ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటే తప్ప పోలీసులు, ప్రభుత్వం కదల్లేదు


బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ -రాయిటర్స్

బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ -రాయిటర్స్

“డిసెంబర్ 26 తేదీ సాయంత్రం, న్యూ ఢిల్లీ సామూహిక అత్యాచారం బాధితురాలు భారత ప్రభుత్వ జెట్ విమానంలో మెరుగైన వైద్యం కోసం సింగపూర్ వెళుతున్న సమయంలోనే మరో సామూహిక అత్యాచార బాధితురాలయిన ఒక టీనేజి అమ్మాయి తన ప్రాణం తాను తీసుకుంటోంది” (రాయిటర్స్, 16.01.2013)

పంజాబ్ లో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న 17 సంవత్సరాల బాలిక గురించి రాయిటర్స్ వార్తా సంస్థ చెప్పిన సంగతి ఇది. దేశం మొత్తం ఢిల్లీ అమానుష కృత్యంపై ఆగ్రహంతో స్పందిస్తూ న్యాయ, చట్ట, పోలీసు, రాజకీయ వ్యవస్థలను నిలదీస్తున్న సమయంలోనే పంజాబ్ పోలీసులు న్యాయం చేయడానికి నిరాకరించిన ఫలితంగా ఆ అమ్మాయి తనను తాను బలి తీసుకుంది. రేపిస్టుల్లో ఒకరికి ఇచ్చి తనను వివాహం చేయడానికి అంగీకరిస్తే కేసు వాపసు తీసుకోవడానికి ఒప్పుకున్న తల్లిదండ్రులు, రేపిస్టులిద్దరికీ అప్పటికే పెళ్లయినందున డబ్బు తీసుకుని వేరే పెళ్లి చేయాలని తీర్పు చెప్పిన పంచాయితీ పెద్దలు, ఏదో విధంగా రేపిస్టులతో రాజీ పడకపోతే అమ్మాయినీ, ఆమె తల్లినీ కూడా వ్యభిచారం నేరం కింద అరెస్టు చేస్తామని బెదిరించిన పోలీసులు… అందరూ కలిసి ఒక కౌమార యువతిని ఆత్మహత్య వైపుకి నెట్టడంలో క్రియాశీలక పాత్రధారులయ్యారు.

చెడుపై మంచి విజయం సాధించినందుకు, అసురుడిపై స్త్రీ శక్తి విజయం సాధించినందుకు భారతీయులు ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి రోజునే పంజాబ్ అమ్మాయి మగాసురుల బారిన పడింది. అమ్మాయిని చెరబట్టి ఎత్తుకుపోయిన దుండగులు ఆమెకు మత్తుమందు ఇచ్చి ఒక వ్యవసాయ మోటార్ పంప్ గదిలో అత్యాచారం చేశారు. అత్యాచారం సమయంలో స్పృహ వచ్చి కేకలు వేసినప్పటికీ అవి ఎవరి చెవినా పడలేదు. తల్లిదండ్రులతో కలిసి తమ గ్రామం బాద్షాపూర్ లోనే గల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యబోతే వారు కేసు నమోదు చేయలేదు. విచారణ చేశాక మాత్రమే ఎఫ్ఐఆర్‌ నమోదు చేస్తామని చెబుతూ మొదటి అడుగులోనే న్యాయాన్ని నిరాకరించారు.

ఢిల్లీ అత్యాచారం పెను ప్రకంపనలు సృష్టిస్తున్న నేపధ్యంలో అమ్మాయి ఆత్మహత్య తర్వాత మాత్రమే పంజాబ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శశి ప్రభ ద్వివేది నేతృత్వంలో ఏర్పాటయిన ప్రత్యేక కమిటీ చేసిన విచారణలో పోలీసుల నిష్క్రియా పరతత్వం, నిందితులతో నేర పూరిత సహకారం, బాధితులనే బెదిరించిన తీరు బైటికి వచ్చాయి. ఫిర్యాదు నమోదు చేయడంలో పోలీసు ఇనస్పెక్టర్ తీవ్రంగా తాత్సారం చేశాడని ఐ.జి విచారణలో తేలింది. నిందితులను ప్రశ్నించడానికీ, విచారణ చేసి అరెస్టు చెయ్యడానికీ ఆయన ఆసక్తి చూపలేదని తేలింది. నిందితులతో రాజీ చేయించడానికి కూడా సబ్-ఇనస్పెక్టర్ నసీబ్ సింగ్ ప్రయత్నించినట్లు కనిపిస్తోందని కమిటీ విచారణలో తెలిసింది.

