మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అంతిమ బాధితులు ప్రజలే


Akbaruddin arest (The Hindu)

Akbaruddin arest (The Hindu)

మతోన్మాదం గురించి ఆంధ్ర ప్రదేశ్ లో మళ్ళీ చర్చ జరుగుతోంది. మైనారిటీ మతోన్మాదం వార్తలకు ఎక్కడం ఈసారి ప్రత్యేకత. ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీకి చెందిన యువ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ చోట్ల ఇచ్చిన విద్వేష పూరిత ప్రసంగాలు ఈ చర్చకు ప్రేరణగా నిలిచాయి. ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి హిందూ తీవ్రవాద సంస్థలు, పార్టీల నుండి సెక్యులరిస్టు పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ నుండి వివిధ సెక్యులర్ ముస్లిం సంస్థల వరకూ అక్బరుద్దీన్ తన ప్రసంగాల్లో హిందూ మత విద్వేషాన్ని విరజిమ్మాడని చెబుతూ ఖండన మండనలు జారీ చేశాయి.

అనేకమంది చిన్న, పెద్ద ముస్లిం సంస్థలు ప్రసంగంలో అంశాలపై అభ్యంతరాలను ప్రకటించారు. కలిసిమెలిసి నివసిస్తున్న హిందూ, ముస్లిం ప్రజల మధ్య చిచ్చు రగుల్చే విధంగా ఆయన మాటలు ఉన్నాయనీ, ఆయన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామని చెబుతూ ముస్లిం సంస్థల నాయకులు ఛానళ్లలో కనిపించారు. ఒవైసీ మాటలను తీవ్రంగా ఖండిస్తూ కొందరు విశ్లేషకులు వ్యాసాలు రాశారు. దిలీప్ పడగోంకర్ లాంటి వారు అక్బరుద్దీన్ ని సంఘ బహిష్కరణ చేయాలని కూడా వాదించారు. అయితే వీరి వాదనలను ఎంఐఎం నాయకులు తిరస్కరిస్తున్నారు. ప్రసంగంలో కొద్ది భాగాలను మాత్రమే తీసుకుని విద్వేషం అని ప్రచారం చెయ్యడం సరికాదని, ప్రసంగం మొత్తాన్ని పరిగణించినపుడు వ్యక్తం అయే అర్ధంలో ద్వేషం లేదని గ్రహించవచ్చని వారు వివరిస్తున్నారు.

అనేకమంది వ్యతిరేకతను మూటగట్టుకునే విధంగా అక్బరుద్దీన్ ఏమన్నాడు? ప్రధాన పత్రికలేవీ ఆ వివరాలు ఇవ్వలేదు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఒక చోట మాత్రం ఆయన ఏమన్నారో పరోక్షంగా తెలిపింది. అది కూడా ఒక్క విషయమే. కొద్ది నిమిషాలు పోలీసులు లేకుండా చేస్తే ముస్లింలు కొద్దిమందే అయినా మెజారిటీ మతం వారిపై తమ తడాఖా ఏమిటో చూపిస్తారన్నట్లుగా అక్బరుద్దీన్ వ్యాఖ్యానించాడని తెలుస్తోందని టి.ఒ.ఐ తెలిపింది. హిందువులు పవిత్రంగా చూసే ఆవు విషయంలో అసభ్యంగా వ్యాఖ్యానించినట్లు నిర్ధారించబడని వార్తల ద్వారా తెలుస్తోంది. భాగ్యలక్ష్మి ఆలయం, రాముడి జన్మస్థలం గురించి కూడా ఆయన వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశాడని ‘నమస్తే ఆంధ్ర’ వెబ్ సైట్ చెప్పింది. అక్బరుద్దీన్ విద్వేష వ్యాఖ్యలను ప్రధాన పత్రికలేవీ నిర్ధారణ చేయలేదు. ఆయన వ్యాఖ్యలను యధాతధంగా ఉల్లేఖిస్తే ఉద్రిక్తతలు ఏర్పడవచ్చని అవి జాగ్రత్త పాటించి ఉండవచ్చు.

అక్బరుద్దీన్ అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్నంలో ఇచ్చిన ప్రసంగంపైనే విమర్శలు, కేసులు కేంద్రీకృతం అయ్యాయి. డిసెంబర్ 22 తేదీన ఆయన అక్కడ ప్రసంగం ఇస్తే జనవరి మొదటి వారానికి గాని వివాదాస్పదం కాలేదు. బహుశా ఆయన ప్రసంగాన్ని రికార్డు చేసినవారు యూ ట్యూబ్ లో వీడియోగా పెట్టిన తర్వాతే వివాదం మొదలయిందా అన్న విషయం తెలియలేదు. కొన్ని టి.వి ఛానెళ్ళు అక్బరుద్దీన్ ప్రసంగ భాగాలను ప్రసారం చేశాయని తెలుస్తోంది. విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన గొంతు తనది కాదని అక్బరుద్దీన్ పోలీసుల విచారణలో చెప్పిన నేపధ్యంలో UrduTV, రుబి, 4TV, MQ తదితర ఛానళ్లకు చెందిన రెండు హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ‘ది హిందూ’ ఆదివారం తెలిపింది. తాము ప్రసారం చేసిన వీడియో భాగాలను సదరు ఛానళ్ళు ముందే పోలీసులకి ఇచ్చినప్పటికీ అందులో వివాదాస్పద వ్యాఖ్యలు ఏమీ లేకపోవడంతో ఒరిజినల్ ఫుటేజీ కోసం హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. అయితే డిస్క్ లలో కూడా పోలీసులకి incremental evidence ఏదీ దొరక లేదట. దానితో ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా తొలగించిన వీడియోను సంగ్రహించడానికి పోలీసులు నిర్ణయించారు.

అక్బరుద్దీన్ ప్రసంగం, అరెస్టుల విషయమై ది హిందూ పత్రిక ఎంఐఎం నాయకులతో మాట్లాడినట్లు తెలిపింది. వారి ఉద్దేశ్యంలో అక్బరుద్దీన్ అరెస్టు కాంగ్రెస్, బిజెపి లు కలిసి చేసిన కుట్ర. తెలంగాణ ఏర్పడితే బిజెపి ఆధిపత్యం ఏర్పడుతుందని తాము మొదటి నుండి చెబుతున్నామని అక్బరుద్దీన్ ప్రసంగంపై చెలరేగిన వివాదం దానిని నిరూపిస్తున్నదనీ వారు చెప్పారు. ఆయన ప్రసంగం విద్వేషపూరితంగా ఉంటే సీమాంధ్రలో ప్రజలు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కుట్ర వల్ల బిజెపి కి ఒరిగేది ఏమీ లేదని మహా అయితే జారిపోతున్న కార్యకర్తలను తిరిగి నిలబెట్టుకోవచ్చనీ ఎంఐఎం నాయకులు వ్యాఖ్యానించినట్లు పత్రిక తెలిపింది. అక్బరుద్దీన్ అరెస్టు వెనుక ఎంఐఎం చెప్పిన విధంగా రాజకీయాలు ఉండకపోవచ్చు గానీ అసలైతే రాజకీయాలు ‘కూడా’ ఉన్నాయని సందేహం లేకుండా చెప్పొచ్చు.

