తొడగొడుతున్న చైనా, మీసం మెలివేస్తున్న జపాన్


నలు చదరంలో ఉన్నది దియోయు/సెంకాకు ద్వీపకల్పం ఉన్న ప్రాంతం (ఫొటో: ఫ్రీ వెబ్స్)

నలు చదరంలో ఉన్నది దియోయు/సెంకాకు ద్వీపకల్పం ఉన్న ప్రాంతం (ఫొటో: ఫ్రీ వెబ్స్)

ఒకరు అరే అంటే మరొకరు ఏరా అంటారు. ఒకరు తొడగొడితే మరొకరు మీసం మెలివేస్తారు. ఒకరు పౌర విమానం పంపితే మరొకరు ఏకంగా జెట్ ఫైటర్ విమానాన్నే పంపుతారు. తూర్పు చైనా సముద్రంలో చైనా, జపాన్ లు మళ్ళీ కీచులాటలు మొదలు పెట్టాయి. కీచులాటలు కాస్తా యుద్ధం వైపుకి దారి తీస్తాయేమోనని ఉగ్గబట్టుకోవడం ఇరుగు పొరుగు దేశాల పనిగా మారుతోంది. నివాస యోగ్యం కాని చిన్న చిన్న దీవుల పైన ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలను చూస్తే ఇరు దేశాలూ యుద్ధానికి దగ్గర అవుతున్నాయా అన్న అనుమానం కలగక మానదు. ‘యుద్ధం రాదు గానీ, పరిస్ధితి విస్మరించడానికి వీలుగా మాత్రం లేదని చెప్పొచ్చు’ అని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారని ‘న్యూ యార్క్ టైమ్స్’ లాంటి పత్రికలు కూడా కూయడం మొదలు పెట్టాయి.

గత వారం పౌర గూఢచార విమానాన్ని తూర్పు చైనా సముద్రంలోని దియోయు ద్వీప కల్పం (వీటిని జపాన్ సెంకాకు ద్వీప కల్పం అని పిలుస్తుంది) వద్దకు పంపింది. చైనా చర్యకు ప్రతీకారంగా జపాన్, ద్వీపకల్పం వద్ద ఏం జరుగుతోందో చూడమంటూ ఎఫ్-15 ఫైటర్ జెట్ లను పంపింది. చైనా ‘నేను మాత్రం తక్కువ తిన్నానా’ అనుకుంటూ తన సొంత సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ విమానాలను ద్వీపాల వద్దకు పంపింది. న్యూ యార్క్ టైమ్స్ ప్రకారం చైనా, జపాన్ దేశాలు తమ తమ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ విమానాలను దాదాపు ఏక కాలంలో వివాదాస్పద ద్వీప కల్పం పైకి పంపడం గత సంవత్సరం వివాదం తిరిగి చెలరేగాక ఇదే మొదటిసారి. పరస్పరం హెచ్చరికలు చేసుకోవడానికి జరిగిన ఈ చర్యల్లో ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా అది సాయుధ ఘర్షణ రూపం తీసుకోవచ్చని సదరు పత్రిక ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా, జపాన్ ఇరు దేశాల్లోనూ జాతీయ సెంటిమెంట్లు పెచ్చరిల్లిన ప్రస్తుత పరిస్ధితుల్లో ఇలాంటి చర్యలు మతి లేనివని టైమ్స్ వ్యాఖ్యానించింది. గత అక్టోబరులో జపాన్ లో జరిగిన ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల సంయుక్త శిఖరాగ్ర సమావేశానికి చైనా తన సెంట్రల్ బ్యాక్ గవర్నర్ ను పంపకుండా చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. సెంకాకు ద్వీప కల్పం అప్పటివరకూ ఒక జపాన్ ప్రైవేటు పౌరుడి ఆధీనంలో ఉన్నదనీ, దానిని ప్రభుత్వం డబ్బు చెల్లించి కొనుక్కుందనీ, ఇకనుండి జపాన్ ప్రభుత్వమే సెంకాకు ద్వీపాలకు యజమాని అనీ జపాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనకు నిరసనగా చైనా ఈ చర్య తీసుకుంది. జపాన్ ప్రకటన తర్వాత చైనా వ్యాపితంగా జపాన్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. జపాన్ నుండి దిగుమతి అయే సరుకులను బహిష్కరించాలని పిలుపులు ఇచ్చే వరకూ జపాన్ వ్యతిరేకత పెరిగింది. చివరికి చైనా ప్రభుత్వమే రంగంలోకి దిగి జపాన్ వ్యతిరేక నిరసనలను ఒకింత బల ప్రయోగం చేసి అదుపు చేయవలసి వచ్చింది.