ఎస్.ఐ కేసును సరైన రీతిలో నిర్వహించలేదని, తద్వారా అమ్మాయి ఆత్మహత్యకు కారణం అయ్యాడని ఐ.జి ప్రాధమిక విచారణ తేల్చింది. దానితో ఆయనను విధులనుండి తొలగించి ఆత్మహత్యకు అమ్మాయిని ప్రేరేపించిన నేరాన్ని నమోదు చేశారు. విధులను సరిగా నిర్వర్తించనందుకు మరో ఇద్దరు పోలీసులు సర్వీసు నుండి డిస్మిస్ అయ్యారు. నలుగురు నిందితులు –ఇద్దరు అత్యాచార నేరానికి పాల్పడినందుకు, మరో ఇద్దరు వారికి సహకరించినందుకు- ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఎస్.ఐ ఇనస్పెక్టర్ చేసిన రాజీ ప్రయత్నాలపై వివరాలు ఇవ్వడానికి ఐ.జి శశి ప్రభ నిరాకరించిందని రాయిటర్స్ తెలిపింది.

పోలీసుల బెదిరింపులు, పంచాయితీ రాజీ ప్రయత్నాలు, తల్లిదండ్రుల పెళ్లి ప్రతిపాదన అమ్మాయికి విరక్తి కలిగించింది. తనను బలవంతంగా చెరబట్టి, తనకు స్పృహ లేకుండా చేయడానికి మత్తుమందు ఇచ్చి, తన శరీరంపై అత్యంత సన్నిహిత రీతిలో గాయపరిచిన నిందితులను అరెస్టు చేసి, శిక్షించడానికి బదులు తిరిగి వారికే తనను కట్టబెట్టే ప్రయత్నాలు చెయ్యడం ఆమెను నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు. తనకు న్యాయం జరగడం అటుంచి రాజీపడక పోవడమే నేరంగా మలిచి తనతోపాటు తన తల్లిపై కూడా వ్యభిచార నేరం మోపుతామన్న పోలీసుల బెదిరింపులకు ఆమె భయభ్రాంతురాలై ఉండవచ్చు. సమాజం తనపై మోపే శాశ్వత అపవాదుని తలచుకుని విరక్తి చెంది ఉండవచ్చు. చివరిగా అమ్మాయి గోధుమ పొలాలకు వాడే పురుగు మందు తాగింది.

ఆమెను గుర్తించే సరికి పదే పదే వాంతులు చేసుకుంటూ కనపడిందని ఆమె బంధువులు చెప్పారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె చనిపోయిందని తెలుస్తోంది. ఆమెనా పరిస్ధితికి నెట్టింది కేవలం అత్యాచారం చేసినవారు మాత్రమే కాదన్నది స్పష్టమే. అత్యాచారమే కారణం అయితే నలభై రోజుల పాటు పోలీసులు, పంచాయితీల వెంట న్యాయం అర్థిస్తూ తిరిగి ఉండేదే కాదు. “పరిస్ధితి తీవ్ర స్థాయిలో భ్రష్టు పట్టిపోయింది. జరిగింది చాలు,” అని పంజాబ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రి ఈ కేసు విషయంలో ప్రకటించడాన్ని బట్టి పోలీసు వ్యవస్థ పనితీరుపై ఆయనకి కలిగిన ఏవగింపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇండియా జనాభా, కోర్టులు, జడ్జీల సంఖ్యను బట్టి చూస్తే తలసరి న్యాయ మూర్తుల సంఖ్య ఇండియా కంటే అమెరికాలో ఐదు రెట్లు ఎక్కువని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఢిల్లీ అత్యాచారం విషయంలో నేర తీవ్రతపై దేశం అంతా గగ్గోలు పుడితే, పంజాబ్ అత్యాచారం పోలీసుల పనితీరును చర్చకు తెచ్చింది. కొందరు సుప్రీం కోర్టు లాయర్ల ప్రకారం బాధితులనూ, వారి కుటుంబాలనూ నేరస్థులతో రాజీపడాలని ఒత్తిడి చెయ్యడం, కోర్టు బయట సెటిల్‌మెంట్లు చెయ్యడం పోలీసులకు మామూలే. నిజానికి పోలీసుల గురించి తెలుసుకోవడానికి సుప్రీం కోర్టు లాయర్లు కానవసరం లేదు.