వ్యాఖ్యల్లో విద్వేషం లేకుండా అరెస్టు సాధ్యం కాదు గనక (సూపర్ ధనిక వర్గం అయితేనే సుమా!) విద్వేషపూరిత వ్యాఖ్యానాలు చేశాడా లేదా అన్న విషయంలో సందేహం అనవసరం. కానీ విద్వేష ప్రసంగాలు చెయ్యడం ఒవైసీ కుటుంబానికి ఇదే మొదటిసారి కాదు. బహుశా చివరిసారి కూడా కాకపోవచ్చు. శ్రామిక ప్రజలకి ఏనాడూ కాసింత కూడు పెట్టని మతాలపైనా, మత విద్వేషం పైనా, మత విద్వేషపూరిత ప్రసంగాల పైనా ఆధారపడి సవాలక్ష వ్యవస్థలు పని చేస్తున్న దేశంలో, విద్వేషపూరిత ప్రసంగం ఇచ్చాడా లేదా అన్న అనుమానమే అనవసరం. అది కూడా ఒవైసీలాంటి వారి విషయంలో.

మతంపై ఆధారపడి బిజెపి, ఎంఐఎం లతో సహా అనేక రాజకీయ పార్టీలు రాజకీయాలు నడిపిస్తున్నాయి. మతం ఆధారంగా ముంబై, గుజరాత్, అస్సాం లాంటి చోట్ల సామూహిక హత్యాకాండలు, గృహ దహనాలే జరిగాయి. వాటిల్లో దోషులైన పెద్ద తలకాయలు ఇప్పటికీ అధికారం వెలగబెడుతున్నారు. ఎంఐఎం నాయకుల ప్రసంగాల్లో గతంలో వారికి అనుకూల ప్రభుత్వాలు ఉన్నపుడు కనపడని విద్వేషం, పాలక కూటమి నుండి బైటికి వచ్చిన తర్వాత కనిపించడమే, ప్రజల ప్రయోజనాల రీత్యా, అసలు చర్చనీయాంశం.

భూస్వామ్య అణచివేత స్వభావం అన్ని అంగాల్లోనూ నిండి ఉన్న పార్టీ ఎంఐఎం. అలాంటి పార్టీ నాయకులు అందుకు భిన్నంగా ఎందుకు ఉంటారు? మత విద్వేషం ఆ పార్టీకి ఓట్లు సమకూర్చే సాధనం. పాత బస్తీలో గానీ, మరో చోట గానీ ముస్లింలు మరో పార్టీ నీడలోకి చేరకుండా ఉండాలంటే స్వమత దురభిమానం పెంచి పోషించడంతో పాటు పరమత విద్వేషం అనే విషాన్ని విరజిమ్మడం కూడా మత పార్టీలకు అవసరం. తద్వారా పరాయి మతం వలన తమ మతానికి ప్రమాదం ఉన్నదని స్వమతస్ధులను ఒక భయంలో కొనసాగించడం వారి లక్ష్యం. మైనారిటీ మతం అయితే అలాంటి భయం పెంపొందించడం ఇంకా తేలిక కావచ్చు. ఆ విధంగా మాత్రమే సొంత మత ఓటర్లను విడిపోకుండా ఒకే పార్టీ నీడలో ఉంచగలమని మత పార్టీలు నమ్ముతాయి.

ఎం.ఐ.ఎం చరిత్ర అంతా ప్రజా వ్యతిరేక చరిత్ర. 1927 లో నిజాం పాలనలో స్థాపించబడినప్పుడు అది ఒక మతపరమైన సాంస్కృతిక సంస్థ. ఆ తర్వాత అది భారత దేశంలో ముస్లిం లీగ్ లాగానే నిజాం సంస్థానంలో ముస్లిం మత పార్టీగా ఆవిర్భవించింది. నిజాం పాలంలో ముస్లిం మతతత్వానికే ఎం.ఐ.ఎం ప్రాతినిధ్యం వహించిందని నరేంద్ర లూధర్ లాంటి హైదరాబాద్ చరిత్రకారులు చెప్పిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం.

బహదూర్ ఖాన్ లాంటి ఫ్యూడల్ జాగీర్దార్ లు ఎం.ఐ.ఎం ప్రారంభ నాయకులుగా ఉన్నారు. మత విద్వేష పూరిత ప్రసంగాలతో ముస్లిం ప్రజలను అమితంగా ఆకట్టుకున్న బహదూర్ ఖాన్, తన ప్రసంగాల ప్రతిభతో నిజాం నవాబు గౌరవాన్ని కూడా పొందాడు. హిందూ మతంలో అంటరానివారుగా వెలి వేయబడిన దళిత కులాల ప్రజలు అనేకమంది ఆయన ప్రోత్సాహ సహకారాలతో ముస్లిం మతాన్ని స్వీకరించారని, తద్వారా నిజాం రాజ్యంలో ముస్లింల సంఖ్య పెరిగేందుకు తోడ్పడ్డాడని చరిత్ర రికార్డు చేసింది. అంటే తెలంగాణలో గానీ, పాత బస్తీలో గానీ దరిద్రంతో బతుకీడుస్తున్న ముస్లింలలో అనేకులు కొన్ని దశాబ్దాల లేదా ఒకటి రెండు శతాబ్దాల క్రితం హిందూమతం దూరంగా ఉంచిన అంటరానివారని స్పష్టం అవుతోంది. ఒక్క తెలంగాణ అనే కాదు దేశంలో అనేక చోట్ల హిందూ మతంలో అణచివేత నుండి బయట పడడానికి దళిత కులాల వారు ముస్లిం, క్రైస్తవ మతాలను స్వీకరించారు. కుల అణచివేతకు మతం పరిష్కారం కాదు గనుక దళితులు ఏ మతంలోకి వెళ్ళినా శ్రమ దోపిడిని తప్పించుకోలేకపోయారు. వారు ఎక్కడికి వెళ్ళినా అంటరానితనం అనే సామాజిక కళంకం, ఆర్ధిక వెనుకబాటుతనం వారి వెన్నంటే వెళ్ళాయి. దళితులకు హిందు మతం ప్రసాదించిన శాపం అంత శక్తివంతమైనది.

ఎం.ఐ.ఎం పార్టీని నడిపినవారిలో ఖాసిం రిజ్వి ఒకరు. భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన ఫ్యూడల్ సైన్యంగా ప్రసిద్ధి పొందిన ‘రజాకార్’ సైన్యానికి ఆయన నిర్మాత, నాయకుడు. ఉత్తర ప్రదేశ్ నుండి వలస వచ్చి లాయర్ గిరి పొందిన రిజ్వి కూడా హిందూ మతంపై విషం కక్కే ప్రసంగాలతో నిజాం ప్రశంసలు పొందాడు. ఇలాంటి నాయకుల నుండి పాఠాలు నేర్చుకున్న ఒవైసీ కుటుంబం వారికి భిన్నంగా వ్యవహరిస్తారా? ఆ పాఠాలు ఎలా ఉన్నా ఒవైసి కుటుంబం, దాన్ని అంటిపెట్టుకున్న ఇతర ముస్లిం సూపర్ ధనికులకు మత విద్వేషం ఒక ఆర్ధిక, భౌతిక అవసరం. చైతన్యంతో వ్యవహరించే ప్రజలు మత విద్వేషాలకు లొంగరు గనుక పాత బస్తీ ప్రజలు ఎల్లకాలం దరిద్రం, అవిద్యలలో కొనసాగడమే ఎం.ఐ.ఎం కి కావాలి.

ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే, ఎం.ఐ.ఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో స్నేహం తెంచుకుంది. అలా ఎందుకు జరిగిందో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. భాగ్యలక్ష్మి ఆలయానికి సంబంధించిన వివాదం సందర్భంగా ఆ విషయం వివరిస్తూ ఒక ఆర్టికల్ ఈ బ్లాగ్ లో ప్రచురించబడింది కూడా. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని అందరూ అంచనా వేస్తున్నారు. జైలులో కాలం వెళ్ళబుచ్చుతున్న జగన్ నేతృత్వంలోని వైకాపా పార్టీకి మంచి అవకాశాలున్నాయని అనేకమంది అంచనా వేస్తున్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని కూడా వారి అంచనా. పైగా వై.ఎస్.రాజశేఖర రెడ్డితో కలిసి పాత బస్తీలో అత్యంత దారుణమైన మత కల్లోలాలను నిర్వహించిన చరిత్ర ఎం.ఐ.ఎం సొంతం అని పత్రికలు అనేక సార్లు చెప్పాయి.

రాజకీయ పార్టీల లాంటి దేశాన్ని నడిపే సంస్థలు కొన్ని సంవత్సరాలు ముందుగానే రాజకీయ పధకాలు రచించుకుని పెట్టుకుంటారు. రాష్ట్ర రాజకీయ చదరంగంలో వైకాపా, ఎం.ఐ.ఎం లు ఉమ్మడిగా రచించుకున్న ఎత్తులు, పైఎత్తులలో భాగంగానే ఉన్నట్లుండి భాగ్యలక్ష్మి ఆలయాన్ని సాకుగా చూపి ఎం.ఐ.ఎం వివాదం లేవనెత్తింది. అనంతరం కాంగ్రెస్ తో దోస్తీ లేదు పొమ్మంది. ఆ తర్వాత ముస్లిం ఓట్లను స్థిరీకరించుకునే పనిని అక్బరుద్దీన్ మొదలుపెట్టాడు. దానిలో భాగమే ఆయన విద్వేషపూరిత ప్రసంగాలు. ఎవరు గమనించారో గానీ (కాంగ్రెస్ కావచ్చు, బిజెపి కావచ్చు లేదా ఇంకెవరైనా మొదలు పెడితే వీరు అందుకుని ఉండొచ్చు) అక్బరుద్దీన్ ప్రసంగాలు రాజకీయ వ్యూహానికి అచ్చిరానున్నాయని గ్రహించారు. దానితో మొదలయింది జాతర.

ఈ విశ్లేషణ అక్బరుద్దీన్ వెళ్లగక్కిన విషానికి సమర్థన కాదు. హిందూమత సంస్థల నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలను, హత్యాకాండలను గుర్తుకు తెచ్చి కొంతమంది అక్బరుద్దీన్ ప్రసంగాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. మెజారిటీ మతం పేరుతో కక్కినా, మైనారిటీ మతం పేరుతో కక్కినా విషం ఎప్పటికీ విషమే. సాధారణంగా మైనారిటీ మతం వాళ్ళు ప్రతికూల పరిస్ధితులు ఎదుర్కోవడం కద్దు. కాని కాంగ్రెస్ లాంటి బూటకపు సెక్యులర్ పార్టీల మద్దతు ఉన్నపుడు, మత విద్వేషంపై ఆధారపడిన ఓటు బ్యాంకు రాజకీయాలు వర్ధిల్లుతున్నపుడు ఒవైసీ లాంటి మైనారిటీ ఫ్యూడల్ మత నాయకులు కొరకరాని కొయ్యలు కావడం జరుగుతోంది. కాంగ్రెస్, ఎన్.సి.పి లు సెక్యులర్ ఫోజు కొడతాయి. కాని వారి మద్దతు లేకపోతే బాల్, రాజ్ ధాకరే ఎంత విద్వేషం కక్కినా వారిపైన ఈగ కూడా వాలకుండా ఎలా ఉండగలదు? కాంగ్రెస్ నాయకుడు పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన ఆశీస్సులతోనే బాబ్రి మసీదు కూల్చివేత జరిగిందని ఆయన వద్ద కార్యదర్శిగా పనిచేసిన అధికారి ఇటీవల రాసిన పుస్తకంలో వెల్లడి చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవడం సముచితం.

కనుక ఉన్నత స్థాయుల్లో ప్రభుత్వాలు నడుపుతూ వందల వేల కోట్లు జమ చేసుకుంటున్నవారి స్థాయిలో సెక్యులరిజం, మతతత్వాల మధ్య సరిహద్దు రేఖ ఎప్పుడో చెరిగిపోయింది. నిజమైన సెక్యులర్ పార్టీలు ఇపుడు దుర్భిణి వేసి వెతికినా కనపడవు. మతతత్వం ఏ రూపంలో ఉన్నా ఖండించి తిరస్కరించాల్సిందే. అయితే మెజారిటీ మతతత్వం దూకుడుగా ఉన్నపుడు మైనారిటీ మతస్థులు తీవ్రమైన అబధ్రతను ఎదుర్కుంటారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారని అనేక హత్యాకాండలు రుజువు చేస్తున్నాయి. మెజారిటీ మతతత్వం దానికదే ఒక రాజకీయ శక్తిగా మనగలుగుతోంది. మైనారిటీ మతతత్వం సెక్యులర్ ముసుగులో ఉన్న రాజకీయ శక్తులు లేకుండా మనజాలదు. సాధారణ పరిశీలనలో రెండింటికీ ఉన్న తేడా ఇది. మతతత్వం జడలు విప్పి వీరంగం ఆడుతున్నపుడు మెజారిటీ, మైనారిటీ అని తేడా చూడనవసరం లేదు. ఆ సమయంలో మెజారిటీ, మైనారిటీ అన్న తేడా లేకుండా రెండూ ప్రజలకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తాయి.

మతతత్వం జడలు విప్పి వీరంగం ఎందుకు ఆడుతుంది? ఎందుకో చెన్నారెడ్డి ప్రభుత్వం ఉన్నపుడు హైదరాబాద్ లో జరిగిన మత కల్లోలాలు స్పష్టం చేశాయి. ‘పొద్దున్నే లేచి ఈ రోజు కూటికి ఎలాగ’ అని సతమతం అయ్యే సాధారణ ప్రజలకి మతం సంగతి పెద్దగా పట్టదు. ఇక మతతత్వం జోలికే వారు పోరు. అలా పోయేవారు కలిగినవారే. ఆధిపత్య వర్గాలు తమ మధ్య ప్రజా వనరుల పంపకాల సమస్య ఏర్పడినప్పుడు పునః పంపిణీకి దిగవలసి వస్తుంది. పునః పంపిణీ సజావుగా జరగకపోయినా, లేదా కొందరికి అసంతృప్తి కలిగినా వారు ప్రజలను ఆశ్రయిస్తారు.

