లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు


లతెహార్ ఎన్ కౌంటర్ లో గిరిజనులను పోలీసులు బలవంతం చేసి మానవ కవచంగా వాడుకున్నారని ది హిందూ పరిశోధనలో వెల్లడయింది. మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన పోలీసుల శవాలను వెతికే పనిలో గ్రామ ప్రజలను మానవ కవచంగా పోలీసులు వినియోగించడంతో నలుగురు గిరిజనులు దుర్మరణం చెందారు. పోలీసులు మరణించిన తమ సహచరుడి శవానికి ఇరవై అడుగుల దూరంలోనే నిలబడి శవాన్ని తేవడానికి గిరిజనులను పంపించడంతో పేలుడునుండి పోలీసులు తప్పించుకోగా గిరిజనులు చనిపోయారు. శవాన్ని తన భుజానికి ఎత్తుకుంటూ శవం పైకి ఒంగిన 16 సంవత్సరాల గను పార్ధివ దేహం కింద ఉన్న బాంబు పేలి తునాతునకలై పోయాడు. పోలీసుల విగత దేహాలను మోయడానికి సిద్ధపడిన మరో ముగ్గురు గిరిజనులు కూడా పేలుడులో చనిపోయారు. పోలీసులు తమను కొట్టుకుంటూ, బూటు కాళ్లతో తన్నుకుంటూ బలవంతంగా మానవ కవచంగా వినియోగించారని గిరిజనులు చెబుతుండగా గిరిజనులే తమకు సాయం చెయ్యడానికి వచ్చారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

జనవరి 7 తేదీన జార్ఖండ్ రాష్ట్రంలోని కతియా అడవిలో మావోయిస్టులు, సి.ఆర్.పి.ఎఫ్ పోలీసులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. తాము విశ్రాంతి తీసుకుంటుండగా ప్రభుత్వ బలగాలు దాడి చేశాయని మావోయిస్టులు ప్రకటించినట్లు ది హిందూ తెలిపింది. తమ సహచరుల విగత దేహాలను వెతకడానికి వారు గిరిజన పురుషులతో పాటు మహిళలు, పిల్లలను కూడా మానవ కవచంగా వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.

గిరిజనులను మావోయిస్టులు కవచంగా వాడుతున్నారంటూ ప్రభుత్వాలు తరచుగా ఆరోపించడం రివాజు. కానీ లతెహార్ ఎన్ కౌంటర్ అందుకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. గిరిజన గ్రామాల చుట్టూ అడవుల్లో సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు విస్తృతంగా బాంబులు నాటారని, తద్వారా గిరిజనుల ప్రాణాలకు సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు తీవ్ర ప్రమాదం కలిగిస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారని హిందూ తెలిపింది. పత్రికలు, ఛానెళ్ళు కావాలంటే స్వయంగా ఆయా ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్ధితిని చూడవచ్చని వారు ప్రకటించారు.

జనవరి 11 తేదీన ది హిందూ విలేఖరులు ఎన్ కౌంటర్ జరిగిన గ్రామాలను సందర్శించారు. బాంబు పేలుడు నుండి బతికి బయటపడిన విజయ్ తురి (40) ప్రకారం సి.ఆర్.పి.ఎఫ్ బలగాల ఆదేశాల మేరకు బైజ్ నాధ్ కిస్కు అనే పోలీసు మృత దేహాన్ని పైకి ఎత్తుకుంటుండగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ మూడు అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. ఆదివాసీ గ్రామానికి అనుకుని ఉన్న బలువాహి కొండ వాలులో ఒక తల గుడ్డ, తెగిపోయిన చెప్పులు, వస్త్రాల తునకలు చిందరవందరగా పడి ఉన్నాయని ది హిందూ విలేఖరి అనుమెహ యాదవ్ తెలిపాడు.

కిస్కు విగత శరీరం కింద మావోయిస్టులు ఉంచిన పేలుడు పదార్ధాల వలన పేలుడు సంభవించిందని మొదట చెప్పిన పోలీసులు అనంతరం శరీరం లోపల ఉంచిన పేలుడు పదార్ధాల వలన పేలుడు జరిగిందని చెప్పారు. మరో సి.ఆర్.పి.ఎఫ్ జవాను బాబునాధ్ పటేల్ శరీరంలో ఉన్న పేలుడు పదార్ధాలను ఆ తర్వాత పోలీసులు నిర్వీర్యం చేశారు. పోస్టుమార్టం కోసం డాక్టర్లు ప్రయత్నిస్తుండగా బాబునాధ్ శరీరంపై కుట్లు కనిపించడంతో వారు కీడు శంకించి పోలీసులను అప్రమత్తం చేశారు. అనంతరం పోలీసులు కుట్లు విప్పి పేలుడు పదార్ధాలు కనుగొన్నట్లు కొద్ది రోజుల క్రితం పత్రికలు తెలిపాయి.

Latehar encounter2తమను మానవ కవచాలుగా పోలీసులు ఎలా వినియోగించుకున్నదీ గిరిజనులు వివరించారు. “ఉదయం 10 గంటలకు ప్రమోద్ సావు వచ్చి జనాన్ల శవాలు వెతకాలనీ, లేకపోతే తమను పోలీసులు కొడతారని చెప్పమన్నారని చెప్పాడు” అని 18 సంవత్సరాల బినోద్ తురి ది హిందూ కి తెలిపాడు. “మిమ్మల్ని మూడు వరసల్లో నడవాలని పోలీసులు ఆదేశించారు. మగ, ఆడ అటు ఇటు నడుస్తుండగా పోలీసులు మధ్యలో నడిచారు. కొండ వాలులో మేము శవాన్ని కనుగొన్నాము. పోలీసులు గ్రామస్థులతో కలిసి కొండ మొదట్లో శవానికి 20 అడుగుల దూరంలో నిలబడిపోయారు. మాలో ముందు వరసలో నిలబడిన ఆరుగురు గ్రామస్థులను ముందుకెళ్లి శవాన్ని తేవాలని ఆదేశించారు.”