ప్రతిరోజూ ఎదురయే బీటు కానిస్టేబుల్ దగ్గర్నుంచి, జగన్ అరెస్టు లాంటి హై ప్రొఫైల్ కేసుల్లో రాష్ట్రస్థాయి పోలీసు అధికారుల వరకూ అవినీతిలో మునిగి తేలుతున్న వారే. శశి ప్రభ కమిటీ ప్రకారం విధులనుండి తొలగించబడిన రెండో అధికారి గుర్చరణ్ సింగ్ (ఏరియా పోలీస్ అధికారి) పంజాబ్ బాలిక అత్యాచారం విషయంలో నేర పరిశోధనను పర్యవేక్షించడంలో విఫలం అయ్యాడు. అయితే ఎస్.ఐ నసీబ్ సింగ్ కుమారుడి ప్రకారం అతని తండ్రిని బలి పశువుని చేశారు. పోలీసు ఠాణాలో జరిగే అవినీతిలో కింది నుండి పై వరకూ వాటాలు ఉంటాయన్న నిజాన్ని గ్రహిస్తే అతని ఆరోపణలో వాస్తవం ఉండొచ్చని అర్థమవుతుంది. రాయిటర్స్ ప్రకారం అనేకమంది పోలీసులు నిందితులతో రాజీకి రావాలని అమ్మాయి తల్లిదండ్రులను అదే పనిగా ఒత్తిడి చేశారు. కానీ అమ్మాయి కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. దానితో పోలీసులు అమ్మాయి పైనా, ఆమె తల్లి పైనా వ్యభిచారం కేసు పెడతామని బెదిరించడం మొదలు పెట్టారు.

సామాజిక అపవాదుకి భయపడ్డ అమ్మాయి తల్లిదండ్రులు పక్క ఊరికి చెందిన రేపిస్టుల్లో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాల్లో నవంబరు 13 న జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చెయ్యడంలో ఆలస్యం చేశారు. “వారిలో ఎవరికైనా పెళ్ళికాకపోతే మా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని నేను అడిగాను. ఎందుకంటే గ్రామంలో అప్పటికే మా పరువు పోయింది” అని అమ్మాయి తల్లి చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. కానీ నిందితుల గ్రామ పంచాయితీ వారికి అప్పటికే పెళ్లయిందని చెప్పారు. పెళ్లయింది గనుక డబ్బు తీసుకుని దానిని కట్నంగా చెల్లించి మరో పెళ్లి చేయమని ఆ పంచాయితీ పెద్దలు పరిష్కారంగా సూచించారు. “ఇష్టం వచ్చినట్లు అమ్మెయ్యడానికి మా అమ్మాయి ఆవు, బర్రె లాంటిది కాదని వారికి చెప్పాను” అని అమ్మాయి తల్లి తెలిపింది. ఈ నేపధ్యంలో విరక్తి చెందిన అమ్మాయి నోట్ బుక్ లో పేజీ చించి ఉత్తరం రాసి పురుగు మందు మింగింది. “అందరూ నన్ను క్షమించాలి. నేను నా జీవితంతో విరక్తి చెందాను. అందుకే ఇలా చేస్తున్నాను. నాపై అత్యాచారం చేసినవారు దీనికి బాధ్యులు” అని రాసి ఆమె చనిపోయింది.

భారత దేశంలో ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఏదన్నా ఉందా అన్నది అనుమానమే. ఇక స్త్రీలు, దళితులు లాంటి బలహీనుల సమస్యలపై ఈ వ్యవస్థల సానుకూల/ప్రతికూల స్పందన గురించి మాట్లాడుకుని ఏం ప్రయోజనం? దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒక స్త్రీపై అత్యాచారం జరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. 2011లో 24,206 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ప్రతి పది అత్యాచారాల్లో ఆరు పోలీసుల వరకూ రావడం లేదని పోలీసు అధికారులే చెబుతున్నారు. అత్యాచారానికి గురయిన స్త్రీకి సమాజం అంటించే అపవాదు లేదా కళంక ముద్ర పదుల వేల రేపిస్టులకు చట్టబద్ధ ముద్రగా మారిపోయింది. అనేక కేసుల్లో సమాజానికి భయపడి కుటుంబ సభ్యులే బాధితురాళ్ల గొంతు నొక్కడం పరిపాటి. మహిళల వ్యక్తిగత లైంగిక హక్కు కుటుంబ గౌరవంతో ముడిపెట్టిన సమాజం దానికి బాధ్యురాలు.