‘మీకు చెందిన ఆస్తులను పంచుకోవడంలో మాకు తగాదాలు వచ్చాయి. తీర్పు మీరే ఇవ్వండి’ అని నేరుగా అడగలేరు గనుక ఏదో ఒక ముసుగు వేసుకుని వాళ్ళు వస్తారు. ఒకసారి అభివృద్ధి అంటారు; ఒకసారి సెక్యులరిజం అంటారు; ఇంకో సారి రిజర్వేషన్లు అంటారు; మరొక సారి మతతత్వం అంటారు; ఇంకో సారి పాకిస్థాన్ లేదా విదేశీ హస్తం లేదా చైనా ఇలాంటివి చెబుతారు. ఆ విధంగా అక్బరుద్దీన్ మత విద్వేషం ముసుగు వేసుకుని ముస్లిం ప్రజలను ఓట్లుగా స్థిరీకరించుకునే ప్రయత్నంలో వైరి శిబిరానికి దొరికిపోయాడు. ఓట్ల వేటలో వళ్ళు మరిచిపోయిన అక్బరుద్దీన్ కట్లు తెంచుకున్న వేటకుక్క తరహాలో మొరిగి నెత్తిమీదకి కేసులు తెచ్చుకున్నాడు. ఈ కేసుల ద్వారా ఎం.ఐ.ఎం ని కాంగ్రెస్ మళ్ళీ తన శిబిరంలోకి లాక్కోగలదేమో చూడాలి. వైకాపా మళ్ళీ కాంగ్రెస్ ఒడిలోకి చేరకుండా మొండిగా ఉంటే ఎం.ఐ.ఎం దోస్తీ తెలంగాణలో కాంగ్రెస్ కి లాభకరం కావచ్చు. అందుకు కేసులు దానికి ఉపయోగపడవచ్చు.

ఈ పరిస్ధితుల్లో అక్బరుద్దీన్ ప్రసంగం పైన అనవసరంగా భావోద్వేగాలు పెంచుకుని ఉద్రిక్తతలకు లోను కావలసిన అవసరం లేదు. అదంతా పెద్దోళ్ల భాగోతం. కాదని దూరితే అరిటాకు, ముల్లు సామెత అవుతుంది.

23 thoughts on “మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా అంతిమ బాధితులు ప్రజలే

 1. “కాంగ్రెస్ నాయకుడు పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన ఆశీస్సులతోనే బాబ్రి మసీదు కూల్చివేత జరిగిందని ఆయన వద్ద కార్యదర్శిగా ”

  May I know his name.

 2. Sri గారూ, ఆయన పేరు నాకు గుర్తు రాలేదు. అందుకే రాయలేదు. ది హిందూ లోనే చదినట్లు నాకు గుర్తుంది. ఇప్పుడు ఆ వార్త కోసం వెతికినా దొరకలేదు. దొరికితే చెబుతాను.

 3. There are also some Hindus who upheld MIM’s speech. For example: Adusumilli JayaPrakash, United Andhra JAC leader. MIM is pro-Nizam party since it’s foundation and it’s leaders cannot admire the development of Telangana. So, even some United Andhra proponents got ready to ally with those communal elements against Telangana.

 4. PVRK ప్రసాద్ గారు “అసలేం జరిగిందంటే” అనే పుస్తకం లో దాని గురించి కొంచెం వ్రాసారు. మీరు చెప్తున్న కార్యదర్శి ఆయనేమో. నాకు గుర్తున్న వరకు ఆయన బాబ్రీ మసీద్ కూల్చివేత స్పష్టంగా PV నరసింహారావు గారి ఆశీస్సుల తో జరిగింది అని వ్రాయలేదు అనుకుంటున్నాను. అసలు నిజం ఆశీస్సుల కు, అసహయతకు కు మద్యలో ఉందేమో.

 5. I watched a cinema titled “Cameraman Gangato Rambabu”. That cinema did spill strong venom against Telangana. Those film makers displayed Nizam photo as wall frame in villain’s house to prove that Telangana people are admirers of Nizam’s dust. But in real life, Nizam’s disciples are in alliance with United AP heroes like Jagan against Telangana.

 6. ప్రవీణ్, మీరిలా ముక్కలు ముక్కలుగా వరుస వ్యాఖ్యలు రాసే బదులు ఒకేసారి రాయగలిగితే మీరు రాసే అంశాలు మరింత అర్ధవంతంగా పాఠకుల దృష్టికి వస్తాయి. అలా చేయగలరేమో ప్రయత్నించి చూడండి.

 7. చంద్ర గారూ, ప్రసాద్ పి.వి అమాయకుడని సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తి. పి.వికి ఆయన మీడియా సలహాదరుగా పని చేశాడని నేను చదివాను. ఆయన మరే విభాగానికైనా కార్యదర్శిగా చేశారేమో తెలియదు.

  పి.వికి మసీదు కూల్చివేత గురించి తెలియదనీ, అప్పటి యు.పి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ హామీని నమ్మి మోసపోయాడని ప్రసాద్ చెప్పాడు. కాని అప్పటి హోమ్ సెక్రటరీ (గాడ్బోలే అనుకుంటా) పి.వికి ఎప్పటికప్పుడు మసీదు కూల్చివేత గురించిన తాజా సమాచారం చెప్పాడనీ, ప్రధానికి సమాచారం ఇస్తున్న విషయం లాగ్ బుక్ లో నమోదు కూడ చేశాడని మరో అధికారి (పేరు గుర్తులేదు) చెప్పాడు. ‘మసీదు కూల్చుతుంటే పి.వి పూజలో గడిపాడు. కూల్చాకనే పూజనుండి లేచాడు’ అని కులదీప్ నయ్యర్ రాసిన దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఆ విషయం చెప్పాడని పత్రికలు రాసాయి.

  ఈ సంగతులు ఇలా ఉంటే మసీదు కూలిపోవాలనే పి.వి భావించాడని ఇంకో కార్యదర్శి (అని గుర్తు) చెప్పిన లేదా రాసిన విషయం హిందూలో చదివాను. ఇప్పుడా వార్త నాకు దొరకలేదు. ఏదేమయినా మసీదు కూల్చివేతకి పి.వి అంగీకారం ఏదో ఒక రూపంలో ఉందని భావించవచ్చు.

 8. Anti-Telangana conspiracy is clearly evident here. If they fuel communal riots, Sonia may decide not to create separate Telangana state for the sake of her muslim vote bank. MIM leaders will attempt at their best to prevent the formation of Telangana state because they are direct scions of Abdul Wahid Owaisi who wanted to revive Nizam’s heritage.