“అకస్మాత్తుగా అక్కడ పెద్ద పేలుడు సంభవించింది. మేము భయపడి పరుగెత్తాము. కానీ పోలీసులు మిమ్మల్ని ఆపారు. తమతో పాటు కలిసి ఉండాలని, వాళ్ళు దాక్కున్న చోటనే దాక్కోవాలనీ బలవంత పెట్టారు. కానీ గ్రామస్థులు పరుగెత్తుతున్నారు. దానితో కొందరు పోలీసులు పురుషులను తమ తుపాకులు, లాఠీలు, కర్రలతో కొట్టడం, బూట్లతో తన్నడం మొదలు పెట్టారు. మావోయిస్టులకి షెల్టర్ ఇస్తారంట్రా మీరు?’ అని అరుస్తూ తన్నారు. వాళ్ళు నా పొట్టపైన ఒక తుపాకి గురిపెట్టి బెదిరిస్తూ అక్కడే కూర్చోబెట్టారు” అని బినోద్ తెలిపాడు. ఆ తర్వాత తురి తన భార్య ఆశ, ఇద్దరు పిల్లలను తీసుకుని బట్టలు, కొద్దిగా ధాన్యం సర్దుకొని గ్రామం నుండి పారిపోయాడు. వారితో పాటు ఇతర ఆదివాసీ కుటుంబాలు కూడా గ్రామం వదిలి పారిపోయారు. అక్కడే ఉంటే మరిన్ని చావులు తప్పవని వారు భయ పడ్డారని తెలుస్తోంది.

పేలుడు తర్వాత భయపడి పరుగెట్టడంతో సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ ఒకరు తన తలపైనా, కాలుపైనా కొట్టాడని మరో ఆదివాసి సురేశ్ పరహైయ తెలిపాడు. “మేము పరుగెత్తడానికి ప్రయత్నించినపుడు వాళ్ళు మిమ్మల్ని కొట్టారు. సాయంత్రం 4 గంటలకు రెండు శవాలు దొరికే వరకూ మిమ్మల్ని అక్కడే కూర్చోబెట్టారు. శవాలు దొరికాక వాటిని ట్రాక్టర్ లో పెట్టాలని మమ్మల్ని ఆదేశించారు” అని సురేశ్ భార్య మనో దేవి తెలిపింది. “పోలీసులు మగవాళ్ళని ముందు వరసలో నిలబెట్టి వారి మెడలకు తుపాకులు గురిపెట్టి కొండ వద్దకు నడిపించారు. నా మేనకోడలు కొడుకు గను (16) వీపుకి తుపాకి గురిపెట్టి నడిపించారు” అని బిమిలి దేవి తెలిపింది. గను కొండ వాలు పైకి కొద్ది అడుగులు వేసి పేలుడు జరిగే సమయానికి జవాను శవం మీదికి వంగుతున్నాడని ఆమె తెలిపింది. మంగళవారం ఉదయానికి అతని శరీరంలో కింది భాగం మాత్రమే అంత్యక్రియలకు లభ్యం అయింది. చనిపోయిన నలుగురు ఆదివాసుల్లో గను చిన్నవాడు.

70 యేళ్ళ రాజ్ కుమార్ ఇలా తెలిపాడు. “సోమవారం (జనవరి 7) రోజంతా కాల్పులు వినపడుతూనే ఉన్నాయి. నా పెద్ద కొడుకు జోగేశ్వర్ తన ఐదుగురు కొడుకులను తీసుకుని మనిక పట్నం వెళ్లిపొమ్మని తన భార్యకు చెప్పాడు. నా చిన్న కొడుకు సునేశ్వర్ ని కూడా వారితో తీసుకెళ్లమని చెప్పాడు. మంగళవారం నేను ఆవుల్ని మేపుతూ అడవికి వెళ్ళాను. శవాలను వెతకడానికి జోగేశ్వర్ ని పోలీసులు తీసుకెళ్లారని ఆ రోజు సాయంత్రం నాకు తెలిసింది. నాకు అతని గాంఛ (తల గుడ్డ), ఒక చెప్పు, మూడు పక్కటెముకలు మాత్రమే దొరికాయి…” అని రాజ్ తెలిపాడు. బిహారీ యాదవ్ కయితే తన కొడుకు శవం కూడా దొరకలేదు. “మంగళవారం నా కొడుకు బీరేంద్ర శవం దొరకలేదు. లతెహార్ పోలీసు స్టేషన్ కి వెళ్ళినపుడు నన్ను పోలీసులు కొట్టారు. నేను మావోయిస్టునని చెప్పి కొట్టడం మొదలు పెట్టారు. ఒక అధికారి జోక్యం చేసుకోవడంతో కొట్టడం ఆపారు అని బిహారీ యాదవ్ ని ఉటంకిస్తూ ది హిందు తెలియజేసింది.

చనిపోయినవారిలో ఒకరయిన ప్రమోద్ సాహు నవాది గ్రామంలో ఒక షాప్ కీపర్. పోలీసుల శవాలను తీసుకెళ్లడానికి అవసరమైన వాహనాలు, మనుషులను సమకూర్చి పెట్టాడు. అంవతికర్, నవాది, చాహల్ తదితర గ్రామాల నుండి ఆదివాసీలను సేకరించాడు. నాలుగు శవాలను తీసుకెళ్లడానికి గ్రామస్థులకు చెందిన రెండు ట్రాక్టర్లు తెప్పించాడు. పేలుడు వల్ల అతని మొఖం పైన తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకో రెండు రోజులకి అతను రాంచి ఆసుపత్రిలో చనిపోయాడు. పొరుగునే గల చుంగ్రు పంచాయతి ముఖియా (గ్రామ పెద్ద) బల్దేవ్ పరాహియా నలుగురు పోలీసుల శవాలను తీసుకెళ్లడానికి మూడు ట్రాక్టర్లు తెప్పించడానికి పోలీసుల వద్ద అంగీకరించాడు. అయితే పేలుడు సంభవించాక గ్రామస్థులను వారి ఇళ్లకు వెళ్లనివ్వాలని తాను పోలీసుల్ని బతిమాలానని తెలిపాడు.