కానీ సమాజంపై బాధ్యత నెట్టేశాక వ్యక్తిగత బాధ్యత వెనక్కి వెళ్లిపోవడం ఒక భ్రమాజనిత అభాస. సమాజం నుండి తమను తాము వేరు చేసి చూసుకోవడం వ్యక్తులు, కుటుంబాలు పాల్పడుతున్న ఘోరమైన తప్పిదం. తక్షణ పరిశీలనలో వ్యక్తికీ, సమాజానికి బేధం కనిపించినా వాస్తవంలో ఇద్దరికీ అభేదం. వ్యక్తికి ఎదురయ్యే ప్రతి అవసరమూ సమాజమే తీర్చాలి, ప్రతి సామాజిక చర్యా వ్యక్తులకు లాభం/నష్టం కలుగజేస్తుంది. వ్యక్తి, సమాజం అని రెండుగా అంటున్నపుడు ఉండే ద్వంద్వ భావన, భావనే తప్ప అది వాస్తవ భౌతిక ఉనికి కాదు. బొమ్మ, బొరుసు రెండూ లేకుండా నాణెం లేనట్లే వ్యక్తి, సమాజం ఒకరు లేకుండా మరొకరు లేరు. సౌకర్యం కోసం, విశ్లేషణ కోసం ఉనికిలోకి వచ్చిన అవగాహనాత్మక విభజన చివరికి మనుషులుని ఒంటరులను చేయడం ఒక అభాస కాగా అది పోస్టు మాడర్నిస్టులకు ఆయుధం కావడం, సదరు ఆయుధం కాస్తా సామాజిక ఆధిపత్యవంతులకు బడుగు జీవుల అనేకానేక పోరాటాలను పక్కదారి పట్టించే సైద్ధాంతిక ఆవిష్కరణగా అవతరించడం మరొక విపరిణామం.

పంజాబ్ కేసులో నేరం రుజువు అవుతుందో లేదా అన్నది అనుమానమే. పెళ్లి ప్రయత్నాలు, పోలీసుల బేరసారాల నేపధ్యంలో ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణపై పోలీసులు దృష్టి పెట్టలేదు. అనేక అత్యాచారాల కేసుల్లో జరిగేది ఇదే. న్యాయం చెయ్యాలి అన్న నిబద్ధత ఉంటే సాక్ష్యాల సేకరణపై దృష్టి ఉంటుంది. లేనిది న్యాయ దృష్టే కనుక సాక్ష్యాల సేకరణ సమస్యే తలెత్తదు. అత్యాచారం కేసుల్లో శాస్త్రీయ పరిశోధన ముఖ్య పాత్ర పోషిస్తుంది. సాక్ష్యాలను సేకరించడం, వాటిని భద్రం చెయ్యడం, అవినీతికి అతీతంగా పరిశోధన చేసి నిష్పాక్షికంగా ఫలితాలను నిగ్గుదేల్చడం ఇవన్నీ ఇప్పటి సమాజంలో సవాళ్లుగానే ఉంటున్నాయి. ఇవన్నీ అయినా యేళ్ల తరబడి సాగే కోర్టు విచారణ మరొక బాధాకరమైన అడ్డంకి. ఢిల్లీ ఆందోళనల ఫలితంగా అక్కడి ప్రభుత్వం ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నెలకొల్పగా, పంజాబ్ అమ్మాయి ఆత్మహత్య తర్వాత ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అక్కడ నెలకొల్పినట్లు తెలుస్తోంది. ఉత్తరా ఖండ్ ప్రభుత్వం తమకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరం లేదని చెప్పేసింది. ఎపి ప్రభుత్వం నుండి ఈ విషయమై ఇంకా ఏ ప్రకటనా లేదు. బహుశా రాష్ట్రానికొకటి చొప్పున అమానుష రీతిలో అత్యాచారం, హత్య, ఆత్మహత్య… ఇలాంటివి జరిగితే తప్ప ప్రతి రాష్ట్రంలో మహిళలకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దక్కవేమో!