మరో వైపు ఇటీవలి జపాన్ ఎన్నికలలో జాతీయ తత్వ పార్టీ తిరిగి గద్దె ఎక్కిన నేపధ్యంలో నూతన ప్రధాని ‘షింజో అబే’ అమెరికా సందర్శించాలన్న కోరికను వ్యక్తం చేయగా దానిని ఇతర కారణాల వల్ల అమెరికా ప్రభుత్వం తిరస్కరించింది. రోషం తెచ్చుకున్న షింజో వెంటనే ఆగ్నేయాసియా దేశాల పర్యటనకి బయలుదేరాడు. ఈ పర్యటన కాస్తా చైనాకి వ్యతిరేకంగా ప్రాంతీయంగా తనకి ఉన్న బల నిరూపణంకు జపాన్ చేసిన ప్రయత్నంగా రూపు దిద్దుకుంది. బల నిరూపణం మాత్రమే కాకుండా ప్రాంతీయంగా చైనాకి గల ప్రభావాన్ని తగ్గించడానికి కూడా జపాన్ ప్రధాని తన పర్యటనని వినియోగించుకున్నాడు.

అల్జీరియాలో ఆల్-ఖైదా బందీలుగా తీసుకున్న ఆయిల్ రిఫైనరీ ఉద్యోగుల్లో జపాన్ ఉద్యోగులు కూడా ఉండడంతో షింజో తన పర్యటనని మధ్యలో ముగించుకుని టోక్యో చేరుకుంటుండగానే ‘జపాన్ ప్రధాని ఫిబ్రవరిలో అమెరికా సందర్శించనున్నాడు’ అని హిల్లరీ క్లింటన్ ప్రకటించింది. చైనా, జపాన్ ల మధ్య ఏర్పడిన ఒక ఇబ్బందికర పరిస్ధితి కూడా అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం కలిగిస్తుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

అంతే కాకుండా జపాన్ నుండి చైనా, యూరప్ ల మీదుగా అమెరికా వరకూ ఆర్ధిక వ్యవస్థలు గాఢంగా పెనవేసుకొన్న నేపధ్యంలో ఎక్కడ చిన్న రాజకీయ, మిలట్రీ, భౌతిక ఇబ్బందులు ఏర్పడినా దాదాపు అన్ని దేశాలూ ఉలిక్కి పడుతున్నాయి. అమెరికా, జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ చైనా, జపాన్ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయి ఉండడం వల్లనే ఈ ఉలికిపాటులు పెద్ద దేశాలకు సాధారణంగా మారాయి. అయితే తన ప్రయోజనాలకు అవసరమైతే దియోయు/సెంకాకు ద్వీప కల్పం వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి అమెరికా సదా సిద్ధంగా ఉంటుందన్న విషయం మరవరాదు. తనకు అవసరం అయితే ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, అవసరం తీరాక జో కొట్టడం అమెరికా సామ్రాజ్యవాదం దశాబ్దాలుగా ఆడుతున్న పాచికలాట.

సెప్టెంబర్ లో జపాన్ కోస్ట్ గార్డు ఓడలు చైనా ఓడను అడ్డగిస్తున్న దృశ్యం (ఫొటో: ఫ్రీఫెబ్స్)

సెప్టెంబర్ లో జపాన్ కోస్ట్ గార్డు ఓడలు చైనా ఓడను అడ్డగిస్తున్న దృశ్యం (ఫొటో: ఫ్రీఫెబ్స్)