గ్రామస్థులు పోలీసుల చేతుల్లో ప్రత్యక్షంగా అనుభవించిన హింస గురించి చెప్పిన సంగతులను పోలీసులు కొట్టి పారేశారని పత్రిక చెప్పింది. జనవరి 18 న ఐ.జి (ఆపరేషన్స్) ఎస్.ఎన్ ప్రధాన్ ని సంప్రదించడానికి ప్రయత్నించినపుడు ఆయన అందుబాటులో లేడని ది హిందూ తెలిపింది. అయితే జనవరి 11 న ఆయన తమకు ఇంటర్వ్యూ ఇచ్చాడని గ్రామస్థులు చెప్పిన విషయాలను అప్పుడాయన నిరాకరించాడని పత్రిక తెలిపింది. “శవాలను వెనక్కి తేవడానికి మాకు తరచుగా గ్రామస్థుల సహాయం అవసరం అవుతుంది. వారి మంచాలను మేము అరువు తీసుకుంటాము. మహిళలు పిల్లలు ఒక్కోసారి వారి మగవారి వెంటే వస్తారు. ఆ విధంగా చేస్తే తమ మగవాళ్లు భద్రంగా ఉంటారని వారి ఆలోచన” అని ప్రధాన్ చెప్పాడని పత్రిక తెలిపింది.

మీడియా ఇక్కడికి వచ్చి చూడాలి

మానవ హక్కుల కార్యకర్తలు, మీడియా ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని స్వయంగా సందర్శించాలని మావోయిస్టులు కోరారు. భద్రతా బలగాలు బూబీ ట్రాప్ రాకెట్లు, గ్రెనేడ్లు గ్రామాల నిండా పెట్టారని అటవీ గ్రామాలకు వచ్చి చూస్తే మీడియా స్వయంగా ఆ సంగతి తెలుసుకోవచ్చని వారు తెలిపారని టైమ్స్ ఆఫ్ ఇండియా (టి.ఒ.ఐ) తెలిపింది. కేవలం తాకితేనే పేలిపోయేలా వాటిని అమర్చారని తెలిపారు. “పి.ఎల్.జి.ఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) ని నేరుగా ఎదుర్కునే బదులు భద్రతా బలగాలు గ్రామస్థులను టార్గెట్ చేస్తున్నారు. తద్వారా అడవులనుండి ఆదివాసీలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు” మావోయిస్టుల ప్రతినిధి తూఫాన్ యుద్ధ క్షేత్రం (battleground) నుండి తెలిపాడని టి.ఒ.ఐ తెలిపింది. అమాయక గ్రామీణులను మానవ కవచంగా వాడడం ఆపాలని మావోయిస్టులు హెచ్చరించారని తెలిపింది.

ఎన్ కౌంటర్ గురించి మావోయిస్టులు వివరాలు ఇచ్చారని టి.ఒ.ఐ తెలియజేసింది. పత్రిక ప్రకారం సోమవారం (జనవరి 7) ఉదయం 11 గంటలకు ఎన్ కౌంటర్ మొదలయింది. కేంద్ర ప్రభుత్వ పారా మిలటరీ బలగాలు ఇందులో పాల్గొన్నాయి. సి.ఆర్.పి.ఎఫ్, జార్ఖండ్ జాగ్వార్, కోబ్రా బలగాలకు చెందిన 30 బెటాలియన్ల వరకూ తమపై దాడి చేశారని మావోయిస్టులు తెలిపారు. బర్వాది పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తాము మకాం వేసి ఉండగా దాడి జరిగిందని వారు తెలిపారు. “భద్రతా బలగాలను ఎదుర్కోవడానికి మేము తయారుగా ఉన్నాము. వారిలో ఏడుగురిని చంపేశాము” అని తూఫాన్ తెలిపాడు (టి.ఒ.ఐ -11.01.2013)

చనిపోయిన ఆదివాసీల వయసు విషయంలో ది హిందూ రిపోర్టుకి, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కీ తేడా కనిపిస్తోంది. ది హిందూ రిపోర్ట్ ప్రకారం 16 యేళ్ళ గను చనిపోయినవారిలో అత్యంత పిన్న వయస్కుడు. టి.ఒ.ఐ ప్రకారం చనిపోయిన వారు: యోగేశ్వర్ భుయిన్యా (12 సం.), మనా సింగ్ (15 సం.), అమ్మ తికార్ గ్రామానికి చెందిన విజయ్ తురి (వయసు ఇవ్వలేదు), నవాది గ్రామస్థుడు ప్రమోద్ సావో (వయసు ఇవ్వలేదు).

అటవీ భూములను, నీటి వనరులను పెద్ద పెద్ద కార్పొరేషన్లకు ధారాదత్తం చేస్తున్నది ప్రభుత్వమేనని మిలటరీ కమిషన్ లోని మరో సభ్యుడు ఆరోపించాడని టి.ఒ.ఐ తెలిపింది. పేద కానిస్టేబుళ్ల ప్రాణాలపై ప్రభుత్వాలకి ఎటువంటి ఆపేక్ష లేదని ఆయన ఆరోపించాడు. “అభివృద్ధి పేరుతో కేంద్ర మంత్రి జై రాం రమేశ్ అమాయక గ్రామస్థులను మోసం చేస్తున్నాడు. వారు దాచి పెట్టిన అసలు లక్ష్యం కార్పొరేట్ కంపెనీలు సహజ వనరులను దోచుకోవడానికి తగిన ఏర్పాట్లు చెయ్యడమే. ఈ ప్రయత్నంలో వాళ్ళు భద్రతా బలగాలను మృత్యు బోను లోకి నెడుతున్నారు” అని ఆయన ఆరోపించాడు. గర్వ జిల్లా ఎస్.పి మైఖేల్ రాజ్, రణబీర్ అనే కోవర్టు గూఢచారిని పి.ఎల్.జి.ఏ లోకి ప్రవేశపెట్టాడని అతన్ని త్వరలో శిక్షిస్తామని ఆయన తెలిపాడు.

దేశం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దశలో ఉందని మావోయిస్టులు ప్రకటించారు. ఈ దశకు అనుగుణంగానే భారత పాలకులైన భూస్వాములు, పెట్టుబడిదారులు విదేశీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థలకు ఊడిగం చేస్తూ దేశ ప్రజల వనరులను వారికి అప్పజెబుతున్నారని ప్రకటించారు. దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన వారికి లేదనీ, తమ స్వలాభం చూసుకోవడమే వారి లక్షణమని మావోయిస్టుల అంచనా. దేశ ప్రజలు తమ వనరులు తాము దక్కించుకోవాలంటే పాలక వర్గాలపై సాయుధ పోరాటం చేయాలని వారు ప్రబోధిస్తున్నారు. తాము అందుకే ఆయుధాలు పట్టి సాయుధ పోరాటం చేస్తున్నామని వారు చెబుతున్నారు.