15 thoughts on “ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంటే తప్ప పోలీసులు, ప్రభుత్వం కదల్లేదు

 1. >>భారత దేశంలో ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఏదన్నా ఉందా అన్నది అనుమానమే.

  ఎందుకు లేదు? ఉంది. రిజర్వేషన్ వ్యవస్థ బాగా పని చేస్తుంది.

  This was my comment on “https://teluguvartalu.com/2013/01/07/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B1%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF/”

  >>>>పాండే గారు కాబట్టి, నెలకు 150/- జీతం ఐనా సరే … పాపం చదువుకోవాలన్న కూతురికి అండగా ఉన్నాడు. అదే ఈయన దళితుడయ్యి ఉంటే, ఆ అమ్మాయికి రిజర్వేషన్ ఉండేది. మన దేశం లో రిజర్వేషన్ లు ముడ్డి కింద కోట్లు ఉన్న దలితునికి ఉంటాయి కానీ, చదువుకోవాలని ఆశ ఉన్న తెలివైన అమ్మాయి, నిరుపేద కూతురికి లేదు. చాలా గొప్ప సమానత్వం. చాలా గొప్ప రాజ్యాంగం.

  మీరు ఓవైసీ గురించి ఏమీ రాసినట్టు లేదు విశేఖర్ గారూ! మీ విశ్లేషణ చూడాలని ఉంది. <<<<

 2. ఊపిరి తిత్తుల్లో ( అంటే లంగ్స్ లో ) బాక్టీరియా వల్ల అంటు వ్యాధి సోకితే కేవలం ఉపశమనానికి మందులు తీసుకుంటే ( ఉదాహరణ కు దగ్గు తగ్గడానికి మందు వేసుకుంటే ) ఆ ఇన్ఫెక్షన్ లేదా అంటు వ్యాధి , తగ్గక పోగా , మనిషి ప్రాణాలు కబళిస్తుంది. అందువల్ల వీలైనంత త్వరగా ఆ బాక్టీరియా లను సమూలం గా నాశనం చేసే యాంటీ బయాటిక్స్ వేసుకోవాలి !
  ఇప్పుడు , మన దేశం లో స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు తెలుసుకుంటూ ఉంటే , అట్లా అనిపిస్తుంది. కుటుంబం లో , సమాజం లో, స్త్రీకి ఇవ్వలేని గౌరవం ,రక్షణ , భద్రతా , ” రక్షక భటులు ” ఇస్తారనుకోవడం ఒక భ్రమే !

 3. దళితుల కోసం పుట్టిన ముస్లిం మరియు క్రిస్టియన్ మతాల గురించి ఆయన రాయరు.
  కేవలం అగ్ర కులాలైన – బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్డి, కమ్మ, నాయుడు మొదలైన వాటికోసం “పుట్టిన” హిందూ మతం గురించైతే విర్ర వీగి రాస్తారు. 🙂

  Just joking sir! No hard feelings.

  Actually I am waiting what he would analyze (విశ్లేషణ)

 4. Sekhar a/s ఆరు, Nagasrinivasa, Das గార్లకు

  మహీధర్ గారు మీరు అడిగినట్లే ఒవైసి ప్రసంగం గురించి రాయమని అడిగారు. ఆయనకి నేనిచ్చిన సమాధానం ఇది.

  >>> మహీధర్ గారూ, ఆయన స్పీచ్ కోసం నేను వెతికాను. నాకు పత్రికల్లో ఎక్కడా దొరకలేదు. అందువలన ఆ స్పీచ్ పై రాయాలనుకుని కూడా రాయలేకపోయాను.
  ముస్లిం ప్రజలు, సంఘాలు కూడా అనేకమంది ఖండిస్తున్నారంటే ఆయన ప్రసంగం ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. పాతబస్తీలో అనేకమంది ఇంకా కటిక దరిద్రంలో మగ్గుతున్నారంటే కారణం ఓవైసీ కుటుంబమే. మతాన్ని అడ్డుపెట్టుకుని వారి దోపిడీ, అణచివేతలు సాగించుకుంటున్నారన్నది నా అభిప్రాయం. >>>

  ఈ సమాధానం ఈ లింక్ లో ఉంది: http://wp.me/p1kSha-3CJ

  ఈ సమాధానం చూసి ప్రవీణ్ గారు ఆయన స్పీచ్ ఉన్న వీడియో తన వ్యాఖ్యలో పోస్ట్ చేసారు. కాని నాకు ఉర్దు రాదు.