  Dasarathi wrote on a wall of Nizamabad central prison “I may not get rid of Nizam’s dust even if I reincarnate again and again”. Dasarathi termed Nizam’s heritage as dust of many incarnations (janma janmala booju). In fact, Nizam’s heritage is nothing other than a crude venom. Owaisis, the scions of Nizam are spilling such venom on us.

 9. “మసీదు కూల్చివేతకి పి.వి అంగీకారం ఏదో ఒక రూపంలో ఉందని భావించవచ్చు”
  బాబ్రి మసీదు పడగొట్టె సమయంలో, పి వి పూజా గదిలో ఉన్నట్లు తనకు మధు లిమయే చెప్పాడని కులదీప్ నయ్యర్ రాశాడు. కులదీప్ నయ్యర్ చెప్పింది అబద్దం అని ఎప్పుడోతేలి పోయింది. వాస్తవమేమిటంటే పి వి ఇంటిలో పూజా గదే లేదని ఆ వార్తను ఎంతో మంది ఖండించారు. ఇక్కడ మీరు గమనించాల్సిందేమిటంటే కులదీప్ నయ్యర్, మధు లిమయే వంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారే నిస్సిగ్గుగా అబ్బద్దాలను చెప్పటం. జీవిత చరమాకంలో రాస్తున్న పుస్తకాలలో కూడా ప్రజలను తప్పుదోవపట్టించటానికి కులదీప్ నయ్యర్ సంశయించకపోవటం చూస్తూంటే స్వార్ధం, స్వలాభం అనేది మనం పెద్ద వారను కొనే వారిలో నరనరాన జీర్ణించుకుపోయిందో అర్థమౌతున్నాది. ఇక ఎవడో ప్రభుత్వద్యోగి చెప్పినదానిని నిజమైనట్లు మీరు రాయటం ఎమీ బాగా లేదు. మీరు పి వి రాసిన డిసెంబర్ 6 పుస్తకం చదివారా? చదివిఉంటే ఇలా రాసి ఉండేవారు కాదేమో. కోర్ట్, కమీషన్ ల నుంచి ఆయన కు క్లీన్ చీట్ వచ్చినా, గాసిప్ మాటలను మీరు వాస్తవాలుగా పేర్కోనటం బాధ్యతా యుతంగా లేదు. అయినా బి జె పి వాళ్ళు మసీదు పగలగొడితే వారిని పక్కన పెట్టి, పి వి ని బాధ్యుడినే చేయటం లో కాంగ్రెస్ పార్టికి రాజకీయ లబ్ది ఉంది. తప్పులన్నిటికి పి వి బాధ్యుడు, ఆయన చేసిన మంచి పనులన్ని కాంగ్రెస్ పార్టి చేసింది అని ప్రచారం చేస్తున్నారు కదా! ఏ వ్యక్తిగత లాభం ఆశించకుండా, బ్లాగులు రాసే మీలాంటి వారు వాళ్ల ప్రచారానికి వంత పాడటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.

 10. What do you gain by worshipping the scamster called PV? I remember the history. When he was alive, he was infamous as scamster and now he is worshipped as reformer by pro-globalisation elite. Can his contribution to globalisation wipe away all the sins committed by him?

 11. Srinivas గారు

  ప్రభుత్వోద్యోగి చెప్పినందునే నేను పి.వి పాత్రను నమ్మడం లేదు. ఆ మాటకొస్తే పి.వి పాత్రను అంగీకరించినవారు, తిరస్కరించినవారు ఇద్దరూ ప్రభుత్వోద్యోగుల్లో ఉన్నారు. సీనియర్ పాత్రికేయుల్లో కూడా ఆ రెండు తరగతులవారు ఉన్నారు. కులదీప్ నయ్యర్ మాటల్ని బట్టి ఆయన తన పుస్తకాన్ని గాంధీ కుటుంబం కోసం రాసినట్లు అర్ధం అవుతుంది. అలాగే పి.వి కుటుంబం కోసం రాసినవారు ఉన్నారు. నా అంచనాకి ఇవేవీ ఆధారం కాదు.

  పి.వి ప్రధాని గా ఉన్నాడు గనుక ఆయన చేతుల్లో అన్ని అధికారాలు ఉన్నాయి గనుక ఆయన తలచుకుంటే మసీదు కూల్చివేతను ఆపగలిగి ఉండేవాడు.కూల్చివేత జరుగుతున్నపుడు కేంద్ర బలగాలు అక్కడే ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమాచారం ఆయనకి వస్తోంది. అయినా ఎందుకు ఆపలేదు. కూల్చివేత తర్వాత జరిగిన విలేఖరుల సమావేశాల్లో పి.వి కుంటి సాకులు చెప్పాడే తప్ప విశ్వసనీయమైన కారణం ఎమీ చెప్పలేకపోయాడు.

  పి.వి కేవలం ప్రధాని మాత్రమే కాదు. ఆధిపత్య వర్గాలలోని ఒక సెక్షన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి అతను నాయకుడు. ఆయనను ఒక వ్యక్తిగా మాత్రమే చూస్తే కొన్ని విషయాలు అర్ధం కావు. లేదా అర్ధం చేసుకోవడానికి కొన్ని భావోద్వేగాలు అడ్డు రావచ్చు. అలా కాకుండా అప్పటి దేశ పరిస్ధితి, ప్రజలు ఉన్న పరిస్ధితి, వారిలో రెచ్చగొట్టబడిన సెంటిమెంట్లు, ఓట్ల రాజకీయాలు ఇవన్నీ నాయకులను, ప్రభుత్వాధినేతలను నడిపిస్తాయి. కూల్చివేతను అడ్డుకుంటే వచ్చే ప్రయోజనాలు, అనుమతిస్తే వచ్చే ప్రయోజనాలు వీటన్నింటినీ ఓట్లు, సీట్లు రీత్యా బేరీజు వేసుకున్న పి.వి నాయకత్వంలోని పాలకవర్గాలు తమకు ప్రయోజనం అనుకున్నదాన్ని అమలు చేశాయి.

  మసీదు కూల్చివేత, రాముడి గుడి ఇవే లక్ష్యం అయితే బి.జె.పి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు నిర్మించలేదు? ‘ఇంకో దెబ్బ వెయ్యండి’ అని కూల్చివేతను దగ్గరుండి ప్రోత్సహించిన అద్వానీ లిబర్ హాన్ కమిషన్ ముందు, కోర్టు ముందు ‘నాకేమీ తెలియదు, నేను అక్కడ లేను’ అని ఎందుకు చెప్పాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినపుడు మసీదు, గుడి ల చుట్టూ ఉన్న రాజకీయాలు అర్ధం అయ్యే అవకాశం ఉంటుంది. బి.జె.పి, కాంగ్రెస్ ల మధ్య అధికారం ఎలా సంపాదించాలన్న ఎత్తుగడల్లో తేడా తప్ప ఇంకే తేడాలు లేవని అర్ధం అవుతుంది.