సాయుధ పోరాటం చేయవలసింది ప్రధానంగా ప్రజలేననీ, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు వారికి తగిన నాయకత్వం, మార్గదర్శకత్వం మాత్రమే వహించాలనీ మార్క్సిస్టు బోధకులు చెప్పింది నిజమే. అయితే మావోయిస్టుల సాయుధ పోరాటంలో ప్రజల పాత్ర ఎంతవరకు ఉందన్నదీ ఒక తీవ్రమైన చర్చగా దేశంలో ఉంటోంది. మావోయిస్టు నాయకులు ఎన్ కౌంటర్లలో చనిపోయినపుడు గానీ, ఇతరత్రా నిర్బంధ పరిస్ధితులు ఏర్పడినప్పుడు గానీ ప్రజలు మౌన ప్రేక్షకులు గానూ, అనేక సార్లు తమకు సంబంధం లేనిది గానూ భావించడం కాదనలేని వాస్తవం. ఇటువంటి పరిస్ధితులపై వారు ఆత్మావలోకనం చేసుకున్నట్లు అప్పుడప్పుడూ పత్రికలు చెబుతున్నప్పటికీ తిరిగి అదే ఆచరణ కొనసాగుతోంది. భారత దేశంలో మావోయిస్టులే ప్రధాన విప్లవ శక్తిగా జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అందువలన ప్రజలనుండి వేరు పడిన పరిస్ధితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్ధితిని చక్కదిద్దుకుని ప్రజలకు విలువైన, ఆవశ్యమైన, అత్యంత దగ్గరైన విప్లవ ప్రత్యామ్నాయంగా మారవలసిన బాధ్యతను ఇపుడు వారే మోస్తున్నారు. భారత దేశపు నరోద్నిక్కులు (రష్యన్ విప్లవ పూర్వపు వామపక్ష దుస్సాహసికులు)గా మిగులుతారో లేక తప్పులు సమీక్షించుకుని నాణ్యమైన విప్లవ ప్రత్యామ్నాయాన్ని అందిస్తారో వారు తేల్చుకోవలసి ఉంది.

7 thoughts on “లతెహార్ ఎన్‌కౌంటర్: ఆదివాసీలను మానవ కవచంగా వినియోగించిన పోలీసులు

 1. లతేహార్ ఎదురుకాల్పుల ఘటన వెనుక వాస్తవాన్ని ఈ కథనం చాలా వివరంగా తెలిపింది. హిందూ పత్రిక ప్రత్యక్ష రిపోర్టింగ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త రెండూ కలిశాయి కాబట్టి ఈ కథనాన్ని విశ్వసించవచ్చు. మావోయిస్టుల బూబీ ట్రాప్ ప్రయోగాల గురించి ఊదరగొట్టిన తెలుగుపత్రికలు తర్వాత నీరసపడిపోయి తెరవెనుక విషయాలను కవర్ చేయలేదనుకుంటా. అలా మరోసారి మావోయిస్టులంటే రాక్షసుల వంటివారని ముద్రించడంలో మన పత్రికలు యథా సేవ చేసేశాయి. ఆ లోటును మీ కథనం పూరించింది.

  “మావోయిస్టు నాయకులు ఎన్ కౌంటర్లలో చనిపోయినపుడు గానీ, ఇతరత్రా నిర్బంధ పరిస్ధితులు ఏర్పడినప్పుడు గానీ ప్రజలు మౌన ప్రేక్షకులు గానూ, అనేక సార్లు తమకు సంబంధం లేనిది గానూ భావించడం కాదనలేని వాస్తవం.”

  కాని చివరిపేరాలోని పై వ్యాఖ్యలు మీ మొత్తం కథనాన్ని నెగేట్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు వార్తను వార్తగా మాత్రమే ఇచ్చి ఉంటే బాగుండేది. వ్యాఖ్యానం చేసే మీ స్వేచ్ఛను నేను కాదనను.

  కాని ఇంత పాసింగ్ కామెంట్ మీనుంచి నేను ఊహించలేదు. మన దేశంలో ఎంఎల్ పార్టీలకు సంబంధించిన ఏ కార్యకర్త ఏ ఘటనలో చనిపోయినా అనామకంగా, ప్రజలు పట్టించుకోకుండా ఉన్న స్థితిలో మట్టిలో కలిసిపోలేదనే నా ప్రగాఢ విశ్వాసం. గత పాతికేళ్లకు పైగా ఉద్యమ కార్యకర్తలు నేతలు ఎన్ కౌంటర్లలో నేలకొరిగినప్పడు పార్టీ భేదాలు లేకుండా ప్రజలు వారి పట్ల ఎలా స్పంధించారో నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాను. శవాలకోసం ఎవరూ రానప్పుడు మునిసిపల్ కార్మికులే ఖననం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాని వాటికి మీరు చెప్పిన అంశాలు కారణాలు కాదు.

  “మావోయిస్టుల సాయుధ పోరాటంలో ప్రజల పాత్ర ఎంతవరకు ఉందన్నదీ ఒక తీవ్రమైన చర్చగా దేశంలో ఉంటోంది.
  భారత దేశంలో మావోయిస్టులే ప్రధాన విప్లవ శక్తిగా జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు…

  ప్రజలనుండి వేరు పడిన పరిస్ధితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్ధితిని చక్కదిద్దుకుని…

  భారత దేశపు నరోద్నిక్కులు (రష్యన్ విప్లవ పూర్వపు వామపక్ష దుస్సాహసికులు)గా మిగులుతారో..

  లేక తప్పులు సమీక్షించుకుని నాణ్యమైన విప్లవ ప్రత్యామ్నాయాన్ని అందిస్తారో..”

  ఒకే ఒక చిన్న పేరాలో ఇన్ని విరుద్ధ ప్రకటనలు ఎలా చేయగలరు మీరు?

