉన్న కొన్ని నిర్దిష్ట కోణం పైన చాలా తరచుగా ఆ విలేఖరి మాట చెల్లుబాటు కాదు. ఈ పరిస్ధితిలో బ్రాడ్ కాస్ట్ జర్నలిజం నుండి (రాజకీయ) విలేఖరి ఉనికి దాదాపు అదృశ్యం అయిపోయింది.

మారుతి విషయంలో సుతిమెత్తగా

ప్రైవేటు కార్పొరేషన్ల పాత్ర ఉన్న వార్తల రిపోర్టింగ్ విషయంలో ఎడిటోరియల్ నియంత్రణ కఠినంగా ఉంటుంది. గత సంవత్సరం జులైలో మారుతి కార్మికుల చేసిన సమ్మె నా అనుభవంలో ఒక మంచి ఉదాహరణ. సమ్మె విషయం రిపోర్ట్ చేసినపుడు అది పూర్తిగా ఏకపక్షంగా సాగింది. అక్కడ చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను రిపోర్ట్ చెయ్యడంలో, న్యూస్ నెట్ వర్క్ లు ప్రసిద్ధిగాంచిన ‘వాల్ టు వాల్’ తరహా కవరేజి కి అది కాంతి సంవత్సరాల (కాంతి కిరణం ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు) దూరంలో ఉంది. ప్రకటనల ద్వారా తమకు ఆదాయాన్ని సమకూర్చే కంపెనీల్లో మారుతి ప్రధానమైనది కనుక అక్కడ జరిగే వాస్తవాలను పెద్దగా ఇవ్వలేమని చెప్పడంలో ఎడిటర్లు దృఢంగానే వ్యవహరించారు.

(ప్రమోటర్, ఎడిటర్ ల మధ్య) కొత్తగా అభివృద్ధి అవుతున్న ఈ సమానురూప (symmetry) ఏకీభావం వార్తా సేకరణ ప్రక్రియను దారుణంగా దెబ్బతీసింది. సంపాదకుడే అంతిమ నిర్ణేత అని విలేఖరి స్ధానంలో ఉన్నవారికి పూర్తిగా తెలిసిన విషయమే. వాళ్ళు చాలా మామూలుగా విలేఖరి తలపై నుండి వంగి తేరిపార చూస్తారు. పొలిటికల్ బీట్స్ విషయంలో, ముఖ్యంగా ఎన్నికలు వంటి కీలక ఘట్టాలు ముందున్న సమయాల్లో ఇది అంతకంతకూ ఎక్కువవుతోంది.

అనుభవ శూన్యుల నియామకం

రెండవది, విలేఖరులను తయారు చేసుకునే అవసరం క్రమానుగతంగా అంతర్ధానం అవుతున్న ఒక వ్యవస్థ సృష్టించబడుతోంది. వార్తలను నిర్మించడంలో విలేఖరికి గల కీలక పాత్రకు ఇది శరాఘాతంలా తాకింది. ఫలితంగా టెలివిజన్ రిపోర్టింగ్ లు అర్థవంతమైన “ప్రత్యేక” కధనాలను, వాటి అనుసరణలను పెద్దగా అందించ లేకపోతున్నాయి. దరిమిలా ముద్రణ మీడియా పైనే అవి పూర్తిగా ఆధారపడి నడుస్తున్నాయి. ప్రైమ్-టైమ్ సమయాల్లో వార్తల నెట్ వర్క్ లు అన్నింటా జీవం మృగ్యమై ఒకటే తీరులో వార్తలు కనిపిస్తే అందులో ఇక ఆశ్చర్యం ఏముంటుంది?

స్థిరంగా టాబ్లాయిడీకరణ (సంచలన వార్తలకు ప్రాధాన్యం పెరగడం? -అను) చెందుతున్న వార్తలు, ‘హార్డ్’ న్యూస్ గా రూపు సంతరించుకుంటున్న ‘రియాలిటీ’ టెలివిజన్ షోలు గంట తర్వాత గంటగా ‘లైవ్’ ఫుటేజీ సమయాన్ని తినేస్తున్న ఒక వ్యవస్థ ఆవిర్భవిస్తున్నది. ఇక్కడ విలేఖరులకు చెల్లుబాటు లేక వేగంగా ఉనికిని కోల్పోతున్నారు. టెలివిజన్ జర్నలిస్టు సగటు వయసు బాగా పడిపోయిందంటే దానికి కారణం అతని జాబ్ ప్రొఫైల్ ప్రధానంగా బైట్స్ సేకరించి అప్ లింక్ చెయ్యడమే; ఈ పని ఎవరైనా చెయ్యగలిగిందే మరి! గంటల తరబడి సాగే నిస్సారపు పనికి పావు వేతనానికైనా సిద్ధపడి ఆత్రంగా ముందుకు వస్తున్న అనుభవ శూన్యులు ఉండగా భారీ వేతనాలు చెల్లించవలసిన అనుభవజ్ఞుల అవసరం ఏమిటి?