 12. నాయకుల చేసే ప్రతి పని లో రాజకీయం గా లాభపడాలి (అధికారం లోకి రావడం, లేదా నిలబెట్టు కోవడం ) అనే ఆలోచన లేకుండా ఉంటుందని ఎలా అనుకుంటాము? కాకపోతే బాబ్రి మసీద్ విషయం లో , కూల్చి వేతను నిలువరించ గలిగి ఉంటేనే PV నరసింహారావు గారికి గాని కాంగ్రెస్ కు గాని రాజకీయం గా లాభం అని తెలుసుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ గుడి కట్టాలి అని కరసేవ ప్రారంభించింది బి.జె.పి నే. మసీద్ కూల్చి వేయడం వలన హిందూ వాదుల ఓట్లు వాళ్ళకు వస్తాయి గాని కాంగ్రెస్ లు రావు కదా. పైగా కూల్చివేత ను ఆపలేక పోయినందుకు ముస్లిం ల ఓట్లు రాకుండా పోయాయి. PV నరసింహారావు గారి హయాం లో అమలు అయిన ఆర్ధిక విధానాల మీద వ్యతిరేకత ఇలా బాబ్రి మసీద్ విషయం లోకి మళ్ళించడం సబబు కాదేమో. సాంకేతిక పెరిగి అందరికి అందుబాటులోకి రావడం అనేది ఏ ఆర్ధిక విధానం తో అయిన జరగవచ్చు . మనం ఏ ఆర్ధిక విధానాన్ని సమర్థించినా కాని, మనం ఇలా అభిప్రాయాలు పంచుకొనే వేదిక కల్పించిన ఇదే సాంకేతిక మన దేశం లో అందుబాటు రావడానికి పెట్టుబడి దారి విధానం అనే ఆర్ధిక విధానాలు కారణం అనేది కాదనలేని వాస్తవం.

 13. edited…

  ఈ వ్యాఖ్యాత సంబోధన అసభ్యంగా ఉంది. వ్యాఖ్య రాసిన పద్ధతి చర్చకు తావిచ్చేదిగా లేదు. అందువలన తొలగిస్తున్నాను. -విశేఖర్

 14. చంద్ర గారు, మీకు సమాధానం ఇవ్వడం మరిచాను.

  >>నాయకుల చేసే ప్రతి పని లో రాజకీయం గా లాభపడాలి (అధికారం లోకి రావడం, లేదా నిలబెట్టు కోవడం ) అనే ఆలోచన లేకుండా ఉంటుందని ఎలా అనుకుంటాము? >>

  ఆ రాజకీయ లాభం ప్రజలకు చెందకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. వారు చేసే రాజకీయాలు ప్రజల పేరుతోనే జరుగుతాయి. కానీ అంతిమంగ లబ్ది పొందేదీ మాత్రం మీరు చెప్పినట్లు రాజకీయ లాభార్జనాపరులు. నేను చెబుతున్నది ఈ విషయమే.

  >>కాకపోతే బాబ్రి మసీద్ విషయం లో , కూల్చి వేతను నిలువరించ గలిగి ఉంటేనే PV నరసింహారావు గారికి గాని కాంగ్రెస్ కు గాని రాజకీయం గా లాభం అని తెలుసుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ గుడి కట్టాలి అని కరసేవ ప్రారంభించింది బి.జె.పి నే. మసీద్ కూల్చి వేయడం వలన హిందూ వాదుల ఓట్లు వాళ్ళకు వస్తాయి గాని కాంగ్రెస్ లు రావు కదా.>>

  కాంగ్రెస్, బి.జె.పి పార్టీలు నడుపుతున్న వర్గాలు రెండు పరస్పరం ఒకరికి వ్యతిరేకంగా మరొకరు మోహరించిన బద్ధ శత్రువులు అన్న అర్ధం మీ సూచనలో ధ్వనిస్తోంది. వాస్తవంగా ప్రజల వైపు నుండి చూస్తే రెండు పార్టీలకు తేడా లేదు. డబ్బు, ఆస్తులను సమకూర్చి పెట్టే అధికారం సంపాదించడానికి ధనిక వర్గాలలోని రెండు గ్రూపులు రెండు మార్గాలు ఎన్నుకున్నాయి. ఒకరిది హిందూత్వ అయితే మరొకరిది సెక్యులరిజం. ఈ తత్వాలకు కట్టుబడి ఉండడం వారి లక్ష్యం కాదు. ఆ పేరుతో ఆధికారం సంపాదించి ఆస్తులు పోగేసుకోవడం వారి లక్ష్యం.

  ఈ నేపధ్యంలో పి.విపై వచ్చే ఆరోపణలు కాంగ్రెస్, బి.జె.పి ల్లో ఎవరికి లాభం అన్న చర్చకు అర్ధం ఉండదు. కూల్చివేత అనే ఒక ఘటన జరుగుతోంది. జనం అంతా ఆ వైపుగా చార్జి చేయబడి ఉన్నారు. ప్రజల సెంటిమెంట్లు ఆ వైపుగా రెచ్చగొట్టబడి ఉన్నాయి. ఆ పరిస్ధితిలో కాంగ్రెస్ వైపు ఉన్న పాలకవర్గాలకు ఏ నిర్ణయం తీసుకుంటే ఉపయోగం? దేశం మొత్తం ఏకరూపంలో ఉన్న జీవన విధానం కాదు భారత దేశ ప్రజలది. అనేక సంస్కృతుల కలయిక, వైవిధ్యం దేశం లక్షణం. ఒకే సమయంలో సమాజంయొక్క వివిధ అభివృద్ధి దశలు (బానిస, భూస్వామ్య, పెట్టుబడిదారీ…) కొలువున్న దేశం మనది. వీరిలో మెజారిటీ హిందూ సెంటిమెంటు లోకి లాగడంలో అప్పట్లో బి.జె.పి సఫలం అయింది.

  దానితో కూల్చివేతకు వ్యతిరేకంగా స్పందించే పరిస్ధితి కాంగ్రెస్ కి లేదు. అలాగని కూల్చివేతకు అనుకూలంగా స్పందించి ముస్లింలను శాశ్వత శత్రువుగా మారే ధైర్యం, సెక్యులరిస్టు ముసుగు వదులుకునే ధైర్యం ఆ పార్టీకి లేదు. హిందూ మత సంస్ధలకు లోపాయకారిగా సహకరించిన పేరు తెచ్చుకుని హిందూ ఓట్లు కాపాడుకోవడం, తనను మోసగించారని చెప్పుకుని ఆ నెపాన్ని బి.జె.పి పైకి నెట్టి ముస్లింల ఓట్లు కాపాడుకోవడం.. ఇలాంటి ద్వంద్వ ఎత్తుగడని పి.వి వేసినట్లు అర్ధం చేసుకోవచ్చు.

  ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకసారి అధికారం చేజిక్కాక ఇరు పార్టీలు ఒకరినొకరు సహకరించుకుంటారు. ఒకరి ఆర్ధిక ప్రయోజనాలు మరొకరు కాపాడుకుంటారు. ప్రజల వనరులను దోచుకోవడంలో ఇద్దరూ సహకరించుకుంటారు. కాకపోతే సింహభాగం ఎవరికి అని నిర్ధారించుకోవడం, విదేశాలనుండి వచ్చే కమిషన్లలో ఎక్కువ వాటా సంపాదించడం, వివిధ అంశాల్లో నిర్ణయాధికారం… ఇలాంటి అంశాల్లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటే ఉండవచ్చు.