  కానీ బెటాలియన్ల సైన్యం కూంబింగ్ చేస్తున్నప్పుడు కూడా మావోయిస్టులు తలపడి అపారమైన ఆయుధ శక్తి కలిగిన సైనికబలగాలను దెబ్బ తీస్తున్నారంటే, మెరుపుదాడి చేసి తప్పించుకోగలుగు తున్నారంటే అది మావోయిస్టుల ప్రజాబలానికి, ప్రజామద్దతుకు సంకేతమా లేదా భారతీయ నరోద్నిక్కుల కేవల సాహస చర్యలకు నిదర్శనమా?

  45 ఏళ్లుగా సాహస చర్యలు మాత్రమే చేస్తూ ప్రపంచంలో ఏ తిరుగుబాటు శక్తి కూడా బతికి బట్టలేదని మీకు చెప్పవలసిన పనిలేదనుకుంటాను. ప్రజాబలం ఉండి కూడా గెరిల్లాలు ఒక ప్రాంతంలో, దేశంలో, లేదా చరిత్రలో సంపూర్ణ పరాజయం పొందవని చెప్పలేం. మన కళ్లముందు కూడా ఇందుకు సంబంధించి ఎన్నో ఉదాహరణలు చూశాము.

  “ప్రజలనుండి వేరు పడిన పరిస్ధితే ప్రధానంగా కనిపిస్తున్న పరిస్ధితి”

  ఇది నూటికి నూరు శాతం ధర్మకాటాలో అటూ ఇటూ మొగ్గకుండా ఉన్నట్లు కనబడుతూనే వాటంగా,పాలకవర్గం వైపు దూకేసే మనపత్రికల వాణిని పోలి ఉంది. లేదా మావోయిస్టు పార్టీ వ్యతిరేక సిద్ధాంత వైఖరినుంచి వచ్చే వ్యాఖ్యానమే అయివుండవచ్చు. (నా ఈ వ్యాఖ్య పరుషంగా ఉందనిపిస్తే వదిలేయండి)

  వ్యతిరేక దృక్పథం నుంచి వ్యాఖ్యానించడం తప్పుకాదు. కానీ..

  ఆదివాసీలకు, ఉద్యమాలకు మనం చాలా దూరంగా ఉంటున్నప్పుడు, భావజాల రంగంలో మాత్రమే కొనసాగుతున్నప్పుడు ప్రజలనుండి వేరు పడటం అనేరకం పోలీసు భాషను, లేదా మన ఘనతవహించిన పత్రికల తీర్పుల భాషను మనం ఇలా ఉపయోగించకుండా ఉంటేనే అందరికీ మంచిదనుకుంటాను.

  ఇది తప్ప మీ ప్రధాన వార్త రిపోర్టింగుతో నాకెలాంటి విభేదమూ లేదు. పాసింగ్ కామెంట్ లాంటిది చూసిన ఆశ్చర్యం తోటే ఇలా స్పందిస్తున్నాను.

 2. రాజశేఖర రాజు గారికి

  అన్నీ అంశాల్లో వైరుద్యాలు ఉన్నట్లే మావోయిస్టుల ఆచరిస్తున్న విప్లవ కార్యక్రమంలోనూ వైరుద్యాలున్నాయి. ఈ వైరుధ్యాలకు అనుగుణంగా నా ‘చివరి పేరా అభిప్రాయం’ ఉంది. మీరన్నట్లు ఇది ‘negation’ కాదు. కేవలం ‘contradiction’ మాత్రమే. దేశంలో ప్రధాన విప్లవ శక్తిగా ఆ పార్టీ ఉన్న మాట భౌతిక వాస్తవం. అదే సమయంలో ఏ ప్రాంతంలోనూ స్ధిరమైన ఉద్యమాన్ని ఆ పార్టీ నిర్మించలేని బలహీనతలో దశాబ్దాలుగా ఉంటున్న పరిస్ధితి కూడా ఒక వాస్తవం. ఆ బలహీనతలు ఏమిటన్నదీ పత్రికల్లో అప్పుడప్పుడూ వచ్చే సమీక్ష వార్తలు చెబుతున్నాయి.

  >>కాని ఇంత పాసింగ్ కామెంట్ మీనుంచి నేను ఊహించలేదు. మన దేశంలో ఎంఎల్ పార్టీలకు సంబంధించిన ఏ కార్యకర్త ఏ ఘటనలో చనిపోయినా అనామకంగా, ప్రజలు పట్టించుకోకుండా ఉన్న స్థితిలో మట్టిలో కలిసిపోలేదనే నా ప్రగాఢ విశ్వాసం. గత పాతికేళ్లకు పైగా ఉద్యమ కార్యకర్తలు నేతలు ఎన్ కౌంటర్లలో నేలకొరిగినప్పడు పార్టీ భేదాలు లేకుండా ప్రజలు వారి పట్ల ఎలా స్పంధించారో నిత్యం వార్తలు చూస్తూనే ఉన్నాను. శవాలకోసం ఎవరూ రానప్పుడు మునిసిపల్ కార్మికులే ఖననం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాని వాటికి మీరు చెప్పిన అంశాలు కారణాలు కాదు.>>

  రాజు గారూ రాజకీయాలు, ఆచరణ లతో మన భావోద్వేగాలు కూడా ముడిపడి ఉంటాయన్నది నిజమే. కానీ మంచి చెడ్డలు చర్చించుకునేటప్పుడు నిర్మోహమాటంగా మాట్లాడుకోవడమే ఎప్పటికైనా సరైనది. ఎందుకంటే ప్రజల కోసం పని చేసే పార్టీల ఆచరణ ప్రజల తక్షణ భవిష్యత్తునే కాక దీర్ఘకాలిక భవిష్యత్తును కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వారి ఎత్తుగడలు, వ్యూహం సరైతే ప్రజలకు ఉపయోగం కాగా, తప్పైతే ప్రజలు అనవసరంగా తీవ్ర నిర్బంధం పాలు కావడమో, లేక ఏ కార్యాచరణా లేక మరింత దోపిడీకి బలి కావడమో జరుగుతుంది. ఈ రెండింటి ఫలితమూ చివరికి విప్లవ సమయం మరింత సుదీర్హ కాలంపాటు వాయిదా పడడమే. అందువలన చర్చల్లో భావోద్వేగాలను పక్కన పెడితేనే ఉపయోగం అని నా సూచన. ఆఫ్ కోర్స్! ఈ సంగతులు మీకు తెలియవని కాదు.