అమెరికా పాచికలాట ఒక సంగతి అయితే ఆసియాలో మారుతున్న బలాబలాలు ఇక్కడి బలగాల మోహరింపులో మార్పులు తెస్తుండడం గమనించవలసిన విషయం. ఆసియాలోని వివిధ దేశాల ఆర్ధిక, మిలట్రీ బలాల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ శిథిలాల నుండి అమెరికా సహాయంతో వేగంగా అభివృద్ధి సాధించి రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిన జపాన్ ప్రస్తుతం సంక్షోభాలతో తీసుకుంటోంది. 90 ల దశాబ్దం అంతటా ఆర్ధిక స్తంభన తోటి, ప్రతి ద్రవ్యోల్బణం తోటి సతమతమై ‘లాస్ట్ డికేడ్’ ను నమోదు చేసినంతగా సంక్షోభం ఎదుర్కొంది. నూతన మిలీనియంలో కోలుకుంటున్నట్లే కనిపించినా 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దెబ్బకు తిరిగి కుదేలయింది. ప్రతి ద్రవ్యోల్బణం న్యూ నార్మల్ మాదిరిగా తయారయింది. 2012 రెండో అర్ధ భాగంలో జపాన్ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి బదులు కుదించుకుపోయింది.

ఇంకోవైపు చూస్తే చైనా ఆర్ధిక వ్యవస్థ వృద్ధి గతంలో మాదిరిగా అద్భుతంగా లేకపోయినా ఇతర అన్ని దేశాల కంటే మెరుగుగానే ఉంది. 1980ల్లో డెంగ్ ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితంగా అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ తిరిగి మొగ్గ తొడిగి 1990ల్లో జియాంగ్ జెమిన్ ప్రవేశ పెట్టిన పెట్టుబడిదారీ అనుకూల రాజకీయ సంస్కరణలతో పుష్పించి విరగ కాయడం మొదలు పెట్టింది. ఈ కాపు కమ్యూనిస్టు పార్టీలో చొరబడి పార్టీ, ప్రభుత్వాలలోని ఉన్నత స్ధానాలన్నింటినీ కబళించిన నూతన పెట్టుబడిదారులకీ, మాఫీయా నేరగాళ్లకు మాత్రమే అందుబాటులో ఉందన్నది అసలు సంగతి. కోట్లాది శ్రామిక ప్రజల శ్రమ ఫలితాన్ని అవినీతి ద్వారా, రాజ్య పెట్టుబడిదారీ విధానం ద్వారా స్వాయత్తం చేసుకున్న కుబేరులే చైనా ఆర్ధిక వ్యవస్థకు రధ సారధులు. లక్షలాది కార్మిక వర్గ పోరాటాలను ఉక్కు పాదంతో అణచివేస్తూ పెంచుకున్న స్వదేశీ, విదేశీ బహుళజాతి కంపెనీలకు దేశ వనరులను కట్టబెట్టిన దరిమిలా దేశ జి.డి.పి దూకుతూ వెళ్ళి జపాన్ ని అధిగమించి అమెరికా తర్వాత రెండో స్ధానాన్ని ఆక్రమించింది.

ఈ పరిస్ధితుల్లో చైనా, జపాన్ ల మధ్య ప్రాంతీయంగా అన్ని రంగాల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. ఆర్ధికంగా జి.డి.పి పరంగా జపాన్ ని చైనా అధిగమించినప్పటికీ తలసరి జి.డి.పి రీత్యా చైనా ఇంకా మూడో ప్రపంచ దేశమే. ఆ విధంగా జపాన్ కి ఆర్ధిక అనుకూలత కొనసాగుతోంది. అయితే అమెరికా, యూరప్, జపాన్ లు తీవ్ర వ్యవస్థాగత సంక్షోభాలతో నిండిపోయి ఉన్నాయి. ఉత్పత్తి ఒకవైపు పేరుకు పోతుంటే మరో వైపు నిరుద్యోగం పెరిగి కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్ధితి. ఫలితంగా జి.డి.పి పడిపోయి ఆర్ధిక మాంద్యం ఎదుర్కుంటున్నాయి. అమెరికా నమోదు చేస్తున్న నామ మాత్ర ఆర్ధిక వృద్ధి ఫెడరల్ రిజర్వ్, ట్రెజరీ తదితర ప్రభుత్వ విభాగాలతో నెట్టుకొస్తున్నదే తప్ప ప్రవేటు పెట్టుబడి కంపెనీల ఉత్పత్తి కార్యకలాపాల్లోని చురుకుదనం వల్ల కాదని అమెరికా ఆర్థికవేత్తలే, ఇంకా చెప్పాలంటే ఫెడ్ చైర్మన్ బెన్ బెర్నాంకే చెబుతున్నాడు. ఈ పరిస్ధితి అమెరికాని మరింతగా యుద్ధాల్లోకి, విదేశీ జోక్యాల్లోకి నెడుతోంది. విదేశీ మార్కెట్లను పోటీదారులనుండి వశం చేసుకోవడానికి అమెరికా, యూరప్, జపాన్ సామ్రాజ్యవాద శక్తులు తెగబడుతూ, పరస్పరం కూడా పోటీ పడుతున్నాయి.