  లేకపోతే కాంగ్రెస్ నుండి చీలిన ఎన్.సి.పి మళ్ళీ అదే కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకుంటుంది? కాంగ్రెస్, ఎన్.సి.పి పొత్తుఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం గడ్కారీ అక్రమ ఆస్తులకు ఎందుకు సహకరిస్తుంది? ఏక కాలంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి అటు బి.ఎజే.పి గాలి జ.రెడ్డికి ఇటు కాంగ్రెస్ సోనియాకు ఎలా సహకరిస్తాడు? యు.పి ఎన్నికల్లో ఒకరినొకరు తూర్పార బోసుకున్న ఎస్.పి, కాంగ్రెస్, బి.ఎస్.పి లు రిటైల్ ఎఫ్.డి.ఐ బిల్లు కోసం ఎలా చేతులు కలుపుతారు? ఇలాంటి ఉదాహరణలు అనేకం మనం రోజువారీ రాజకీయ రంగంలో మనకి కనపడతాయి.

  అందువలన తేడాలున్నది పార్టీలు కొట్టుకోవడానికి కాదు. ఆరుగాలం శ్రమించే రైతులు, ఫ్యాక్టరీల్లో, పొలాల్లో టెక్కలు ముక్కలు చేసుకునే కూలీలు, మధ్య తరగతి మేధో జీవులు వీరందరినీ ఆ పేరుతో విడదీసి కొట్టుకునేలా చెయ్యడానికి. జనం వివిధ పేర్లతో కొట్టుకుంటేనే పెద్దోళ్ళ దోపిడి పైకి వారి దృష్టి మళ్ళదు. జనం సవ్యంగా ఆలోచించడం మొదలు పెడితే సారా వ్యతిరేక ఉద్యమం, ఢిల్లీ గ్యాంగ్ రేప్ వ్యతిరేక ఉద్యమం, కాకరాపల్లి తదితర శ్రీకాకుళం ధర్మల్ వ్యతిరేక ఉద్యమాలు తలెత్తుతాయి. ఆ పరిస్ధితి రాకుండా ఉండడానికి జనం మధ్య చీలికలు పెంచి పోషించడానికి పార్టీలు ఇష్టపడతాయి.

  పెట్టుబడిదారీ విధానం గురించి:

  మీ దృష్టిలో పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం అంటే ఏమిటి? మీకు తెలిసి ఆ విధానాలు ప్రబోధించే తత్వవేత్తలుగానీ, ఆర్ధికవేత్తలు గానీ గతంలోగానీ, వర్తమానంలో గానీ ఎవరు? మీ అవగాహనలో పెట్టుబడిదారీ ఆర్ధిక విధానం సమాజ ప్రగతి కి ఎలా దోహదపడుతుంది?

  ఈ ప్రశ్నలకి నిర్దిష్ట జవాబు ఇవ్వగలిగితే చర్చ అర్ధవంతంగా ఉంటుంది. లేకపోతే చీకట్లో తడుములాటగా ఉంటుంది.

 15. చంద్రగారు, ఏ వస్తువునైనా మానవ స్రమే తయారు చేస్తుంది కానీ పెట్టుబడి తయారు చెయ్యదు. ఆటోమొబైల్‌ని పెట్టుబడి తయారు చేసిందని చెప్పి ఎర్ర బస్సు ఎక్కేవాడు (పల్లెటూరివాడు) పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థించడు కానీ ల్యాప్‌టాప్‌లూ, ఐఫోన్‌లూ వాడేవాడు మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థిస్తాడు. వస్తు వ్యామోహ సంస్కృతిలో ఇలాంటి వైరుధ్యాలే ఉంటాయి.

 16. “What do you gain by worshipping the scamster called PV?”
  ఈ వ్యాఖ్య ఇప్పుడు చూస్తున్నాను. ప్రవీణ్ గ్లోబలైసేషన్ విషయం వేరే అంశం దానిపైన మళ్ళీ చర్చించవచ్చు. విషయానికొస్తే, పివి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి పార్టిలు చీల్చాడు గాని, స్వంత లాభం కొరకు స్కాంలు చేయలేదు. అంతా స్కాములు చేసి సంపాదించి ఉంటే వేల కోట్ల డబ్బు వెనకేసుకొని ఉండేవాడు. లాయర్ల ఫీజు చేల్లించటానికి డబ్బులు లేక బంజారా హిల్స్ లో ఇల్లు అమ్మి పెట్టటానికి సహాయం చేయమని ఎందుకు అడుగుతాడు. ఆయన ప్రధాని పదవినుంచి దిగిపోయాక హైదరాబాద్ కొచ్చినపుడు కె . విజయరామారావు (తెలుగు దేశం మాజీ మంత్రి, మాజి సి బి ఐ డైరేక్టర్, పి వి ఆర్ కే ప్రసాద్ ను హైదరాబాద్ కొచ్చినపుడు అడిగాడు). ప్రవీణ్ పి వి స్కాం స్టర్, మౌన ముని, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకొంటాడు అనేది మీడియా ప్రొజెక్షన్. మీడీయా లాబియింగ్ ను, దాని అసలి స్వరూపాన్ని పి వి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుసుకొని, అందులో వచ్చే వార్తలను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకోనేవాడు కాడు. లాబియింగ్ చేసేవారికి (ఉదా|| మీడీయా ద్వారా వీర్ సింగ్వి లాంటి వారు రాసే వ్యాసాలు, వారి సలహాలు) వారి మాట ఎమాత్రం చెల్లుబడి అయ్యేది కాదు. దానితో కసి బోక మసిబూసుకొన్నట్లు కోపంతో మౌన ముని, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకొంటాడు అని రకరకాల పద్దతులలో ప్రచారం మొదలుపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా మన్మోహన్ గారు తీసుకొన్న నిర్ణయాలు ఎమైనా ఉన్నాయా? ప్రజలు అది ధరల విషయంలో ఐతేగాని, రూపాయి విలువ పడిపోతున్నాగాని, ద్రవ్యోల్బణం విషయంలో గాని ఏ నిర్ణయాలుతీసుకోవటం లేదు అని నెత్తినోరు కొట్టుకొంట్టున్నా పటించుకోరు. ఆయన బాధ్యత వైఫల్యం గురించి చిన్న కామేంట్ కూడా మీడీయాలో ఉండదు. తెలంగాణా విషయంలో ఆయన పాత్ర ఎమిటి? ఎన్ని సార్లు వాయిదా వేస్తాడు? ఏ పని ఈ ప్రభుత్వ హయాంలో సక్రమంగా జరుగుతున్నాది? దానిని ఎవరైనా తీవ్రంగా విమర్శిస్తున్నారా? అప్పట్లో మీడీయను ఇప్పటితో పోలిస్తే ప్రజలు చాలా ఎక్కువగా నమ్మేవారు. దానిని వాళ్ళు సొమ్ము చేసుకొనేవారు. అది ఈ మధ్య అందరికి అర్థమయింది. పి వి గట్టివాడు కనుక మీడీయా ద్వారా లాబీయింగ్ చేసేవారి ఎత్తులు పారకపోయేసరికి ఆయన ను తిడుతూ కూచున్నారు. అదే కకా ఆయన నెహృ గాంధి కుటుంబ సభ్యుడు కూడా కాకపోయే.