  నా వ్యాఖ్యను లేదా పరిశీలనను ‘పాసింగ్ కామెంట్’ గా కొట్టిపారేయడానికి బదులు నా అభిప్రాయంగా పరిగణించి చర్చకు దిగితే ఉపయోగం అనుకుంటాను.

  జిల్లా పేరు గుర్తులేదు (వరంగల్ అనుకుంటా) గానీ న్యూ డెమోక్రసీ పార్టీ దళ నాయకుడు (గణేష్ అని గుర్తు) గత సంవత్సరం ఎన్ కౌంటర్ అయినపుడు అక్కడి ప్రజల స్పందనను నేనొకసారి టి.విలో చూశాను. వార్త తెలిసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా అక్కడికి చేరుకుని శవాన్ని పోలీసుల వద్దనుండి లాక్కుని స్వాధీనం చేసుకున్న విధం టి.విలో ప్రసారం అయింది. నేను విన్నదాని ప్రకారం 2000 పైగా జనం ఎన్ కౌంటర్ పై సంఘటనా స్ధలిలోనే పోలీసులతో ప్రత్యక్ష ఘర్షణకి దిగారు. పోలీసులకు శవాన్ని స్వాధీనం చెయ్యడానికి జనం ఒప్పుకోలేదు. చివరికి పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే వాహనాల్లో జనం వెంటరాగా శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయ్యించారు. ఒక ప్రజల నాయకుడు ఎన్ కౌంటర్ అయితే ప్రజల కనీస స్పందన ఎలా ఉండాలీ ఈ ఘటన చెబుతోందని నా అభిప్రాయం.

  ఈ రకమైన ప్రత్యక్ష భౌతిక స్పందన మావోయిస్టు నాయకులు ఎన్ కౌంటర్ అయినపుడు వచ్చినట్లు నేనెప్పుడూ వినలేదు. (బహుశా నాకు రాజకీయ స్పృహ తెలియక ముందు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.) గతంలో పౌరహక్కుల సంస్ధల నాయకులు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీలు ఇలా రాజకీయ స్పృహ ఉన్న వారు కూడి శవాల స్వాధీనానానికీ, అంతిమయాత్రలకు పోరాడేవారు. అందులో కూడా దళాల ఉనికి వల్ల లబ్ది పొందిన సాధారణ ప్రజల పాత్ర ఉండేది కాదు. కిషన్ లాంటి అత్యున్నత నాయకుడు మరణించినపుడు కూడా ప్రజల నుండి స్పందన రాలేదు. స్పందన అంటే నా ఉద్దేశ్యం ప్రజల ప్రత్యక్ష పాత్ర. దూరం ఉండి ఘోరం, అన్యాయం అనుకోవడం, బాధపడడం, కన్నీరు పెట్టుకోవడం కూడా స్పందనే. కానీ దానివల్ల విప్లవ కార్యాచరణకు ఏ ఉపయోగమూ ఉండదు. ప్రజల స్పందనలోని తేడాలను నేను ఇలా చూస్తున్నాను. ప్రజల స్పందన విషయంలో మీకు నాకూ మధ్య perceptions లో తేడా ఉన్నట్లు నాకు తోస్తున్నది.

  ‘ప్రజలనుండి వేరు పడ్డారు’ అన్నది పోలీసు భాష అని, పాలకవర్గంవైపు దూకేసే పత్రికల భాష అనీ మీరు చేసిన వ్యాఖ్యానం సరికాదని నా అభిప్రాయం. ఏ వర్గాలు వాడే భాష అయినా భాష ప్రాధమికంగా న్యూట్రల్. ఒక పరిస్ధితిపై నా అభిప్రాయం చెప్పడానికి నాకు అందుబాటులో ఉన్న పదజాలం వాడడానికి నాకు స్వేచ్ఛ ఉందనే భావిస్తున్నాను. ఆ స్వేచ్ఛతోటే ఆ భాష నా వ్యాఖ్యానంలోకి వచ్చింది. అంతే తప్ప మీరు చెప్పినట్లు వ్యతిరేక దృక్పధం కాదు, పాలకవర్గ దృక్పధమూ కాదు. చిన్న (లేదా పెద్ద) విమర్శ చేసినంతనే పాలక వర్గ పత్రికల వాణిలోకి వ్యాఖ్యాతల అభిప్రాయాలను నెట్టివేయవలసిన అవసరం ఉందంటారా?

  >>45 ఏళ్లుగా సాహస చర్యలు మాత్రమే చేస్తూ ప్రపంచంలో ఏ తిరుగుబాటు శక్తి కూడా బతికి బట్టలేదని మీకు చెప్పవలసిన పనిలేదనుకుంటాను.>>

  సాహస చర్యలు మాత్రమే చేస్తున్నారన్న అభిప్రాయం నాకు లేదు. ప్రజల రాజకీయాలు కలిగి ఉన్నపుడు రాజకీయ పార్టీలకు వాటి బలహీనతలకు అతీతంగా ఒక శాశ్వతత్వం వస్తుంది. అది అనివార్యం.

  >> ప్రజాబలం ఉండి కూడా గెరిల్లాలు ఒక ప్రాంతంలో, దేశంలో, లేదా చరిత్రలో సంపూర్ణ పరాజయం పొందవని చెప్పలేం.>>

  స్ధిరమైన ప్రజా ఉద్యమాన్ని లేదా ప్రతిఘటనోద్యమాన్ని లేదా ఇంకో పేరుతో సంబోధించగల సాయుధ ప్రతిఘటనను నిర్మించలేని బలహీనతకు ఇది సమర్ధనగా నాకు కనిపిస్తోంది. కేవలం ముప్ఫై యేళ్ళ గెరిల్లా పోరాటంలో చైనాలాంటి అతి పెద్ద దేశం విముక్తి సాధించగా 45 యేళ్ళ గెరిల్లా పోరాటం ఇప్పటివరకూ ఒక్కటైనా స్ధిరమైన విముక్తి ప్రాంతాన్ని సాధించలేకపోవడం నుండే గుణపాఠాలు నేర్చుకోవలసిన అత్యవసరం కనిపిస్తోంది.