ఈ పరిస్ధితిలో చైనాకు అంతర్గతంగా ఉన్న విస్తారమైన మార్కెట్ వలన సాపేక్షకంగా కనీసం సమీప భవిష్యత్తులో మెరుగైన పరిస్ధితిలో కనిపిస్తోంది. కాని చైనాలో పెరుగుతున్న అంతర్గత వైరుధ్యాలు, తత్ఫలితంగా పెరుగుతున్న వర్గ పోరాటాలను ఆ దేశ ప్రభుత్వం ఎలా పరిష్కరించుకుంటుంది అన్నదానిపై చైనా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అమెరికాతో పోలిస్తే ఎంతో దూరంలోనే ఉన్నప్పటికీ మిలట్రీపై చైనా పెడుతున్న ఖర్చు తక్కువేమీ కాదు. అమెరికా, యూరప్ ల యాంటీ మిసైల్ డిఫెన్స్ ను ఛేదించడానికి రష్యాతో ఉమ్మడి కృషి చేసేందుకు చైనా ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. BASIC, BRICKS లాంటి ఎమర్జింగ్ దేశాల కూటముల ద్వారా ఇండియా, రష్యా లాంటి దేశాలతో చైనా సాన్నిహిత్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా పెట్టుబడిని ఎగుమతి చేస్తూ అక్కడి వనరులను చేతుల్లోకి తెచ్చుకుంటోంది. దేశీయంగా విస్తృతంగా మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేస్తోంది. దరిమిలా మధ్య తరగతి వర్గం విస్తృతం అవుతోంది. అదే సమయంలో గ్రామీణ చైనా పట్టణాలకు వలస వచ్చి విప్లవకర కార్మికవర్గ స్వభావాన్ని సంతరించుకుంటోంది.

ఇన్ని సంక్లిష్ట పరిస్ధితుల మధ్య దియోయు/సెంకాకు ద్వీప కల్ప సమస్య చైనా, జపాన్ లకు తక్షణ బల ప్రదర్శనకు, వ్యూహాత్మక బల ప్రయోగాలకు వేదికగా మారింది. దక్షిణ చైనా సముద్రం అమెరికాకు చైనా వ్యతిరేక జియో-పోలిటికల్ వ్యూహాల కార్యక్షేత్రంగా ఉండగా తూర్పు చైనా సముద్రం ప్రాంతీయంగా చైనా, జపాన్ ల పోటీ ప్రదర్శనకు కార్య క్షేత్రంగా ఉంటోంది. ఈ ఘర్షణలన్నీ ఆయా దేశాల్లోని బహుళజాతి కంపెనీల వాణిజ్య ప్రయోజనాల ఘర్షణకు మిలట్రీ మరియు రాజకీయ రూపాలు. ఆర్ధిక ప్రయోజనాలు అంతర్లీనంగా ఉండే ప్రపంచ స్థాయి రాజకీయ ఘర్షణలకు పొడిగింపే మిలట్రీ ఘర్షణలన్న ప్రసిద్ధ నానుడి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. తూర్పు చైనా సముద్రంలో పరిస్ధితి తమకు అనుకూలంగా ఉందని చైనా జపాన్ లు ఎవరికి వారే భావించుకుంటున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా శక్తి క్షీణిస్తుండగా; యూరప్ శక్తి అంతంత మాత్రమే కాగా; జపాన్ కూడా వచ్చిపోయి అదే పరిస్ధితి కనుక; చైనా ఎదుగుదలకు విస్తారమైన కార్మికవర్గం ప్రతిబంధకం కనుక; ప్రపంచం బహుళ ధ్రువం వైపుకి వేగంగా పరుగెడుతోందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s