  హర్షద్ మెహతా కోటి రూపాయల లంచం ఒక తప్పుడు కథ. ఆరోజుల్లో ఐదు వందల నోట్లు,వేయి రూపాయల నోట్లు ఉండేవి కాదు. కోటి రూపాయలకి ఎన్ని నోట్ల కట్టలు వస్తాయి, ఎంత సైజు ఆక్రమిస్తాయి అని మొత్తం లెక్కేస్తే అది ఒకసూట్ కేసులో పట్టదని,చాలా సూట్కేసులు అవసరమౌతాయని, హర్షద్ మెహతా సూట్ కేసులో లంచం ఇచ్చాడని చెప్పినది అబ్బద్దమని ఎప్పుడో తేల్చేశారు.
  ఇక పివి రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. ఎన్నో సమస్యలను పరిష్కరించాడు. ఈ ప్రసంగం చదువుకో తెలుస్తుంది.

  http://presidentofindia.nic.in/sp311212.html

 17. నాకు లాలు విషయం తెలియదు. బహుశా ఆయన గడ్డిస్కాం ను కేంద్రం లో కాంగ్రెస్ పార్టి అధిష్టానం ఆయనను వారికి మద్దతు ఇచ్చేదాని కొరకు వాడుకొని ఉండవచ్చు. ఇప్పుడు ఆయనే ఆపార్టికి వీరవిధేయుడు గా మారిపోయాడు అని పార్లమెంట్ చర్చలో మాట్లాడే తీరు చూస్తే తెలుస్తుంది.

 18. “how many people did scold PV when he was alive”
  నిజాలు నిలకడమీడుగా తెలుస్తాయి. పి వి ని అందరు ఆరునెలలో దిగిపోతారనుకొన్నారు. ముఖ్యంగా స్వపక్షం వాళ్ళు ఆయనను ఈ రోజు మన్మోహన్ సింగ్ లా ఆడిద్దామనుకొన్నారు. ఆయన ఐదు సం|| కొనసాగేసరికి స్వపక్షంలో అర్జున్ సింగ్ వంటివారికి కుళ్ళు పుట్టింది. ఇతని అవినీతి చరిత్ర అందరికి తెలిసిందే. ఇటువంటి వారికే మీడీయాతో ఎక్కువ పరిచయాలు ఉంటాయి కూడాను. వాళ్ళు దానిని సమర్ధవంతంగా ఉపయోగించుకొని సమాయనుకూలంగా పి వి మీద వ్యతిరేక ప్రచారం చేసేవారు. అంటే ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు ఆయన పార్టి లు చీలిస్తే అది శృతిమించిన రీతిలో నెగటివ్ ప్రచారం చేయటం. రామజన్మభూమి కేసు విషయంలో స్వంత పార్టి వారే బి జె పి ని వదలివేసి, ఆయన నొక్కడినే బాధ్యుడిని చేయటం చేశారు.ఇందులో నార్త్ రాజకీయనాయకులకు సౌత్ వాళ్లంటే చాలా చిన్న చూపు కోణం కూడా ఉంది. ఇప్పుడు రాహుల్ నాయకత్వం లో పార్టి ఒక్కసారి గెలవకపోయినా మీడీయా పల్లెత్తు మాట అనిందా? పార్టి ఎలాగూ చెక్క భజన చేస్తుంది. అది తెలిసిన విషయమే.
  మనకు తెలిసిన నిజాలు, చరిత్ర లో జరిగిన సంఘటనలను బేరీజు వేసి చూసుకొంటే వాస్తవం దానికదే బయటికి వస్తుంది. అటువంటి సందర్భంలో ఒక వ్యక్తి/నేత చనిపోయినా లేక బతికి ఉన్నా, అనవసరం గా అతని మీద వచ్చిన అసత్య ఆరోపణలు కొన్ని కారణాల వలన నమ్మిన వాళ్ళు వాటిని ఉటంకిస్తుంటే మనకు తెల్సింది చేప్పటం తప్పుకాదేమో. ఇతరులు ఒప్పుకోవటాం ఒప్పుకోకపోవటం వాళ్ల పరిణతి, స్వభావం, నిజానిజాలు తెల్చుకొనేందుకు వాళ్ళు అవలంభించే పద్దతిపైన ఆధారపడి ఉంట్టుంది. మీకు నేను చెప్పినవి అబద్దమనిపించాయనుకోండి, నా వ్యాఖ్యలను వాస్తవం తెలుసుకోవటానికి మీకు తెలిసిన ఆధారాలతో పరిశీలించుకోంటారు గదా! అందుకు ఉపయోగపడినా మేలేకదా!

 19. ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల ఇండియాకి పెద్ద ముప్పేమీ లేదు. వంద కోట్ల మంది హిందువులని ఇరవై కోట్ల మంది ముస్లింలు ఏమీ చెయ్యలేరు. ఇండియాకి పెద్ద ముప్పు అనేది ఉంటే అది మన పాలక వర్గం అనుసరిస్తోన్న అమెరికా సామ్రాజ్యవాద అనుకూల విధానాల వల్లే. హైదరాబాద్‌లో బహుళ జాతి కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌కి ఇంపార్టెన్స్ తగ్గిపోయి సామ్రాజ్యవాదులు బాధపడతారని మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ఒప్పుకోవడం లేదు. అందుకే తెలంగాణాకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌కి చెందిన కమ్మ ఎం.పి.లు తెలుగు దేశానికి చెందిన కమ్మ ఎం.పి.లతో కలిసి పని చేసేలా ఎంకరేజ్ చెయ్యాలని నికృష్ట కమిటీ చేత నివేదిక వ్రాయించడం లాంటివి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణా రాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణాలో కాంగ్రెస్‌కి వోట్లు పడవని ఆ పార్టీ హై కమాండ్‌కి తెలుసు. కానీ సామ్రాజ్యవాదులకి ఇష్టం లేని పని (హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గించడం) మాత్రం వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే కాంగ్రెస్ పార్టీ చచ్చినా చెయ్యదు. పేదవాడు బతకడానికి రోజుకి ఇరవై రూపాయలు సరిపోతాయని మాంటెక్ సింగ్ అహ్లువాలియా లాంటివాళ్ళు చెపితే నమ్మేసి దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే పార్టీకి ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కష్టం కాదు. హ్యూమ్ దొర మన మీదకి వదిలిన బూజు అయిన కాంగ్రెస్ పార్టీ పోతే దేశానికి పట్టిన దరిద్రం సఘం వదిలిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s