  ప్రభుత్వాల సైనిక బలగాలను దెబ్బ తీయడం, మెరుపు దాడి చేసి తప్పించుకోవడం సాయుధ పోరాటంలో ఒకానొక అంశం. అది స్ధిరమైన విముక్తి ఉద్యమానికి పక్కా సంకేతకం కూడా కాదని నా అభిప్రాయం. అలాంటి ప్రతిభా శక్తులు, భారతీయ నరోద్నిక్కులుగా మిగిలిపోవడానికి దారి తీయకూడదన్నదే నా ఆకాంక్ష. అందులో తప్పులేదనే అనుకుంటున్నాను. మిలట్రీ పరంగా, గెరిల్లా యుద్ధ తంత్రం పరంగా అమెరికా బలగాలతో తలబడుతున్న వారు ఉన్నారు. ఫ్రాన్సు బలగాలకు చెమటలు పట్టిస్తున్న మాలి దేశపు తౌరెగ్ గెరిల్లాలు తాజా ఉదాహరణ. ప్రజల విముక్తిని, దేశ విముక్తిని లక్ష్యంగా పెట్టుకున్నపుడు ఇవి ఒక భాగంగానే ఉంటాయి.

  ఆర్టికల్ అప్పటికే పెద్దది అయింది. అందువలన చివరి పేరా వ్యాఖ్యానాన్ని వివరాలలోకి తీసుకెళ్లలేదు. విమర్శకు మించిన వ్యతిరేక ఉద్దేశ్యాలు ఏమీ లేవని గమనించ గలరు.

 3. మావొయిస్టులు గానీ లేక గొరిల్లా పొరాటాలు గానీ, ఒక నిర్దిస్టమైన ఆర్దిక పొరాటాలకు మాత్రమే పరిమితమౌతూ వచ్చాయి. రాజకీయ చైతన్యం కనపడటం లేదు. నిజానికి రాజకీయపొరాటమూ, ఆర్దిక పొరాటమూ విడతీయలేము అది దీర్గకాలిక పొరాటపటిమకలిగి అందులొ మార్కిస్టు ప్రజా చైతన్యం చెప్పుకొదగిన స్తాయిలొ కార్మిక వర్గ నియంత్రుత్వం వున్నప్పుడు మాత్రమే. లేక పొతే బుర్జువా సంస్కరణ స్తాయిలొనే వాటికి వంత పాడుతూ వుందిపొతాయి ఇప్పటి కమ్యునిస్టు పార్టీలాగ ఎన్నియుగాలైనా.

  ఇప్పటివరకూ మావొయిస్టులుగానీ, నక్ష్లైట్లు గానీ, ప్రజలలొ రాజకీయ చైతన్యం తేవడానికి ఏవిదమైన కార్యక్రమమూ వున్నట్టు నాకు కనపడటం లేదు. కేవలం కొన్ని ఆర్దికపొరాటాలకు పరిమితం అయ్యారు తప్ప. ఇలాంటి పొరాటాల వల్ల ప్రజలలొ యవరొ లొక రక్షకుడు వచ్చి తమను కాపాడతాడని ప్రజలతొ సంభందం లేకుండానే ఏకొద్దిమంది మాత్రమే చేసే వీరత్వం వల్ల సమాజం మారిపొతుందనీ వాళ్ళు కేవలం ప్రెక్షకులుగానే వుండిపొతాలు. కార్యాచరణకు దిగరు. విప్లవ పార్టీలు చిన్న చిన్న బుర్జువా సంస్కరణకు మాత్రమే పరిమితమైతే బుర్జువాలకు అంతకన్నా కావలసింది మరొకటిలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా అది బుర్జువాలకే అనుకూలిస్తుంది.

 4. నరోడ్నిక్కుల చర్చ తేవడం ద్వారా ఒక చర్చకు వీలు కలుగుతోంది. నిజమైన విప్లవ ఆచరణాంటే ఏమిటి? నిజమైన విప్లవ పార్టీ ఏది? అనే ప్రశ్నలు నిజానికి ఇప్పుడూ కావు.
  రాజశేఖరరాజుగారు వ్యక్తపరచిన అభిప్రాయానికి బదులుగా శేఖర్ గారు ఇచ్చిన జవాబు చాలా పరిమితమైనది. ఇది ఒక ఉదాహరణను, అదీ స్థల, కాల పరిమితులకు కుదించి ఒక వాదనగా ముందుంచేందుకు ఆయన ప్రయత్నం చేసారు.
  ప్రజల ప్రమేయం, మద్దతు, వారే విప్లావాచరణలో భాగం కావడం లేకుండా ఈ రోజు మావోయిస్టూ పార్టీ ఇంత పెద్ద, ప్రభావశీలమైన పార్టీ అయ్యుండేదికాదు. చరిత్ర రీత్యా మిగతా వాటితో పోల్చినట్లయితే,( శేఖర్ గారి దృష్టిలో మరో పార్టీ, నిజమైన విప్లవకర పార్టీగా ఉన్నా) అవేవీ రాశిలోనూ, వాశిలోనూ మావోయిష్టు పార్టీకి దరిదాపులలో లేవు. అలాగని మావోయిస్టూ పార్టీ దైవసమానమైన పార్టీ అని కూడా నేను అనబోవడంలేదు. అది అనేక కీలకమైన ప్రాంతాలలో బాధాకరంగా వెనుదిరిగింది.
  నిజానికి మన ఎం ఎల్ పార్టీల చరిత్ర అంతా కొద్ది తేడాలతో ఒకే కాలంలోనే మొదలయింది. అభిప్రాయ బేధాలు, ఆచరణలో వైరుధ్యాలు, విభిన్నతలు, అవగాహనా పరంగా పరస్పర విమర్శలు, తామే నిజమైన విప్లవకర పార్టీ అని రొమ్ము చరుచుకోవడాలూ ఆది నుండీ ఉన్నాయి.
  నలభై ఏళ్లా లేక ఇంకా ఎక్కువా అన్న కొలమానం చర్చను మరింత సంకుచితం చేస్తుంది. ఈ నలభై ఐదేళ్ల కొలమానం అన్ని విప్లవ పార్టీలకూ వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తు చేయడానికి ఇది రాస్తున్నాను.
  విప్లవాన్ని నిర్మించడం, విజయవంతం చేయడం మైన విప్లవ పార్టీ లక్ష్యాలు. ఇవి ఎంత కాలంలో సాధ్యమవుతాయి అన్న చర్చ ఏ సిద్ధాంతంలోనూ లేదు. ప్రజల మధ్య ఉన్న వైరుధ్యాలను అర్థం చేసుకొని, వారిని ఐక్య పరిచి రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడడంతో విప్లవ పార్టీ విజయం ముడి పడి ఉంటుంది. అప్పుడే అది తనను తాను విప్లవకర పార్టీగా రుజువు చేసుకోగలుగుతుంది. ఇది మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలకూ వర్తిస్తుంది.
  ఈ దిశగా ఆలోచిస్తూ, భౌతిక గతి తర్కాన్ని అనువర్తించడం ద్వారా, సిద్ధాంతాన్నీ, ఆచరణనూ నిత్య నూతనంగానూ, సమకాలికంగానూ మలచడానికి వీలవుతుంది. తద్వారా మాత్రమే విప్లవమనే మార్పుకు దోహద పడగలం కానీ, భావోద్వేగాలలో పడి, పడికట్టు అభిప్రాయాలతో కొనసాగేటట్లయితే అది మనల్ని మనం సమాజం నుండి దూరం చేసుకోవడం మాత్రమే అవుతుంది.