  మీలో ఎవరికైనా ఓవైసి ప్రసంగం ఆంగ్లంలోగానీ, తెలుగులో గానీ Text రూపంలో ఉన్న వెబ్ సైట్ కి లింక్ ఇస్తే అది చదివి నా స్పందన రాయగలను. ఈలోపు ఒక మాట.

  ఓవైసి కుటుంబం లాంటి భూస్వాములు కమ్ పెట్టుబడిదారులు ఈ దేశ ప్రజలకి భారమే తప్ప ప్రయోజనం కాదు. అలాంటివారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. వారి ఆస్తులు కాపాడుకోవడానికి మతాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడం వారికి తెలిసిన విద్య. వాళ్లు ముస్లింలు అయినంత మాత్రాన ముస్లిం ప్రజలకి ఒరిగింది యేమీ లేదు. నిజానికి ముస్లిం ప్రజలే వారిని, వారి లాంటి ముస్లిం కోటీశ్వరులని (మత భక్తి వల్ల) కాపాడుతున్నారు.

  ఓవైసి ప్రసంగానికి దీనికి మించి స్పందించాల్సినంత ప్రాముఖ్యత లేదు. అయినప్పటికీ మిత్రులు కోరుతున్నందున స్పందించడానికి నాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు నాకు తెలియాలి.

  విర్రవీగి రాయవలసిన అవసరం ఉన్నపుడు తప్పనిసరిగా రాస్తాను. చీల్చి చెండాడాల్సి వస్తే ఆపని చేసే తీరతాను. కాని ఆ అవసరం నాకు తోచాలి. విర్రవీగడంలో, చీల్చి చెండాడంలో ఒక సామాజిక ప్రయోజనం ఉందని నాకు తోచాలి. అప్పుడే ఆ పని చేయగలను.

 5. miku owaisi speech పత్రికల్లో ఎక్కడా దొరకలేదు anedi nammasakyam ga ledu …. endukante nela rojula nunchi TV llo pepar lalo main page lo vachina vaartha adi…. akhariki Hindu , DC paperlalo kuda vachindi…. aneka website lalo kuda vachindi…. aneka desala samasayalanu paper lalo chadivi spandinche miku Owaisi speech dorakedu ante , danipi miku spandinchadam istam ledu ani spastam ga telustondi….

 6. నాగ శ్రీనివాస గారు, అనేక వెబ్ సైట్లలో వచ్చింది అనే బదులు ఒక్క సైట్ కయినా లింక్ ఇవ్వగలరేమో చూడండి.

  పేపర్లలో, ఛానెళ్లలో ఏదో ఘోరంగా అన్నాడని రాసారు, చెప్పారు తప్ప వాస్తవంగా ఏమి అన్నదీ చెప్పలేదు. ది హిందూ, టి.ఓ.ఐ లాంటి పత్రికల్లో విద్వేషంతో ప్రసంగించాడని వచ్చింది కాని కాని ఏమి ప్రసంగించిందీ విషయం లేదు. మీరు చెబుతున్నారు కాబట్టి మళ్లీ ఒకసారి వెతుకుతాను. ఎలాగూ అనేక వెబ్ సైట్లలో వచ్చింది అంటున్నారు గనుక కనీసం ఒక్క వెబ్ సైట్ కయినా లింక్ ఇస్తే, నాకు ఉపయోగం.

  మీ అనుమానం అంతరార్ధం నాకు అంతుబట్టలేదు. దానికి నేను బాధ్యుడిని కూడా కాదు. ఆ పైన మీ యిష్టం.

 7. నాగ శ్రీనివాస గారు, మీరిచ్చిన లింక్స్ చదివాను. ఆ కింద వ్యాఖ్యలు కూడా చదివాను. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాను. హిందు, డి.సి లింక్స్ కూడా ఇవ్వగలరేమో చూడండి.

 8. @Nagasrinivasa

  విలువ పెరగడం అంటూ ఎమీ లేదు. ధంబ్స్ అప్ అంటే ఆ వ్యాఖ్యని మెచ్చుకున్నట్లు. డౌన్ అయితే నచ్చలేదని. నాకు తెలిసి అంతకు మించిన అర్ధం లేదు. వాటి మీద నేనెప్పుడూ దృష్టి కూడా పెట్టలేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s