మీడియా వ్యాపారంలో వాస్తవంగా విస్తరణ కొరవడిన పరిస్ధితిలో ఉద్యోగ భద్రత ఎవరికీ లేదు. వాడి పారేయగల పేద విలేఖరికే కాక కాంట్రాక్టు ఉద్యోగంలో ఉన్న ఎడిటర్ కి కూడా ఉద్యోగ భద్రత లేదు. కుచించుకుపోతున్న ఉద్యోగావకాశాలు ఇప్పుడు అంతటా కనపడుతున్న లక్షణం; ఎడిటోరియల్ పిరమిడ్ లో ఎవరికీ భద్రత లేదు. (2008 తర్వాత దాదాపు 3,000 మంది విలేఖరులు ఉద్యోగం పోగొట్టుకున్నారని రెండు సంవత్సరాల క్రితం “Catalyst for Change” అని అంశంపై ముంబైలో లెక్చర్ ఇస్తూ ది హిందూ విలేఖరి పి.సాయినాధ్ తెలిపాడు.)

విలేఖరికి సాధికారత లేకుండా చేసిన ఫలితంగా ఎడిటర్, తద్వారా ప్రమోటర్ శక్తివంతంగా మారాడు. బూటకపు నిపుణులు, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే తక్షణ వ్యాఖ్యాతలతో నిండి ఉన్న న్యూస్ స్టూడియోలకు నిజమైన వివేకంతో కూడిన విజ్ఞాన భాండాగారం తరలిపోయింది. వార్తల్లో ప్రధాన భాగాన్ని స్టూడియో చర్చలు ఆక్రమిస్తున్నాయి. ఇది ఇంకా చౌక. (విలేఖరులను బైటికి పంపవలసిన అవసరం లేదు.) ఒక ప్రయోగశాలలో ప్రయోగం వలెనే ఎడిటోరియల్ నియంత్రణ సులభతరం అవుతుంది. స్టూడియో అతిధులు గొప్ప నిపుణులై ఉంటారు. చర్చలో ఉన్న అంశంపైన అప్పటికే అందరికీ తెలిసిన అభిప్రాయాలు, కొందరు అనుకూలంగా ఇంకొందరు వ్యతిరేకంగా, వారు కలిగి ఉంటారు. ప్రైమ్ టైమ్ టెలివిజన్ లకు సాధారణంగా మారిన అటువంటి అభినయ పూర్వక కోడిపుంజు పోరాటాల ద్వారా, మీడియాచేత జాగ్రత్తగా “తయారు చేయబడిన సమ్మతి” (manufactured consent – నోమ్ చోమ్ స్కీ మొదట ఈ పదబంధాన్ని ఉపయోగించాడు) ని ఏ చర్చా అతిక్రమించకుండా చూడవచ్చు. వ్యవస్థ యధాతధ స్థితి కొనసాగడానికి ఈ సమ్మతి అత్యవసరం!

దేశ వ్యాపితంగా రాజకీయ అవగాహన వృద్ధి చెందుతూ ప్రజాస్వామ్యం మరింత లోతుల్లోకి పోతున్న సమయంలోనే ఈ పరిస్ధితి ఏర్పడడం గర్హనీయం.

పైనుండి కిందికి ప్రవహించే సంపాదకత్వం, రాజకీయాల నుండి విమర్శనాత్మక సంఘర్షణలను (బిజెపి వర్సెస్ కాంగ్రెస్ లాంటి సంకుచిత అర్ధంలో కాదు) తొలగించే ఏకరూపతా వార్తల ప్రసారం మీడియాను ‘మేనేజ్’ చేసే పనిని రాజ్యానికి సులభతరం చేసిపెట్టాయి.

మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే, వార్తల్లోని వైవిధ్య లేమి మరియు సంపాదకత్వంలోని ఏకరూపత భారతదేశానికి అంతర్లీనంగా ఉంటూ వచ్చిన బహుళత్వానికి శరాఘాతంగా మారాయి. కాబట్టి ఇప్పుడు కావలసిందేమిటంటే, అనేకమంది ప్రముఖ లిబరల్స్ సూచిస్తున్నట్లుగా మురికిని శుభ్రం చెయ్యడానికి (బ్రిటన్ లో మాదిరిగా) లెవెసన్ కమిటీ లాంటి విచారణ కమిటీని నియమించడం కాదు; పూర్తి స్థాయిలో వరుస సంస్కరణలను చేపట్టాలి. విలేఖరులకు మరింత రక్షణ కల్పించాలి; మేనేజ్ మెంట్ వృత్తి నైపుణ్యం సాధించే విధంగా మరింత అర్థవంతమైన ప్రయత్నం సాగాలి; వీటన్నింటికంటే ముఖ్యంగా యాజమాన్యంలోనూ, వార్తల్లోనూ వైవిధ్యం కొనసాగడానికి శక్తివంతమైన యాంటీ ట్రస్ట్ చట్టాలు తేవాలి.

(సందీప్ భూషణ్ మాజీ టి.వి జర్నలిస్టు. ఆయన జామియా మిలియా ఇస్లామియాలో బోధనోపాధ్యాయుడు.)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s