 5. నాగరాజు గారికి

  బహుశా నరోద్నిక్కులతో పోల్చడం నచ్చలేదనుకుంటాను.

  నరోద్నిక్కులుగా మిగలకూడదు అని ఆకాంక్షించడం నరోద్నిక్కులని తేల్చి చెప్పడం… ఈ రెండింటి మధ్య తేడా నేను చూపాను. గుర్తించగలరు.

  ఆ పోలిక సంగతి ఎలా ఉన్నా ఎదురు కాల్పుల పట్ల ప్రజల స్పందన విషయమై నా పరిశీలన నిజమే కదా. స్ధల, కాల పరిమితులకు కుదించానన్న మీ సూచన నేను లేవనెత్తిన అంశానికి సమాధానం కాదనుకుంటాను. మీరు చెప్పిన పరిమితుల్లోనైనా ఒక సమాధానం ఉండాలి.

  ఇక ఏది నిజమైన విప్లవ పార్టీ అన్న సెంటిమెంటు నాకైతే లేదు. కాల పరిమితి విషయంలో మీరు చెప్పింది స్ధూలంగా నిజమే. అయితే సమీక్ష కోణంలో అది కూడా ఒక అంశంగా గుర్తించాలి.

 6. మీరు చెప్పిన పద్ధతిలో ప్రజల మద్ధతును పొందిన సంఘటనలు ఉదాహరణలుగా చెప్పాలంటే అలాంటివి వందలకొద్దీ గతం నుండి, వర్తమానం నుండి ఇవ్వవచ్చును. ఇంకా చెప్పాలంటే మరే పార్టీ అనుభవించనంత నిర్భంధంలో కూడా మావోయిస్టు పార్టీ ప్రజల మద్ధతును పొందుతూనే ఉంది. మీరు చెప్పిన సంఘటనలతో సరిపోలగలిగేవి చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనలు నిదర్శనాలుగా చెబితే మావోయిస్టు పార్టీ మీ లెక్క ప్రకారం విప్లవకర పార్టీ అయిపోతుందా? ఇంతకు మించి ఇంకా ఏమైనా కొలమానాలు ఉన్నాయా? అందుకే ఇలాంటి చర్చ కుదింపు వాదానికి దారితీస్తుందని అన్నాను
  నా దృష్టిలో విప్లవకర పార్టీగా నిలబడడానికి అంతకు మించిన కొన్ని లక్షణాలుండాలని అనుకుంటాను. విప్లవకరంగా ఉండడమంటే ప్రజల అవసరాలకనుగుణాంగా ఎప్పటికప్పుడు తనను తాను సంసిద్ధ పరుచుకోవడం. దీర్ఘ కాలిక లక్ష్యాలతో పాటు, తక్షణ లక్ష్యాలను మిళితం చేసుకొని నడవగలగడం.
  ఈ క్షణాన, ఒక అంశం మీద విప్లవకరంగా మనగలిగిన పార్టీ, మరొక సందర్భంలో మరో అంశం మీద జారిపోవచ్చు.
  ఈ కారణం వల్లనే విప్లవపు అంచున ఉన్న రాజకీయ పార్టీలు కూడా తప్పిదాలు చేసి, చరిత్ర నుండి కనుమరుగు కావడం మనం చూసాం.
  ప్రస్తుత పరిస్థితులలో ఈ పద్ధతిలో ఈ చర్చ జరగడం విషాధంగా అనిపిస్తోంది నాకు. ఏ ఎం.ఎల్ పార్టీ పరిస్థితి మాత్రం ఈ రోజు బాగుంది.

 7. నాగరాజు గారు

  నావైపు నుండి ఒక విషయం స్పష్టంగా చెప్పాను. ఫలానావారే నిజమైన విప్లవ పార్టీ అన్న సెంటిమెంటు నాకు లేదు. ఈ సంగతి చెప్పినా ఎందుకో మళ్లీ “మీ లెక్క ప్రకారం విప్లవకర పార్టీ అయిపోతుందా?” అని అంటున్నారు. నాకా సెంటిమెంటు లేదు గనుక ఆ సంగతి వదిలేయండి.

  లెక్కలు వేస్తే మీరన్నట్లు కుదింపువాదం అవుతుంది. లెక్కల జోలికి కూడా నేను పోలేదు. కనుక అది కూడా నాకు వర్తించదనుకుంటున్నాను.

  ప్రజల స్పందనకు సంబంధించి నేను చెప్పిన ఘటనతో పోలినవి వందలు ఉన్నా బైటికి ఎందుకు తెలియలేదు? పోనీ వర్తమానం నుండి ఒకటి, రెండు ఉదాహరణలు చెప్పండి. వందలు ఉన్నాయి అనే బదులు ఒకటి రెండు ఘటనలు చెబితే సరిపోతుంది కదా.

  మళ్లీ ఒక విషయం స్పష్టం చేస్తాను. నేను చెప్పిన ఉదాహరణను బట్టి ఆ పార్టీ కంటే ఈ పార్టీయే గొప్పది అని నేను చెప్పడం లేదు. నాకా ఉద్దేశ్యం లేదు.

  మీరు చెప్పిన ఇతర అంశాలతో నాకు విభేదం ఎమీ లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s